ప్రపంచ దేశాల సారస్వతం108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -3
అప్పుడే నాటకసాహిత్యానికి గొప్ప ఊపు వచ్చి ,ప్రేక్షకాదరణ పెరిగి నాటకాలు వచ్చాయి కాని ఇవన్నీ గ్రీకు ప్రేరణతో వచ్చి విజయం పొందలేదు .అప్పుడే స్వతంత్ర ఆలోచన వచ్చి జాన్ లిలీ ,టామాస్ కిడ్ ,జార్జి పీల్ ,ధామస్ లాడ్జ్ ,రాబర్ట్ గ్రీన్ ,ధామస్ నాష్ మంచి నాటకాలు రాశారు .మహోజ్వల భావనా పటిమతో క్రిస్టఫర్ మార్లో ‘’టాంబర్లేన్ ‘’,డాక్టర్ ఫాస్టస్,దిజ్యూ ఆఫ్ మాల్టా,ఎడ్వర్డ్ ది సెకండ్ రాసి మహానాటక రచయిత అనిపించాడు .అతడే ‘’హీరో అండ్ లియాండర్ ‘’పద్యకావ్యమూ రాశాడు .,
విలియం షేక్స్ పియర్ నాటకాలు జగద్విఖ్యాతమై శిఖరారోహణం చేశాయి .నాటక వాజ్మయం లో ఆయన స్పృశించని పార్శ్వం లేదు .మొత్తం 37నాటకాలు రాశాడు .అందులో –ఎ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ,దిమర్చెంట్ ఆఫ్ వెనిస్ ,మచ్ యాడో అబౌట్ నథింగ్,యాజ్ యు లైక్ ఇట్ , ట్వేల్ఫ్త్ నైట్ నాటకాలు సుఖాంతాలు .రిచర్డ్ ది సెకండ్ ,హెన్రి దిఫోర్త్ ,హెన్రి ది ఫిఫ్త్ ,లు చారిత్రకాలు .జూలియస్ సీజర్,ఆంటోనీ అండ్ క్లియోపాట్రా,లు రోమన్ నాటకాలు .రోమియో అండ్ జూలియట్ ,హామ్లెట్ ,ఒథెల్లో,మేక్బెత్,కింగ్ లియర్ విశాదంతాలు అంటే ట్రాజెడీలు.సిమ్బలీన్ ,ది వింటర్స్ టేల్,దిటెంపెస్ట్ లు కాల్పనిక నాటకాలు .భావన ,పాత్రనిర్వాహణ,పోషణ శైలి ,మంజుల శబ్దనిర్మాణ౦,విశ్వ జనీన ధార్మికత ఆయన ప్రత్యేకతలు అది నాటక రంగానికి స్వర్ణయుగమే .జాతీయ కవి –బార్డ్ ఆఫ్ ఆవన్ అన్నారు షేక్స్ పియర్ మహాకవిని .
వినోదం తోపాటు ధర్మప్రతిపాదనాచేసి నాటకాలు రాసినవాడు బెన్ జాన్సన్ .ఆనాటి వాస్తవిక జీవితాలను వస్తువులుగాతీసుకొని నాటకాలు రాశాడు .వీటిలో ‘’ఎవిరిమాన్ ఇన్ హిజ్ హ్యూమర్ ,ది ఆల్కమిస్ట్ ,వాల్పోన్ ముఖ్యమైనవి ,జాన్ వెబ్ స్టర్ విషాదా౦తనాటకాలు –వైట్ డెవిల్ ,ది డచెస్ ఆఫ్ మల్ఫీ రాశాడు వీటిలో భయానక సన్నివేశాలు మితిమీరి భయభ్రాంతుల్ని చేస్తాయి .జాన్ ఫోర్డ్ రాసిన ‘’ది బ్రోకెన్ హార్ట్ ‘’కరుణ రసాత్మకనాటకంఫ్రాన్సిస్ బోమంట్ ,జాన్ ఫ్లెచర్ కవులిద్దరూ కలిసి ‘’ఫైలాస్టర్’’,ది మెయిడ్స్ ట్రాజడి రాసి గొప్ప ప్రజా దరణ పొందారు .ఫిలిప్ మాసిన్జర్ ‘ఎ న్యు వే టుపే ఓల్డ్ డెట్స్ ‘’నాటకం సరసహాస్యంతో గిలిగింతలు పెడుతుంది .
అదేకాలం లో ఫ్రాన్సిస్ బేకన్ ఇంగ్లీష్ సాహిత్యానికి వ్యాసం అనే ఎస్సే అనే నూతన సాహిత్య ప్రక్రియ ను పరిచయం చేసి ఆంగ్ల సాహిత్య ‘’వ్యాసు’’డు అయ్యాడు .ఈ పేరును మొదట ఫెంచ్ రచయిత మాన్టైన్ ఉపయోగించి తన స్వీయ చరిత్రను రాసుకొన్నాడు. కాని బేకన్ సార్వకాలీన గుణాలను ఆదర్శాలను గురించి నభూతోగా వ్యాస పరమపర రాశాడు.బేకన్ ఎస్సేస్ అంటే విపరీతమైన మోజు అన్నికాలాల్లో అన్ని వయసులవారికీ ఉన్నది .ఎస్సేకు మార్గదర్శి బేకన్ –కాదు’’ బీకన్ లైట్ ‘’.కాంటర్ బరీ చర్చి ఫాదర్ టామస్ కార్మర్ రాసిన ‘’ది ఫస్ట్ ప్రేయర్ బుక్ ‘’ను గంభీర్య సౌకుమార్య వచన శైలితో రాశాడు .ఆకాల వచనరచనలో మకుటాయమానం ‘’ది ఆథ రైజ్డ్ వెర్షన్ ‘’అనే బైబిల్ అనువాదం .మాధుర్యం తో ఉన్న వాక్యాలు ఆకర్షణీయంగా ఉంటాయి .అప్పటికే భాషలో అనేకశబ్ద చిత్రాలు నుడికారం చేరి ఇంగ్లీష్ సాహిత్యం సుసంపన్నమైంది ‘.
17వ శతాబ్దం లో కవిత్వం లో ఒక ఒక విచక్షణ మార్గమేర్పడింది.ఆధ్యాత్మికంగా కాక ఇతర విషయాలపై కవులు స్వేచ్చగా స్పందించి గీతాలు రాశారు .వీటికి మెటాఫిజికల్ గీతాలని పేరుపెట్టారు .ఒకరకంగా కాల్పనిక౦ పై తిరుగు బాటే ఇది .సుందరమైన భాషకు బదులు తార్కిక దృష్టి పెరిగింది .రమణీయ కవి సమయాలకు బదులు విచిత్ర సాదృశ్యాలు చోటు చేసుకొన్నాయి మార్దవం లేకపోవటం వలన కవుల ప్రతిభ ‘’సర్కస్ ఫీట్ గా ‘’ మారింది .దీనికి మార్గ దర్శి జాన్ డన్ అనే క్రైస్తవ మతాధికారి .ఈమార్గం లో తాత్విక కవిత్వం రాసిన వారిలో –జార్జి హెర్బర్ట్ ,హేన్రివాన్ ,రిచర్డ్ క్రాషా ,ఇబ్రహీం కౌలే ఉన్నారు .ఈ మార్గం తొక్కకుండా సంప్రదాయ కవిత్వంలో సొగసైన కావ్యాలు రాసినవారూ ఉన్నారు వారిలో రాబర్ట్ హెరిక్ ,యా౦ డ్రూమార్వెల్ ,ఎడ్మండ్ వాలర్ ,రిచర్డ్ లవ్ లేస్,శామ్యూల్ బట్లర్ ముఖ్యులు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-20-ఉయ్యూరు.