సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -63
జాంబవంతుని సలహాను అంగద హనుమదాది కపివీరులంతా ఆమోదించారు .తర్వాత అందరూ కలిసి మహేంద్ర పర్వతం వదిలి ఆకాశంలోకి ఎగిరారు .మహా గజాలలాగా మహాశరీరాలున్న వారవటం తో ఆకాశం కప్పి వేయబడినట్లు అనిపించింది .సర్వభూత పూజ్యుడు ,వీర ధీర మహాబల మహావేగుడు ఐన హనుమను రెప్ప వేయకుండా చూస్తూ తమ చూపుల మీదనే ఆయన్ను కూర్చో పెట్టుకొని మోసుకు పోతున్నట్లుగా అనిపించింది –
‘’సభాజ్యమానం భూతై స్తమాత్మవంతం మహాబలం –హనుమంతం మహావేగం’’ వహంత ఇతి దృష్టి భిః’’’’
రామకార్య సాధన చేసి మహాయశం పొంది ,మిగిలిన దిక్కులకు సీతాన్వేషణకుతే వెళ్ళిన వానరులకంటే వీరు ఘనులయ్యారు –
‘’రాఘవే చార్థ నివృత్తిం కర్తుం చ పరమం యశః –సమాధాయ సమృద్థార్థాః కార్ము సిద్దిభి రున్నతా ‘’
సీతా దర్శన వార్త రాముడికి చెప్పాలనే తహతహతో ,రావణుడితో యుద్ధం చేయాలన్న కాంక్షతో ,రాముడికి ప్రత్యుపకారం చేయాలన్న కోరికతోవానరులు అనేక వృక్షాలు తీగలతో నందన వనం లాంటి ,సుగ్రీవుని ఆజ్ఞ చేత కాపలా కాయబడుతున్న ,ఏ ప్రాణీ చొరరానంత కట్టు దిట్టమైన ,సకలమనోహరమైన మధు వనం చేరారు –
‘’నందనోపమ మాసేదు ర్వనంద్రుమలతా యుతం ‘’
‘’యత్తన్మదు వనం నామ సుగ్రీవస్యాభి రక్షితం –అదృష్య౦ సర్వభూతానాం సర్వ భూత మనోహరం ‘’
మధువనాన్ని సుగ్రీవుని మేనమామ దధిముఖుడు సదా రక్షిస్తూ ఉంటాడు .వానరులంతా మధువనం లో దిగి సుగ్రీవుని మనసుకు ఆందం కలిగించే మధువనం లోని మధువు తాగాలాని ఉబలాట పడ్డారు –
‘’తే తద్వన ముపాగమ్య బభూవుః పరమోత్కటాః –వానరా వాన రేంద్రస్య మనః కాన్తతమం మహత్ ‘’
తెనేలాగా పింగళ వర్ణం తో ఉన్న వానరులు తేనే త్రాగటానికి యువరాజు అంగదుని అనుమతి కోరారు –
‘’తతస్తే వానరా హృస్టాదృష్ట్వామధువనం మహత్ కుమార మభ్యయా చంత మధూని మధు పింగళాః’’
అంగదడు,జాంబవంతాది పెద్దల అనుమతి పొంది తర్వాతనే తేనే తాగటానికి వానరును అనుమతించాడు –అంటే తనను అడిగినా ,పెద్దరికం జామ్బవంతునికిచ్చి ,ఆయన సరే నన్న తర్వాతే తన అనుమతి మంజూరు చేశాడు –
‘’తతః కుమారస్తాన్ వృ-ద్ధాన్ జా౦బ వత్ప్రముఖాన్ కపీన్ –అనుమాన్య దదౌ తేషాం నిసర్గం మధు భక్షణే’’
అంగదుని అనుమతి లభించగానే ఆనంద పరవశత్వం తో ననౌకసులైన వానరులు నృత్యం చేశారు-ఇక్కడ వనౌకసులు అనటం పరమ ఔచిత్యమైన మాట .వాళ్ళు ఉండేది వనాలలోనే కనుక ఆ శబ్దం చక్కని అర్ధ ప్రబోధకంగా ప్రయోగించాడు కవి వాల్మీకి –
‘’తత శ్చాను మతా స్సర్వే సంప్ర హృష్టా వనౌకసః –ముదితాఃప్రేరితా శ్చాపి ప్రవృత్యంతో భావం స్తతః
కోతికి కొబ్బరి కాయ దొరికితే అనే సామెత లోకం లో ఉంది .అలాగే ఇక్కడా వానరుల ఆనందానికి అంతులేకుండా పోయింది .కొందరు పాడితే ,కొందరు వంగితే మరి కొందరు నృత్యం చేస్తే ఇంకొందరు అట్టహాసం చేస్తే ,కొందరు పడి లేస్తూ ,కొందరు అటూ ఇటూ తిరుగుతూ ,కొందరు అరుస్తూ ‘’ హల్ చల్’’చేశారు –
‘’గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ –నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ –పతంతి కేచిత్ ద్విచర౦తి కేచిత్ –ప్లవంతి కేచిత్ ప్రలవంతి కేచిత్ ‘’
ఒకళ్ల నొకళ్ళు కావలించుకొంటూ ,కొందరు ఒకళ్ళను ఒకళ్ళు పట్టుకొంటూ ,కొందరు మాట్లాడుకొంటూ ,కొందరు కలిసి విహరించి ఆనందం అనుభవించారు –
‘’పరస్పరం కేచి దుపాశ్రయంతే-పరస్పరం కేచి దుపాక్రమంతే-పరస్పరం కేచి దుపబ్రువంతే-పరస్పరం కేచి దుపారమంతే’’
కొందరు ఒక చెట్టు మీదనుంచి ఇంకో దానిమీదకు పరిగెత్తారు .కొందరు చెట్టు చివరి కొమ్మలపైకి చేరి కిందికి దూకారు ,మరికొందరు గడుగ్గాయలు మహా వేగంతో చెట్టుకి౦ది వృక్షాగ్రం ఎక్కేశారు-
‘’ద్రుమా ద్ద్రుమం కేచి దభి ద్రవంతే-క్షితౌ నగాగ్రా న్నిపతంతి కేచిత్ –మహీతలానన్ త్కేచి దుదీర్ణ వేగా –మహాద్రుమాగ్రా ణ్యభి సంపతంతి’’
‘’ఒకడు పాడుతుంటే ఇంకోడు నవ్వుతూ వాడి దగ్గరకు వెళ్ళాడు .ఇంకోడు నవ్వేవాడి దగ్గరకు ఏడుస్తూ పోయాడు .ఇంకోడు ఏడ్చేవాడిని త్రోసేసి దగ్గర కెళ్ళాడు.మరో గడుసు పిండం అరుస్తూ ఆ తోసిన వాడి దగ్గర కెళ్ళాడు –ముక్తపద గ్రస్తం లాగా తమాషాగా వర్ణన చేసాడు మహర్షి .
‘’గాయంతి మన్యః ప్రహసన్నుపైతి-హసంత మన్యః ప్రరుదన్నుపైతి-రుదంత మన్యః ప్రణుద న్నుపైతి-నుదంత మన్యః ప్రణద న్నుపైతి’’
బాగా తేనే కడుపారా తాగి ,మత్తెక్కి విపరీత చేష్టలు చేస్తూ కల్లోలం సృష్టించారు .తాగి తృప్తి పొందనివాడు మత్తెక్కని వాడు లేదు అంటే అతిశయోక్తిలేదు .కల్లుపాకల దగ్గర’’ తాగు బోతుల సీను’’ ఇదంతా లాగా అనిపిస్తుంది .-
‘’సమాకులం తత్కపి సైన్య మాసీ –న్మధు ప్రసానోత్కటసత్వ చేస్ట౦-న చాత్ర కశ్చిన్న బభూవమత్తో-న చాత్ర కశ్చి న్న బభూవతృప్తః ‘’
తాగి తందనాలాడటం అంటే ఇదే నెమో ? తాగినమత్తులో మధువనం చెట్లు విరగ్గొట్టారు ,ఆకులు పూలు పళ్ళు రాల్చి నేలపాలు చేస్తుంటే కాపలాదారు దధి ముఖుడు అడ్డు వచ్చాడు .అసలే ముసలాడు ,ఆయన మనల్ని బెదిరించటం ఏమిటని ఇంకా చెలరేగిపోయారు కోతిమూక .పాపం శాయశక్తులా వనాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు సుగ్రీవ మేనమామ- .కొందర్ని తీవ్రంగా తిట్టాడు .కొందర్ని అరచేత్తో కొట్టాడు ,కొందరితో పోట్లడాడు .కొందర్ని వనం పాడు చేయకండిరా బాబూ అని బుజ్జగించాడు . పాపం ఒళ్ళు ఎరగని మత్తులో తిట్లూ శాపనార్ధాలు దెబ్బలూ తిన్నారు వానరులు –
‘’ఉవాచ కాంశ్చిత్పరుషాని ధృష్ట-మసక్త మన్యా౦శ్చతలై ర్ణఘాన –సమేత్య కైశ్చిత్కలాహం చకార –తథై వసామ్నోపజగామ కాం శ్చిత్’’
మధుపానమత్తులై ,కపలాదారును లెక్క చేయకుండా భయం లేకుండా రెచ్చిపోయి ,అతడి చుట్టూ చేరి ,వనరక్షకుడు అతడిని ఏమీ చేయరాదనే ఇంగితం కూడా లేకుండా తిట్టారు ,అటూ ఇటూ లాగారు .గోళ్ళతో గీరి పళ్ళతో కరిచి,చేతులు కాళ్ళతో బాదుతూ ఆవనం లో తినటానికి ఉన్న సర్వం భోజ్యం చేసి మిగలకుండా పూజ్యం చేసేశారు కపి సేన కసికసిగా విజయోత్సాహంతో -అసలైన ‘’కిష్కింధకాండ ‘’సినిమా ఆడారు. మనకు వారికీ వినోదం ,ఆనందం సంతృప్తీ ,ఆటవిడుపు దధిముఖుడికి పరాభవం ,దుఖం అవమానం దూషణ తిరస్కారాలు .
ఇది 23శ్లోకాల 61వ సర్గ
కోతి మూక ఆగడాలను కవి రుషి వాల్మీకి అనుస్టుప్పులలో మన చెవుల తుప్పు వదిలేట్లు పరమ మనోహరంగా వర్ణించాడు .తీవ్రమైన అనుభూతి ఆనందం సంతృప్తి సంఘటనలలో ఈ విధమైన శ్లోకాలతో వర్ణిస్తూ గొప్ప’’ ఎఫెక్ట్ ‘’కలిగిస్తాడు లోగడ రెండు మూడు ఘట్టాలలో చూశాం .ఇన్ని మంచి శ్లోకాలను ఏ ప్రవచన కారుడూ ముట్టుకోడు .అదే నాకు ఆశ్చర్యం .ఒక సారి కైకలూరుకు చెందిన ప్రవచన కారులు బ్రహ్మశ్రీ పరిమి రామకృష్ణ శాస్త్రిగారు ఉయ్యూరు విష్ణ్వాలయం లో సుందర కాండ చెబుతూ అంతా అయ్యాక ఆయన్ను సన్మానిస్తూ నన్ను మాట్లాడమంటే ఈ సర్గ శ్లోకాలు చదివి వినిపిస్తే ‘’అలాగా మాస్టారూ ‘’అని ఆశ్చర్యపోయారు .మల్లాది వారూ ఎక్కడా ఉటంకి౦చినట్లు లేదు .నాకెందుకో ఈ సర్గ పరమాద్భుతం అనిపిస్తుంది .సహజత్వానికి నిలువుటద్దం.వీనులవిందైన శబ్ద లాలిత్యానికి గొప్ప ఉదారణ .
అసలు ఈ మధువనం సీను ఎందుకు పెట్టాడు కవి ?ఎవరైనా ఏదైనా అద్భుత కార్యం సాధిస్తే ,పరీక్ష పాసైతే రాంకు వస్తే మాంచి ఉద్యోగం సంపాదిస్తే తన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవటం లోక రివాజు .స్వీట్,హాట్ టీ వగైరాలిచ్చి తృప్తి చెందుతారు .ఇంకా’’ ఖరీదైన ‘’వారు ‘’మందుపార్టీ ‘’చేసుకొంటారు .కాక్ టైల్ పార్టీ వగైరాలు చేస్తారు .ఇక్కడ కూడా అంతే.వానర విజయోత్సాహానికి తగిన’’ కిక్కు’’ రావాలి .అందుకే మధు వన విహారం .తేనే త్రాగటం .వనౌకసుల సహజ లక్షణం .తేనే తుట్టె దులిపి తేనే తాగటం .ఆ పనే వీళ్ళు చేశారు .మాత్తేక్కితే పిచ్చిప్రేలాపనలు ,చేష్టలు చేయటమూ సహజమే .అలాగే తమ జాతి లక్షణాలనీ ప్రదర్శించారు .ధిక్కారమూ సహజమే అదీచేశారు మత్తు గమ్మత్తులో .వద్దని వారించిన వారిని దుమ్మెత్తి పోయటమూ సహజమే .అదీ చూపించారిక్కడ. అన్నీ సహజ లక్షణ సుందర బంధురంగా ఉన్నాయి .ఆశ్లోకాలలో వాల్మీకు తేనే కారేట్లు రాశాడు .చదువుతుంటే మనకూ కిక్ వస్తుంది .చక్కని లయాత్మకమైన శ్లోకాలు .భావ సుందరాలు .మనోజ్ఞాలు .మధుమదురాలు .మరొక్క సారి మహర్షికి నమస్కరిస్తున్నాను ఈసర్గను సర్వతో మనోజ్ఞంగా తీర్చి దిద్దినందుకు .
హనుమ అంగద జాంబవంతాది’’ ఎల్డర్స్’’ ఈ మధువు జోలికి వెళ్ళినట్లు చెప్పలేదు .అనుచరుల సంతోషమే తమ సంతోషంగా భావించి ఉంటారు .కపులు తమ కపిత్వం తో వన ధ్వంసం చేయటం తప్పని పిస్తుంది .కానీ ఇక్కడ తప్పని విషయమే అది .ఆనందానికి పరాకాష్ట అది అని సర్దుకోవాలి .సుగ్రీవుడికి పరమానందం కలిగించేది,కుకనే మేనమామను ముసలివాడైనా జాగ్రత్త గా చూసుకొంటాడని కాపలాగా పెట్టాడు .అలాంటి దాన్ని ధ్వంసం చేస్తే సుగ్రీవుడు అగ్గిమీద గుగ్గిలం అవుతాడు .కానీ లెక్క చేయలేదు కపి మూక .తెలిసినా తమ విజయం ముందు ఈ తోట ధ్వంసం ఒక లెక్కా అను కొ౦టాడని తెలుసేమో వీరికి ? అసలు అంగద జాంబవంతులు కూడా కిమిన్నాస్తిగా మౌనంగా ఉండి పోయారు .ఏదో ఆంతర్యం వారికి తెలుసు అనిపిస్తుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-20-ఉయ్యూరు