ప్రపంచ దేశాల సారస్వతం
108-బ్రిటన్ దేశ( ఆంగ్ల )సాహిత్యం -6
య౦గ్ అనే రచయిత అనుకరణమాని స్వయంగా ప్రకృతితో సాన్నిహిత్యాన్ని అనుభవించి ,వ్యక్తిగత ప్రతిభతో స్వేచ్చగా కవిత్వం రాయమని కవులను హెచ్చరించాడు .దానిని గ్రహించి ప్రకృతి శోభ ,నిరాడంబర జీవితం వస్తువులుగా ,సరళ మాధుర్యంతో సామాన్య పదాలను వాడుతూ కవిత్వం రాశారు .వీరిని 19శతాబ్ది కాల్పనిక సాహిత్య పునరుజ్జీవన వైతాళికులు అన్నారు .వీరిలో గ్రే ,కాలిన్స్ ,కూపర్ ,బర్న్స్ ,బ్లేక్ కవులు ముఖ్యులు .తామస్ గ్రే రాసిన ‘’ఎలిజీ రిటెన్ ఇన్ ఎ కంట్రీ యార్డ్ ‘’మిక్కిలి ప్రసిద్ధమూ ప్రశస్తమూ .కాలిన్స్ ‘’ఓడ్ టు ఈవెనింగ్ ‘’లో సంధ్యాకాల ప్రశాంత శోభ వర్ణించాడు .చిన్నతనం లోనే తల్లిని కోల్పోయిన విలియం కూపర్ ,అనుకుందా తల్లి చిత్ర పటం కనిపిస్తే ,ఆనంద విషాదాలలో ఊగిపోతూ రాసిన కవిత్వం ఉజ్వల భావ దీప్తికి గొప్ప ఉదాహరణ .రాబర్ట్ బర్న్స్ ప్రణయం సుఖదుఖాలు దేశభక్తి పై రసవంతమైన గొప్ప కవిత్వం రాశాడు .విలియం బ్లేక్ తాత్విక దృష్టితో ‘’సాంగ్స్ ఆఫ్ ఇన్నో సెన్స్ ,’’సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీ రిఎన్సేస్ ‘’లలో ఆధ్యాత్మిక మార్మిక భావాలను శైలీ రామణీయకత్వం తో రాశాడు.అవన్నీ అప్రయత్నంగా రాసిన ఆణిముత్యాలే .
అప్పుడే బిషప్ పెర్సీ నిసర్గ సుందర ప్రాచీన జానపదాలను సేకరించి ప్రచురించాడు .అదే ధోరణిలో మేక్ఫర్సన్ తానె రాసి ఓసియన్ అనే పూర్వకవి రాశాడని కలరింగ్ ఇచ్చి ముద్రించాడు .చాటర్టన్ ‘’రౌలీ ‘’గేయాలు రాశాడు .కాల్పనిక కవిత్వం పై దృష్టిమరల్చటానికి ఇవన్నీ మార్గ దర్శకాలయ్యాయి .రాజకీయ వాతావరణమూ తోడ్పడింది .హ్యూమనిజం స్వేచ్చాకవిత్వానికి పరోక్ష ప్రేరకమైంది .18వశతాబ్దం ముగిసే నాటికి కాల్పనిక కవిత్వం మూడుపూలు ఆరుకాయలుగా వికసించింది .
వర్డ్స్ వర్త్ ,కాల్రిడ్జ్ కవులిద్దరూ సాహిత్య పునరుజ్జీవనానికి నాయకత్వం వహించారు వస్తువు భాష భావం శైలి లలో కొత్తదనం ప్రదర్శించే రస గీతాలు రాశారు .1798లో వాటిని ‘’లిరికల్ బాలడ్స్ ‘’పేరుతో ప్రచురించారు .మొదట్లో కొందరు ఈసడి౦చినా ,క్రమంగా అవే మహా ప్రాచుర్యం పొందాయి .వర్డ్స్ వర్త్ ప్రకృతి సౌందర్య దర్శనం చేసి ఆత్మాశ్రయ మైన ఆహ్లాద గీతాలు చాలా రాశాడు .’’మైకేల్ ‘’అనే కథాకావ్యం,తన ఆధ్యాత్మిక విశ్వాసాల వ్యాఖ్యానంగా ‘’టింటర్న్ఎబ్బీలైన్స్ ‘’’’దిఇమ్మోర్టాలిటి ఓడ్’’మొదలైన ప్రశస్తకావ్యాలు రాశాడు .భారవి మహాకవిలాగా అర్ధ గౌరవంతో ఈయన కవిత్వం గౌరవం పొంది ‘’ప్రకృతికవి ‘’అనిపించుకొన్నాడు .ఈయన స్నేహితుడు జిజ్ఞాసువైన కాల్రిడ్జ్ తత్వశాస్త్రాన్ని కూలంకషంగా చదివి ,విషాదం తో జీవితాన్ని మోస్తూ తన ఆత్మ వేదననే మహా కవితగా మార్చి ‘’ది ఏన్శేంట్ మారినర్ ,’’క్రిస్టబెల్ ,కుబ్లాఖాన్ ,కాల్పనిక కావ్యాలు ,’’ది నైటింగేల్’’,ది డిజెక్షన్ ఓడ్ వంటి తాత్విక ,స్వీయ కథాత్మక గీతాలను అత్యంత ప్రతిభాన్విత౦ గా రాశాడు .షేక్స్ పియర్ నాటకాలకు కాల్ రిడ్జ్ వ్యాఖ్యానం మన మల్లి నాథ సూరి వ్యాఖ్యానాలకు సమానం .తన ఆత్మకథ ‘’బయోగ్రాఫియా లిటరేరియా ‘’గా రాసుకొన్నాడు .
ఈ ఇద్దరి సమకాలికులైన రాబర్ట్ సౌదే, వాల్టర్, సావేజ్ లాండర్ ,టామస్ కాంబెల్ ,టామస్ మోర్ కవులు ఖండకావ్యాలు కలకండ మాధుర్యంగా రాశారు .సౌదే ‘’ది ఇంచ్ కేప్ రాక ,’’బాటిల్ ఆఫ్ బెన్హీం’’,ది స్కాలర్ పద్య కృతులు ,నెల్సన్ జీవిత చరిత్రరాశాడు .లాండర్ ‘’ఇమాజినరి కాన్వర్జేషన్స్’’,వచన రచనలో సుప్రసిద్ధ చారిత్రిక వ్యక్తులమధ్య కల్పిత సంభాషణలను అతి చమత్కారంగా ఊహించి రాశాడు .కాంబెల్ ‘’లార్డ్ అలిన్స్ డాటర్,హో హేన్ లిండేన్,ది బాటిల్ ఆఫ్ ది బాల్టిక్ ‘’వంటి రమ్య రచనలు చేశాడు .టామస్ మూర్ ‘’లాల్లా రూఖ్ ‘’అనే కల్పిత కావ్యం లో అక్బర్ ,సలీం నూర్ మహల్ మొదలైన మొగల రాజవంశీయుల గాథలను వర్ణించాడు .రసవంతమైన ‘’ఐరిష్ మెలడీస్’’గీతాలూ రాశాడు .
వీర గాథా కావ్యాలను సర్ వాల్టర్ ష్కాట్ రాసి ప్రసిద్ధి కెక్కాడు ‘’ది డే ఆఫ్ లాస్ట్ మిస్ట్రెల్,మార్మియన్ ,ది లేడీ ఆఫ్ ది లేక్ కథా కావ్యాలురాశాడు తర్వాత దృష్టి నవలా రచనపై పడి,అనేక చారిత్రకనవాలలు రాసి మార్గ దర్శి అయ్యాడు .అందులో వేవర్లీ ,గైమానేరింగ్ ,రాబ్ రాయ్ ,దిహార్ట్ ఆఫ్ మిడ్లోథియన్,దిబ్రైడ్ ఆఫ్ లామర్ మూర్ ,ఇవాన్ హో ,కేనిల్ వర్త్ ,క్వెంటిన్ డల్వార్డ్,ది టాలిస్ మన్ ముఖ్యమైనవి .స్కాట్ జీవిత చరిత్రను అల్లుడు జాన్ లాక్ హార్ట్ రాశాడు .దీనికి గొప్ప పేరొచ్చింది .జేన్ ఆస్టేన్ రచయిత్రి ‘’సెన్స్ అండ్ సెన్సిబిలిటి ‘’ప్రైడ్ అండ్ ప్రిజుడిస్’’,మానస్ ఫీల్డ్ పార్క్ ,ఎమ్మా ,నార్దంగర్ఎబ్బీ ,పెర్సుయేషన్ నవలలనుకల్పనలులేకుండా ,తెలిసిన వాతావరణం లో తన వర్గానికి చెందిన స్త్రీ పురుషుల మనస్తత్వాలను వారి వినోద విహారాలను ,సమస్యలను సరసహాస్యంతో రాసి ప్రజాదరణ పొంది౦ది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-6-20-ఉయ్యూరు