సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -64
హనుమ వానరులకు ‘’జ౦కకండి మీ ఇష్టం వచ్చినట్లు మధువు తాగండి .మిమ్మల్ని అడ్డగించే వారిని నేను చూసుకొంటాను ‘’అనగానే అంగదుడు కూడా ‘’మీరు తేనే తాగండి ‘’అన్నాడు’’ తానా త౦దానా’’గా .’’ అని వారిద్దరూ అన్నదాన్నీ ‘’బాగు బాగు ‘’అంటూ ‘’భేష్ భేష్ అంటూ వానరులు ఆనందం వ్యక్తం చేశారు .హనుమ సీతఃను చూశాడని జాంబవంత అ౦గదులు మధువును గ్రోలమని అనుమతిచ్చారన్న సంతోషంతో మధువనం చేరి ,కాపుదార్ల ను విదిలి౦చి ,ఇష్టం వచ్చినట్లు తెనేత్రాగి పండ్లుకోసి తిన్నారు ,వనరక్షకులపై పడి బాదారు .’’తూమెడు తేనే తుట్ట’’లనుఒక్కొక్కడు చేత్తో పట్టుకొని తేనే అంతా తాగి ఖాళీ చేశారు .మిగిలినవాటిని త్రెంచి పారేశారు ,కొందరు విసిరేశారు ,మత్తుబాగా ఎక్కి ఆ తుట్టేలతోనే కొట్టుకున్నారు –
‘’మధూని ద్రోణ మాత్రాణి బాహుభిః పరి గృహ్యతే –పిబంతి సహితా స్సర్వేనిఘ్నంతి స్మతథా పరే ‘’
‘’కేచిత్ పీత్వా పవిధ్యంతిమధూని మధు పింగళాః-మధూ చ్ఛి స్టేన కేచిచ్చ జఘ్ను రన్యోన్య ముత్కటాః’’
మదించిన వానరులు కొందరు చెట్ల కింద చేరి ,కొమ్మల్ని పట్టుకొని మత్తు బాగా పెరిగి ఆకులు నేలపై రాల్చి వాటిపై పడుకొన్నారు .సంతోషంతో ఒకరినొకరు కింద పడేసు కొని తన్నుకొన్నారు ,తోసుకొన్నారు .కొందరు సింహనాదం చేస్తే ,కొందరు పక్షుల్లాగా అరచారు .మరికొందరు హాయిగా నేలపై పడి దొర్లారు –ఇవన్నీ కోతి చేస్టలే .చూస్తుంటే ముచ్చటగా ఉండేవే .
‘’ఉన్మత్త భూతాః ప్లవగా మధు మత్తా శ్చహృష్ట వత్ –క్షిపంతి చ తదాన్యోన్యం స్కలంతి చ తథాపరే’’
‘’కేచిత్ క్ష్వేళా౦ ప్రకుర్వంతి,కేచిత్ కూజంతి హృష్ట వత్ –హరయో మధునా మత్తాః కేచిత్ సుప్తామహీతలే ‘’
కొందరు పల్లెటూరి పనులు చేసి నవ్వుకొన్నారు .మరికొందరు అలాగే చేస్తూ నవ్వుకొన్నారు .మేమిలా చేశాం మేమలాగా చేశాం మేమిట్లా చేశాం మేము ఇలా చేస్తాం అని చెప్పుకొంటూ పగలబడి నవ్వుకొన్నారు-
‘’కృత్వా కేచిద్ధ సంత్య న్యే కేచిత్కుర్వంతి చేతరత్ –కృత్వా కేచి ద్వదంతనయే కేచిత్ ద్భుధ్యంతి చేతరత్’’
‘’’మధువానాన్ని కాపాడే వారు వానరుల ఆగడాలకు భయపడి నలుదిక్కులకూ పారిపోయారు .వాళ్ళను వెంబడించి మోకాళ్ళు పట్టి లాగి ,అపానద్వారం చూపగా భయం దుఖం తో దదిముఖుడి దగ్గరకెళ్ళి మొరపెట్టుకొన్నారు .అంటే చాలా మోటుగా ఉచ్చ నీచాలు లేకుండా కోతిమూక ప్రవర్తి౦చిందన్నమాట –రాయటానికే నాకుఇప్పుడు ఇబ్బందిగా ఉంటె అసలు ఆదృశ్యం చూస్తె ఎంత జుగుప్సగా ఉంటుందో ?-కానీ మా చిన్నతనాలలో మేము కూడా అవతలవాడిని ఏడిపించటానికి పోట్టిలాగు కిందికి జార్చి ‘’ముందు ,వెనక ‘’చూపిస్తూ నవ్వుకోవటం నాకు గుర్తే .మానవుడు కోతినుంచి దిగుమతి అయ్యాడు అనటానికి ఇదికూడా బలమైన సాక్ష్యమేమో ?
‘’జాను భిస్తు ప్రకృష్టాశ్చ’’దేవమార్గం ‘’ప్రదర్శితాః- అబ్రువన్ పరమోద్విగ్నా గత్వా దధిముఖం వచః’’
వనపాలకులు ‘’హనుమంతుని అనుమతి తో వానరులు మధువనం పాడు చేశారు .మమ్మల్ని మోకాళ్ళు పట్టి లాగి అపానద్వారం చూపించారు ‘’అనిసిగ్గు విడిచి చెప్పి గగ్గోలుపెట్టారు.ఆమాటలు విని ఓదార్ఛి ‘’నాతో రండి .మనం కలిసి మనబలం చూపించి అడ్డు కొందాం ‘’అని చెప్పి వాళ్ళతో కలిసి వనానికి వచ్చాడు .పెద్ద చెట్టు పీకి, చేత్తో పట్టుకొని కోతులపైకి వెళ్ళాడు .అనుచరులూఅనేక రకాల చెట్లు పీకి చేతులతో పట్టుకొని అలానే చేశారు.హనుమకు కోపం రాగా వానరులతోకలిసి వనపాలురందరిపై దాడి చేశాడు .అంగదుడు తనతాత దదిముఖుని కిందపడేసి ,చేతులతో కొట్టాడు బందుత్వం,ముసలితనం కూడా మరచి .ఈ దెబ్బలకు అతడు తట్టుకోలేక వివశుడై కాసేపు మూర్చపోయాడు –
‘’ఆర్యకం ప్రాహర త్తత్ర బాహూభ్యాం కుపితో౦ గదః ‘’
‘’స భగ్న బాహూరుభుజో విహ్వల శ్శో‘ణితోక్షితః -’ముమోహ సహసా వీరో ముహూర్తం కపికున్జరః ‘’
కాస్త తేరుకొని దదిముఖుడు మత్తెక్కివొడలు మరచిన ఆవానరులను దండం చేతబట్టి పారద్రోలాడు .అందుకే ‘’దండం దశ గుణం భవేత్ ‘’అన్నారు.దూరంగా పోయి అతడు తన సేవకులతో ‘’వాళ్ళ ఏడుపు వాళ్ళని ఏడవనియ్యండి .మనం రాజు సుగ్రీవుని వద్దకు వెళ్లి మనరాజుకు అంగదుడు చేసిన అపకారం అంతా చెబుతాను .అసలే సుగ్రీవుడికి కోపం ఎప్పుడూ తారాస్థాయిలో ఉంటుంది .మనం చెప్పినమాటవిని వీళ్ళందర్నీ చంపించి వేస్తాడు .ఈ వనం ఆయనకు చాలా ఇష్టమైనది తండ్రితాతలనుంచి సంక్రమించింది దేవతలకుకూడా చొరరానిది –
‘’సర్వం చైవాంగదే దోషం శ్రావ యిష్యామి పార్థివే-అమర్షీ వచనం శ్రుత్వాఘాతయిష్యతి వానరాన్ ‘’
‘’ఇష్టం మధువనం హ్యేతత్ సుగ్రీవస్య మహాత్మనః –పితృపైతాహం దివ్యం దేవైరపిదురాసదం ‘’
‘’సుగ్రీవుడికి ఈ తేనే తాగే వారు ,పోగాలం దాపురించిన వారు ఐన వానరులకు ,మిత్రులకు కూడా మరణ శిక్ష వేస్తాడు .సుగ్రీవాజ్ఞ పరమ భీషణమైనది .దాన్ని యెదిర్చి ఎవరూ బతికి బట్టకట్ట లేరు .రాజాజ్ఞ ధిక్కరించిన వీళ్ళకు చావు మూడుతుంది .అప్పుడు వాళ్ళ వల్ల బాధలుపడ్డ మన కోపం శాంతిస్తుంది ‘’అని వనపాలురను ఊరడించి, వారితో సహా దదిముఖుడు అమాంతం ఆకాశం లోకి యెగిరి క్షణం లో రాజు రామ లక్ష్మణ సుగ్రీవుల ముందు వాలాడు .మహాపరాక్రమశాలి ఐన అతడు దీనవదనం తో సుగ్రీవుని పాదాలకు ప్రణామం చేసి నిల బడ్డాడు ‘’
‘’’స వానరా నిమాన్ సర్వాన్ మధు లుబ్ధాన్ గతాయుషః-ఘాత ఇష్యతి దండేన సుగ్రీవఃససుహృజ్జనాన్ ‘’
‘’వాద్యా యేత్యే దురాత్మానో నృపాజ్ఞాపరిభావినః –అమర్ష ప్రభవో రోషఃసఫలో నో భవిష్యతి ‘’
‘’సన్నీ పత్య మహా వీర్యః సర్వైస్తైః పరి వారితః –హరి ర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః ‘’
‘’స దీన వదనో భూత్వా కృత్వా శిరశి చాంజలిం-సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ ప్రత్య పీడయత్ ‘’
ఇది 40 శ్లోకాల 62వ సర్గ .
ఇందులో వానరుల కోతి చేస్టల పొడిగింపూ,వాళ్ళ సభ్యత లేని ప్రవర్తన ,అంగదుడు తాత అని చూడకుండా ముసలి దధిముఖుడిని నేలపై పడేసి భుజాలతో పొడవటం కొంత హద్దుమీరిన ప్రవర్తన కనిపిస్తుంది .అంగద హనుమలు సుస్టుగా మధువు తాగమని ‘’ఫుల్ లైసెన్స్’’ ఇవ్వటం తో వానరులలో సీతాన్వేషణ సమయం లో కోల్పోయిన శక్తీ ,పొందిన అలసట దూరం చేసుకోవటానికి ఫుల్లుగా తాగి తాగుబోతుల వీరంగం సృష్టించారు .ఇంత చేస్తే కానీ వాళ్ళు మామూలు వానరులు కాలేక పోయారన్నమాట. సుగ్రీవుడికి పరమ ప్రీతిపాత్రమైన తరతరాలుగా దక్కిన మధు వనం పాడు చేయటం అంటే ఆయనకు తెలిస్తే ప్రాణాలు కోల్పోవటమే .బహుశా ఇంత దూరం ఆలొచి౦చి ఉండరు హనుమదాదులతో సహా .ఒక వేళ ఈ ఆనంద సమయం లో అవేవీ గుర్తుకు రాక పోయి ఉండవచ్చు .తెలిస్తే ఏం చేస్తాడే౦ అనే ధీమా కూడా కావచ్చు .తాము తెచ్చిన అత్యంత శుభ ప్రదమైన వార్త విని ,ఆయన ఈ చిన్న చిన్న విషయాలను పట్టించు కోడులే అనే భరోసా కూడా కావచ్చు .తాగితే బాగానే ఉంది వనద్వంసం ఎందుకు చేయాలి ?’’ఆనంద లహరి’’ కి అడ్డూ, ఆపూ ఉండవు .వేరేది ఏదీ కనిపించదు వినిపించదు.గుడ్డిలో మెల్ల జాంబవంత హనుమ అ౦గదులు మాత్రం ‘’తీర్ధం ‘’పుచ్చుకోలేదు .వానరుల ‘’ఎంజాయ్ మెంట్’’ ను హాయిగా వారూ ఆస్వాదించారు .వారి పర్మిషన్ ఉండబట్టే ఇంత తెగించారు .వాళ్ళు నాయకులు, మనకేమైనా అయితే వాళ్ళే చూసుకొంటారు అనే తెంపరితనం ఉండచ్చు.హనుమకూడా దధిముఖునిపైకి పోరాటానికి వెళ్ళటం స్వజన సంరక్షణలో భాగమే .
మేనమామ అయిన, వయసులో పెద్ద వాడు ముసలి వాడూ అయిన దదిముఖుడు రాజైన సుగ్రీవునికి పాద ప్రణామం చేసి ,మధు వనపాలకాధికారిగా నమస్కరించి సంస్కారం చూపాడు .తనపాలన ధర్మాన్ని కూడా సమర్దవంతం గానే నిర్వహించాడు మధువన సంరక్షణ విషయం లో .అయినా’’ తెగించిన వాడికి తెడ్డే లింగం ‘’అన్నట్లు బరితెగించిన ఆ కోతి మూక ను అడ్డుకోలేక విధ్వంసాన్ని ఆపలేకపోయాడు పాపం .వాళ్ళతోనూ, మనవడు అంగదుడి తోనూ దెబ్బలు కూడా తిన్నాడు విధి నిర్వహణలో .
సశేషం
తొలి (శయన )ఏకాదశి శుభాకాంక్షలతో
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -1-7-20-ఉయ్యూరు