బక దాల్భ్యుడు -19
ఆది
మార్కండేయ పురాణం -9లో ,దేవీ భాగవతం -6.12-13లో ‘’ఆదిబక ‘’ప్రస్తావన ఉన్నది .రాజా హరిశ్చంద్రుడు తన పురోహితుడు వసిష్ట మహర్షి ఆధ్వర్యం లో చేసిన యాగం లో విశ్వామిత్రుడు వచ్చి విఘ్నం చేయబోతే వసిష్టుడు ‘’బకం’’గా పుట్టమని శాపమిస్తే ఆయన ఈయన్ను ‘’ఆది’’గా పుట్టమని శపించాడు .వీరిద్దరూ మహా బకాలుగా మారి మహాభయంకరంగా ఆకాశయుద్ధం చేస్తే ,బ్రహ్మవచ్చి శాంతపరచితే ,అప్పటినుంచి ఇద్దరు ఋషులు మిత్రులయ్యారు .భాగవతంలో ఆదిబకవృత్తాంతంలో వశిష్టుడు బ్రాహ్మణుడు అయితే ,విశ్వామిత్రుడు క్షత్రియుడు బక రూపం పొందాడు .కేశి దాల్భ్యుడు ఇక్కడ గుర్తుకొస్తాడు .మార్కండేయపురాణ౦ లో వసిస్ట మహర్షి విశ్వామిత్రుని నీచదుర్మార్గ బ్రాహ్మణుడిగా సంబోధిస్తాడు-9.9-‘’దురాత్మా బ్రహ్మద్విస్’’.దేవీ భాగవతం లో విశ్వామిత్రుడు ఎందుకు బకం గా మారాడో వివరంగా ఉన్నది -6.1332-.హరిశ్చద్ర మహారాజుదగ్గరకు ముసలి బ్రాహ్మణ వేషంలో వెడితే ‘’వృద్ధ బ్రాహ్మణ వేషేణ’’.వశిష్టుడు గుర్తించి ,ఆయన ప్రవర్తన బకధర్మం లాగా ఉందని ’’బకధర్మా బకాద్యాన పరా ‘’ అని తిట్టి శపించాడు .
విశ్వామిత్ర బకుడికి ఆజన్మవిరోది ఆది అనే వసిస్టబకం.వసిస్టుడు బ్రాహ్మణుడే అయినా సద్బ్రాహ్మణుడు కాదు అని దేవీభాగవతం 6.12.25 లో ఉంది .గంగాతీరంలో ఉన్నంతమాత్రాన రుషులలో దివ్యత్వం పొందటంలో అసూయా ద్వేషాలు పోలేదని అన్నది .
అశ్వఘోషుడు బుద్ధ చరిత్రకావ్యం లో ఎలి లేక అలి ,పక ల మధ్య ద్వేషం పెరిగినట్లు చెప్పాడు .వీళ్ళే ఆది,బక అయి ఉండాలి .హాలాయుధ ,బక అని జాన్ స్టన్ అన్నాడు .బకుడు అతడి రాక్షసగణ౦ జానపద కథల్లోకీ ఎక్కారు .తమిళ కథలలోబకుడు లేక పకాచురన్ కు 200 తలల వారసులున్నారు .వారిలో ఆచలమ్మాన్ ,రోచకన్,మలై యుకాచురన్ లున్నారు .అల౦బుసుడి పేరు మాత్రంబకుని చిన్నతమ్ముడిగా అలాగే ఉంది మారలేదు .వీరంతా భీమునిపై ద్వేష విరోధాలు పెంచుకోన్న వాళ్లే.
కేశి
వేదకాలం తర్వాత మనం బకదాల్భ్య, దాల్భ్య,బక విషయాలు వివరంగా తెలుసుకొన్నాం .ఇప్పుడు కేశి గురించి ఒకసారి ఆలోచిద్దాం .బకునిలాగా కేశికూడా అసురబృందంతో కనిపిస్తాడు .వేదకాలం తర్వాత కేశి దాల్భ్యుడి పాత్ర కనిపించదు .అధర్వ వేదం లో గర్భిణీ స్త్రీల రక్షణకోసం చేసే స్తోత్రం లో నల్లగా ,పొడవైన కేశాలున్న పిలకతో ,కోలముఖ పురుషాంగం ఉన్న అసురుడు గర్భిణీ స్త్రీల పిరుదులు ,యోని లను వేధిస్తాడు 8.6.5.-‘’యః కృష్ణా కేశ్యాసుర స్తంబజా ఉత తుందికాః’’.పొడవైన జుట్టు ఉంటె గుర్రం, సింహం కూడా కావచ్చు.కానీ వేదకాలం తర్వాత సాహిత్యం లో యాదవ వంశంలో జన్మించినవారిజాబితాలో వసుదేవ కౌసల్యల కొడుకు కేశి పేరు ఉన్నది .9.24.48 .కేశిని పేరు చాలా చోట్ల ఆడవారి పేర్లలో వచ్చింది .
భాగవతం లో బాలకృష్ణుడు ఆశ్వాకార అసురుడు కేశిని చంపాడు .మళ్ళీ ఇంకెక్కేడా కేశిపేరు రాలేదు .భారతంలో చాలా చోట్ల వస్తుంది .కశ్యపమహర్షి కి దనువుకు పుత్రులైన దానవులలో వీడి పేరుంది -1.59.22.కాని వాడు కృష్ణుడి శత్రువు .కృష్ణుడు మధురలో మామకంసుని, కేశిని సంహరించాడు-14.69. 23,16.7.9.ఇదే విషయం అశ్వ ఘోషుడి’’సౌందర నందం ‘’లోనూ ఉన్నది .కేశి సంహారకుడుగా కృష్ణుడినామాలలో తరచుగావస్తుంది .కృష్ణుడిని కేశవా అనీ అంటారు –‘’కేశవః కేశి సూదనః ‘’-2.30.11 ,9.62.69.’’కేశవం కేశిహన్తారం ‘’-2.36.2.’’కేశవాః,కేశిహా ,హరిః-13.135.82.
భారతం 3.213.9-13లోకృష్ణుడి శత్రవు కేశికాదు ఇంద్రుడు .దేవ దానవ యుద్ధాలకాలం లో ,ఇంద్రుడి పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు మానస పర్వతానికి కొత్త సేనానికోసం వెడతాడు .(స్కందుడిని ఒప్పించి ఆహ్వానిస్తాడు ).అక్కడ ఒక అమ్మాయి ఆర్తనాదం విని ఆమె ప్రజాపతి కూతురు దేవసేన(దేవతల సేనాని )ను కేశి బలాత్కరించబోతుండగా చూసి ,అప్పటికే వాడు ఆమె సోదరి దైత్య సేన(దైత్యుల సేనాని )ను వశపరచుకొనగా ఆమె అంగీకరించగా ,దేవ సేనను కాపాడే ప్రయత్నం ఇంద్రుడు చేయగా వాడు ‘’యెర్ర ఖనిజ పర్వతం ‘’లాగా కిరీటం ,గదతో కనిపించాడు 3.213.9-‘’కిరీటం గద పాణిం ధాతుమంతం ఇవాచలం ‘’.వాడితో యుద్ధం చేశాడు .వాడు వేసిన గదను పర్వత శిఖరాన్నీ వజ్రాయుధంతో రెండుముక్కలు చేయగా అందులో ఒకముక్క కేశి రాక్షసుడిపైనే పడి,గిలగిల తన్నుకొని లేచి ,ఆబాలిక జోలికి పోకుండా కాలికి బుద్ధి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-20-ఉయ్యూరు ,