సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67
వానరులంతా అంగదుని ముందు పెట్టుకొని చిత్రమైన అడవులున్న ‘’ప్రస్రవణ గిరి ‘’కి వెళ్లి ,రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి సీతా వృత్తాంతం చెప్పటం మొదలెట్టారు .రావణుడుఅంతపురం లో సీత బంధింపబడినట్లు ,రాక్షసస్త్రీలు ఆమెను భయపెడుతున్నట్లు ,రామునిపై ఆమెకున్న అవ్యాజ అనురాగం , రాక్షసరాజు ఇచ్చిన రెండు నెలల గడువు విషయం హనుమనుంచి తాము విన్నది చెప్పారు .సీతా దేవి క్షేమం అని తెలిసి రాముడు ‘’సీత ఎక్కడ ఉంది ?నాపై ఆమె అభిప్రాయమేమిటి ?సీత గురించి అన్ని విషయాలు చెప్పండి ‘’అనగా వారంతా హనుమవైపు చూసి ఆయననే చెప్పమన్నారు –
‘’క్వ సీతా వర్తతే దేవీ కథం చమయివర్తతే –ఏతస్మే సర్వ మాఖ్యాత వైదీహీం ప్రతివానరాః’’
వానరుల సాభిప్రాయం గ్రహించి, ప్రాజ్ఞ హనుమ దక్షిణ దిశకు తిరిగి, సీతాదేవికి మొక్కి ,రాముడితో ‘’నేను నూరు యోజనాల పొడవైన సముద్రం దాటి ,సీతా దేవిని వెతుకుతూ ,దక్షిణ తీరం లో దురాత్మరావణపాలిత లంకానగరం వెళ్లి,అతడి అంతపురం లో నీమీదే మనసంతాలగ్నం చేసి, జీవిస్తున్న సీతాదేవిని చూశాను .ప్రమదావనం లో రక్కసి వనితలామెను కావలి కాస్తున్నారు .వారు మాటిమాటికీ భయపెడుతున్నారు .ఆమె సుఖం అనుభవించటానికి పుట్టింది .కాని దురంత దుఖం అనుభవిస్తోంది .ఒంటి జడతో దీనురాలై,నిన్నే తలుస్తూ అక్కడ బందీగా ఉంది .నేలపైనే నిద్రిస్తోంది .హేమంత తామర తీగలాగా ఆమె శరీరం కాంతి విహీనంగా ఉంది .రావణునిపై వైముఖ్య౦ తో చావటానికి నిశ్చయించిన ఆమెను ఎలాగో వెతికి కనుగొన్నాను .నేను ఇక్ష్వాకు వంశ కీర్తి ని మెల్లగా ప్రస్తుతించి ,ఆమెకు నాపై విశ్వాసం కలిగేట్లు చేయగలిగాను .
‘’ దుఃఖ మాసాద్యతే దేవీ తథాదుఖోచితా సతీ ‘’
రావణా౦తః పురే రుద్ధారాక్షసీభిస్సురక్షితా –ఏక వేణీధరా దీనా త్వయి చి౦తాపరాయణా’’
‘’అథ శ్శయ్యా వివర్ణా౦గీ పద్మినీవ హిమాగతే-రావణా ద్విని వృత్తార్థా మర్తవ్యకృత నిశ్చయా ‘’
‘’ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శనైః కీర్తి యతా నఘ –సా మయా నర శార్దూల విశ్వాస ముపసాదితా ‘’
నాపై విశ్వాసం కలిగి సీతాదేవి నాతో మాట్లాడింది.నీ పరిస్థిని కూడా సాకల్యంగా ఆమెకు తెలియజేశాను .రామ సుగ్రీవ మైత్రివిని చాలాసంతోషించింది .నీపై అచంచల ప్రేమ భక్తీ తో ఆమె ఉంది .నిరాహారంగా నీకోసం భయంకరతపస్సు చేస్తోంది !చిత్రకూటం లో జరిగిన కాకాసుర వృత్తాంతం జ్ఞాపకం చేయమన్నది .ఆమె స్వయంగానాకు ‘’అక్కడ నువ్వు ఏం చూశావో అక్షరం పొల్లుపోకుండా సుగ్రీవుడు కూడా వింటుండగా రాముడికి నివేది౦చు .నేను ఇప్పటిదాకా చాలాజాగ్రత్తగా దాచుకొన్న చూడామణిని నా రాముడికివ్వు.శ్రీమంతమైన ఈ చూడామణిని నేను ఎంతో శ్రద్ధగా కాపాడుకొన్నాను .పూర్వం ఒక సారి నా నుదుటి బొట్టు కరిగి నీకు కనిపిస్తే ,నువ్వు మణి శిల నా నుదుట బొట్టుగా ప్రతిఫలిం చేట్లు న నుదుట గుండ్రాతిపై ఉంచావు దాన్ని ఒక్కసారి స్మరించు .అనర్ఘ రాఘవా !సముద్రం లో పుట్టిన శ్రీమంతమైన చూడామణి నీ కోసం పంపాను .నేను ఇప్పటివరకు దుఖం లో దీన్ని చూసుకొంటూ నిన్ను చూసినంత ఆనందాన్ని అనుభవిస్తున్నాను .దాశరధ రామా !ఇంకా ఒక్కనెల మాత్రమె బతికి ఉంటాను .ఆతర్వాత ఈ రాక్షసులకు వశమై జీవి౦చనే జీవించను ‘’అని కృశాంగి ధర్మచారిణి సీత రావణ బందీయై నాతో చెప్పింది .రామా !ఆమె చెప్పింది అంతా ఆమె మాటలతోనే నీకు విన్నవించాను .ఇంకా ఆలస్యం చేయకుండా సముద్ర లంఘనం విషయం ఆలోచించు ‘’అని హనుమ సవివరంగా తెలిపాడు .తనమాటలు విని రామ సోదరులు ఊరట పొందారని గ్రహించి ,సీతాదేవి ఇచ్చిన చూడామణి ని రామునికి అందజేసి ,ఆమె చెప్పింద౦తా సవిస్తరంగా చెప్పాడు హనుమ .
‘’రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగమా ‘’
‘’నియతస్సముదాచారో భక్తిశ్చాస్యాస్తథా త్వయి –ఉగ్రేణ తపసా యుక్తా త్వద్భక్త్యా పురుషర్షభ ‘’అభిజ్ఞానం చ మే దత్తం యథా వృత్తంతవాన్తికే –చిత్ర కూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతి రాఘవ ‘’అయం చాస్మైప్రదాతవ్యో యత్నాత్ సుప్రరిరక్షితః-బ్రువతా వచనా న్యేవం సుగ్రీవ స్యోప శృణ్వతః-ఏష చూడామణిః శ్రీమాన్ మయా సుపరిరక్షితః’’
‘’మన శ్శిలా యా స్తిలకో గండ పార్శ్వేనివేశితః –త్వయా ప్రణస్టే తిలకే త్వంకిల స్మర్తు మర్హసి ‘’
‘’ఏష నిర్యా తితః శ్రీమాన్ మయాతే వారి సంభవః –ఏతం దృష్ట్వాప్రమోదిష్యే వ్యసనే త్వామివానఘ ‘’
‘’జీవితం ధార యిష్యామి మాసం దశరథాత్మజ –ఊర్ధ్వం మాసా న్న జీవేయ౦ రాక్షసా వశ మాగతా’’
‘’సర్వథా సాగర జలే సంతారః ప్రవిధీయతాం’’
‘’తౌజాతా శ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా –తచ్ఛాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ – దేవ్యా చాఖ్యాతాం సర్వమే వాను పూర్వ్యాత్ –వాచా సంపూర్ణం యాయుపుత్రః శశంస’’
ఇది 28 శ్లోకాల 65 వ సర్గ .
హనుమ లంక విశేషాలన్నీ చాలాసంక్షిప్త వివరంగా రాముడికి సుగ్రీవ సముఖంలోనే సీత కోరినట్లు తెలిపాడు .’’చూడామణి , మణి శ్శిలాఫలకం విషయాలు నెలకంటే ఎక్కువకాలం బ్రతకని విషయమ సీత చెప్పినట్లే డైరెక్ట్ స్పీచ్ తో హనుమ తెలియ జేసి రాముడికి సీత చెబుతున్న అనుభూతి కలిగించి గోప్పఎఫెక్ట్ తెచ్చాడు .తక్షణ కర్తవ్య పరాయణుడిని చేయటానికిది బాగా తోడ్పడింది .,చూడామణి మహాత్మ్యం చాలాగొప్పదని దాన్ని తాను ఇంతవరకు ప్రాణప్రదంగా తన పవిత్ర శీలంతో పాటు కాపడుకొన్నది సీత . అన్దుకెఆ విషయాన్ని నొక్కి వక్కా ణి౦చింది.దీనితోనైనా రాముడిలో చలనం కలుగుతుందని ,తనకు మోక్షం కలుగుతుందని ఆశించింది .ఆమె కోరినట్లే రామసోదరసుగ్రీవ సమక్షం లో అంద జేసి,దూత కార్యాన్ని అత్యంత సఫలం చేశాడు .సీత తనతో చెప్పిన కాకికథ తో సహా, మిగిలినదంతా హనుమ తాను తనకళ్ళతో చూసిన సర్వవిషయాలు రామాదులకు చెప్పాడు తక్షణ కర్తవ్యం సముద్రం దాటటం ఎట్లాగో ఆలోచించమని త్వర పెట్టాడు . ఇక తాను చేయవలసిందేమీ లేదు. రామసోదరులు, వానరరాజు సుగ్రీవుడి చేతుల్లోనే ఇక మిగిలింది అంతా ఉన్నది .ఇప్పటిదాకా హనుమ సఫల పవిత్ర రామకార్య దూత .ఇక తాను కేవలం వారి బంటు .వారేమి ఆలోచించి నిర్ణయిస్తే దాన్ని తూచా పాటిస్తాడు .కానీ సీతను లంక చెర విడిపించి రావణ సంహారం చేసి నెలలోపలె లంకనుంచి రాముడు తీసుకు రావాలి తప్పదు. ఇదే ఇప్పుడు అందరి తక్షణ కర్తవ్యమ్ .
సశేషం
గురు పూర్ణిమ శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-20-ఉయ్యూరు