సుందర కాండలో హనుమ బహుముఖీయ వ్యక్తిత్వం -56
జాంబవంతాదులు హనుమ చుట్టూ మహేంద్ర పర్వతం పై కూర్చుని ఉండగా, జాంబవంతుడు సంతోష పులకిత గాత్రంతో హనుమను ‘’సీతా దేవిని చూసి వచ్చిన విధానమంతా వివరించు ‘హనుమా ‘.ఆమెను ఎక్కడ ఎలా చూశావ్ ?ఎలాఉంది ?క్రూర రావణుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు?అన్ని విషయాలూ యధాతధంగా మా అందరికీ తెలిజేయి .అంతా విని మనం ఏంచేయాలో ఆలోచిద్దాం.మనం కిష్కింధకు వెళ్లి రాముడి సన్నిధిలో ఏం చెప్పాలో ,దేన్నీ దాచాలో బుద్ధిమంతుడవైన నువ్వు మాకు చెప్పు ‘’ అని అడిగాడు .దూర దృష్టి ఉన్నవాడుకనుక రాముడి హృదయం గాయపడే మాటలు చెప్పకుండా మిగిలిన విషయాలు చెప్పి ఆయన్ను కర్తవ్య పరాయణుడిని చేయాలని పెద్దాయన తలపు .సరాసరి రాముడి దగ్గరే సర్వ విషయాలు చెప్పటం ప్రమాదకరం .కనుక ముందుగా తాము విని ,అవసరమైతే విషయాలను కొంత సెన్సార్ చేసి ,ముఖ్యవిషయాలు రాముడికి చెప్పటం రాజనీతి .ఇప్పటివాడా ఋక్షరాజు జాంబవంతుడు?గ్రాండ్ ఓల్డ్ మాన్ . .అన్నీ కాచి వడపోసిన ముదురుఘటం.
‘’కథందృష్టాత్వయాదేవి ,కథంవా తత్ర వర్తతే –తస్యాం వా స కథంవృత్తఃక్రూరకర్మా దశాననః ‘’
‘’తత్వత స్సర్వ మేతన్నః ప్రబ్రూహి త్వం మహా కపే-శ్రుతార్దాశ్చింత యిష్యామో భూయః కార్య వినిశ్చయ౦
‘’యశ్చార్ధస్తత్ర వక్తవ్యో గతై రస్మాభి రాత్మవాన్ –రక్షితవ్యంచ యత్ర త్రతద్భవా న్వ్యాకరోతు నః ‘’
వృద్ధవాన్ జా౦బవాన్ అలా అడగ౦గానే సంతోషం తో ఒడలు పులకించి ,సీతాదేవినిస్మరించి నమస్కరించి ఇలా చెప్పటం ప్రారంభించాడు –‘’మీరంతా చూస్తుండగా మహేంద్ర పర్వతం నుంచి సముద్ర దక్షిణ తీరం చేరటానికి ఆకాశం లోకి ఎగిరా కదా .అలా ఆకాశం లో పోతుంటే బంగారు శిఖరాలతో దివ్యమైన పర్వతం నన్ను నిరోధించటానికా అన్నట్లు భావించి దగ్గరకు వెళ్లి ,దాన్ని పగలకొట్టాలనే ఉద్దేశ్యంతో ముందు ‘’శాంపిల్’’ గా నా తోకతో ఝాడించి కొట్టాను .అంతే అది వెయ్యిముక్కలైంది .నా ప్రయత్నం గ్రహించి ఆ మహాపర్వత౦’’పుత్రా !అని నన్ను ప్రేమగా పిలిచి ,తనపేరు మైనాకుడు అని సముద్రం లో ఉంటానని ,ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవని వాటితో ఆకాశం లో ఎగిరి ప్రాణులకు బాధకలిగించేవనీ ,అప్పుడు పాకాసుర సంహారి దేవేంద్రుడు వాటి రెక్కలను వజ్రాయుధం తో ముక్కలు చేశాడనీ ,మా తండ్రి వాయుదేవుడు తనను దేవేంద్రుని బారి నుంచి తప్పించి ,ఈ సముద్రం లో పడేసి ఇంద్రుడికి కనపడకుండా చేశాడనీ ,తానూ రాముడికి సహాయం చేయటానికే వచ్చానననిచెప్పగా ,రామబాణం లాగా తనప్రయాణ౦ ఎక్కడా ఆగటానికి వీల్లేదని చెప్పి ,ఆయన అనుమతితో మళ్ళీ ప్రయాణం సాగించాను . అప్పటిదాకా మానవాకారం తో మాట్లాడిన ఆపర్వత౦,మళ్ళీ పర్వత రూపం పొంది సముద్రంలో ఉన్నది ‘’
‘’క్రుతామే మనసా బుద్ధి ర్భేత్తవ్యోయం మయేతిచ-ప్రహతంచ మయా తస్య లంగూలేన మహాగిరేః-శిఖరం సూర్య సంకాశం వ్యసీర్యత సహస్ర ధా’’
మొదటి సర్గ లో హనుమ మైనాకుడిని తోకతో కొట్టి’’ వేయి ముక్కలు ‘’చేసినట్లు లేదు .ఇప్పుడే ఈవిషయం చెప్పాడు .
‘’చాలాకాలం ప్రయాణం చేశాక సర్పాలకు తల్లి సురస సముద్ర మధ్యంలో కనిపించి ,నన్ను తనకు దేవతలు ఆహారంగా ఇచ్చారు కనుక నన్ను తినేస్తాను అన్నది .రామకార్యానికి రెండవ విఘ్నం కలుగుతోందని భావించి నమస్కరించి ,ఆమెతో రామ వృత్తాంతం టూకీ గా చెప్పిరామదూతగా వెడుతున్న నాకు అడ్డం రావద్దని ,కావాలంటే లంకనుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆహారం అవుతానని రామకార్యానికి ఆమెనుకూడా సాయం చేయమని కోరాను.నా మాట వినకుండా తన్ను ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పగా తెలివిగా పది యోజనాల పొడవున్న నేను పదిహేను యోజనాల పొడవున్నవాడిగా మారగా, నన్ను బట్టి ఆమె కూడా నోరు పెంచటం ప్రారంభించగా ,అమాంతం ఒక్కసారిగా నా శరీరాన్ని బాగా కుదించుకొని ఆమె నోటిలో దూరి ,క్షణం లో బయటకు వచ్చేశాను .అప్పుడు సురస సహజ వేషంతో కనిపించి ‘’సౌమ్య వానర శ్రేస్టా ! ఇంక సుఖంగా వెళ్ళు .నీకు కార్యసిద్ధి అవుగాక .మహాత్ముడైన రామునితో సీతను కలుపు .సుఖం ,శుభం భూయాత్ .నీ బుద్ధి కౌశలానికి చాలా సంతోషించాను ‘’అనగా భూతగణాలన్నీ ‘’భేష్ భేష్ ‘’అని ప్రశంసించాయి –
‘’రామో దాశరధిఃశ్రీమాన్ ప్రవిస్టోదండకావనం –లక్ష్మణేన సహభ్రాత్రా సీతాయాచ పరంతపః
‘’తస్య సీతాహృతా భార్యా రావణేన దురాత్మనా –తస్యాస్సకాశం దూతోహం గమిష్యే రామ శాసనాత్ ‘-కర్తు మర్హసి రామస్య సాహాయ్యం విషయే సతీ’’అథవా మైథిలీం దృష్ట్వారామచాక్లిస్టకారిణం’’
‘’అర్ధ సిద్ధై హరి శ్రేష్ఠ గచ్ఛ సౌమ్య యధాసుఖం –సమానయ చ వైదేహీ౦రాఘవేణ మహాత్మనః –సుఖీభవ మహాబాహో ప్రీతాస్మి తవ వానర’’
‘’సాదు సాధ్వీతిసర్వ భూతైఃప్రశంసితః ‘’
‘’మళ్ళీ మహావేగంతో బయల్దేరాను .నా నీడను బట్టిఎవరో వెనక్కు లాగుతున్నట్లు అనిపించింది .కానీ నాకెవ్వరూ కనబడలేదు .నావేగం తగ్గగా అన్ని వైపులా చూస్తూ కారణం ఏమిటో అని చూసినా నాకేమీ కనిపించలేదు .నాకు మూడో విఘ్నం కలిగించటానికి ప్రయత్నించిన జంతువేదో తెలియలేదు .ఒకసారి కిందకి చూడగా భయంకర రాక్షసి ఒకటి నీటిలో కనిపించింది .అది నన్ను చూసి అట్టహాసం చేసి ‘’ఓ మహా శరీరా !ఆకలిగా ఉన్న నాకు నువ్వు భలే ఆహారంగా దొరికావు .ఎక్కడికీ పోతావు పెద్దోడా ?చాలాకాలం గా ఆహారం లేని నాకు పుష్టిగా నువ్వు ఆహారంగా దొరికావ్’అన్నది ..ఆవిడ మాట కాదనటం ఎ౦దుకని సరే అని ,ఆమె నోటికంటే ,నా శరీరం బాగా పెంచాను .నన్ను చూసి ఆమె కూడా నోరు పెంచింది .నాసామర్ధ్యం, కామరూపం ,నేను చేయగల అపకారం ఆమెకు తెలీదు పాపం .క్షణంలో నా రూపం అతి సూక్షం చేసుకొని ఆవిడ నోట్లో ప్రవేశించి గుండెను చీల్చి ఒక్కసారి మళ్ళీ ఆకాశం లోకి ఎగిరాను..పర్వతాకారం గా ఉన్న ఆరాక్షసి భుజాల కీళ్ళు సడలిపోయి సముద్రంలో మునిగిపోయింది .ఆకాశ సిద్ధ చారణులు ‘’భయంకర సింహిక రాక్షసిని హనుమ శీఘ్రంగా సంహరించాడు ‘’అని అనటం నాకు వినిపించింది .
‘’నచ మాం సాదు బుబుదే మమవా నికృతం కృతం –తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషా౦త రాత్ ‘’
‘’తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాన్తరాత్-తస్యా హృదయ మాదాయ ప్రపతామి నభాస్థలం’’
‘’సా విసృష్ట భుజా భీమా పపాత లవణా౦ భసి-మయా పర్వత సంకాశా నికృత్త హృదయాసతీ’’
‘’శృణోమి ఖగతానాం చ సిద్ధానాం చారణై స్సహ –రాక్షసీ సింహికా భీమా క్షిప్రం హనుమతా హతా ‘’
విడిచిన రామ బాణం లక్ష్యం చేరేదాకా విశ్రమించాడో అలాగే హనుమ లంకకు వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నాన్ స్టాప్ గా ప్రయాణం చేశాడు అని మనం గుర్తుంచుకోవాలి అదీ ఆయన ప్రతిభా, సామర్ధ్యం, పట్టుదల ,కార్యదీక్ష ,అంకితభావం ,ధీశక్తీ,చిత్త శుద్ధీ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-6-20-ఉయ్యూరు