ఆరామ ద్రావిడుల ఆలయం -1
నిన్నటి నిడదవోలు పర్యటనలో మల్లవరం లో నాకు శ్రీమతి చర్ల మృదుల గారిచేత శ్రీ కానూరి బదరీ నాథ్ రాసిన ‘’తరతరాల సరస్వతీపీఠం-మన కాకర పర్రు’’పుస్తకాన్ని అంది౦ప జేశారు ‘’నేను బదరీ నాద్ గారి భార్యను ‘’అని పరిచయం చేసుకొని ఒకావిడ .ఆమె లో ఎంతో సౌజన్య సంస్కారాలు నాకు కనిపించాయి .ఇవాళ ఆ పుస్తకం చదవటం ప్రారంభించాను .తరతరాల కాకరపర్రు గ్రామ విశేషాలు అక్కడి చారిత్రిక ,సాహిత్య ,సంగీత విశేషాలు అక్కడ జన్మించి దాన్ని పునీత౦చెసిన మహా మహుల గురించి ,ఎంతో వివరంగా విషయ సేకరణ చేసి రాసిన రచయితకు అభినందనలు తెలియజేసి ,అందులోని విశేషాలను టూకీగా మీకు తెలియ జేయాలనే ఉద్దేశ్యంతో ‘’ ఆరామ ద్రావిడుల ఆలయం’ శీర్షిక పేరుతొ కొన్ని వ్యాసాలు దాన్నిఆదారంగా రాయాలనుకొని ,పుస్తకం నాకు ఇచ్చిన ,ఆమె పేరు ఏమిటో అందులో లేకపోవటం ఆశ్చర్యం కలిగించి ,ఇంత చరిత్ర త్రవ్వి తీసిన ఆయన ,తనభార్య పేరు రాయకపోవటం బాధకలిగించి , ఆ పేరు లేకుండా రాయటం ఔచిత్యం కాదని పించి ,వాణీ ప్రభాకరి గారికి మెసేజ్ పెడితే ఆమెవెంటనే స్పందించి ,ఆ ఇల్లాలి పేరు’’ శ్రీమతి రమా మురళి రాజేశ్వరి ‘’అని తెలియ జేశారు .రాజేశ్వరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉపక్రమిస్తున్నాను .. పశ్చిమ గోదారి జిల్లా పెరవలి మండలం లో కాకరపర్రు పండితాగ్రహారం ఉంది.అది సంస్కృత ,వ్యాకరణ వేదం వేదాంగాల అధ్యయన కేంద్రం .తెలుగు భాష ఔన్నత్య ,వికాసాలకు పట్టుకొమ్మ తెలుగు జాతి యశస్సు ,వైభవ ,ప్రాభవాలకు జీవ ధాతువు .బ్రహ్మ గారి సృజన ప్రతిభకు సాక్ష్యం .తెలుగు సరస్వతికి ఆలయ శిఖరం .ద్రావిడులు దక్షిణా పధంనుంచి గోదావరీ ముఖ ద్వారాలకు చేరి ,పంచారామ క్షేత్రాలలో స్థిర పడి’’ఆరామ ద్రావిడులు ‘’అయ్యారు .కనుక ఇది విలువైన చారిత్రిక గ్రామం .
‘’కాకర పర్తిని చూస్తె కాశీకే కన్నెర్ర ‘’గాఉండేది .కాశీ పండితులే ఇక్కడికి వచ్చి తమ సందేహాలు ఇక్కడి పండితుల నుంచి తీర్చుకొనేవారు .అందుకే దక్షిణ కాశి అయి సరస్వతీ పీరమైంది .పల్లవ సామ్రాజ్య రాజధానిగా కంచి ఉండేది .అక్కడ వేద వేదంగావిదులు ,వైదికులు ,రాజనీతి విశారదులైన నియోగులు ,క్షత్రియులు ,వ్యాపార వేత్తలైన వైశ్యులు ,వ్యవసాయ నిపుణులైన తక్కిన కులాల వారు రాజాదరణ పొంది సుఖంగా జీవించా రక్కడ .పల్లవ విజయాదిత్య వర్మ బ్రాహ్మణులకువేంగీ దేశం లోని 204అగ్రహారాలుదానమిచ్చాడు .ఈ గ్రామమలలో కాకరపర్రు, కానూరు ,తీపర్రు కూడా ఉండి ఉంటాయి .వారు అక్కడనుండి గోదావరి ప్రాంతానికి వచ్చి10వ శతాబ్ది లో గోస్తనీ నదీ తీర అగ్రహార బ్రాహ్మణులు అయ్యారు.బౌద్ధాన్ని రూపుమాపి వైదిక మత పునరుద్ధరణ చేశారు వేగినాటి ‘’ కాకర్త్యపురం ‘’ నేటి కాకరపర్రు .పూర్వ చాళుక్య రాజుల మూల పురుషుడు నాల్గవ విష్ణు వర్ధనుడికొడుకు రెండవ విజయాదిత్యుడు .ఇతడికి అతని సోదరుడు ‘’భీమ సళుక్కి’’ల మధ్య 108 యుద్ధాలు జరిగి అందులో ఒకయుద్ధం గుండ్యన కుటుంబాలకు నిలయమైన కాకర పర్రు లోనూ జరిగి ,’’నరేంద్ర వర్మ మృగరాజ ‘’బిరుదాంకితుడు రెండవ విజయాదిత్యుడు శత్రువుఅను అందర్నీ ఓడించి ,రాజు అయ్యాడు అనేక శివాలయాలు చెరువులు ఉద్యానవనాలు సత్రాలు కట్టించాడు వాటిలో కృష్ణా జిల్లా దివి సీమలోని ‘’న౦గే గడ్డ ‘’లోని’’నగేంద్ర మృగేశ్వరాలయం ‘’,నందిగామ తాలూకా కొణకంచిలోని ‘’నరేంద్రస్వామి ఆలయం ‘’ఉన్నాయి ,
ముక్కంటి త్రిలోచన వర్మ మహారాజు ఆహ్వానం పై ఇక్కడికి వచ్చిన ఆర్వేల నియోగులలో కంచి రాజు వంశస్థులు గోదావరి ముఖద్వారమైన ,వశిష్ట నది తీర గ్రామం కాకర పర్రు కు సుమారు 700ఏళ్ళ క్రితమే వచ్చి స్థిర పడ్డారు .సప్తగోదావరిపాపికొందలద్వారా ప్రవహించి లోని ఏడు పాయలై-తుల్యభాగ ,ఆత్రేయ ,గౌతమి ,వృద్ధ గౌతమి ,భారద్వాజ ,,కౌశిక ,వశిష్ట పేర్లతో విలసిల్లాయి .ఇంతటి నదీ శోభ ఉన్న గోదావరి నదిని ‘’ది రైన్ ఆఫ్ ఇండియా ‘’అన్నారు .ఐరోపా లోని అతి పెద్దనది రైన్ నది .వశిష్ట పాయ చెంత కాకరపర్రు అగ్రహారం ఉన్నది .
అగస్త్య మహర్షికాలం లో బ్రాహ్మణులు ఉత్తరాదినుంచి దక్షిణాదికి వచ్చి కర్మిస్టు లై పేరూరి ద్రావిడులు ,దివిలి ద్రావిడులు ,పుత్తూరు ద్రావిడులు ,తుమ్మగుంట ద్రావిడులు ,ఆరామ ద్రావిడులు అనే అయిదు శాఖలుగా చీలిపోయారు .కౌశికీ నది తీరానున్న పెరియ గ్రామం లో ఉన్నవారు పేరూరు ద్రావిడులు ,సర్వసిద్ది తాలూకా దివిలి గ్రామంలోని వారు దివిలి ద్రావిడులు,నెల్లూరు ,పుత్తూరు ప్రాంతంలో చేరినవారు పుత్తూరు ద్రావిడులు , నెల్లూరు జిల్లా తుమ్మగుంటవారు తుమ్మగుంట ద్రావిడులు ,తోటలు ఆరామాలలో ఉన్నవారు ఆరామ ద్రావిడులు అయ్యారని కధనం .వీరిని ‘’తోట అరవలు ‘’అనీ అంటారట .
ఆరామ ద్రావిడుల తొలి ఆవాసం కాకరపర్రు .ఇక్కడినుంచే తర్వాత తరాలలో బొబ్బిలి విజయనగరం మొదలైన ప్రాంతాలకు వ్యాపించారు .కాకరపర్రు ,ఇంజరం ఆరామ ద్రావిడులకు ముఖ్యగ్రామాలు .ఆకొండి, వేదుల ,చర్ల ,ఆణివిళ్ళ,ఓలేటి ,కాకరపర్తి ,కామవరపు ,కూచిభొట్ల ,ఇంటిపేర్లు .ఆరామ ద్రావిడులకు ఆలయం అనీ , చతుర్వేద , శాస్త్రార్ద, తర్క ,వేదార్ధ, సాహిత్య ,కవిత్వాలతో ఈ గ్రామం లోని ప్రతి ఇల్లూ ‘’ఒక యూని వర్సిటి ‘’అన్నారు కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారు .
కలియుగం లో కృష్ణాజిల్లా శ్రీకాకుళం లోని శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు కొంతకాలం గుడీ ,ప్రాకారాలతో సహా అంతర్ధానమై భూగర్భ నాగలోకం లో నివాసమున్నాడట .ఆహిచ్చ పురానికి వెళ్ళాడని మరో కథనం .ఒరిస్సారాజు అంగపాల కొడుకు అనంతపాలుడు ,మంత్రి సైన్యాధ్యక్షుడు,నరసింహ వర్మ దక్షిణ యాత్ర చేస్తూ శ్రీకాకుళం వచ్చి తన తలి దండ్రులను కలిసి నప్పుడు రాత్రికలలో స్వామి కనిపించి తాను ‘’ఆహిచ్చపురం బ్రహ్మ కుండం నది ఒడ్డున వామన శర్మ దొడ్లో ‘’కాకర వల్లిక ‘’మొక్క మొదట్లో భూమిలో నిద్రావస్థలో ఉన్నాననీ ,తాను శ్రీకాకుళం లోనే స్థిరంగా ఉండాలని నిశ్చ యించు కొన్నాననీ చెప్పగా ,మంత్రి ఒక పురోహితుడిని పంపి విగ్రహం తెప్పించి ,శ్రీకాకుళం లో దేవాలయం కట్టించి స్వామిని ప్రతిస్టిం చాడట ,ఆహిచ్చ అంటే భూమికి గొడుగు .కాకరపర్రు అన్నిటికీ గొడుగుగా ఉండేది కనుక కాకరపాదు పేరున్నదీ కనుక కాకరపర్రు ఆహిచ్చపురంగా పిలువబడేదని అంటారు .
అలాగే కృష్ణాజిల్లా హంసలదీవిలోని శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం కాకరపర్రు చెరువులో దొరికిందనే జనవాక్యం ప్రచారం లో ఉందిట .చారిత్రిక ఆధారాలు లేవు కనుక నమ్మటానికి వీల్లేదు.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-6-20-ఉయ్యూరు .