ప్రపంచ దేశాల సారస్వతం
108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -4
ఆనాటి కవులలో ముఖ్యుడు జాన్ మిల్టన్ .అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులతో ఆయనరాసిన ‘’పారడైజ్ లాస్ట్ ‘’కావ్యం పద్య కావ్య శిరో రత్నం .ఆయనే రాసిన’’లలేగ్రో ,ఇల్ పెన్స రోసో పద్యకావ్యాలు ,కోమస్ నాటకం ‘’లిసిడాస్’’అనే విషాద గీతం ఆయన ప్రతిబా సర్వస్వాలు .జీవిత చరమాంకం లో ‘’పారడైజ్ రీ గైన్డ్’’కావ్యం,’’శాంసన్ ఎగొనిస్టస్’’నాటకం రాశాడు .వచనరచనలూ చాలా చేశాడు .వాక్ స్వాతంత్ర్యం కోరుతూ రాసిన ‘ఏరియో పెజీటీక ‘’గ్రంథం విలువైనది .
అధిక్షేప కావ్య రచనలతో దూసుకు పోయినవాడు జాన్ డ్రైడేన్.’’అబ్సలం అండ్ అకిట ఫెల్’’’’దిమెడల్ ,మెక్ ఫ్లేక్నో కావ్యాలలో ఆనాటి రాచకీయ వాతావరణం మనుషుల దుర్నీతి వ్యంగ్యంగా విమర్శించాడు .’’అలగ్జా౦డర్స్ ఫీస్ట్ ‘’,ది హైండ్ అండ్ ది పాంథర్లలోకూడా ఈవ్య౦గ్య వైభవం స్పష్టంగా కనిపిస్తుంది .డ్రైడేన్ తనకావ్య రచనకు ‘’హీరోయిక్ కప్లెట్ ‘’అనే ద్విపదను అత్యంత నైపుణ్యంతో ఉపయోగించి మార్గ దర్శకుడయ్యాడు .సాహిత్య శాస్త్ర సిద్దా౦తాలనుకూడా చాలా దక్షతతో విమర్శించాడు .కొత్తగా ప్రసన్న సరళ వచనకు దారి చూపి కొన్ని సాహిత్య వ్యాసాలుకూడా రాశాడు .నాటి నాటక కర్తలలో అతనిది ప్రత్యేక స్థానం .మార్క్ ఆంటోని విషాద గాథను ‘లవ్ ఫర్ లవ్ ‘’నాటకం లో అమోఘంగా చిత్రించి రాశాడు .
ఆ నాటి సుఖాంత నాటకాలు కథా సంవిధాన ప్రతిభకు నిదర్శనాలు కాని నీతి లేకపోవటం పెద్ద లోటు .ఓట్వే,ఎథరిజ్ ,విచర్లి ,కాన్గ్రీన్ ,ఫార్క్వర్ ఈనాటకకర్తలలో ముఖ్యులు .కాన్గ్రీన్ రాసిన ‘’లవ్ ఫర్ లవ్ ‘’,ది వె ఆఫ్ ది వరల్డ్ నాటకాలు వీటిలో ప్రసిద్ధాలు .వచనం ఆనాడు పలు వింత విశిష్ట పోకడలు పోయింది .వైదుష్యం జోడించి గంభీరశైలిలో రాబర్ట్ బర్టన్ రాసిన ‘’ది అనాటమీ ఆఫ్ మెలాంకలి’’గ్రంథం,కవిత్వం తో పోటీగా రమణీయ శైలిలో టామస్ బ్రౌన్ రాసిన ‘’రివిజియో మెడిచి ‘’,హైడ్రియో టేఫియా’’, లలిత ఆలంకారికశైలిలో జేరేమి టియ్లర్’’రాసిన హోలీ లివింగ్ ,హోలీ డైయింగ్ అనే ధార్మిక గ్రంథాలు ,సరళ సుందరంగా ఉన్నడ్రైడేన్ విమర్శనావ్యాసాలూ ,ప్రసంగ ధోరణిగా ఐజాక్ వాల్టన్ రాసిన ‘’ది కంప్లీట్ యా౦గ్లర్’’,నిత్య వ్యవహార భాషలో శామ్యుల్ పెపిన్ రాసిన ‘’డైరీ ‘’చాలా విలువైన వచన రచనలు .జాన్ బన్యన్ పెద్దగా చదువుకోకపోయినా బైబిల్ ను నిత్య పారాయణ చేయటం తో వచ్చిన పాండిత్యంతో ‘’ది పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ‘’అనే ‘’ఎలిగరి ‘’అంటే అన్యాపదేశాన్ని గొప్పగా పండించాడు .పాపపంకిల మార్గం నుంచి దైవ సన్నిధానానికి చేరాలని భక్తుడు చేసే యాత్రలో తటస్తించే అనేక అనుభవాలను మహా సొగసుగా వర్ణించాడు . సమాజం నీతి బాహ్య విశ్రుమ్ఖలత్వం పై విరక్తి పుట్టి ,18వ శతాబ్దిలో నవమార్గ కవితా సంప్రదాయం –నియోక్లాసికల్ స్కూల్ ఏర్పడింది .ప్రాచీన లాటిన్ కవిత్వ రీతులపై మోజు పుట్టింది .భావనకంటే బుద్ధికి ప్రాధాన్యమేర్పడింది .దీనితో వ్యంగ్య ,ప్రబోధాత్మక కావ్యాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .ప్రకృతి అందాలను వదిలేసి నాగరక జీవిత తళుకు బెలుకులపై ఆసక్తి పెరిగి ,వాటినే కవితా వస్తువులుగా తీసుకొన్నారు .లాలిత్యం లోపించి కృత్రిమత హెచ్చింది .దీనికి పితామహుడు అలేగ్జాండర్ పోప్ .ఈతనికావ్యాలలో నవమార్గ కవితా సంప్రదాయం లోని గుణాలు దోషాలు కనిపిస్తాయి .తన కవిత్వ సిద్ధాంతాన్ని ‘’ఎస్సే ఆన్ క్రిటిసిజం ‘’అనే కావ్యం లో ,సాంఘిక విశ్వాసాలకు ‘’ఎస్సే ఆన్ మాన్’’రాశాడు .హోమర్ ఇలియడ్ కు ఇంగ్లీష్ లోస్వతంత్ర అనువాదం చేశాడు .’’ది రేప్ ఆఫ్ ది లాక్ ‘’వ్యంగ్య కావ్యం లో ఉన్నత కుటుంబ వ్యక్తుల నిరర్ధక విలాస జీవితాలను మెత్తని చెప్పుతో కొట్టి మందలించాడు .పరిహాస రసికత్వం లో మాంచి రసపట్టున్నవాడు పోప్..తన విరోధులను కడిగి పారెయ్యటానికి ‘’డన్సియడ్ ‘’అనే అధిక్షేప కావ్యమే రాశాడు .ఇతని కవిత్వానికి ప్రాణం ఛలోక్తి .ఇతనికవిత్వ పద్యపంక్తులు సామెతలుగా లోకంలో విస్తృత ప్రచారం పొంది మన ‘’వేమన’’ గుర్తుకు వస్తాడు .ఒక రకంగా ‘’సాహిత్య దినుసుల పోపు డబ్బా ‘’పోప్ కవి అనిపిస్తుంది .
పోప్ అనుయానకవులు ఎడ్వర్డ్ య౦గ్ ,మాధ్యూ ప్రయర్ ,జాన్ గే.జేమ్స్ టామ్సన్ఋతువులను వర్ణిస్తూ ‘’సీజన్స్ ‘’రాసి మధుర భావనకు ప్రాధాన్యం తెచ్చాడు .భావ ప్రకటనకు కవిత్వం కంటే వచనమే హాయి అనిపించి, డేనియల్ డీఫోరాసిన కల్పిత కథ యదార్ధమే అని నమ్మి౦ చేట్లుగా ‘’రాబిన్సన్ క్రూసో ‘’ బహుళ ప్రజాదరణ పొంది ,బాలవాగ్మయం లో అందర్నీ ఫోఫో అని వెనక్కి నెట్టేసి సుస్థిర స్థానం పొందాడు డీఫో.స౦వాద శైలికి ప్రాణ ప్రతిష్ట చేసి ,సరళ సుబోధకంగా రాసినవాడు ‘’జొనాథన్ స్విఫ్ట్ ‘’.’’ది బాటిల్ ఆఫ్ ది బుక్స్ ‘’లో ప్రాచీన ,ఆధునిక మార్గాలమధ్య సంఘర్షణను ,క్రైస్తవ మతశాఖలమధ్య అంతః కలహాలను ‘’ది టేల్ ఆఫ్ ఎ టబ్’’ (నూతిలోని కప్పలు ?) లోనూ విమర్శించాడు .మొత్తం మానవ జాతిపై ఏర్పడిని తన విరక్తిని ‘’గలివర్స్ ట్రావెల్స్ ‘’లో అధిక్షేప రచనగా ,వచన కథా కావ్యంగా నిర్మించాడు .మానవ సమాజం లోని అనేక లోపాలను అందులో ఎత్తి చూపాడు .అందులోనే ఉన్న ‘’యాహూ ‘’పదం మనకు’’ యాహూ డాట్ కాం’’ కు దారి చూపింది .అది స్విఫ్ట్ ‘’కాయనేజ్డ్ వర్డ్ ‘’.
ఆనాటి పత్రికలు వ్యాసరచన బాగా ప్రోత్సహించాయి .రిచర్డ్ స్టీల్ ,జోసెఫ్ యుడిసన్ఇద్దరు కలిసి ‘’ది టాట్లర్ ‘’అనే పత్రికలో ,తర్వాత ‘’డి స్పెక్టేటర్’’పత్రికలో సమకాలీన సమస్యలను నిష్పక్షపాతంగా సౌమ్యంగా మృదు హాస్య భరితంగా ,రసవంతంగా అనేక వ్యాసాలూ రాశారు .వీరు సృష్టించిన ఐజాక్ బికర్ స్టాఫ్ ,సర్ రోజర్ డీ కవర్లి పాత్రలు సాహిత్యం లో అమరత్వం పొందాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-20-ఉయ్యూరు