సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-46
తనకు మండోదరికి జన్మించిన అక్ష కుమార మరణం తో కుంగినా , నెమ్మదిగా మనసు దిటవు చేసుకొని రావణుడు మేఘనాధుడు అనే తనకొడుకు ఇంద్రజిత్ తో ‘’అస్త్ర శస్త్ర కోవిదుడవు .నీపరాక్రమ౦ సురాసురులకు బాగా తెలుసు .బ్రహ్మను ఆరాధించి బ్రహ్మాస్త్రం పొందావు .దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనిపించుకొన్నావు .నీ బుద్ధి వైభవం దేశకాలపాత్ర తెలిసిన యుద్ధ నైపుణ్యం ఉన్నవాడవు .తపము యుద్ధం ,పరాక్రమ౦ ,అస్త్ర శస్త్ర బలాలలో అన్నిటా నాకు సమానమైన వాడవు .నువ్వు యుద్ధం లో నిలిస్తే నీకు జయ౦ అనేది నిశ్చయమే .కింకర ,జంబుమాలి అమాత్యపుత్ర ,పంచ సేనానులు ,వారి సైన్యంతో సహా చనిపోయారు –
‘’మమాను రూపం తపసో బలం చ తే-పరాక్రమ శ్చాస్త్రబలం చ సంయుగే –న త్వాం సమాసాద్య రణావ మర్దే-మశ్శ్రమం గచ్చతి నిశ్చితార్ధం ‘’
‘’నీ సోదరుడు అక్షయ కుమారుడూ గతించాడు .నాబలం వారిలో మాత్రమె లేదు ఆ బలం నీలోనే ఉంది –‘
‘’అమాత్యపుత్రా వీరాశ్చపంచ సేనా గ్రయాయినః –బలాని సు సమృద్ధాని సాశ్వ నాగ రథానిచ’’
‘’సహోదర స్తే దయితః కుమారోక్షశ్చ సూదితః –నహి తేష్వేవ మే సారో యస్త్వ య్యరి నిషూదన ‘’
సామూహికంగా మన యోధులను పరిమార్చిన ఆ వానరుని ఎదుట సైన్యం ఉపయోగ పడదు .వజ్రం లాంటి ఆయుధం కూడా నిష్ఫలమే .వాడి గమన వేగం వాయువుకు కూడా లేదు .వాడు అగ్ని తేజో మూర్తి కనుక పిడికిలి దెబ్బలకు చావడు-
న వీర సేనా గణశోచ్యవంతి-న వజ్రమాదాయ విశాల సారం –న మారుత స్యాస్య గ తేః ప్రమాణం –నచాగ్ని కల్పః కరణేన హ౦తుం’’
కనుక నీ బుద్ధిబలంతో ఆలోచించి వాడి పరాక్రమం గుర్తించి ,నీ దివ్యాస్త్రాలప్రభావం చింతిస్తూ వెళ్ళు .అపాయం కలగకుండా కార్యం నెరవేర్చు .చిన్నవాడివైనా నిన్ను పంపటం నాకు భావ్యంగా లేదుకాని ఇది రాజ ధర్మం.క్షత్రియాలోచనం .బంధుత్వం ఇక్కడ లెక్కచేయరాదు-
‘’న ఖిల్వియం మతిః శ్రేస్టా-యత్వాం సంప్రేషయా మ్యహం –ఇయం చ రాజ ధార్మాణాం-క్షత్రస్య మతిర్మతాః’’
‘’ యుద్ధం లో విజయం కోసం వివిధ ఆయుధాలు ఉపయోగించాలి’’అని అన్నిరకాల జాగ్రత్తలు యుద్ధనీతి బోధించగా ,ఇంద్రజిత్ శిరసువంచి నమస్కరించి ,తండ్రికి ప్రదక్షిణ చేసి ,యోధులు ముందుకు సాగుతుండగా సముద్రంలా ఉప్పొంగి యుద్ధానికి బయల్దేరాడు .నాలుగు సింహాల రథం ఎక్కి,మనోవేగంతో యుద్ధభూమికి చేరాడు .హనుమ వాడి రథధ్వని వింటినారి ధ్వని విని ఆనందించాడు .దిక్కులు కలుషితాలై ,క్రూరమృగాలు బిగ్గరగా అరచాయి .ఇంద్రజిత్ యుద్ధాన్ని చూడటానికి ఆకాశం లో దేవముని గ౦ధర్వ గణాలన్నీ చేరాయి .హనుమగురుడికి ఉత్సాహం ఉరకలు వేసి శరీరం పెంచి మహాసి౦హ నాదం చేశాడు .వాడు ప్రయోగించే బాణాలను మెలకువగా తప్పించుకొంటున్నాడు .హనుమ ఒక్క సారిగా పైకి ఎగిరాడు .అతడి బాణాలను నిష్ఫలం చేశాడు .సకలజనాలను రంజిల్లజేసే ఘోర యుద్ధం ఇద్దరి మధ్యా జరిగింది .ఇద్దరూ అసాధ్యులే అనిపించారు .
ఎన్ని బాణాలు వేసినా వానరుడు లొంగటం లేదని గ్రహించి ,అతడిని చంపటం అసాధ్యం అనీ తెలుసుకొని ,అతడిని పట్టుకొనే ఉపాయం ఆలోచించి ఇంద్రజిత్తు వాయు సుతునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు –
‘’తతః పైతామహం వీరః స్సోస్త్ర మస్త్రవిదాంవరః –సందధే సుమహాతేజాస్తం హరి ప్రవరం ప్రతి ‘’
అవధ్యోయ మితిజ్ఞాత్వా త మస్త్రేణాస్త్ర తత్వ విత్ –నిజగ్రాహ మహాబాహు ర్మారుతాత్మజ మి౦ద్రజిత్ ‘’
ఇంద్రజిత్ సంధించిన బ్రహాస్త్రానికి బంధితుడై చేష్టలుడిగి హనుమ నేలమీద పడ్డాడు
బ్రహ్మ దేవుని వరం వలన బ్రహ్మాస్త్రం తనను ఏమీ చేయలేదు అని గుర్తుకు వచ్చి ,’’ముహూర్తకాలం లోనే దాని నుంచి విముక్తి చెందుతావు ‘’అని చెప్పినమాటకూడా జ్ఞప్తికి వచ్చి,తానూ బ్రహ్మాస్త్రానికి కాని కట్టుపడను అని ఇంద్రజిత్ తెలిసి ప్రయోగించాడుకనుక ఏమీ చేయకుండా దానికి బద్ధుడయ్యాడు .బ్రహ్మ మహేంద్ర వాయు దేవులు తనను రక్షింపగా,ఇప్పుడు ఈరాక్షస బంధనం రావణునినిచూడటానికి ఉపయోగ పడిందని భావించాడు .రాక్షసులు చుట్టుముట్టి బందిస్తుంటే పెద్దగా గర్జించాడు .కదలికలేని కపి వీరుని చూసి వాళ్ళు జనపనార ,నార చీరల తో త్రాళ్ళు పేని హనుమను బంధించారు .ఈ బంధనం వలన రాక్షసరాజును చూసే అవకాశం కలుగుతోందని సంబర పడ్డాడు .త్రాళ్ళ చేత బంది౦ప బడగా బ్రహ్మాస్త్ర బంధం తొలగి పోయింది .అస్త్ర బంధికి వేరొక బంధం కుదరదు,నిలువదు కదా –
‘’స బద్ధ స్టేన వల్కేన విముక్తో స్త్రేణ వీర్యవాన్ – ‘’అస్త్ర బంధస్సచాన్యం హిన బంధ మనువర్తతే ‘’
త్రాళ్ళతో కట్టటం తో బ్రహ్మాస్త్ర బంధనం వీడిపోయిందని గ్రహించి ఇంద్రజిత్ ‘’ఇతర బంధనాలతో బ్రహ్మాస్త్ర బంధం నిలువదుకదా’.నా మహాకార్యం ఇలా నిష్ప్రయోజనమైంది .మా సన్యాసులకు మంత్రం ప్రభావం సంగతి తెలీదు .ఒకసారి బ్రహ్మాస్త్రం వ్యర్ధమైతే ,మళ్ళీ ప్రయోగించటానికీ ,వేరే అస్త్రప్రయోగానికీ కుదరదు ‘’అని బాధపడగా హనుమ బంధం విడిపోయిన సంగతి గమనించక ,రాక్షసులు లాక్కు పోతుంటే అలాగే ఉన్నాడు .-‘’విముక్త మస్త్రేణజగామ చిన్తాం-నాన్యేన బద్ధోహ్యనువర్తతే స్త్రం’’
కట్టెలతో బాదుతూ ,పిడికిళ్ళతో మోదుతూ రావణ సమక్షానికి తీసుకు వెళ్ళారు .బంధనాలతో ఉన్న మహాకపిని ఇంద్రజిత్ తన తండ్రికీ కొలువు కూటం లో ఉన్నవారికీ చూపించాడు .కొలువులోని వారు ‘’ఎవడు వీడు ఎక్కడనుండి వచ్చాడు ఎక్కడ దిగాడు ,ఇక్కడికి ఎందుకొచ్చాడు అసలు ఎవరివాడు “’అంటూ గుసగుసలాడుకొన్నారు ‘’వాడిని చంపండి నరకండి ,కాల్చండి తినండి ‘’అని రాక్షులు అరచారు .మంత్రి పరివేష్టితుడైన రాక్షసరాజు రావణాసురుడిని హనుమ చూస్తె ,వాడు అటూ ఇటూ త్రాళ్ళతో లాగబడే హనుమను చూశాడు .అక్కడున్నవారిని వానరుడి సంగతి అడిగి తెలుసుకోమని ఆనతిచ్చాడు .వాళ్ళు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించగా ‘’నేను వానరరాజు సుగ్రీవుని వద్ద నుంచి వచ్చిన దూతను ‘’అని మాత్రం చెప్పాడు
‘’నివేదయామాస హరీశ్వరస్య –దూత స్సకాశా దహ మాగతోస్మి’’
ఇది 62శ్లోకాల 48వసర్గ
రావణుడికి ఎవరికి ఎలా ‘’తైరు ‘’కొట్టాలో బాగా తెలుసు .మేఘనాధుడు అంటే ప్రాణ సమానుడే కాదు బలబుద్ధిపరాక్రమాలలో కూడా తనకు సాటైనవాడేకాదు ఇంద్రుని జయించినవాడు .కనుక వాడు తొందరపడి యుద్ధం లో చనిపోతే వారసులే ఉండరు కనుక ముందూ వెనకా ఆలోచించి వానర పరాక్రమ విశేషాలు క్షుణ్ణంగా తెలిపి ,ప్రాణాలతో పట్టుకు రమ్మన్నాడే కాని చంపమని చెప్పలేదు .చంపే దాకావస్తే ఎవరు చస్తారో ఎవరు మిగులుతారో తెలీదుకదా.అందులో జయం అనిశ్చితం చంచలం అని ఇదివరకు చెప్పాడు అక్షకుమారుని పంపిస్తూ .ఎందుకు వీడిని పంపాల్సి వస్తోందో అందులో ఉన్న రాజ, క్షత్రియ ధర్మం తేట తెల్లంగా చెప్పాడు రాజు .పేగు బంధం క్షాత్ర ధర్మం ముందు నిలువదు అనీ చెప్పాడు .మరింత వివరంగా మహాకపి ముందు సైన్యం మహా ఆయుధాలు బలాదూర్ అనీ చెప్పాడు .ఉన్న శస్త్రాస్త్రాలన్నీ ఉపయోగించమనీ చెప్పినా ,మిగిలింది కేవలం యుక్తి .దానితో బంధించి తేవాలి . రెట్టించిన ఉత్సాహంతో వెళ్లి వాడు హనుమతో కలబడ్డాడు .ఇద్దరూ ఒకరికి కారు తీసిపోకుండా యుద్ధం చేసి దేవతల, మునులను ఆశ్చర్యపరచారు .’’గివ్ హిం ఎ లాంగ్ రోప్’’అన్నట్లు ఇంద్రజిత్ అన్ని రకాల ప్రయోగాలు చేసి విసిగి ,హనుమ ప్రాణం తీయటం సాధ్యం కాదని గ్రహించి బంధనమే ఉభయతారకం అని గ్రహించి దానికోసమే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు .అది చేయాల్సిన పని చేసి బంధించింది .కాని ఇదివరకే బ్రహ్మవరం ఉ౦ది కనుక బంధనం క్షణ భంగురం అని తాతగారే చెప్పారు కనుక కిమిన్నాస్తి గా ఊరుకున్నాడు .ఇక్కడేఆయనకు ఒక’’ బ్లెస్ ఇన్ డిస్గై స్’’లాగా వాళ్ళు బంధించి రావణుడి దగ్గరకు తీసుకు వెడతారు కనుక తనకు కావాల్సిందీ రాక్షసరాజును స్వయంగా చూసి హితం చెప్పాలనుకొన్నాడుకనుక బాగుందని గమ్మున ఉండిపోయాడు .రోగీ పద్యమే కోరాడు డాక్టరూ అదే చెప్పాడు అన్నట్లు సరిపోయింది . బ్రహ్మాస్త్రం తో బంధించిన మోజు క్షణభంగురమై తెలివి లేని రాక్షసమూక త్రాళ్ళతో కట్టేయటం తో వ్యర్ధమైంది .ఇప్పుడుహనుమ’’ ఫ్రీ బర్డ్ ‘’అది తెలిసినా తెలియనట్లే ఉన్నాడు .రాక్షసమూక లాక్కు వెడుతున్నా ఏమీ అనుకోక తనను కాదులే అనుకొన్నట్లు ప్రవర్తించాడు .చివరికి ఈ బంధనం రాక్షస రాజును చూడటానికి చక్కగా ఉపయోగపడింది .తనకార్యం దాదాపు సఫలీ కృతం అయింది .హనుమకు రావణుడు ‘’తేజో బలసమన్వితుడై ప్రజ్వరిల్లే సూర్యుడిలాగా అవుపించాడు . తాళ్ళతో అటూ ఇటూ లాగబడే హనుమను చూశాడు రాజు .కొంచెం గర్వంకూడా కలిగి ఉంటుంది .తనకొడుకు,తనమాట నిలబెట్టి అన్నంతపనీ చేసి కోతిని పట్టి తెచ్చిన౦దుకు.తాను సూటిగా దూతను అడుగరాదుకనుక మంత్రిమొదలైన వారితో అడిగించాడు రాజు .అన్నిటికీ ముక్తసరిగా ఒక్కటే సమాధానం ‘’నేను సుగ్రీవ దూతను ‘’అని .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-20-ఉయ్యూరు