సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-50
కోపం తో మూఢుడైన రాక్షసరాజు రావణుడు హనుమ ను చంపమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు .దూతకార్యానికి వచ్చిన వాడిని చంపటం భావ్యం కాదన్నాడు వాక్య విశారద విభీషణుడు .ఆతడిని ఆపటానికి ఏమి ఆలోచించాలా అని మధనపడ్డాడు .అన్నను సామవచనాలతో మనసు మెత్త పడేట్లు చేద్దామనుకొని ,చాలా కౌశల్యమైన మాటలతో ‘’రాక్షసరాజా !ఈ వానరుడిని క్షమించు .అతనిపై కోపం వద్దు .ఏ పని చేయాలో ఏపని చేయరాదో తెలిసిన రాజశ్రేస్టులు దూతను వధించరు .అసలు వానరుని చంపటం రాజధర్మం కాదు .నింద్యమైనదికూడా.అది నీ వంటి వీరునికి తగని పని .-
‘’నిశ్చితార్ధ స్తతస్సామ్నా పూజ్య శత్రు జిదగ్రజం –ఉవాచ హిత మత్యర్ధం వాక్యం వాక్య విశారదః ‘’
‘’క్షమస్వ, రోషం త్యజ రాక్షసేంద్ర –ప్రసీద మద్వాక్య మిదం శృణుష్వ-వధం న కుర్వంతిపరావరజ్ఞాః-దూతస్య సంతో వసుధాదిపేంద్రాః’’
‘’రాజ ధర్మ విరుద్ధం చ లోక వృత్తేశ్చ గర్హితం –తవదాస దృశం వీర కపే రస్య ప్రమాపణం’’
రాజా !ధర్మజ్ఞుడవు,కృతజ్ఞుడవు.రాజధర్మ కుశలుడవు కర్తవ్యాకర్తవ్యాలు బాగా తెలిసిన వాడవు .పరమార్ధం తెలిసిన వివేకివి .నీలాంటి పండితుడు రోషంతో కలుషితులైతే ,వివిధ శాస్త్రాలు చదివి ,జ్ఞానం సంపాదించటం శ్రమ వ్యర్ధమే అవుతాయికదా.కనుక అన్నీ క్షుణ్ణంగా తెలిసిన నువ్వు యుక్తాయుక్తాలతో ఆలోచించి ఈ దూతను దండించు ‘’అని చెప్పి కూర్చున్నాడు .-
‘’గృహ్యంతే యది రోషేణ త్వాదృశోపివిపశ్చితః-తతశ్శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం ‘’
‘’తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద –యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దండోవిధీయతాం ‘’
విభీషణుడి మాటలకు అరికాలి మంట నెత్తికెక్కిన రావణుడు ‘’శత్రునాశకా ,విభీషణా!పాపుల్ని చంపితే పాపం రాదు .రాజద్రోహం చేసిన వీడు పాపి కనుక చంపేస్తాను .’’అన్నాడు –
‘’న పాపానాం వధేపాపం విద్యతే శత్రుసూదన –తస్మాదేనం వదిష్యామి వానరం పాపచారిణం’’
అన్నమాటలు విన్న తమ్ముడు తన పట్టు వదలకుండా ‘’రాజా !ప్రసన్నుడవు కావలసినది గా కోరుతున్నాను.ధర్మార్ధ యుక్తమైన నా మాట విను .యజమాని ఆజ్ఞను దూత నిర్వహిస్తాడు కనుక ఏ జాతిలో కూడా దూతను చంపటం అనేది లేదు –
‘’దూతాన్ నవధ్యాన్ సమయేషు రాజన్ –సర్వేషు సర్వత్ర వదంతి సంతః
రాజా !యితడు బలమైన శత్రువు అనటం లో సందేహం ఏమాత్రం లేదు .అతడు చేసిన అపకారం కూడా చాలా పెద్దదే .అయినా సత్పురుషులు దూత వధను దండంగా పేర్కొనరు .దూతకు విధించే శిక్షలు వేరే ఉన్నాయి .అంగవైకల్యం కలిగించటం ,కొరడాలతో కొట్టటం ,గుండుగీయించటం ,ముద్ర వేయటం దూతకు విధించే శిక్షలు అనే చెప్పారుకాని దూతవధ ఎక్కడా ఇంతవరకు విని ఉండలేదు .-
‘’అశంశయం శత్రు రయం ప్రవృద్ధః -కృతం హ్యనే నాప్రియ మప్రమేయం –న దూత వధ్యాంప్రవదంతిసంతో –దూతస్య దృష్టాబహవో హి దండాః’’
‘’వైరూప్య మంగేషు కశాభి ఘాతో-మౌ౦డ్య౦ తథా లక్షణసన్నిపాతః -ఏతాన్ హిదూతే ప్రవదంతి దండాన్ –వధస్య దూతస్య న నః శ్రుతోపి ‘’
అన్నా !ధర్మాధర్మాలలో సుశిక్షితమైన బుద్ధి కలిగి ఉత్కృష్ట ,అప కృస్టాలు తెలిసి ,కార్య నిర్వహణ చేసే నీవంటివాడు కోపించటం ఏమిటి ?ధీరులు కోపం నిగ్రహించు కొంటారు కదా .ధర్మ శాస్త్ర ,లౌకిక విషయ ,శాస్త్రార్ధాలను తెలుసుకొని వాటిని మర్చిపోకుండా ఉండటం లో నీకు సమానులులేరు .సురాసురులలో నువ్వు ఉత్తముడవు .కోతిని చంపటం లో గుణ విశేషం ఏదీ నాకు కనిపించటం లేదు .నువ్వు వేసే దండన ఇతడికి కాక ,ఇతడిని పంపిన వాడికి వర్తి౦చేట్లు చెయ్యి .యోగ్యుడైనా అయోగ్యుడైనా యితడు పరులచే పంపబడిన వాడు .అతడిమాటలు పరాధీనమైన మాటలు కనుక దండి౦ప తగనివాడు .ఇతడిని చంపితే ఇంతదూరం రాగలిగే వేరొక దూత కనపడడు.కనుక వది౦చవద్దు.అలాంటి ప్రయత్నం ఇంద్రాదులపై చెయ్యి .యితడు ఇక్కడ మరణిస్తే రామలక్ష్మణులను యుద్ధానికి ప్రేరేపించే వేరొక దూత ఉండడు.సర్వ శత్రు సంహారకుడవైన రాజా! ఆ సోదరులతో చేయాల్సిన యుద్దావకాశాన్ని జార విడుచుకోవద్దు –
‘’పరాక్రమోత్సాహ మనస్వినాం చ –సురాసురాణామపి దుర్జయేన –త్వయా మనోనందన నైరుతానాం-యుద్ధాయతి ర్నాశయితుం న యుక్తా ‘’
‘’నీ దగ్గర సర్వ సమర్ధులైన యోగ్యులైన సేవక సైనికులు కోట్లాది మ౦దిఉన్నారు .అందులో కొద్ది భాగ౦ సైన్యాన్ని తీసుకొని నీ ఆజ్ఞతోకొందరు మహాయోధులు వెళ్లి ,రామ సోదరులను బంధించి నీ శత్రువులకు నీ ప్రభావం ఎలాంటిదో చూపించాలి ‘’అని అత్యంత రాజనీతిజ్ఞతతో తమ్ముడు విభీషణుడు చెప్పిన మాటలకు అన్న రావణుడు శాంతించి బుద్ధిపూర్వకంగా అంగీకరించాడు –
‘’తదేక దేశేన బలస్య తావత్ –కే చిత్తివా దేశ కృతోభియాంతు –తౌ రాజపుత్రౌ విని గృహ్య మూడ్హౌ-పరేషు తే భావయితుం ప్రభావం ‘’
‘’నిశాచరాణా మదిపోనుజస్య –విభీషణ స్యోత్తమ వాక్య మిష్టం –జగ్రాహ బుద్ధ్యా సురలోక శత్రు- ర్మహాబలో రాక్షస రాజముఖ్యః ‘’
ఇది 26శోకాల 52వ సర్గ
ఇందులో రావణుడి దు౦దుడుకుతనం ,ఆవేశం తో వచ్చిన కోపం ఆలోచనా రాహిత్యం ,మరచిపోయిన మూల రాజనీతి మనకు స్పష్టంగా కనిపిస్తుంది .తమ్ముడు విభీషనుడిలో అత్య౦త వివేకం ధీబలం ,రాజనీతి ,ప్రపంచజ్ఞానం విస్పష్టంగా దర్శనమిస్తుంది .అన్నగారి కోపం తగ్గించి శా౦త పరచనిదే సమస్య పరిష్కారం కాదు కనుక అతడి శాస్త్రజ్ఞానం ,పరాక్రమవిశేషాలు అతడిని ఎదిరించే సాహసం ఎవరిలోనూ లేదనే విషయం చెప్పి కొంత ధూపం వేసి మెత్తబడేట్లు చేశాడు .నేర్చిన శాస్త్రార్ద జ్ఞానం విఫలం కారాదనీ చెప్పాడు .కోపం అనర్ధదాయకమనీ దూత వధ అనేది ఏ రాజ ధర్మంలోనూ లేనిదని అది ఆటవిక చర్య అని తపస్వి మేధావి రాజకీయ దురంధరుడు అయిన రావణుడు చేయాల్సినపనికాదని అది అత్యంత హేయ , నీచ,నికృష్ట కృత్యమని స్పష్టం చేశాడు .యుక్తాయుక్తాలు విచారించి శిక్షించమన్నాడు . వానరుడు రాజద్రోహం చేశాడు .కనుక దండనార్హుడు అని ఒక మెలిక పెట్టాడు రావణుడు .తనవాదన మరీ ఒక వైపే ఉ౦దేమోననే అనుమానం వచ్చి వానరుడు మహాబలశాలేకాక లంకకు పెద్ద నష్టం కూడా చేశాడు అనటంలో సందేహం లేదనీ చెప్పాడు .దూత తనను పంపినవారు ఏది, ఎలా చెప్పమంటే అలా చెబుతారు .అందులో వాళ్ళ స్వంతమాటలేమీ ఉండవు. దూతవాక్యం అంటే పంపినవాడు చెప్పిన మాటలే .’’కాళిదాసు కవిత్వం కొంత నాపైత్యం కొంత’’ అన్నట్లుగా దూత స్వంత పైత్యం ఉండదు .వాడికి వేసే శిక్షపంపినవాడికి బుద్ధి వచ్చేట్లు చేయటం రాజనీతి అన్నాడు .దూతను దండించేందుకు ఎన్నో రకాలు చెప్పబడ్డాయి కనుక అందులో ఏదో ఒకటి చేసి ,వాడిని పంపిస్తే ,వాడు వెళ్లి పంపినవాడితో తనగోడు చెప్పుకొంటాడు .వీడిని ఇక్కడే హతమారిస్తే ఈకాకను అక్కడికి చేర వేసే వారు ఉండరు .రావణుడికి కావాల్సింది రామసోదరులతో యుద్ధం .అన౦త సేనావాహినిలో కొంతమందిని సోదరులదగ్గరకు పంపి వాళ్ళను బంధించి తెమ్మనటం ఒక గొప్ప ఆలోచన .రాక్షససైన్యానికి అవలీల అయిన పనికూడా .విభీషణుడి ఈ మంత్రం బాగా పారింది ,ఠక్కున అతుక్కుంది రావణ హృదయానికి .వెంటనే ‘’ఐ అగ్రీ విత్ యు ‘’అన్నట్లు తలూపి వధ ఆలోచన విరమించి తమ్ముడి ఆలోచనను అంగీకరించాడు .హనుమ బతికి బయట పడ్డాడు ‘’చూచిరమ్మంటే కాల్చివచ్చినట్లు’’ లంకాదహనం చేయటానికి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-20-ఉయ్యూరు