సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-47
భయంకర మహా పరాక్రమ శాలి హనుమ మనసులో ‘’రావణుడు వచ్చి నాతో యుద్ధం చేస్తాడనుకొని అన్ని ప్రయత్నాలూ చేశాను .కాని ఉన్నచోటు కదలకుండా ఆసనం వీడకుండా కొడుకు ఇంద్రజిత్తు ను పంపి నన్ను బంధించి తెప్పించుకొన్న రాజనీతిజ్ఞుడు ‘’అనుకొని ఆశ్చర్యపడి,రోషం తో కన్ను లెర్రబడి రాక్షసరాజును చూశాడు .ముత్యాలు కూర్చిన బంగారు కిరీటం తో రావణుడు మరింతగా ప్రకాశించాడు .మనస్సంకల్ప మాత్రంగా సృష్టించిన ఆశ్చర్యకరమైన బంగారు నగలు వేసుకొని కాంతి వంతంగా కనిపించాడు .
‘’తత స్సకర్మణా తస్య విస్మితో భీమ విక్రమః –హనుమాన్ రోష తామ్రాక్షో రక్షోధిప మవైక్షత.’’
‘’హైమైరాభరణై శ్చిత్రై ర్మనసేవ ప్రకల్పితైః’’
పట్టుబట్టలు కట్టి ఒంటికి రక్త చందనం ,కస్తూరి మొదలైన గంధపు పూతలతో ఉన్నాడు. బాగా తెరువ బడిన నోళ్ళు ,అందమైన యెర్రని కళ్ళు ,చూసే వారికి భయం కలిగించే వాడి యైన పెద్ద కోరలు ,వేలాడే పెదవులు ఉన్న పది తలలతో వీరత్వ తేజస్సులతో ,దుస్టమృగాలతో శిఖరాలున్న పర్వతం లాగా ఉన్నాడు రావణుడు .కాటుకరాశినల్లదనం ,వక్షస్థలం పై పూర్ణ చంద్రునిలా విలసిల్లె హారాలు తో కొంగలతో ఉన్న మేఘం లాగా ఉన్నాడు
‘’నీలాంజన చయ ప్రఖ్యం హారేణోరసి రాజతా-పూర్ణ చంద్రాభ వక్త్రేణ స బలాక మివాంబుదం’’
బలిష్టమైన బాహువులకు భుజకీర్తులు చందనం పూతలతో అయిదు తలల పాముల్లాగా ఉన్నాయి .బాగా పెద్దది,స్పటికాలు పొదిగి ,చిత్ర వర్ణాలతో ,మధ్యమధ్య రత్నాల కూర్పు తో అత్యంత సుందరంగా రావణ సింహాసనం ఉన్నది .అందమైన చానలు ఆయన చుట్టూ నుంచుని వింజామరలు వీస్తున్నారు.
‘’మహతి స్పాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే –ఉత్తమాస్తరణాస్తీర్ణే సూప విస్టంవరాసనే ‘’
దుర్ధర ,మహాపార్శ్వ ప్రహస్త ,నికుంభ మంత్రులతో నాలుగు సముద్రాలతో పరివేష్టించి ఉన్న భూమి లాగా ఉన్నాడు –
‘’కృత్స్నః పరివృతో లోక శ్చతుర్భి రివ సాగరైః’’
మంత్రశాస్త్రం తెలిసిన మంత్రవేత్తలు ,దీమంతులైన రాక్షసులు తో దేవతల చే సేవి౦పబడే దేవేంద్రునిలా ఉన్నాడు –
‘’అన్వాస్యమాన రక్షోభి స్సురైరివ సురేశ్వరం ‘’
నల్లని రూపంతో బంగారు సింహాసనం పై కూర్చున్న రావణుడు మేరు శిఖరం అధిరోహించిన జలపూర్ణమైన నల్లని మేఘంలా ఉన్నాడు ‘
‘’విస్టితం మేరు శిఖరే సతోయమివ తోయదం ‘’
రాక్షసులు తన్ను విపరీతంగా పీడిస్తున్నా ,కన్ను ఆర్పకుండా రావణుడి వైభవాన్ని నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు హనుమ.
‘’ఆహా ఏమి రూపం ఏమి ధైర్యం ఏమి బలం ?సకలప్రశస్త లక్షణాలతో రాక్షసరాజు రావణుడు శోభిస్తున్నాడు .సీతా దేవి పట్ల అలా అధర్మాన్ని ఆచరించి ఉండకపోయి ఉంటె దేవేంద్ర సహిత దేవలోకానికే అధిపతి కాదగినవాడు –
‘’అహో రూప మహోధైర్య మహో సత్వ మహో ద్యుతిః-అహో రాక్షస రాజస్య సర్వ లక్షణ యుక్తతా ‘’
‘’యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః –స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షితా ‘’
‘’వీడి భీకర పరద్రోహాచరణ రూపమైన అధర్మ కార్యాలకు అమర దానవ సకల లోక జనులు భయపడుతున్నారు
‘’అస్య క్రూరై ర్న్రుశంసైశ్చ కర్మభి ర్లోక కుత్సి తైః-సర్వే బిభ్యతి ఖల్వస్మా ల్లోకా స్సామర దానవాః’’
వీడికి కోపం వస్తే ప్రపంచమంతా ఏక సముద్రం చేయగలడు’’అని రావణ రూప పరాక్రమ విక్రమబలశౌర్య వైభవాలను గురించి అనేక విధాలుగా ఆలోచించాడు హరిసత్తముడైన హనుమ .
‘’అయం హ్యుత్సహతే క్రుద్ధం కర్తు మేకార్ణవం జగత్’’
ఇది 20శ్లోకాల 49వ సర్గ .
హనుమ మొదట్లోనే రావణ రాజనీతికి ఫిదా అయ్యాడు యెట్లా ?తనదగ్గరకు రప్పించుకొనే సకల ప్రయత్నాలూ తాను చేస్తే వాడు తానుకదలకుండా కొడుకును పంపి తన్ను బంధించి తనదగ్గరకు రావణుడు తెప్పించుకొన్నాడు .ఇందులో హనుమకు రావణుని గొప్ప రాజనీతి కనిపించింది .తనదగ్గరకు వస్తాడనుకొంటే తననే అతని దగ్గరకు తెప్పించుకోవటం మహా రాజనీతికాదా .ఏమాలోచన హనుమది ?ఇందులో రావణ వైభవం పూస గుచ్చినట్లువర్ణించి హనుమతో మహర్షి వాల్మీకి చెప్పించాడు. రావణుడు మందర పర్వతంలాగా ఉన్నాడుకాని చుట్టూ అనేక దుస్టమృగాలున్నాయి .ఇక్కడ దుష్టరాక్షసులున్నారని భావం .ఇంకేమీ ఉపమానం దొరకనట్లు వాల్మీకి వాడిని కొంగలతో కూడిన మేఘంలా ఉన్నాడన్నాడు .హంసలతో ఉన్న మేఘం ఉత్తమ ఉపమ .ఇది నీచోపమ వాడికి తగిందే .భుజాలు అయిదుతలల పాముల్లాఉన్నాయట .ఇక్కడ వాటిలో విషం ఉన్నట్లు అనుకోవాలి . సింహాసనం స్వర్ణ రత్నమయం జిగ్ జిగేల్ గా పసుపు రంగులో ఉంటె అందులో వీడు నల్ల తుమ్మ మొద్దులాగా ఉన్నాడని పిస్తుంది .చతుస్సముద్ర వేలావలయిత భూమండలం లాగా రావణుడున్నాడు .చాలా గొప్ప వర్ణన .మేరు శిఖరం పై కారు మేఘం లా కనిపించాడు హనుమకు .త్రాళ్ళతో బంధించి రాక్షసులు హింసిస్తున్నా హనుమ తదేక దృష్టితో రావణుడిని చూశాడు అంటే ఏదో లోకోత్తర మహత్తర ఆకర్షణ వాడిలో ఉందన్నమాట .
రావణుడి గురించి హనుమతో వాల్మీకి చెప్పించిన రెండు శ్లోకాలు సాహిత్య చరిత్రలో సువర్ణ మయంగా భాసిస్తూ అందరి నోళ్ళలోనూ నానుతున్నాయి .ఉదాహరణ రూపం గా వ్యాప్తి చెందుతున్నాయి .ఇన్ని సుగుణాలున్నా సీతాపహరణం అనే ఒకే ఒక్క దుర్గుణం వాడి గుణాలకు పెద్ద చేటు తెచ్చింది .లేకుంటే ఇంద్ర పదవి కి సర్వవిధాలా అర్హత ఉంది వాడికి .లోకం లో ఉన్న ఒక ముతక సామెత ‘’మనిషి మంచోడేరా గుణం గుడిసేటిది ‘’వీడికి పూర్తిగా సరిపోతుంది .ఇ౦తవరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు .చూపులతోనే సరి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-20-ఉయ్యూరు