సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-53
లంకను సర్వవిధాలాతన వాలాగ్నితో దహింప జేసినమహాబల హరిసత్తమ హనుమ ,సముద్ర జలాలలో తోకను ముంచి అగ్ని చర్చాడు –
‘’లంకాం సమస్తాంసందీప్య లాంగూలాగ్నిం మహాబలః –నిర్వాపయామాస తదా సముద్రే హరి సత్తమః ‘’
సర్వవిధాల విభవం చెడిన లంకను ఒకసారి మళ్ళీ చూసిఒక్కసారి భయపడి తననుతాను ని౦ది౦చుకొని మనసులో’’ లంకను కాల్చి యెంత నింద్యమైన పని చేశాను ?ప్రజ్వరిల్లే అగ్నిని నీళ్ళతో చల్లార్చినట్లు ,ఎవరు తనకోపాన్ని స్వబుద్ధితో నిరోధించుకొంటారో వారు మహాత్ములగు పురుష శ్రేస్టులు,మహాత్ములుకదా?’’-ఈ శ్లోకం లోకం లో బాగా ప్రచారమైంది .
‘’ధన్యా స్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోప ముత్థి తమ్-నిరు౦ధ౦తి-మహాత్మానో దీప్త మగ్ని మివా౦ భసా’’
‘’కోపం హద్దు మీరితే పాపం చేయకుండా ఎవరుంటారు ?కోపంతో పెద్దలను కూడా చంపుతారు ,కఠినమైన మాటలతో సత్పురుషులను ఆక్షేపిస్తారు –
‘’క్రుద్ధఃపాపం న కుర్యాత్కః క్రుద్ధోహవ్యా ద్గురూనపి –క్రుద్ధః పరుషాయా వాచా నర స్సాధూనదిక్షిపేత్’’
విపరీతమైన కోపం లో ఏది మాట్లాడాలో ఏది కూడదో తెలీదు .కోపించిన వాడు చేయరాని పని ,ఎక్కడా మాట్లాడరానిది ఉండదు లోకం లో.
‘’వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ –నా కార్య మస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్ ‘’
‘’మనిషిలో పెల్లుబికి ఉన్న కోపాన్ని శిధిలమైనకుబుసాన్ని పాము వదిలేసినట్లు ఓర్పుతో తొలగించుకున్నవాడే పురుషుడు అనబడుతాడు .ఇదికూడా అద్భుత ఉపమానం
‘’య స్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి –యథోరగస్త్వచం జీర్ణా౦ సవై పురుష ఉచ్యతే’’
‘’ముందూ వెనుకలు చూడకుండా ఆలోచించకుండా మహాపాపం చేసి సీతాదేవిని కాల్చి స్వామి ద్రోహి, ఘాతకుడినీ అయ్యాను .లంక అంతాపూర్తిగా కాలిపోతే ,జనకీదేవికూడా తగులబడే ఉంటుంది .తెలీకుండా నా ప్రభువు కార్యం పాడు చేశాను .ఎవర్ని వెతకటానికి ఇంత దూరం శ్రమపడి వచ్చానో ,ఆపనిని పూర్తిగా నాశనం చేశాను .లంకను కలచి సీత సంరక్షణ చేయలేకపోయిన మందభాగ్యుడను ‘’-పశ్చాత్తాపం తో చేసిన పాపాలన్నీ పోతాయి అనటానికి ఈ దృశ్యం ఉదాహరణ .తొందరపాటు తెచ్చే అనర్ధం ఎలా ఉంటుందో చెప్పే విషయం .
‘’అచింత యిత్వా తాం సీతా మగ్నిదం స్వామి ఘాతుకం –యది దగ్దా త్వియం లంకా నూనా మార్యాపి జానకీ –దగ్దా తేన మయా భర్తుర్హతం కార్య మజానతా –మయాహిదహతా లంకాం న సీతా పరిరక్షితా ‘’
‘’నా అన్వేషణ ఎవరికోసమో ఆ సీతాదేవినే నాశనం చేసుకొన్నాను .లంకలో ఏమూలా మిగలక దహనమైంది కనుక ఆమె తగులబడే ఉంటుంది .నా అవివేకం వలన నాస్వామికార్యం చెడిపోయి౦ది కనుక నా ప్రాణాలు ఇక్కడే వదలటం మంచిది .అగ్నిలో దూకనా బడబాగ్నిలో పడనా సముద్రం లోపడి ,అందులోని జీవులకు ఆహారమవ్వనా .మొత్తం దూతకార్యం వ్యర్ధం చేసి ఏముఖం పెట్టుకొని సుగ్రీవ రామాదులను చూడగలను ?నాలోని కోతిస్వభావాన్ని చంచలత్వాన్నీ,రోష దోషాన్నీ ప్రదర్శించిన వెర్రి వెంగళప్పను .అని తనను తానె బాగా ఎస్టిమేట్ చేసుకొన్నాడు హనుమ .ఇదీ ఆయన వ్యక్తిత్వం లో భాగమే. ఆత్మ విమర్శ లేనిది మనిషి ఎదగడు .ఎదిగే, ఎదిగిన,ఎదుగుతున్న మహాకపి కనుక చక్కగా తాపీగా తనపనులన్నిటినీ ఒకసారి నెమరేసుకొని పశ్చాత్తాపం చెందాడు .చేసిన దోషానికి ప్రతిక్రియలు అన్ని కోణాలనుంచీ ఆలోచించాడు .తనవానర చేష్టలను చెప్పుతో ‘’సారీ తనవాలం’’తోనే కొట్టుకున్న ఘనుడు సుందర హనుమ .చెడ్డ పని చేశానని పించినపుడు మనసు పరిపరి విధాల పొతు౦దనటానికి ఈ విషయం కూడా గొప్ప సాక్ష్యమే .
‘’ఈషత్కార మిదం కార్యం కృతమాసీ న్న సంశయః –తస్య క్రోదాభి భూతేన మయా మూలక్షయః కృతః’’
‘’వినస్టా జానకీ నూనం న హ్య దగ్ధః ప్రదృశ్యతే –లంకాయా౦ కశ్చిదుద్దేశసర్వాభస్మీ కృతా పురీ ‘’కిమగ్నౌనిపతామ్యద్య‘’ ఆహోస్వి ద్బడబా ముఖే –శరీర మాహో సత్వానాందద్మి సాగర వాసినం ‘’
‘’ఈషత్కారమిదం ‘’శ్లోకం మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారు తరచూ ఉటంకిస్తారు .
‘’మయా ఖలుతదే వేదం రోష దోషాత్ ప్రదర్శితం -ప్రథితం త్రిషు లోకేషు కపిత్వ మనవస్థితం
‘’రజో గుణంతో నేను చేసిన పని ఎందుకూ పనికి రాకుండా పోయింది .రజో గుణానికి కారణమైన క్రోధానికి లోబడి సమర్ధత ఉన్నా ,సీతను రక్షించలేక పోయాను .ఆమె మరణిస్తే రామ సోదరులు ఎలా బ్రతుకుతారు? .వాళ్ళు లేకపోతె సుగ్రీవుడు ,అతని బంధువులు అందరూ నశిస్తారు ‘’-రజో గుణం ఎలా కొంపకు అగ్గేట్టేస్తుందో హనుమ తో చెప్పించాడు మహర్షి .రజస్సు వలన కోపం ,క్రోధం పెరిగి చేయరాని అనర్ధాలన్నీ చేయిస్తుంది .దాన్ని అదుపులో పెట్టుకొంటేనే మనిషి మనీషి అవుతాడు .లేకపోతె పతనం అంచున నిలబడిపోతాడు .సీత మరణం ఎందరికి మరణకారకమౌతుందో హనుమ గొప్పగా విశ్లేషించుకొన్నాడు .ఏదో ఆకుటు౦బానికె నాశనం కాదు ,సుగ్రీవాది కపి వరులకు కూడా .అదీ ఇంతటితో ఆగితే పరవాలేదు .మొత్తం అయోధ్య,మిథిల ప్రజలందరికీ జీర్ణించుకోలేని విషయమై మరణ కారణం అవుతుంది .ఇక్కడే హనుమలో ఉన్న అసలైన మానవత్వాన్ని అందించాడు మహర్షి .
ధిగస్తు రాజసం భావ మనీశ మనవస్థి తం –ఈశ్వరేణాపి యద్రాగా న్మయా సీతా న రక్షితా ‘’
‘’వినస్టాయాంతు సీతాయాంతావుభౌ వినశిష్యతః –తయోర్వినాశే సుగ్రీవః సబంధు ర్విన శిష్యతి’’
‘’ఏత దేవ వచః శ్రుత్వా భరతో భ్రాతృ వత్సలః -ధర్మాత్మా సహ శాత్రుఘ్నః కథంశక్ష్యతి జీవితుం ‘’
‘’ధర్మనిస్టకల ఇక్ష్వాకు వంశజులైన రామాదులు నలుగురు నశిస్తే ,ప్రజలంతా శోక పీడితులవటం తధ్యం .భాగ్య హీనం తో నేను ధర్మార్ధ సంగ్రహణం చేయకుండా ,రోషం అనే దోషం పట్టి పీడించి లోకానికే చేటు తెచ్చాననటం స్పష్టం ‘ ధర్మార్ధ సంగ్రహణం చేయకపోవటం వల్ల కలిగే చేటు రోషదోషం అనే పిశాచిపడితే కలిగే అనర్ధం చక్కగా విశ్లేషించాడు .ఇవన్నీ ఆయనకే కాదు మనకందరికీ మహా వాక్యాలులాగా మహా నీతి వాక్యాలు .తొందరపడటం యెంత ప్రమాదమో చెప్పే సందర్భం .
‘’ఇక్ష్వాకు వంశే దర్మిస్టే గతే నాశ మసంశయం –భవిష్యంతి ప్రజా స్సర్వా శ్శోక సంతాప పీడితాః’’
‘’తదహం భాగ్య రహితో లుప్త ధర్మార్ధ సంగ్రహః –రోష దోష పరీతాత్మావ్యక్తం లోక వినాశానః ‘’
ఇలా బాధతోమధనపడుతున్న హనుమకు కొన్ని శుభ శకునాలు గోచరించగా మళ్ళీ మనసులో ‘’అనవద్య సౌందర్య రాశి ,మంగళ రూపిణిసీతా దేవికి ఆమె తేజస్సే రక్షణగా ఉండగా,ఆమె నశించదు.అగ్ని అగ్నిని దహి౦పదు కదా !ధర్మాత్ముడు ,మహా తేజశ్శాలి రాముని భార్య సీతకు ఆనే పవిత్ర నడవడి శీలమే రక్షిస్తుంది .అగ్ని ఆమెను తాకటానికి కూడా అర్హుడు కాడు’’అనుకొన్నాడు .అసలు అగ్నికి రక్షణ ఏమిటి .అగ్ని జోలికి ఎవరొచ్చినా మసి అవటమే కదా .ఆమె శీలమేసీతాదేవి అగ్ని లాంటి రక్ష .ఆమె తేజస్సు ఆమెకు సంరక్షణ .అగ్ని హోత్రుడు కూడా ఆమెను తాకటానికి పనికి రాడు అని హనుమ అన్నాడు అంటే ఆమె శీల పావిత్ర్యం, పాతి వ్రత్యం ఎంతటి మహోన్నతమైనవో ఆమెను చూడగానే గ్రహించిన సూక్ష్మగ్రాహి హనుమ .మొదట్లో ఏదో కొ౦పమునిగిపోయినట్లు బాధ ,భయం పడ్డాడుకాని తరచిచూసి ఆమెను ఎవరూ ఎమీచేయలేరని సిద్దా౦తీకరించాడు.అందుకే రావణ సంహారానంతరం రాముడు ఆమె శీలపరీక్షకు అగ్ని పరీక్ష పెడితే ,అగ్ని ఆమెను తాకటానికి కూడా భయపడి మిన్నకుండిపోయాడు .కనుకనే ఆమె అగ్ని స్వరూపిణి అన్నాడుహనుమ అగ్ని మరో అగ్నిని దహనం చేయదు చేయలేదు అని తీర్మానించాడు .ఎరుక కలగటం అంటే ఇదీ .మొదట్లో కపి లక్షణం తర్వాత ‘’మహాకపి దీవిశాలత ‘’హనుమ వ్యక్తిత్వంలో భాగం . ఆయన భయపడినట్లు ఏదీ జరగలేదు కనుక సరిపోయింది .జరిగి ఉంటె ?ఊహించరాని మహా విపత్తు .
‘’అథవా చారు సర్వాంగీ రక్షితా స్వేన తేజసా –న న శిష్యతి కళ్యాణీ నాగ్ని రగ్నౌ ప్రవర్తతే ‘’
‘’నహి ధర్మాస్తనస్తస్య భార్యా మమిత తేజసః –స్వచారిత్రాభి గుప్తాం తాంస్ప్ర ష్టుమర్హతి పావకః ‘’
మరికొంత విచారణ చేస్తూ హనుమ ‘’కాల్చటం అగ్ని స్వభావం .దానికి నాశనం లేదు .సర్వకాల సర్వావస్తల లోనూ దానికి దహన శక్తి ఉంటుంది .అగ్ని’’ఆఫ్టరాల్ ‘’ నాతోకనే కాల్చలేకపోతే ,పూజ్యురాలు అగ్ని హోత్రం వంటి సీత జోలికి వెళ్ళే సాహసం చేయగలడా ‘’అనుకోని మైనాక వృత్తాంతం ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఆశ్చర్యపడి మళ్ళీ మనసులో ‘’తపం ,సత్యం, అనన్య పతిభక్తి తో సీతాదేవి అగ్నినే దహిస్తుంది కానీ ,అగ్ని ఆమెను ఏమీచేయలేదు’’అనుకోని ఆమె ధర్మ పాతివ్రత్యాలను స్మరిస్తూ ఉండగా మహాత్ములైన చారణుల వాక్యాలు’’ఆహా !ఏమి ఆశ్చర్యం?హనుమంతుడు రాక్షసుల ఇళ్ళల్లోభయంకర దుస్సహజమైన అగ్నిని రగిల్చి దుష్కర కార్యం అద్భుతంగా చేశాడు .పారిపోయే రాక్షస స్త్రీలు ,ఆబాల వృద్ధుల జనాల కలకలం ,పెద్ద ధ్వనులతో కొండ గుహ లలో నాదం ప్రతిధ్వనిస్తుండగా ,ఆక్రందనలు చేస్తున్నట్లుగా ,మిద్దె, ద్వార, ప్రాకారాలతో లంక అంతా తగలబడింది కానీ సీత కాలక పోవటం ఆశ్చర్యం కలిగించింది ‘’ అన్నమాటలు హనుమకు వినిపించాయి .తనకు కనిపించిన శుభ శకునాలు ,తన మనో నిశ్చయం ,సీతా దేవి పాతి వ్రత్యం ,రామ ప్రభావం మొదలైన సుగుణాల కారణాలతో ,చారణ వాక్యాలతో మనసులో ఆనందం పొందాడు .ఉపశమనం కలిగింది .
‘’అహో ఖలు కృతం కర్మదుష్కరం హి హనూమమతా –అగ్నిం విసృజతా భీక్ష్ణ౦ భీమం రాక్షస వేశ్మని’’
‘’ప్రపలాయిత రక్షః స్త్రీ బాల వృద్ధసమాకులా –జనకోలాహలాధ్మాతా క్రందంతీ వాద్రి కందరే ‘’
‘’దగ్ధేయం నగరీ సర్వా సాట్ట ప్రాకార తోరణా-‘’జానకీ న చ దగ్ధేతి’’విస్మయో ద్భుత ఏవ నః ‘’
చివరికి హనుమ తనకోరిక నెరవేరి సీతకు ఏ ఆపదా కలగలేదని తెలిసికొని ,మళ్ళీ ఒక్కసారి ఆమెను దర్శించి తిరిగి వెళ్లాలని నిశ్చయించుకొన్నాడు .ఎవరో ఆకాశ రామన్నలు చెబితే నమ్మి వెళ్ళిపోతే హనుమ ఎలా అవుతాడు ?తానూ స్వయంగా సీతను చూసి ఎసర్టైన్ చేసుకొని సంతృప్తి చెందాకే తిరుగు ప్రయాణం చేయాలన్నది మహామతిమాన్ హనుమాన్ తీసుకొన్న మరో మెగా నిర్ణయం .అందుకే సుందర కాండ అంతసుందరమైనది .
‘’తతః కపిః ప్రాప్త మనోరథార్ధ-స్తా మక్షతాం రాజసుతాంవిదిత్వా –ప్రత్యక్షత స్తాంపునరేవ దృష్ట్వా –ప్రతి ప్రయాణాయ మతిం చకార ‘’
ఇది 35శ్లోకాల 58వ అధ్యాయం
ఈ సర్గ లో కోటబుల్ కోట్ లైన శ్లోకాలు చాలా ఉన్నాయి .అన్నీ ఆణిముత్యాలే .నేనూ, చాలామంది రేడియో లో సూక్తిసుధలో ,ఆలోచనాలోచనం లో ఉపయోగించుకొన్నవే .ప్రవచనాలలో మహామహులంతా ఉదాహరించేవే .అంతటి సార్వకాలికమైన సత్యాలున్న శ్లోకాలు మాత్రమే కావు. మహర్షి మాటలు .శిరో దార్యాలే .కనుక ఈ సర్గ కూడా చాలా ముఖ్యమైనదే అని పిస్తుంది .హనుమ గుంజాటన ,మనో నిశ్చయం ,తాను చేసిన పని అవతలి వాళ్లకు అపకారం చేస్తే బాగానే ఉంటుంది కాని. ‘’మన అనుకొన్న’’ వాళ్లకు ఏదైనా జరిగితే తట్టుకోలేరు .అదీ లోక సహజం .దీన్నీ గొప్పగా చిత్రించాడు .తన కోతి చేస్టలకూ బాధ పడ్డాడు .చివరకు సీతారాముల నిర్మల నిష్కల్మష మనస్తత్వం కూడా లోకానికి చాటాడు .
ఈ సర్గలో హనుమ అంతర్మధనాన్ని మహోత్క్రుస్టం గా వాల్మీకి కవి తీర్చి దిద్దాడు .హనుమ ఏక పాత్రాభినయానికి ,సర్వ గుణ ,రస ,అలంకార సుశోభిత౦గా రాశాడు కవివాల్మీకి .ఎవరైనా ఈ సర్గను ఏక పాత్రాభినయం చేశారో లేదో నాకు తెలీదుకానీ ,చేస్తే మహాద్భుత రసకందాయంగా ఉంటుందన్నది మాత్రం సత్యం .మహర్షి రచనా ,మజాకానా !
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-20-ఉయ్యూరు .
‘’
‘
‘’
—