ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996-
చర్ల నారాయణ శాస్త్రి వెంకమ్మ దంపతుల కుమారరత్నం .తండ్రీ ,తాత ఉద్దండ పండితులు ఉభయ భాషలలో .తండ్రివద్దనే సంస్కృతం తెలుగు హిందీ నేర్చి ,స్వయంగా బెంగాలీ ,ఇంగ్లిష్ గ్రీకు భాషాధ్యయనమూ చేసి ,బహు భాషా కోవిదులయ్యారు.తండ్రి వద్ద విద్య నేరుస్తూ కొవ్వూరు విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు .సహాయ నిరాకరణ ఉద్యమం కాలం లో శాస్త్రిగారు ఒక ఇంగ్లీష్ స్కూల్ లో చదువుతుండగా ,జాతీయ పాఠ శాల చూడటానికి వెడితే మాస్టారు కొట్ట గా ,ఆంగ్ల విద్యకు స్వస్తి చెప్పిన దేశాభిమాని .1929లో మహాత్మా గాంధీ ప.గోజి లో పర్యటన చేస్తూ చేసిన ఉపన్యాసాలకు ప్రభావితులై అప్పటినుంచి ,జీవిత పర్యంతం ఖద్దరు వస్త్రాలే ధరించారు .అభిమానం,ఆచరణ, దీక్షకు గొప్ప ఉదాహరణగా నిలిచారు.అప్పటినుంచి భారత జాతీయోద్యమం లో వీరి ప్రస్తానం కొనసాగింది .
1929-31లో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి ‘’ఉభయభాషా ప్రవీణ ‘’పట్టా అందుకొని ,తమ మామగారు వేదుల సూర్యనారాయణ గారి స్థానం లో తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1933నుంచి సంస్కృత పండితులుగా పని చేశారు .తర్వాత నిడదవోలు కు మారారు .అప్పుడు వీరిల్లు కాంగ్రెస్ వాదులకు పెళ్లి వారి విడిదిగా ఉండేది కోలాహలంగా .వృత్తిలో నిబద్ధత పాటించి, ఆదర్శ ఉపాధ్యాయులుగా గౌరవం పొందారు .స్వాతంత్ర్యోధ్యమ స్పూర్తి నరనరానా జీర్ణించి ,ఉద్యోగానికి స్వస్తి చెప్పి, సంఘ సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .
1940లో నిడదవోలు దగ్గరున్న ‘’సమిశ్ర గూడెం ‘’లో ఇల్లు కట్టుకొన్నారు .పోతన త్యాగయ్య ల స్పూర్తితో వ్యవసాయమూ చేశారు .ప్రతి రోజూ రాత్రి చేతిలో’’ లాంతరు’’ పట్టుకొని హరిజన వాడ కు వెళ్లి రాత్రి పాఠశాల నడిపారు .ఫ్లారెన్స్ నైటింగేల్ ప్రతి రోజూ అర్ధరాత్రి వేళ చేత్తో దీపం పట్టుకొని హాస్పిటల్స్ లోని రోగులను పరామర్శించి ‘’లేడీ విత్ ది లాంప్ ‘’అని పించుకున్నట్లే శాస్త్రిగారు ‘’మాన్ విత్ ది లాంప్ ‘’అయ్యారు .వీరి దీపం వారికి జ్ఞాన జ్యోతికి తోడ్పడింది .ఆమె దీపం బాధితుల ఉపశమనానికి దోహద పడింది .అస్పృశ్యతా నివారణకు శాయశక్తులా కృషి చేస్తూ మాటలతోకాక చేతలతో తన ఇంట్లో ఒక హరిజన యువకుడికి ఆశ్రయమిచ్చి ఆదర్శంగా ,మార్గదర్శి గా నిలిచారు.1942లో చాగల్లు జాతీయ పాఠశాలకు శాస్త్రిగారు కార్య దర్శి ,కోశాధికారి బాధ్యతలు సమర్ధంగా నిర్వహింఛి ,పేరు పొందారు .
మంచికీ మా వత్వాని కీ గొప్ప విలువనిచ్చిన శాస్త్రి గారు నిరాడంబర జీవితం గడిపారు .గాంధీ వినోబాల ఆదర్శాలకు ప్రభావితులై ఆ బాటలోనే నడిచి వారి ఆశయ సాధనకు తీవ్ర కృషి చేశారు .భూదాన యాత్ర ఉద్యమం లో వినోబా పగోజిలో పర్యటించినపుడు శాస్త్రిగారు తన 5ఎకరాల భూమి భావే కు దానంగా ఇచ్చారు .భూదాన ,సర్వోదయ సిద్ధాంత ప్రచారమూ నిర్వహించారు .స్వాతంత్ర్యం వచ్చాక వీరికి ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుడుగా చేసిన సేవలను గుర్తించి భూమిని ,పెన్షన్ ను గ్రాంట్ చేస్తే ‘’నా తల్లికి నేను చేసిన సేవకు వెల కడతానా ?’’అని నిస్వార్ధంగా త్యాగబుద్ధితో నిరాయకరించి ఉత్తములు, ఆదర్శప్రాయులు శాస్త్రి గారు .1950’’ఆర్ష విజ్ఞాన పరిషత్ ‘’స్థాపించి ,1953లో ‘’ఆర్ష గ్రంథ మాల ‘’కు శ్రీకారం చుట్టి ,’’లలితా ఆర్ట్స్ ప్రెస్’’ నెలకొల్పి తమ గ్రంథాలను వారే స్వయంగా ముద్రించుకొన్నారు .ఈ పరిషత్ ద్వారా జీవితాంతం ఆర్ష ధర్మ ప్రచారం చేశారు .
తమ 17వ ఏటనే రచనలు చేయటం మొదలుపెట్టిన శాస్త్రిగారు మొదట ‘’కాళీ శతకం ‘’రాశారు .తర్వాత వివిధ ప్రక్రియలలో 75 రచనలు చేశారు .స్వయంగా గొప్ప రచయితే అయినా అనువాద రచనకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు .ప్రాచీన సాహిత్యాన్ని ఆనాటి తరానికి సుబోధకంగా అందించాలనే తపన వారిది .వేద ,పురాణ విజ్ఞానాన్ని తెలుగులో అందించటానికి కృషి చేశారు .బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు తెలిగించి,అధ్యయనం చేసి అనుసరించి ఆ మార్గం లో జీవితాన్ని గడిపారు .రచనలపై సహజంగానే గాంధేయ ప్రభావం ఉంటుంది .తండ్రి నారాయణ శాస్త్రి గారి ‘’నారాయణీయా౦ధ్ర వ్యాకరణం ‘’కు వచనంలో ‘’నారాయణీయాంధ్రవ్యాకరణ వ్యాఖ్యానం,వివరణ ‘’రాసి తండ్రికి తగ్గ తనయులని పించారు.స్వాతంత్ర్య దీక్ష పద్యకావ్యం రాశారు .బుద్ధ చరిత్ర చంపూకావ్యం ,వర్ధమాన మహా వీర గ్రంథాలు అహింసా వ్రతానికి పట్టుగొమ్మలు .శాస్త్రిగారి ‘’మహాభారత మీమాంస ‘’ఉత్తమవిమర్శ గ్రంథంగా కవిపండిత విమర్శకుల మన్ననలు అందుకొన్నది.
గణపతి శాస్త్రిగారి ‘’అమృత గీతాంజలి ‘’వచన గేయ కవితా సంపుటి .లియో టాల్ స్టాయ్ నాటికకు అను సృజనగా సామ్యవాద భావాలతో ‘’చీకటిలో జ్యోతి ‘’రాశారు .’’రఘు వంశ లహరి ‘’పుస్తక పీఠికలో సూర్య వంశ చరిత్ర వివరంగా రాశారు .కాళిదాసకవి ‘’మేఘ సందేశం వీరి చేతిలో ‘’మొయిలు రాయబారం ‘’గా రూపు దిద్దుకొన్నది .వాల్మీకి రామాయణం ను ‘’గణపతి రామాయణ సుధ’’గా అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ అందుకొన్నారు.భగవద్గీతను ‘’తెలుగు గీత ‘’గా అనువాదం చేసి అది తనకు అత్యంత సంతృప్తికరమైన ,ఇష్టమైన గ్రంథంగా చెప్పుకొన్నారు .శాస్త్రిగారి రచనలపై పై శ్రీ బొడ్డేపల్లి ప్రసాదరావు పరిశోధన చేసి శాస్త్రిగారి మొత్తం రచనలు 75అని తేల్చారు .స్వతంత్రంగా నాటికలు గేయాలు బుర్రకధలు రాశారు .1961లో హైదరాబాద్ లో లలితా ప్రెస్ పెట్టి నిర్వహింఛి ,1979లో విశాఖకు మార్చారు .
క్లిష్ట సంస్కృత శ్లోకాలెన్నిటికో తేట తెలుగు పద్యాలురాసి పండితుల మన్ననలు అందుకొన్నారు .విజ్ఞానాత్మకం, కర్తవ్య బోధ గ్రంధ రచన ముఖ్య లక్షణంగా ఉండాలని భావించిన ఉత్తమ శ్రేణి రచయిత శాస్త్రిగారు .శాస్త్రిగారి సాహితీ సేవను గుర్తించిన ఆంద్ర విశ్వవిద్యాలయం వీరికి 1988లో ‘’కళాప్రపూర్ణ’’ తో సత్కరించి గౌరవించింది .1990 లో కేంద్ర సాహిత్య ఆకడేమి అవార్డ్ పొందారు .1995లో ఏలూరు’’ గుప్తా ఫౌండేషన్’’ సాహితీ పురస్కారం స్వీకరించారు .ఎన్నెన్నో ప్రతిష్టాత్మక సంస్థలకు సభ్యులుగా ఉన్నారు .
1976లో శాస్త్రిగారి ఏకైక కుమారుడు శ్రీ బుద్ధ నారాయణ శాస్త్రి విశాఖలో అకస్మాత్తుగా మరణిస్తే ,ఆవార్తవిని ఆయన తల్లి ,శాస్త్రిగారి సతీమణి శ్రీమతి సుశీలగారు కుప్పకూలిపోయి మరణించారు .ఈ రెండు దుర్ఘటనలకు ఏమాత్రం కుంగిపోకుండా ,స్థిత ప్రజ్ఞతతో నిల్చి ,విశాఖకు నివాసం మార్చారు .సాగర తీర విశాఖ లో ఆ రోజుల్లో శాస్త్రిగారులేని సాహిత్య కార్యక్రమం ఉండేదికాదు .చివరి దశలో విశాఖ రామకృష్ణాశ్రమం లో సంస్కృత బోధ చేస్తూ ,,యోగాసనాలు నేర్పిస్తూ ,కృష్ణాశ్రమం లో సారస్వత బోధ గావిస్తూ ,గోస్టులు ,వ్యాపకాలతో సవ్య సాచిలాగా గడుపుతూ 87ఏళ్ళ సార్ధక నిండు జీవితాన్నిగడిపిన చర్ల గణపతి శాస్త్రిగారు 15-8-1996 జీవితం లో చివరి స్వాతంత్రోత్సవ దినాన్నీ చూసి ,మర్నాడు పరమ పదించారు .సాహిత్యసేవ, సంఘసేవ శాస్త్రిగారికి రెండు కళ్ళు.గణపతి పేరును సార్ధకం చేసుకొన్న శిఖరాయమాన వ్యక్తి చర్ల గణపతి శాస్త్రి గారు .
‘’యోగి,జ్ఞాని ,గుణాతీతుడు ఆత్మ నిస్టుడు,స్థిత ప్రజ్ఞుడు వైరాగ్య భావన శాస్త్రిగారి గొప్ప లక్షణాలు .నడిచే గ్రంధాలయం ,మూర్తీభవించిన ఆర్ష విజ్ఞాన సర్వస్వం ,సంస్కృత సాహిత్య సింధు .దేశ భక్తీ , జాతీయభావం ,చిత్త శుద్ధి ,దీక్షా దక్షతకు మారుపేరు .వారి జీవితం నవతరానికి దివ్య సందేశం .నిగర్వి, నిరహంకారి, పరోపకార పారాయణుడు ,వితరణ శీలి సౌజన్య మూర్తి .సత్యమార్గ దర్శి .అవధులులేని మానవ సేవ ఆయన పరమావధి ‘’అని ఉత్తమ ప్రశంసలు అందుకొన్న శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారు ధన్యజీవి .గురు పూర్ణిమ సందర్భంగా ఈ ఉత్తమోత్తమ దేశికోత్తముని గురించి తెలుసుకొని మనమూ ధన్యులమయ్యాం .
సశేషం
గురుపూర్ణమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-20-ఉయ్యూరు
—