eenసుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-58
రావణ రాకగురించి హనుమ వివరిస్తూ ‘’రావణుడు తనభార్యలతో సీత ఉన్న చోటుకు వచ్చాడు ఆమె శరీరాన్ని చేతులతో ఆచ్చాదనగా కప్పుకొనగా ,భయపడిన,రక్షకులెవరూలేని వణుకు చున్న ఆమెను చూసి ,’’భూమిపై వంగి నమస్కరించి’’ తనను ఆదరి౦పు మని కోరాడు . ఇలా నమస్కరించాడని వాల్మీకి 20వసర్గలో చెప్పనే లేదు .అంతేకాదు ఇక్కడ రావణుడికి సీత పరమ శక్తి స్వరూపిణిగా కనిపించి ఉంటుంది .దైవీ శక్తిని ఆమెలో వాడు చూశాడు .అందుకే తలవంచి నమస్కరించాడు అని నాకనిపిస్తోంది .
‘’తదృస్ట్వాథ వరారోహా సీతా రక్షో మహాబలం –సంకుచ్యోరూ స్తనౌ పీనౌ బాహుభ్యాం పరి రభ్యచ ‘’విత్రస్తాం పరమోద్విగ్నా౦ వీక్షమాణా౦ తతస్తతః –త్రాణం కించి దపశ్య౦తీంవేమమానాం తపస్వినీం ‘’
‘’తామువాచ దశగ్రీవ స్సీతాంపరమ దుఖితాం-‘’అవాక్చిరాఃప్రపతితో ‘’బహుమన్వస్వ మామితి
‘’తానిచ్చిన రెండునెలలగడువు లోపల తన్ను ఆదరించకపోతే ముగియగానే ఆమెరక్తం తాగుతానన్నాడు .వాడిమాటలకు ఆమెకు కోపం వచ్చి’’రాక్షసాధమా !అమిత తేజశ్శాలి రాముని భార్యను ,ఇక్ష్వాకు వంశమహారాజు దశరథునికోడలిని .నన్ను అనరాని మాటలు అంటున్న నీనాలుక ఎందుకు తెగి పడకుండా ఉంది ?పాపిస్టుడా! నా భర్త దగ్గర లేని సమయం లో ఆయనకు తెలీకుండా నన్ను అపహరించి తెచ్చావ్ .దీన్ని బట్టి నీపరాక్రమమ యెంత అల్పమైనదో తెలుస్తోంది . రాముడి దాస్యం చేయటానికి కూడా నువ్వు పనికి రావు .అనేకయాగాలు చేసిన సత్యసంధుడు రాముడు .యుద్ధం లో అరివీరభయంకరుడు .నీకూ ఆయనకూ పోలికేమిటి ?’’అని అనగానే వాడి కోపం పరాకాష్ట కు పోయి సీతను చంపే ప్రయత్నం చేయగా ,రాక్షసా౦గనలు హాహాకారం చేశారు .22వ సర్గలో రావణుడు సీతను చంపటానికి ప్రయత్నించి నట్లు చెప్పలేదు .రెండు నెలల లోపు మాట వినకపోతే చంపమనిమాత్రమె కాపలా రాక్షసులకు చెప్పాడు .కానీ ఇది హనుమ చెబుతున్న కథ కనుక కొంత మిర్చీ మసాలా దట్టించి వానరులకు వాడిపై కోపం, సీతపై అపార సానుభూతి కలిగేట్లు చెప్పి ఉంటాడు .సెకండ్ వర్షన్ ఎప్పుడూ నాటకీయంగా ఉండటం లోక సహజం .
‘’యది చేత్వం తు దర్పా న్మాంనాభినందసి గర్వితే –ద్వౌ మాసావంతరం సీతే పాస్యామి రుధిరం తవ ‘’
‘’రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః-ఇక్ష్వాకు కులనాథస్య స్నుషాం దశరథస్య చ –అవాచ్యం వద తోజిహ్వా కథం న పతితా తవ ‘’
‘’న త్వం రామస్యసదృశోదాస్యే ప్యస్య న యుజ్యతే ‘’
‘’వివృత్య నయనే క్రూరేముష్టి ముద్యమ్యదక్షిణం –మైథిలీం హంతుమారబ్దః స్త్రీభి ర్హాహాకార కృతం తదా’’
‘’అప్పుడు రావణ భార్య లలో శ్రేష్టురాలు మండోదరి ,రావణుడి క్రూర కృత్యాన్ని’ దేవ, గ౦ధర్వ యక్ష కాంత లుండగా వారితో క్రీడించక, సీతతో నీకేమిటి పని అని బుజ్జగించి నివారించి,అంతఃపురానికి తీసుకు వెళ్ళింది .’’’
ఇక్కడ కూడా లోగడ సర్గలో చెప్పినదానికి విరుద్ధంగా ఉన్నది అక్కడ 22వ సర్గలో దాన్యమాలి రావణుడిని కౌగిలించి నచ్చచెప్పి తీసుకు వెళ్ళినట్లు ఉన్నది .అక్కడ మండోదరి ప్రసక్తి లేదు .ఇక్కడ ఆమే రావణుడు తిరిగి వెళ్ళటానికి ముఖ్య పాత్ర వహించింది .హనుమకు ఈ ఇద్దరు తేడా అని తెలీదా ?మండోదరి అలా చేసింది అంటే ఎఫెక్టివ్ గా ఉంటుందనా ?ఇదేదో మాజిక్ గా ఉంది .
‘’స్త్రీణా౦ మధ్యా త్సము త్పత్య తస్య భార్యా దురాత్మనః –వరా మండోదరీ నామ తయా స ప్రతి షేదితః ‘’
‘’దేవ గ౦ధర్వ కన్యాభి ర్యక్ష కన్యాభిరేవచ-సార్ధం ప్రభో రమస్వేహ సీతాయా కిం కరిష్యసి ?’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-6-20-ఉయ్యూరు
‘’