సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-52

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-52

లంకను చూస్తూ ,తనమనసులోని కోరిక తీరగా అధిక ఉత్సాహంతో తరువాత కర్తవ్య౦  గూర్చి ఇలా ఆలోచించాడు ‘’అశోక వన భంగం చేశా .మహామహులైన రాక్షస సంహారం చేశా .ఇక మిగిలింది లంకా దహనమే .ఇదిఒక్కటి పూర్తి చేస్తే ,ఇప్పటిదాకా చేసిన పనులవలన పొందిన ఆయాసం తగ్గుతుంది .కొద్ది ప్రయత్నం తో చేసే ఈ పని వలన నా శ్రమ ఫలిస్తుంది .

‘’అల్పయత్నేన కార్యేస్మిన్ మమసాత్స ఫలః శ్రమః ‘’

‘’నాతోకకున్న నిప్పుతో ఈ మహాగృహాలు తగలబెట్టి అగ్నికి సంతర్పణ చేస్తాను ‘’.న్యాయమేకదా.తోక కాలకుండా చల్లబరచిన అగ్ని దేవుడికి కృతజ్ఞతగా ఆ మాత్రమైనా చేయాలి లేకపోతే  కృతఘ్నుడు అయిపోతాడు .అది ఆయన రక్తంలో లేదు .అందుకే చక్కగా ఆలోచించాడు .

‘’యోహ్యయం మమ లాంగూలే దీప్యతే హవ్యవాహనః –అస్య సంతర్పణ౦ న్యాయ్యం కర్తు మే ధిర్గృహో త్తమైః’’

మెరుపులతో ఉన్న మేఘం లాగా  వేగం తో మారుతి, మండే తోకతో లంకాపుర భవనాల పైభాగాలపై తిరిగాడు .ఒక ఇంటినుంచి మరో ఇంటికి కోతిలాగా దూకుతూ ,ఉద్యాన మహా భవనాలలో సంచరించాడు .ముందుగా ప్రహస్తుని ఇంటిపై దిగి చిచ్చుపెట్టి .తర్వాత మహాపార్శ్వుడు  వజ్ర దంష్ట్ర ,తేజశ్శాలి శుక ,ధీశాలి సారణ ,ఇళ్ళను తగలెట్టాడు .తర్వాత కోటాలో ఇంద్రజిత్ ,జంబుమాలి ,సుమాలి రాక్షస గృహాలకు ‘’అగ్గెట్టాడు’..తర్వాత రశ్మికేత  సూర్య శత్రు ,హ్రస్వ కర్ణ ,దంష్ట్ర,రోమశ ,యుద్ధోన్మత్త,మత్త,ధ్వజగ్రీవ ,భీకరుడైన విద్యుజ్జిహ్మ,హస్తిముఖ కొంపలకు  చిచ్చెట్టి ,పిమ్మట కరాళ,పిశాచ ,శోణితాక్ష  ,,కుంభకర్ణ ,మకరాక్ష ,యజ్ఞ శత్రు ,బ్రహ్మ శత్రు ,నరాంతక ,కుంభ ,దురితాత్ముడైన నికుంభ ,గృహాలను వరుసపెట్టి తగలబెట్టాడు .ఒక్క విభీషణుడి గృహాన్ని మాత్రం కాల్చకుండా వదిలేశాడు ‘.కారణం కృతజ్ఞత .రావణ కొలువులో రాక్షసరాజుకు నీతిపాఠం చెప్పగల  రాక్షస వీరుడు ,దూత ను చంపకూడదు అనే రాజ ధర్మాన్ని రాజుకు రాజుకు గుర్తు చేసి తనకు ప్రాణభయం లేకుండా మహోపకారం చేసినవాడు కనుక .

‘’వర్జయిత్వా మహా తేజా విభీషణ గృహం ప్రతి ‘’

 లంకలోని సకల రాక్షస గృహాలను కాల్చివేసి ,చివరికి రావణుడి భవనం దగ్గరకు వచ్చాడు .బహురత్న శోభితమై ,సకల శుభ లక్షణాలతో మేరుమందరం లా ఉన్నతమైన రావణ ప్రధాన భవనాన్ని తన’’తోకాగ్ని’’తో  కాల్చి ,ప్రళయ కాల మేఘంలాగా సింహ గర్జన చేశాడు .

‘’తతస్తస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూశితే –మేరు మందర సంకాశే సర్వ మంగళ శోభితే ‘’ప్రదీప్త మగ్ని ముత్చ్రుజ్య లాంగూలాగ్రే ప్రతిస్టితమ్-’నానాద హనుమాన్ వీరో యుగాంత జలదో యథా’’

 ఇప్పుడు అగ్నికి వాయువు తోడ్పడి మహా వేగంగా  వీస్తుండగా లాంగూలాగ్ని ప్రళయాగ్ని లాగా ప్రజ్వరిల్లింది .వాయువు బాగా సహకరించి ఆ అగ్నిని నిమిషాలమీద అన్ని  ఇళ్ళకూ పాకించి మహోపకారం చేశాడు హనుమకు .మహా దారుణ నష్టం కలిగించాడు లంకకూ రావణ సమూహానికి .ఇప్పటిదాకా వాడు వీచమంటే వీయటం, వద్దంటే మానేయటంలా ఆయన బానిస బతుకు గడిపాడు .ఇప్పుడు తనకోపం పగ ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రళయ  జంఝ లా విజ్రు౦భించాడు .తనకూ ఒక చాన్స్ లంకాదహనం లో లభించినందుకు మహదానందపడ్డాడు.

 బంగారు కిటికీలు ,ముత్యాల మణుల రత్నాల తో నిర్మిత భవనాలు మాడి భస్మమైపోయాయి .పుణ్యం తీరగానే ఆకాశం నుంచి నేలకు పడిన సిద్ధుల భవనాల్లాగా రాక్షసభవన విమానాలు విరిగి నేల గూలాయి –

‘’తాని భగ్న విమానాని నిపేతు ర్వసుదాతలే-భవనానీవ సిద్ధానా మంబరాత్ పుణ్య సంక్షయే’’

అందమైన విలాసవంతమైన తమభవనాలన్నీ తగలబడుతుంటే,కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తూ యజమానులు ‘’అయ్యో !అగ్నియే వానర రూపం లో వచ్చి దహించింది ‘’అని ఏడుస్తూ ,పారిపోతున్న చేసే భీకర నాదాలు అన్ని వైపులనుంచి  వినిపించాయి’’-

‘’నూన మేషోగ్నిరాయాతః కపి రూపేణ హో యితిః

పాలుతాగే పసిపాపలను చంకనెత్తుకొని స్త్రీలు కురులు వదిలేసి ,ఆక్రందనం చేస్తూ తగులబడుతున్న ఇళ్ళ నుండి నేలపై బడ్డారు –‘

‘’క్రందత్య స్సహసా పేతుః  స్తనంధయధరాఃస్త్రియః –కాశ్చి దగ్నిపరీతేభ్యో హర్మ్యేభ్యోముక్త మూర్ధ జాః’’

అట్లా పడినా వాల్మీకికి  వాళ్ళు ఆకాశం నుంచి నేలమీద పడిన మెరుపుతీగాల్లాగా కనిపించారు-

‘’పతంత్యో రేజిరేభ్య స్సౌదామినస్య ఇవా౦బరాత్ ‘’

కాలిన  భవనాలనుంచి వాటికి అలంకరించిన వజ్ర వైడూర్య రత్న,ముత్య,వెండి బంగారాదులన్నీ కరిగి ‘నీఱై’’అంటే భస్మమై అంటే బంగారమైప్రవహించటం హనుమ చూశాడు .రత్నం లోనూ బొగ్గు లోనూ ఉండే మూలపదార్ధం ఎలిమెంట్ కార్బన్ అనే పరమ సత్యం ఇక్కడ ఆవిష్కారమై౦ దని పించి౦దినాకు .వజ్రంకాలిస్తే వచ్చేది బొగ్గే .

అగ్ని కట్టెలు ,గడ్డి చేత తృప్తి చెందదు.అలాగే హనుమ రాక్షస గృహ దహనంతో తృప్తి చెందలేదు ,అలాగే భూమి కూడా చావబడిన రాక్షసుల చేత తృప్తి చెందలేదట ‘.మూడూ పంచభూతాలలోనివేగా .వాటికి దాహం ఎక్కువ . అందుకే ఈ నష్టం వాళ్లకు ఆనలేదు తృప్తి కలిగించలేకపోయింది .ఇంకా ఎక్కువ నష్టం కావాలన్నమాట

‘’వజ్ర విద్రుమ వైదూర్య’ ముక్తా రజత స౦హితాన్-విచిత్రాన్ భవనాన్ ధాతూన్ స్యన్దమానాన్ దదర్శ సః’’

‘’నాగ్నిస్త్రుప్యతి కాష్టానా౦ ,తృణానాంహరియూధపః –నాగ్నేర్నాపి విశస్తానాం రాక్షసానాం వసుంధరా ‘’

 తగల లబడిన సకల వస్తుజాలం మోదుగ పువ్వుల్లాగా ,బూరుగ పూలలా ,కు౦కుమలా వాటి ద్రవ్య స్వభావాన్ని బట్టి ప్రకాశించాయి .త్రిపురాలు రుద్రునిచే కాల్చబడినట్లు ,లంకానగరం వేగవాన్ బలవాన్ మహాన్  హనుమాన్ చేత దగ్ధం చేయబడింది-

‘’హనూమతా వేగవతావానరేణ మహాత్మనా –లంకాపురం ప్రదగ్ధం  త రుద్రేణ త్రిపురాయథా’’

హనుమ   అంటించి విడిచిన అగ్ని లంకాపురాగ్రాన ప్రజ్వరిల్లిన భయంకరాగ్ని ,జ్వాలానల సమూహాలను ప్రజ్వ లింప జేసి విరాజిల్లింది . వాయువు  తోడైన  ఆ ఆగ్ని,ప్రళయాగ్ని వేగంతో పొగ లేకుండా ప్రకాశిస్తూ ,రాక్షస భవనాలలో తిరుగాడుతూ ,రాక్షస శరీరాలు అనే నేతితో ప్రజ్వరిల్లజేయబ డిన జ్వాలల్లాగాఆకాశం అంటుతూ పెరిగాయి –

యుగాన్తకాలానల ఉల్య వేగ –స్సమారుతో గ్నిర్వవృదే దివి స్పృక్-‘’విదూమ రశ్మి ర్భవనేషు సక్తో –రక్షశ్శరీరాజ్య సమర్పితార్చిః’’

ఆ మహాగ్ని కోటి సూర్య ప్రభా భాసితంగా ,లంకానగరం అంతా చుట్టి వ్యాపి౦చి పిడుగుల్లాంటి భయంకర శబ్దాలు చేస్తూ ,బ్రహ్మాండాన్ని బద్దలు చేస్తోందేమో ననిపిస్తోంది-

 –ఆదిత్య కోటీర సదృశ స్సుతేజా –లంకాం సమస్తాం పరివార్య తిస్టన్-లంకాం సమస్తాంపరివార్య తిస్టన్-శబ్దై రనేకై రశని  ప్రరూఢై-ర్భిందన్నివాండం ప్రభవౌ మహాగ్నిః ‘’

ఆకాశ పర్యంతం వ్యాపించిన  ఆ ఆగ్నిరూక్ష కాంతితో,మోదుగుపూల రంగుమంటలతో కనిపించి క్రమగా మంటలు తగ్గి ,పొగ చేత వ్యాపించిన మేఘాల్లాగా నల్లకలువల్లాగా ప్రకాశించాయి –

‘’తత్రామ్బరా దగ్ని రతి ప్రవృద్ధో –రూక్ష ప్రభః కింశుక పుష్ప చూడః-నిర్వాణ దూమాకుల రాజయశ్చ-నీలోత్పలాభాః ప్రచకాశిరే భ్రాః’’

‘’ ఈకోతిగాడుయముడో ,వరుణుడో ,వాయువో ,రుద్రుడో అగ్ని,సూర్య కుబేర చంద్రుడో అయిఉంటాడు .కేవల వానరుడు మాత్రం కాదు .స్వయంగా యముడేమో””?ఒక వేళఅన్నిలోకాలకు తాత ,సకల జీవ పోషకుడు ఐన బ్రహ్మ కోపం సకల రాక్షస సంహారానికై వీడి రూపం లో వచ్చినదా  ?-

-కిం బ్రాహ్మణ స్సర్వ పితామహస్య -‘’సర్వస్య ధాతుశ్చతురాననస్య –ఇహా  గతో వానర రూపదారీ –రక్షోప సంహార కరః ప్రకోపః ‘’

‘’మూడు విధాలుగా పరి చ్ఛేద శూన్యమైనదీ ,ఇంద్రియ గోచరం కానిదీ ,కేవల మనసుకూ తెలియ శక్యం కానిదీ ,అద్వితీయమైనదీ ,ఐన వైష్ణవ తేజం తన అసాధారణ ఆశ్చర్యకర శక్తితో ఈ కపి రూపం దాల్చి వచ్చిందా ?’’అని జ్ఞానాదధికులైన రాక్షసులు అందరూ ఒక చోట చేరి చర్చించుకున్నారు –

‘’కిం వైష్ణవం వా కపి రూప  మేత్య –రక్షో వినాశాయ వరం సుతేజః –అనంత మవ్యక్త మచిన్త్యమేకం-స్వమాయయా సాంప్రత మాగతమ్ వా ‘’

 లంకలోని సకల వస్తుజాలం రాక్షస ,అశ్వ ఏనుగు ,పక్షి మృగాలు భీకరమైన అరుపులతో రథ, వృక్షాదులు కాలటం వలన ఏర్పడిన ధ్వనితో ఆ లంక దీన స్థితి లో భీకరధ్వనులు కలది అయింది చేష్ట లుడిగి .

‘’అయ్యో తండ్రీ !అయ్యో కొడుకా !అయ్యో ప్రియుడా !మిత్రుడా !పుణ్యాలతో  మంచి భోగాలు అనుభవించినఓ జీవితమా !’’అనుకొంటూ రాక్షసులు చేసే దీనాలాపనలు అంతటా వ్యాపించి భయం గొలుపుతున్నాయి –

‘’హా తాత హా పుత్రక కాంత మిత్ర –హా జీవితం భోగయుతం పుణ్యం –రక్షోభి రేవం బహుదా బృవద్భిః  -శబ్దః కృతో ఘోరతర స్సుభీమః ‘’

 అందరూ అన్ని విధాలుగా శాపోప హతుల్లా చనిపోయినట్లుంది నగరం .ప్రళయ కాలం లో భగవంతుని కోపం తో నాశనం చేయబడిన  భూమి  లాగా ఉన్న దీనమైన లంకను హనుమ చూశాడు .చేయాల్సిన విధ్వంసం అంతా చేసేసి ,ఇక తనకు ఏమీ పట్టనట్లు కిమిన్నాస్తి గా ఉండిపోయి త్రికూట పర్వతం పై హాయిగా కూర్చున్నాడు .ఒకసారి రాముడిని మనసులో స్మరి౦చాడు .ఇలాంటి దానికోసం ఆకాశం లో కాచుకు కూర్చున్న దేవతలు పొగడ్తలజల్లు కురిపించారు .ఈవనం తగులబెట్టటం,లంకాదహనం చేసిన హనుమాన్ ను వాల్మీకి మనసారా పొగడ్తలు చేసి తన ఆనందాన్నీ పొందుపరచి మనకూ ఆనందం కూర్చాడు –

‘’మహాబలం మారుత తుల్యవేగం ,మహామతిం వాయు సుతం,వరిష్టం-ప్రతుస్టువుర్దేవ గణాశ్చసర్వే’’

‘’భంక్త్వా వనం  మహా తేజా హత్వా రక్షాంసిసంయుగే –దగ్ధ్వా లంకాపురీం రమ్యాం రరాజ స మహాకపిః’’

  దేవతలతో పాటు కోరస్ పాడారు గంధర్వ,సిద్ధ ,మహర్షులు .వీరికి ఆనందం ,ఆశ్చర్యమూ  కలిగాయి –

‘’తత్ర దేవా స్స గంధర్వా  స్సిద్ధాశ్చ పరమర్షయః –దృష్ట్వా లంకాం ప్రదగ్దాం తాం విస్మయం పరమం గతాః’’

హనుమను చూసి సకల భూత గణాలు ప్రళయాగ్ని అనుకొన్నాయి .వీరితో పాటు వంతకలిపారు విద్యాధర నాగ రాక్షస ,యక్ష మహాభూతాలు మహదానందంగా .అక్కడ వాళ్ళు లంకలో ఏడ్పులు ,పెడబొబ్బలు .ఇక్కడ ఆకాశం లో వీరంతా కేరింతలు ,పులకరింతలు అభినందనలు .’’ఒళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకాల్చుకోటానికి నిప్పు కావాలని అడిగాడు వేరొకడు ‘’అన్న సామెతగా ఉంది దృశ్యం .

‘’దేవాశ్చ సర్వేముని పుంగ వాశ్చ-గ౦ధర్వ విద్యాధర నాగ యక్షాః- భూతాని సర్వాణి మహా౦ తి తత్ర –జగ్ముః  పరాం ప్రీతి మతుల్య రూపం ‘’.

  ఇది 51శ్లోకాల 54 వ సర్గ .

ఇదంతా హనుమ’’ లంకాదహన విభూతి యోగమే’.కడుపు  నిండా కాల్చాడు లంకను. కళ్ళనిండా ఆ కాల్పుల దృశ్యాలను చూసుకొన్నాడు .రాక్షసుల ఆర్తనదాలు వీనుల విందుగా విన్నాడు .సీతాపహరణం అనే పెద్ద తప్పుకు శాంపిల్ చెప్పుదెబ్బ గా చేశాడు .ఇన్నిఇళ్ళు మాడి మసి అయి మహా తేజస్సుతో ఉన్న లంకానగరాన్ని మరు భూమిగా మార్చాడు .రావణ రాక్షసుల గర్వానికి రెండవ పెద్ద దెబ్బ కొట్టాడు .భవిష్యత్తులో విభీషణుడు దుస్ట రావణుడి చెంత ఉండలేడని ,మహా వైష్ణవ భక్తుడు కనుక రామపాదాలను తప్పక చేరుతాడని , చేరక తప్పదని  ఊహించి కూడా ఆ ఇంటి జోలికి పోలేదు..చాలామంది రాక్షసుల కొంపలు తగులబెట్టాడు .ఈపేర్లన్నీ ఎలా తెలుసు ఆయనకు ?బయట నేమ్ ప్లేట్లు పెట్టుకొన్నారా ? అనుకోవచ్చు.ఏ కావ్యంలోనైనా  రచనలోనైనా గ్రంథకర్తే చెబుతాడు   .

  ఈ దహనకాండ సర్గలోనూ  మహర్షి వాల్మీకి చాలసందర్భ శుద్ధిగా ఉపమాలంకారాలు వాడి శ్లోకాలకు శోభ కూర్చాడు .చెప్పాల్సిన విషయం స్పష్టంగా అర్ధమయేట్లు చెప్పి రంజింప జేశాడు .అగ్నికి సంతర్పణం చేస్తానన్నాడు హనుమ . సుమారు యాభై ఏళ్ళ క్రితం వరకు ఆంద్ర దేశం లో  కాశీ రామేశ్వర తీర్ధ యాత్రలు చేసిన వారు ఇళ్ళకు క్షేమ౦గా తిరిగి వచ్చినప్పుడుఇళ్ళ వద్ద ఆయా దేవతాపూజ చేసి కాశీ సంతర్పణ రామేశ్వర  సంతర్పణ చేసి  బంధు మిత్రగణాలను ఆహ్వానించి ,తాము తెచ్చిన గంగోదకం పాత్రలు, కాశీ కాలభైరవ తోరాలు పంచిపెట్టి కమ్మని విందు ఇచ్చేవారు .అప్పుడు ప్రయాణ సౌకర్యాలు తక్కువ కాశీకి వెళ్ళినవాడు తిరిగి వస్తాడనే నమ్మకం తక్కువున్న కాలం ,‘’కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడితో సమానం ‘’అన్న సామెత బాగా వ్యాపించి ఉన్నకాలం కనుక అంతటి ఆనందోత్సవాలు జరిపేవారు .ఉత్తర భారతం లో కూడాఇలాంటివి జరిపేవారా ?మనకు తెలీదు .కాని వాల్మీకి మాత్రం చక్కని ‘’తెలుగు సంతర్పణ ‘’చేయించాడు అగ్ని హోత్రుడికి లంకాదహనం తో .

 కాలే లంకా ,అందులోంచి వచ్చే పిడుగుల్లాంటి వింత ధ్వనులు ,కార్చిచ్చులాంటి వాలాగ్ని ,జ్వాలాగ్ని రంగు మోదుగు పూలలా ఉందనటం ,దహ్యమాన వస్తువుల కు అనుగుణంగా అగ్ని శిఖమోదుగ, బూరుగు ,పూల రంగు ,కుంకుమవర్ణ శోభితమవటం మహా గొప్ప అలంకారాలు .విలువైన రత్న వజ్ర స్వర్ణ రజతాదులు కాలి ప్రవాహమై ప్రవహించటం కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు కవి వాల్మీకి .అగ్నికి ఆహుతైన జనం పెట్టె శోకాలు ,హృదయ విదారకంగా చూపాడు .తండ్రులను కొడుకులను పిల్లలను భర్తలను భార్యలను మిత్రులను కోల్పోయిన వారి రోదనాలు ఎంతటి కర్కోటక హృదయాన్నైనా ద్రవింప జేస్తుంది .అదీ కవితా శిల్పం .

  కాలి బూడిదైన లంక శాపం చేత దగ్ధమైనట్లు  ,ప్రళయం లో భగవంతుని కోపం చేత నాశనం చేయబడిన భూమిలా కనిపించిందని సొగసైన వర్ణన చేశాడు .అసలు ఇంత వినాశనానికి కారణం ఏమిటి అని వితర్కి౦చుకొన్నారు జనం.దిక్పాలకులలో ఎవరో ఒకరు వానర రూపం లో వచ్చి ఉండాలని ,లేకపోతె సకల లోక పితామహ బ్రహ్మదేవుని కోపమే ఈ రూపంలో వచ్చి నాశనం చేసిందని కొంచెం పై ఆలోచన ఉన్నవారు భావించారు .ఎవరూకాడు యమధర్మరాజే లేక ప్రళయకాల రుద్రుడే  వచ్చి ఉంటాడు ‘’బాబాయ్’’ అనుకొన్నారు మరి కొందరు .ఆ పై స్థాయి బుద్ధి సూక్ష్మత ఉన్నవారు మాత్రం’’రచ్చ బండ’’ దగ్గర చేరి తీరికగా  సృష్టి,స్థితి లయాలకు  ఆదిమూలం,త్రివిధ పరిచ్చేద్య శూన్యం ,ఆద్యంతాలు లేని ,అద్వితీయమైనది మనోవాగతీతమైనది,తెలుసుకోవటానికి అసాధ్యమైనది   అయిన పరబ్రహ్మ౦  అనే వైష్ణవ తేజమే ఆశ్చర్య శక్తితో కపి రూపంగా వచ్చి౦ది అనుకొన్నారు .విష్ణుమూర్తికి మహాకపి అనే పేరు కూడా ఉంది కదా .ఈ ఊహ బాగానే ఉంది . ఇందరి ఊహలకు హనుమ  గొప్ప పనికల్పించాడు తాను  చేసిన లంకాదహనం తో .ఇదీ ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగమే .

  ఇది లంకా దహనమే కదా ఏదో పైపైన లాగించేద్దాం అనుకోని మొదలుపెడితే ఏదీ వదలానిపించక అన్నిటినీ  స్ప్రు శి౦చాల్సి  వచ్చింది .దేన్నీ విడువ బుద్ధికాలేదు .అంతటి చిక్కదనం చక్కదనం ఉంది ఈ సర్గలో .కవి మహర్షి వాల్మీకి కి మరోమారు కైమోడ్పులు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.