సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65
దధి ముఖుని దీనవదనం చూసికలత చెందిన సుగ్రీవుడు ‘’ఎందుకు నా పాదాలమీద పడ్డావు ?లే .అభయ మిస్తున్నాను .అసలు విషయం ఏమిటో చెప్పు ‘’అన్నాడు .సుగ్రీవుని విశ్వసించి అతడు లేచి ‘’రాజా !నీ తండ్రి ఋక్ష రజస్సు కాలం లోకాని ,నీ పాలనలో కానీ ,నీ అన్నవాలి కాలం లోకానీ మధువనం ఎప్పుడూ ఇలా విధ్వంసం కాలేదు .ఇప్పుడు వానరులు మధు భక్షణ చేసి పాడు చేశారు .మధుపాన మత్తులో ఉన్న వాళ్ళను మన కాపలా వాళ్ళు బెదిరిస్తే లక్ష్యం చేయకుండా ఫలాలు కోసి తింటూ తేనే తాగుతూ ,త్రాగగామిగిలింది పారబోస్తూ ఉంటె అదలించగా వెక్కిరించారు .వనం లోని తేనే తాగద్దని మన రక్షకులు వారిస్తుంటే అంగదాదులు,మన వాళ్ళనే బెదిరించారు .కోపం తో వానరులు వీళ్ళందర్నీ తరిమేశారు .చేతులతో కాళ్ళతో కొట్టారు కొందరు అటూ ఇటూలాగి అపానద్వారం (దేవమార్గం )చూపించారు .నువ్వు పాలకుడవై ఉండగా ఈ శూరుల్ని వాళ్ళు కొట్టారు .వారి స్వేచ్చను అడ్డుకోలేక పోయాం ‘’అని పూస గ్రుచ్చినట్లు తెలియ జేశాడు –అపానమార్గానికి గౌరవప్రద నామం ‘’దేవమార్గం ‘’.తన్ను అంగదుడు కిందపడేసి కొట్టిన సంగతి చెప్పకుండా వదిలేశాడు ఎందుకో ?నీ పాలనలో ఇలా జరిగింది అని కొంచెం నిష్టూరంగా చెప్పినట్లు భావించాలి .అంటే రాజుకు కోపం తెప్పించే అన్నిరకాలమాటలూ చెప్పాడు –
‘’ప్రాణిభిర్నిహితాఃకేచిత్ కే చిజ్జానుభి రాహతాః-ప్రకృస్టాశ్చ యథా కామం ‘’దేవమార్గం ‘’చ దర్శితాః’’
సుగ్రీవునితో అతడు చెబుతుండగా లక్ష్మణుడు వచ్చి ‘’వనపాలకుడైన యితడు ఎందుకు వచ్చాడు .దుఖంతో నీకేమి చెప్పి ఏమికావాలని కోరాడు ?’’అని అడిగాడు .మాటల నేర్పరి సుగ్రీవుడు ‘’పూజ్య లక్ష్మణా!సీతాన్వేషణకు దక్షిణ దిశకు వెళ్ళిన వానర పుంగవులు తిరిగి వచ్చారని ,అంగదాదులు మధువన మదు భక్షణ చేశారని యితడు చెప్పాడు .ఇలా చేశారంటే వాళ్ళు కార్యం సాధించారనే అనిపిస్తోంది .అందుకే అంతటి ఉత్సాహం ప్రదర్శించి ఉంటారు .నా అనుమతి లేదని భయపడకుండా మధువన ప్రవేశం వారు చేశారంటే కార్య౦ సఫలంగా సాధించారనే అర్ధం .సందేహం లేదు –
‘’అంగదప్రముఖై ర్వీరైర్భక్షితం మధు వానరైః-విచిత్య దక్షిణా మాశామాగతై రహరి పుంగవైః’’
‘’నైషామకృత కృత్యానామీదృశఃస్యా దుపక్రమః-ఆగతై శ్చప్రమథితం యథా మధువనం హితైః
ధర్షితం చ వనం కృత్శ్న ముపయుక్తం చ వానరైః’’
‘’దృష్ట్వా దేవీ న సందేహో న చాన్యేన హనూమతాః’’
లక్ష్మణా ! సీతాదేవినే హనుమంతుడే చూశాడు .సందేహం లేదు. అతడికి కాక ఈకార్యసాధన ఎవరి వలన అవుతుంది ?అతడిలో వివేకం బుద్ధిసూక్ష్మత పట్టుదల ,పరాక్రమం ,విద్యా ది మహాగుణాలున్నాయి –
‘’కార్యసిద్ధి ర్మతి శ్చైవ తస్మి న్వానర పు౦గ వే-వ్యవసాయ శ్చవీర్యం చ శ్రుతం చాపి ప్రతి స్టితమ్’’
‘’ఏ పనిలో జాంబవంత , అంగదులు నాయకులుగా ఉంటారో ,వారికి హనుమ తోడుగా ఉంటాడో ఆ పని తప్పక నేర వేరి తీరుతుంది –
‘’జామ్బవన్యత్ర నేతా స్యా దంగద శ్చమహాబలః –హనూమాం శ్చాప్యధిస్టాతా న తస్య గతిరణ్య థా’’
‘’అంగదాదులు మధువనం పాడు చేసి ,వాళ్ళను వనపాలురు వారిస్తే ,వాళ్ళతో దెబ్బలులుతిన్నారు.ఈ విషయం నాకు నివేది౦చ టానికే రక్షకుడు దధిముఖుడు వచ్చాడు .సీతా దేవిని వానరులు చూశారు .బ్రహ్మ చే నా తండ్రి ఋక్ష రాజస్సుకు ఇవ్వబడిన ఈ దివ్య వన౦ లో పడి యధేచ్చగా తేనే తాగారంటే,వారి ప్రవృత్తిని ఊహించ వచ్చు .సీతా దేవిని చూడకపోతే మధువన ధ్వంసం చేసే వాళ్ళు కాదు ‘’అని చాలా సంతృప్త ప్రశాంత చిత్తంతో సుగ్రీవుడు రామానుజునికి నివేదించాడు –.ముందు మంత్రికి విన్నవించి తర్వాత రాజుకు చెప్పటం లోక సహజం .అందుకే ముందు రామానుజునికి చెప్పాడు .
‘’న చా ప్రదృస్ట్వ్యావైదేహీ౦ విశ్రుతాః పురుషర్షభ-వనం దత్త వరం దివ్యం ధర్ష యేయు ర్వనౌకసః ‘’ సుగ్రీవుని నోటినుండి వెలువడిన ఈ వీనుల విందైన పలుకులు విని రామ లక్ష్మణులు మిక్కిలి హర్షించారు –
‘’శ్రుత్వా కర్ణ సుఖాంవాణీ౦ సుగ్రీవ వదనా చ్చ్యుతాం-ప్రాహృష్యత భ్రుశం రామో లక్ష్మణ శ్చమహా బలః’’
తర్వాతసుగ్రీవుడు వనరక్షక దధిముఖునితో ‘’కార్య సాధకులై వచ్చిన అంగదాదులు మధు వనం లో మధు భక్షణ చేయటం విని సంతోషం కలిగింది నాకు .వారి చిలిపి చేష్టలు క్షమించదగినవే కనుక వారిని క్షమించాను .సీతా దేవిని చూసిన సింహ సదృశ బలపరాక్రమ వీరుడు హనుమను ,అతనితో వెళ్ళిన వానర వీరులను చూడాలని, వారు చేసిన ప్రయత్న విషయాలు వినాలని రామసోదరులు, నేను ఆసక్తిగా ఉన్నాం ‘’అన్నాడు .కార్యసిద్ధి తో సంతోషం తో పులకిట గాత్రం తో వికసించిన నేత్రాలతో ఉన్న రామ సోదరులను చూసి వానరరాజు సుగ్రీవుడు సంతోషించి ,రామ కార్యసిద్ధి అయిందని మిక్కిలిగా ఆనందించాడు –
‘’ఇచ్ఛామి శీఘ్రం హనుమత్ప్రధానాన్ –శాఖా మృగాంస్తాన్ మృగరాజ దర్పాన్ –ద్రస్టుం కృతార్ధాన్ సహా రాఘవాభ్యాం –శ్రోతుం చసీతాథిగమే ప్రయత్నం ‘’
‘’ప్రీతిస్ఫీతాక్షౌ సంప్ర హృ స్టౌకుమారౌ –దృష్ట్వా సిద్ధార్దౌ వానరాణాం చ రాజా అంగైస్సంహృస్టైః-కర్మ సిద్ధిం విదిత్వా –బాహ్వో రాసన్నాం సోతిమాత్రం ననంద’’
ఇది 28శ్లోకాల 63వ సర్గ
ఇందులో ఎక్కడికక్కడే అక్కడి ముఖ్య విశేషాలు చెప్పేశాను .దదిముఖుడు చెప్పినది సావధానంగా విన్నాడుకానీ సుగ్రీవుడు ,వానర విధ్వంసం తో వనరక్షణకు వారు పడిన కష్టం దుఖాన్ని మాటలతో ఉపశమనం కలిగించలేదు.హనుమంతుడు కార్య సిద్ధి చేసివచ్చాడు కనుకనే అంత విలయంసృస్టించారు వానరులు అని అర్ధం చేసుకొన్నాడు .వారినీ పల్లెత్తు మాట కూడా అనలేదు .తన ‘’మెజెస్టీ’’ ప్రదర్శించాడు .వారు సాధించిన మహా కార్యం ముందు తెనేతాగటం, వనం పాడు చేయటం ,కాపలా వారిని కొట్టటం వగైరా చాలా అత్యల్ప విషయాలని భావించాడు .అందుకే దధి ముఖుని సమక్షంలోనే వానరుల౦దర్నీ పొగిడాడు .వాడు మళ్ళీ అక్కడికి వెళ్లి ఏదో గిల్లికజ్జా పెట్టుకోకుండా .అందర్నీ క్షమించాను అనీ చెప్పాడు రాజే ఆ మాట అన్నప్పుడు ‘’కోన్కిస్కా’’ కాపలాదారు ఏం మాట్లాడుతాడు ?గమ్మున ఉండిపోవటం తప్ప .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-6-20-ఉయ్యూరు