సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -57
‘’సింహికా హననాన్ని తలచుకొంటూ కొండలతో ఉన్న దక్షిణ సముద్ర తీరం చేరాను .ఇక్కడే లంకానగరం ఉంది’’అని మళ్ళీ తన సింహళ యాత్రా వృత్తాంతం కొన సాగిస్తూ హనుమ ‘’సూర్యుడు అస్తమించాక ,అక్కడి భయంకర నిశాచరులకు తెలియకుండా లంకానగరం లో ప్రవేశించాను .అప్పుడు ఒక ప్రళయకాల గర్జన చేస్తూ మండే అగ్నిలాంటి వెంట్రుకలు ,న్న రాక్షసి నన్ను చంపటానికి మీదకొస్తే ఎడమ చేతి పిడికిలి తో ఒక్క పోటు పొడిఛి ఓడించి,రాత్రికాలం లో లంకలో చేరగా ఆమె తాను లంకాధి దేవతనని ,నా పరాక్రమంతో ఆమెను జయి౦చాను కనుక,ఇక సకల రాక్షసులను జయిస్తాను అని శుభం పలికింది .తర్వాత రావణ అంతఃపురం చేరి ,రాత్రి అంతా గాలి౦చినా,,నాసీత జాడ కనిపించలేదు .దుఃఖ సముద్రం లోపడి ఒడ్డు కనిపించలేదు .తర్వాత గృహ ,ఉద్యానవనాలన్నీ తెతికా .అప్పుడు పెద్ద అశోక వనం లో శి౦శుపా వృక్షం పైకెక్కి బంగారు రంగు అరటి తోటలు చూశా .ఆవృక్షం దగ్గర వరవర్ణిని అంటే శీతాకాలం లో సుఖమైన ఉష్ణం ,వేసవిలో చల్లని శరీరం కల ,భక్తానురాగమున్న,నడియవ్వనంలో ఉన్న తామరరేకులవంటి కనులున్న ,ఉపవాసంతో కృశించిన ముఖం కల సీతాదేవిని చూశాను –
‘’అదూరే శింశుపా వృక్షస్యాత్ పశ్యామి వరవర్ణినీమ్-శ్యామాం కమలపత్రాక్షీ ముపవాస కృశాసనాం ‘’
‘’ఆమె రావణుడు అపహరించినప్పుడు ఏ వస్త్రాన్ని దాల్చి ఉన్నదో ,,ఇప్పుడూ అదే వస్త్రాన్ని దాల్చి ,కేశాలు ధూళి దూసరితాలతో మలినమై ,సంతాపం తో దీనంగా సదా భర్తృ హితాన్ని కోరుతోంది .సీత ను ఫోటో తీసి చూపించి నట్లు౦ది కదా హనుమ అంటే వాల్మీకి వర్ణన .
‘’తదేక వాస స్సంవీతాం రాజోధ్వస్త శిరోరుహాం –శోక సంతీప దీనాంగీం సీతాం భర్తృహితే స్థితాం’’
‘’రక్తమాంసాలు తినే ఆడ పులుల మధ్య ఉన్న ఆడ లేడి లాగా సీత వికృత భయంకర రాక్షస స్త్రీలచేత పరివేస్టింపబడి ఉన్నది.గొప్ప ఉపమాన౦ ఇది .-
‘’రాక్షసీభి ర్విరూపాభి రభి సంవృతాం-మాంస శోణిత భక్షాభి ర్వ్యాఘ్రీభి ర్హరిణీ మివ ‘’
‘’ఆమె అనుక్షణం భర్తనే తలచుకొంటూ ,మాటిమాటికీ రాక్షసస్త్రీలు భయపెడుతుంటే ,ఒంటి జడ తో దీనంగా ,నేలమీదే పడుకొంటూ ,హేమంతంలో కళ తప్పిన కమల సమూహం లాగా,రావణ వైముఖ్యం తో ,చనిపోటానికి సిద్ధపడిన ఆమెను ఎలాగో చూడగలిగాను’’-
-‘’సామయా రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః-‘’ఏక వేణీ,ధరా దీనా భర్తృచింత పరాయణా ‘’’భూమి శయ్యా వివర్ణా౦గీ పద్మినీవ హిమాగమే ‘’
‘’ఆమె దీనావస్థ చూస్తూ ఆ చెట్టుమీద కూర్చుని అన్నీ చూస్తుండగా మొలత్రాటి చిరుగజ్జెలు,అందెల మ్రోతలతో గంభీరమైన కోలాహలం రావణ భవనం నుంచి వినిపించింది .నేను కలవరపాటుతో నా శరీరం చిన్నది చేసుకొని ఆ వృక్షంపై దట్టమైన ఆకులమధ్య పక్షిలాగా కూర్చున్నాను .అప్పుడు రావణుడి భార్యలు ,మహాబలశాలి రావణుడు సీత ఉన్న చోటుకు వచ్చారు .హనుమకున్న సద్యో స్పురణ కు వెంటనే తగినట్లు స్పందించటానికి ఇది గొప్ప ఉదాహరణమే .
‘’తతోహం పరమోద్విగ్నఃస్వం రూపం ప్రతిసంహరన్-అహం తు శింశుపా వృక్షే పక్షీవ గహనే స్థితః ‘’
సశేషం
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -23-6-20-ఉయ్యూరు