సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-49

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-49

 భయంకర బలపరాక్రమ తేజస్సులతో ఉన్నదశకంఠ రావణుడిని వానర వీర హనుమాన్ చూసి ,భయం తొట్రు పాటూ ఏ మాత్రం లేకుండా ,అర్ధవంతమైన మాటలతో ‘’నేను రామదూతనైన ,వానర రాజు సుగ్రీవుని సందేశం తో లంకకు వచ్చాను .నీ సోదరునిలాగా సుగ్రీవుడు నీకు హితుడు .నిన్ను కుశలప్రశ్నలు అడిగాడు –‘’తమ్ సమీక్ష్య మహాసత్వం సత్వవాన్ హరిసత్తమః –వాక్య మర్దవ దవ్యగ్ర స్తమువాచ దశాననం ‘’

‘’అహం సుగ్రీవ సందేశా దిహప్రాప్త స్తవాలయం –రాక్షసేంద్ర హరీశ స్త్వాంభ్రాతా కుశలమబ్రవీత్ ‘’

‘’స్నేహితుడి లాగా హితం తో సుగ్రీవుడు నీకు పంపిన సందేశం విను .అది నీకు ఈలోకం లో ,పరలోకం  లో కూడా అభ్యుదయం కలిగిస్తుంది ‘

‘’భ్రాతుః శ్రుణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః –ధర్మార్ధోప  హితం వాక్య మిహ చాముత్ర చ క్షమం’’

అని చెప్పి ఇది వరకు తాను అశోక వనం భగ్నం చేసేముందు చెప్పిన శ్లోకాలను సుగ్రీవుడు చెప్పినట్లుగా రికార్డ్ పెట్టాడు హనుమ- ‘’రాజా దశరదోనామ రథకున్జర వాజిమాన్ ‘’నుంచి రాముడుసుగ్రీవ స్నేహం చేసి వాలిని చంపి సుగ్రీవుని రాజును చేసేదాకా 7శ్లోకాలలో వాయి౦చి పారేశాడు –

‘’తత స్టేన మృధేహత్వా రాపుత్రేణ వాలినం –సుగ్రీవ స్థాపితో రాజ్యేహర్యక్షాణా౦ గణేశ్వరః ‘’

‘’రాజా !వాలి నీకు పూర్వం పరిచయమున్నవాడే గా .అతడిని ఒకే ఒక్క బాణం తో రాముడు చంపాడు తెలుసా .

‘’త్వయా విజ్ఞాత పూర్వ శ్చ వాలీ వానర పుంగవః –రామేణ నిహత స్సంఖ్యేశరే ణైకేన వానరః ‘’

 మా రాజు సుగ్రీవుడు సత్య ప్రతిజ్ఞకలవాడు కనుక సీత అన్వేషణకై అన్ని దిక్కులకు లక్షలకొద్దీ వానర సైన్యం పంపాడు.వారిలో కొందరు  గరుత్మంతు నికి , కొందరు వాయువుకు వేగం లో సాటైనవారు –

‘’వైనతేన సమాఃకేచిత్  కేచిత్తత్రానిలోపమాః-అసంగ గతయః శీఘ్రా హరి వీరా మహా బలహ ‘’

‘’అందులో రాజా !నేనువాయుపుత్ర  హనుమంతుడను .సీత జాడకోసం నూరు యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి మీ లంకకు వచ్చాను .లంకంతా గాలిస్తూ ,ఇక్కడ ఆమెను చూశాను .నువ్వు శాస్త్రోక్త ధర్మ స్వరూపం తెలిసిన మహా ప్రాజ్ఞుడవు .మహాతపస్వివి .పరభార్యను అలా నిరోధించటం నీకు తగని పని.నీలాంటి బుద్ధిమంతులు అపాయకర ,ఆత్మవినాశాకర ధర్మ విరుద్దాలైన పనులలో తలదూర్చరు –

‘’తద్భవాన్ దృస్ట ధర్మార్థ  స్తపః కృత పరిగ్రహః –పరదారా న్మహాప్రాజ్ఞ నొప రుద్ధుం త్వమర్హసి ‘’

అని చాలా నెమ్మదిగా మెత్తగా ,ధర్మపరడని తపస్వి అనీ పొగుడుతూ ,చేసినపని చాలా నీచమైనదని అలాంటి వాడు చేయతగనిపని అనీ హితవు చెప్పాడు .కొంచెం స్వరం పెంచి ‘’రావణా !రాముడు కోపిస్తే ,తమ్ముడు లక్ష్మణస్వామి విడిచిన బాణం కు ఎదురు నిలిచే సాహసం దేవాసురులలో ఎవరూ చేయ లేరు .ఆయనకు అపకారం చేస్తే ముల్లోక్లాలలో ఒక్కడు  కూడా సుఖంగా ఉండలేడు  అని   స్పష్టంచేశాడు –

‘’తస్య లక్షణ ముక్తానాం రామ కోపాను వర్తినీం -శరాణామగ్రతః స్థాతుం శక్తో దేవా సురేష్వపి’’.

‘’న చాపిత్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన-రాఘవస్య వ్యళీకం యః కృత్వా సుఖ మవాప్ను యాత్ ‘’

ఇప్పటిదాకా జరిగిన చెడు గురించి ,రామసోదర పరాక్రమ వీరాలగురించి హెచ్చరిక గా చెప్పాడు దీమాన్ హనుమాన్ .అసలే మొండి ముండావాడు కొంచెం కఠినంగా నే వాడు చెయ్యాల్సి౦దేదో ,దేని వలన ప్రమాదం తప్పుతుందో  సూటిగా చెప్పాలనుకొని ‘’రాజా !ధర్మ అర్ధ సమ్మతమైన నా మాటలు విని భూత వర్తమాన  భవిష్యత్తులలో మేలు కలిగేట్లుగా ఆలోచించి సీతా దేవిని శ్రీరాముడికి  సమర్పించు ‘’ –

‘’తత్రికాల హితం వాక్యం ధర్మ్యమర్థాను బంధి చ –మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతి దీయతాం’’

రావణా !అనితర సాధ్యమైన సీతా దర్శనం నాకు లభించింది .ఆమెను ఇక్కడి నుండి తీసుకు వెళ్ళటం ఎలాగో రాముడే నిర్ణయిస్తాడు .మూర్తీభవించిన శోకదేవతలా సీత ఉన్నది .పొరబాటున ఆమెను వశం చేసుకోవాలని అనుకోకు. ఆమె అయిదు తలల సర్పం .నీ ప్రాణాలు తీస్తుంది అని నీకు తెలియనట్లుంది ,జాగ్రత్త .-

‘’లక్షితేయం మయా సీతా తథా శోక పరాయణా-గృహ్య యాం నాభి జానాసి పంచాస్య మివ పన్నగీం ‘’

‘’ఆహారం లో విషం కలిస్తే ఎలా జీర్ణం కాదో ,అలాగే సీత కూడా దేవతలకు అసురులకు వశీకరింప శక్యం కానిది –

‘’  నేయం జరయితు శక్యా సాసురై రమరైరపి- ‘’విష సంసృస్ట మత్యర్ధం భుక్తమన్న మివౌజసా –రాక్షసరాజా !ఎంతో శమించి తపస్సు చేసి న ధర్మానికిప్రతిఫలంగా దీర్ఘాయుస్సు పొందావు .దాన్ని నాశనం చేసుకోవద్దు .నీ తపస్సుతో పొందిన వరంతో దేవాసురులు నిన్ను చంపలేరని అనుకొన్నా నీకు మృత్యువు తప్పదు-‘

’తపస్సంతాప లబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహః –న స నాశయితుం న్యాయ్య ఆత్మప్రాణ పరిగ్రహః

‘’అవధ్యతాం తపోభి ర్యాం భవాన్ సమను పశ్యతి-ఆత్మనస్సాసురై ర్దేవైర్హేతు స్తత్రా ప్యయం మహాన్ ‘’

రావణుడు చావు విషయంలో తనకు  నర వానరులవలన భయం లేదని ముందే శివుడికి చెప్పాడు ఆ విషయాన్ని హనుమ అన్యాపదేశంగా ‘’సుగ్రీవుడు దేవుడు కాదు ,అసురుడు ,రాక్షసుడు కూడా కాదు.గ౦ధర్వ యక్ష ఉరగుడూ కాదు.ఎవరివలన చావు రాకూడదు అని కోరుకున్నావో వారిలో ఎవరూ కాదు .కనుక సుగ్రీవ వానరరాజు రాజునుంచి ప్రాణాలు ఎలాకాపాడుకో గలవయ్యా ?

‘’న దానవో న గంధర్వో న యక్షో న చ పన్నగః –తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యతి ‘’’సరే బాగానే ఉంది .ఇప్పటిదాకా నేను చేసిన అధర్మానికి ఫలం అనుభవించకుండా ఉండటం ఎలా ?అను కుంటున్నావా ?అధర్మ ఫలం ధర్మ ఫలం తో కలియదు ధర్మఫాలం పూర్వపు ధర్మ ఫలం తో  చేరుతుంది .నీ అధర్మం ధర్మాన్ని నశింపజేస్తుంది కనుక అధర్మం నిలవదు .ధర్మం అధర్మాన్ని పో గొడుతుందే,అధర్మం ధర్మాన్ని నాశనం చేయలేదు .కనుక ధర్మాచరణ చేస్తే నీ పాపాలన్నీ పటాపంచలౌతాయి .నేను పూర్వం చాలాధర్మకార్యాలు చేశాను దానిఫాలం చాలా మూలుగుతోంది  అది నా పాపాలను అధర్మాన్ని పోగొట్టదా’’అని ఆలోచిస్తున్నావేమో .నీ ధర్మఫలం అంతా క్షయ మైంది .కనుక నువ్వు ఇప్పుడు అధర్మ ఫలం అనుభవించక తప్పదు అని గ్రహించు –

‘’నతు ధర్మోప సంహార మాధర్మఫల సంహితం-తదేవ ఫలమన్వేతి ధర్మ శ్చాధర్మ నాశనః ‘’

‘’ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయః –ఫలమస్యా ప్యాధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే ‘’

అని మానవ వానరుల చేతిలో నీ చావు తప్పదన్న రహస్యం తనకు తెలిసి౦దని కుండబద్దలు కొట్టి చెప్పాడు .వాడి ధర్మాధర్మాఫాలం తాలూకు  జమా ఖర్చులు లెక్క చెప్పి పుణ్యఫలం జీరో, నిల్ అని చెప్పి ,ఇక పాఫలం అనుభవించటానికి సిద్ధంగా ఉండమన్నాడు .

‘’రాజా !జనస్థానం ఆలో రాముడు ఒక్కడే 14వేల మంది రాక్షస సంహారం చేశాడు ,నీకు అన్నిటా పెద్దవాడైన వాలి ఆయన చేతిలో చచ్చాడని ,రామ సుగ్రీవ మైత్రి అత్యంత  దృఢమైనదనీ తెలుసుకొని నీకు హితం ఏదో ఊహించు .నేనొక్కడినే లంకలో సర్వస్వం నాశనం చేయగలను .కాని అలాచేయమని రామాజ్ఞ లేదు నాకు-‘’

‘’కామం ఖల్వహ మప్యేక స్సవాజి రథ కుంజరాం-లంకా౦నాశయితుమ్ శక్త స్వైష న నిశ్చయః ‘’మరో విషయం రాజా !సీతను చేరబట్టిన శత్రువైన వాడిని నాశనం చేస్తానని రాముడు వానర ,ఋక్షసమక్షంలో ప్రతిజ్ఞ చేశాడు .ఆయనకు అపకారం తలబెడితే దేవేంద్రుదికే దిక్కు ఉండదు నీవొక లెక్కా ?

‘’రామేణ హి ప్రతిజ్ఞాతమ్ హర్ఋక్ష గణ సన్నిధౌ –ఉత్సాదన మమిత్రాణా౦ సీతా యైస్తు ప్రధర్షితా’’

‘’సీత అంటే సకల లంకానగరం నాశనం చేసే కాళరాత్రి అనే మహా శక్తి అని గ్రహించు

‘’యాం సీతే త్యభిజానాసి ఎయం తిస్టతి తే వశే –కాళరాత్రీతి తాం విద్ధిసర్వ లంకా వినాశినీం ‘’

సీత రూపం లో ఉన్న యమపాశాన్ని స్వయంగా నీ మెడకు చుట్టుకోకు .సరిగ్గా ఆలోచించు .సీత కోపం తో తగులబడి ,రామకోప పీడితమై నీలంక అంతా అన్నిటితో సహా కొద్దికాలం లోనే కాలిపోవటం చూస్తావు .నీ మిత్ర బాంధవ సోదర ,కుమారమంత్రి,హితభార్యలు లంకను వినాశనం చెందించకు –

‘’తదలం కాలపాశేన సీతా విగ్రహ రూపిణా-స్వయం స్కంధావ సక్తేన క్షమ మాత్మని చిన్త్యతాం ‘’

‘’సీతాయా స్తేజసా దగ్దాం రామకోప ప్రపీడితాం-దహ్యమానా మిమాం పశ్య పురీం సాట్టప్రపీడితాం’’

‘’స్వాని మిత్రాణి మంత్రీం శ్చ-జ్ఞాతీన్ భాత్రూన్ సుతాన్ హితాన్ –భోగాన్ దారాంశ్చ లంకాం చ-మా వినాశ ముపానయ ‘’

రావణా !చిలక్కి చెప్పినట్లు చెబుతున్నా విను .ప్రత్యేకంగా రామదూతగా వచ్చిన వానరుడను .నామాట పాటించు .’’అన్నాడు

‘సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వవచనం మమ- రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః ‘’

రాముడు అంటే ఎవరో నీకు తెలీదు తెలియ జెబుతున్నా విని నీ బుద్ధి మార్చుకో .సర్వలోకాలు ,పంచ మహాభూతాలు,బ్రహ్మ సృష్టించిన సకల స్థావర జంగమ రాశి ,ప్రళయ కాలం లో రుద్రుని ద్వారా లయింప జేయటానికీ ,మళ్ళీ కల్పాది లో పూర్వం లా సృస్టించటానికి మహాయశ్వి రాముడు సర్వ సమర్ధుడు .దేవాసుర రాజ ,రాక్షస విద్యాధర ,గ౦ధర్వ నాగ సిద్ధ కిన్నర కింపురుష ,పక్షి జాతులలోనూ సర్వ భూతాలలోనూ సకల ప్రదేశాలలోనో సర్వకాలాల్లోనూ విష్ణువు తో సమానమైన పరాక్రమం కల రామునినితో ఎదురు నిలిచే వారు లేరు –

‘’సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ స చరాచరాన్ –పునరేవ తథాస్రస్టు౦ శక్తో రామో మహాశయాః

‘’దేవాసుర నరేంద్రేషు,యక్ష రక్షో గణేశు చ –విద్యాధరేషు సర్వేషు గంధర్వేషూరగేషు చ

‘’సిద్దేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః –సర్వ భూతేషు సర్వత్ర సర్వ కాలేషు నాస్తి సః

యో రామం ప్రతి యుధ్యేత విష్ణు తుల్య పరాక్రమమ ‘’

‘’కనుక దశ కంఠా!అన్నిలోకాలకు ప్రభువు ,రాజ శ్రేష్టుడు అయిన శ్రీ రామచంద్ర మూర్తి కి ఇలాంటి అపకారం చేసి జీవించటం దుర్లభం .రాముని ఎదుట నిలువగలిగిన వారేవ్వరూ లేరు అని తెలుసుకో –

‘’సర్వ లోకేశ్వర స్స్యైవం కృత్వా విప్రియ ముత్తమ౦ –రామస్య రాజ సింహస్య దుర్లభం తవ జీవితం ‘’

రాక్షసరాజా రావణా !స్వయంభు ఐన చతుర్ముఖ బ్రహ్మ ,ముక్కంటి మహేశ్వరుడు ,త్రిపురారి రుద్రుడు ,మూడులోకాల నాయకుడు పరమైశ్వర్య సంపన్నుడు దేవేంద్రుడు కాని రాముడు చంపాలను కొన్నవాడిని ఎట్టి పరిస్థితి లోనూ కాపాడలేరని గ్రహించు ‘’

‘’బ్రహ్మా స్వయంభూ శ్చతురాననో వా –రుద్ర స్త్రిణేత్రస్త్రిపురాంతకో వా –త్రాతుం న శక్తా యుధి రామవధ్యం ‘’

ఇలా చెప్పాల్సిందంతా సవివరం గా జంకూ గొంకూ లేకండా అతి స్పష్టంగా తేటతెల్లంగా అన్ని కోణాల నుంచి తన దూత వాక్యాలను అత్యంత సమర్ధంగాగంభీరంగా  చెప్పిన హనుమంతుని యుక్తియుక్తమైన , వచనాలను విని సాటిలేని పరాక్రమశాలి రాక్షసరాజు రావణాసురుడు కోప౦ నషాళానికి అంటి  గుడ్లు తిప్పుతూ వానర శ్రేష్ట హనుమను చంపమని ఆదేశించాడు .

‘’స సౌస్ట వో పేత మదీన వాదినః –కపేర్నిశమ్యాప్రతిమో ప్రియం వచః –దశాననః కోప వివ్రుత్త లోచన-స్సమాదిశ త్తస్య వాదం మహా కపేః’’

  ఇది 45శ్లోకాల అత్యంత ముఖ్యమైఅన హనుమ దూత కర్తవ్య సర్గ

సీతారాములు మామూలు మనుషులుకారు అవతార మూర్తులు అని విస్పష్టంగా హనుమ రావణుడికి చెప్పాడు .ఇద్దరిలో ఎవరికి కోపమొచ్చినా లంక భస్మం అవాల్సింది .వారికి జరిగిన అవమానం తీవ్రమైనది .దానికి వారు తప్పక ప్రతీకారం తీర్చుకొంటారు .రాముడి పరాక్రమమం ముందు ఏలోకం లోనూ ఎవరూ సాటికారు.ఆయన చంపాలనుకున్నవాడిని అభయమిచ్చి కాపాడే మొనగాడు ఏలోకం లోనూ లేడు.నాలుగు ముఖాలున్న సృష్టికర్త బ్రహ్మ ఏమీ చేయలేడు.మూడవకంటితో దహనం చేయగల శివుడు చేతులెత్తేయాల్సిందే .ప్రపంచలయం చేసే రుద్రుడు ఏమీ చేయలేక రోదిన్చాల్సిందే .ఇక దేవేంద్రుడి మాట చెప్పేదేముంది ఆయనే తన ఆపదలకు వారి దగ్గరకు వెళ్లి మొక్కుకోవాలి .

  సకల చరాచారాన్ని సృష్టించి పోషించి లయం చేసే శక్తి రామునికి ఉంది అందుకే ఆయన ‘’రామబ్రహ్మం ‘’’ బ్రహ్మం అన్ని చోట్లా అన్నికాలాలలో సర్వభూతాలలో ఉన్నట్లే రాముడు ‘’ ‘’omniscient ,omnipresent ,omnipotent ‘’అనీ ఆయన్ను తప్పించుకోవటం అసాధ్యమనీ చెప్పాడు .తాను వానరుడు.తనకంటే ఉత్తమజాతి రాక్షసరాజు తనతో చెప్పించుకోవటం భావ్యం సభ్యతా కాదన్నాడు .సీత పంచముఖ కాలసర్పం ,కాలపాశం ఆమె కు కీడు చేస్తే దు౦పనాశనమే అన్నాడు .అసలు రాముడిదాకా ఎందుకు సకల లంక వినాశనం చేసే సమర్ధత తనకున్నదని చెప్పాడు .కాని రామాజ్న లేదనీ ,ఆయన ప్రతిజ్ఞా చెల్లాలనీ ,తనకే ఇంట శక్తి ఉంటె తనను పంపిన ప్రభువుకు ఎంతటి శక్తి ఉంటుందో ఆలోచి౦చ మన్నాడు .ప్రభుకే అలాంటి శక్తి ఉంటే ,ప్రభువులకు ప్రభువు రామస్వామి కి ఎంతటి తేజబలపరాక్రమాలు౦టాయో గ్రహించమన్నాడు .చాలా సమర్ధంగా ధర్మాధర్మ విచారణ చేసి కూడా హితం చెప్పాడు .రావణ ధర్మఫలం సీతాపహరహతో  ‘’హళ్లికి హళ్లి సున్నకు సున్న’’అయి పోయి  అధర్మ ఫలం పెరిగి నాశనం చేయటానికి సిద్ధంగా ఉ౦దన్నాడు .ఎవరూ రాలేని లంకకు శతయోజనవిస్తీర్ణ మహా సముద్రం పై యెగిరి తాను  చేరానని ,తనలాంటి తనకంటే విశేష బలపరాక్రమ వానర సి౦హులు లున్నారని వారికి వాయు ,గరుడ వేగం ఉందనీ ,కనుక కోతులు భల్లూకాలు అని తేలికగా భావి౦చవద్దనీ చెప్పాడు. వాలి పరాక్రమం తెలుసు నీకు అన్నాడు .పూర్వం ఒకసారి రావణుడు ఏదో కోతి పని చేస్తే కోపంతో వాలి వాడిని తన చంకలో పెట్టుకొని సప్త సముద్రాలలో ముంచి తేలిస్తే, ఊపిరాడక కాళ్ళ బేరానికి వస్తే క్షమించి వదిలాడు వాలి .అలాంటి అమిత తేజో సంపన్నుడైన వాలినే రాముడు ఒకే ఒక్క బాణం తో చంపాడు అని భయపెట్టాడు .వానర భల్లూక సైన్య సమూహాలముందు శ్రీరాముడు సీతాపహరణం చేసినవాడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడని ,రామ ప్రతిజ్ఞా, రామ బాణం తిరుగులేనివని  స్పష్టంగా చెప్పాడు .

  ఎంతటి ధర్మసూక్ష్మాలు హనుమకు తెలుసో మనకు ఆశ్చర్యమేస్తుంది .అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు పగవాడికి అంత విస్పష్టంగా సుగ్రీవ దూత గా హనుమ మహా నేర్పుగా మాట్లాడాడు .సుగ్రీవ వచనాలు అని మొదలుపెట్టి ,తర్వాత అంతా తన మాటలుగానే చెప్పటం మరో విశేషం అని పించింది .ఇహలోకం లోనూ పరలోకం లోనూ హితమైన మాటలు చెబుతున్నా విను అని బుజ్జగించి చెప్పాడు .వినకపోతే నీఖర్మం అన్నాడు తెగేసి .ఆత్మ వినాశనం తెచ్చే పనులు చేయొద్దు అన్నాడు ,తనతో పాటు అందర్నీ, లంకనూ కాపాడుకోమని ముద్దుగా చెప్పాడు .లేక పొతే జరగబోయేది  మైండ్ బ్లాక్ అయ్యేట్లు ‘’బిగ్ స్క్రీన్ ‘’మీద చూపించాడు  .వినాశకాలే విపరీత బుద్ధి అన్నదాన్ని నిజం చేయకు అనీ చెప్పాడు .చేసిన తప్పులు చెంపలు వాయిన్చుకొంటే పోతాయి అన్నట్లు ,పశ్చాత్తాపం చెంది సీతామహాదేవిని శ్రీరామ చంద్ర ప్రభువుకు సమర్పించి తనను సర్వ లంకా సామ్రాజ్యాన్ని కాపాడుకోమన్నాడు .శరణు అంటే రాముడు ఎవరినైనా క్షమిస్తాడని చెప్పకనే చెప్పాడు .శరణాగత రక్షణ రాముని ప్రత్యేకత ‘’అభయం సర్వ భూతేభ్యః ఏతద్ వ్రతం మమ’’అని చాటుకున్న ఉదార హృదయుడు .

   ఈ హనుమ’’ దూతం’’ తో ప్రేరణ చెంది, శ్రీకృష్ణుడు భారతంలో రాయబారం నడిపాడు –‘’నా పలుకులు విశ్వసింపు ‘’ అలుగుటయే ఎరు౦గని  మహామహితాత్ముడజాత  శత్రువే అలగిన నాడు , సాగరములన్నియు  ఏకము కాకపోవునే ‘’,జెండాపై కపి రాజు ,ముందు సిత వాజిశ్రేణి౦  గూర్చి, నే దండంబున్ గొనితోలు  స్య౦దనము మీదన్ నారి  సారించి  గాండీవంబు ధరించి ఫల్గుణుడు మూకన్  చెండుడు చున్నప్పుడు –ఒక్కండును ఒక్కండునునీమొర నాలకి౦పడు’’ లకు హనుమ మాటలే మార్గదర్శకాలు .ఈ సర్గలో దాదాపు అన్ని శ్లోకాలు ఉదహరింప దగినవే .దేనికదే ప్రత్యేకం .అందుకే వదలకుండా అన్నీ రాశాను. వాటి సారమూ తెలియ జేశాను .ఇంతగొప్పగా ఈ సీన్ పండింప జేసిన వాల్మీకి మహర్షికి కైమోడ్పులు ఘటిస్తూ ,ఏకపాత్రాభినయంలా హనుమ చూపిన సర్వ హావభావాలకు అంజలి ఘటిస్తున్నాను .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-6-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.