బక దాల్భ్యుడు -13
స్కంద పురాణం ప్రకారం ప్రజాపతి బ్రహ్మ ఇంద్రద్యుమ్న రాజును స్వర్గం లో కలిశాడు .ఆయనను చేసిన పుణ్యాలు ,పొందిన కీర్తి ని బట్టి ఒక వంద కల్పాల కాలం భౌతికశరీరం తో స్వర్గం లో ఉండే ట్లు అనుగ్రహించాడు .తరవాత అంతా భారత౦ లో ఉన్నదే .ఇక్కడ తాబేలు పేరు ‘’మంధరక’’ మానస సరోవరం లో ఉంటోంది .అందులోని పాత్రలు ఒక్కొక్కరు ఎంతకాలం జీవి౦చాయో లెక్క కూడా ఉన్నది .మార్కండేయుడు -7కల్పాలు ,బకం-14కల్పాలు ,గుడ్లగూబ -28,తోడేలు -56కల్పాలు,తాబేలు -112కల్పాలు బ్రతికారు .ఈ పురాణంలోని మహేశ్వర ఖండం అంతా శివుని గురించే .మహీ నది సముద్రంతో కలిసే ఒక తీర్ధం వివరాలున్నాయి .అక్కడి శివుడు ఇంద్రద్యుమ్నేశ్వర లింగం .మార్కండేయుడు ,పైన చెప్పబడిన జంతువులూ శాపగ్రస్తులైన రుద్ర గణాలు .ఇంద్రద్యుమ్నుడు తాత్కాలికంగా భూమి మీద ఉండాలని అనుకోకుండా బకంతో సహా పై జంతువులతో కలిసి ఇక్కడ తపస్సు ధ్యానాదులను శివునితో సారూప్య ముక్తికోసం చేశాడు -2.13.205-08.
మార్కండేయుడు మాత్రం జీవన్ముక్తుడయ్యాడు.శివుడు ‘’లోమాంశ’’ రుషినీ అలాగే చేశాడు. ఈయన వయసు ఇంద్ర ద్యుమ్న ,తాబేలు లకంటే చాలా ఎక్కువ .కల్పానికి ఒక్క శిరోజం ఊడిపోతుందనీ ,అన్నీ శిరోజాలూ ఊడిపోయే దాకా తాను బ్రతుకు తాననీ ఆయనే చెప్పుకొన్నాడు .కల్పాలు లయమైన కాలం లోకూడా లోమా౦శుడు జీవించే ఉంటాడు .కనుక యితడు వేదకాలానంతరం వాడుగా లోమాంశ లేక రోమాంశ అంటే పొడవైన జుట్టున్నవాడు గా కేశి అంటే దీర్ఘ కేశాలున్నవాడుగా అంటే బక దాల్భ్యుడుగా భావించవచ్చు .లోమామ్శుడు ఉత్తర ప్రాంతం వాడు అనీ ఉన్నది-మణి-1975-458.కనుక బకనాడీ జంఘ ,ఇతర పేర్కొనబడిన దీర్ఘ జీవితం ఉన్న పై ముసలి జంతువులూ అన్నీ హిమాలయ ప్రాంతంలో ఉండేవి .
తనకు దీర్ఘ జీవితం ప్రసాది౦చి౦ది శివుడే అని నాడీ జన్ఘుడు చెప్పాడు .యితడు పూర్వం ‘’అనార్త ‘’మహారాజు .విశ్వ రూప పారాశర్యుని బ్రాహ్మణ కుమారుడు.చిలిపి వాడు .ఒకరోజుతండ్రి పూజించే మరకత శివలింగాన్ని దొంగిలించి ఒక మకర సంక్రాంతి నాడు నేతి ఘటం లో దాచాడు .శివుడు ఈ రకమైన కొత్త అభిషేకానికి మహా ప్రీతి చెంది దీనికి ‘’ఘ్రుత కంబాల పూజ ‘’అనిపేరు పెట్టాడు .ఈ పుణ్య ఫలితం గా ఆ బ్రాహ్మణ యువకుడు అనార్త మహారాజుగా పుట్టాడు .అతనికి గతజన్మవిషయాలు గుర్తున్నాయి .అప్పటినుంచి శివలింగాన్ని నేతితోనే అభిషేకించాడు .శివ దర్శనం కలిగి వరం కోరుకోమంటే కోరిక తీర్చి కైలాస గణ నాయకుని చేయగా ‘’ ప్రతీపపాలక ‘’నామం పొందాడు .
పదవి పతనానికీ దారి తీసింది .ఇష్టమొచ్చినట్లు తిరిగాడు నాడీ.ఈ తిరుగుళ్ళలో గాలవ రుషి పరిచయమై ,ఆయన భార్యపై మోజుతో శిష్యుడిగా చేరాడు .ఒకసారి ఆమెను బలాత్కారించబోగా ఆమె అరుపులు విని రుషివచ్చి తీవ్ర పదజాలంతో స్తబ్దుడవై దీర్ఘకాలం కొంగవై పొమ్మని శపించాడు .అప్పటినుంచి కొంగ నైజం వచ్చింది –స్కందం –మా ఖండం -2.7.94.కశ్యప వంశంలో బకునిగా పుట్టాడు .ఇంద్ర ద్యుమ్నునికి సహాయం చేస్తే, శాప విమోచనం అనీ మహర్షి అనుగ్రహించాడు -2.7.109-110.
నాడీ జన్ఘుని బకనైజం అన్ని రూపాలలో కనిపిస్తుంది .విశ్వరూపుడు తనకొడుకును ‘’బక’’అని పిలిచేవాడు .గాలవ కథలలో చాలా సార్లు ఈ నైజం చూపాడు .ఆయన శిష్యుడివి ఎలా అయ్యావు అని అడిగితె పూర్వ బకజన్మ వల్లనే అని చెప్పాడు .వీడు గురు భార్యను ఎత్తుకు పోదామని ప్రయత్నిస్తుంటే ఆమె వాడిని ‘’బకవృత్తి ‘’గాడు అనిఅంటే ధర్మం ముసుగులో ఉండే కపటి అని తిట్టింది .గాలవ శాపంతో వాడు కదలలేడు అంటే చిత్రంలో బొమ్మలా ఉండిపోయాడు .వృద్ధ బకుడు ,అత్తి చెట్టు తో కలిసి కనిపిస్తాడు .ముని శపించగానే అశ్వత్ధ మొక్క ఆకులులాగా కంపించిపోయాడు .
బక సంబంధమైన అన్ని కథలలో బకాదాల్భ్యుని నైజం కొంగ బుద్దిగానే కనిపిస్తుంది .నాడీ జంఘ వృత్తాంతం లో మూర్తీభవించిన బకత్వమే మనం చూశాం .నమ్మశక్యం కాని ,పనికిమాలిన యోగ్యతలేని అసమర్ధ ,కపట ముని వృత్తికల స్తబ్దుడైన ,వ్యభిచార ముసలి వాడుగా అతడు కనిపిస్తాడు .అల్లరిచిల్లర కొడుకును తండ్రే బక అంటే వాడి నైజం అర్ధమౌతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-6-20-ఉయ్యూరు