సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69
రామ వాక్యాలు విన్న హనుమ ఆయన హృదయ వేదన అర్ధం చేసుకొని లంక లోని సీతా దేవి వృత్తాంతన్ని ఆమె తనకు చెప్పిన సందేశంలోని మాటలను వివరించి చెబుతున్నాడు –పురుష శ్రేస్థ రామా !సీతమ్మ చిత్ర కూటం లో జరిగిన సంగతి అంతా ఇలా చెప్పిందివిను చిత్రకూటం లో ఆమెఒకరోజు నీ దగ్గర సుఖంగా నిద్రి౦చి ముందుగా మేల్కొనగా ఒకకాకి అకస్మాత్తుగా వచ్చి ఆమె స్తనం పై గీరింది .తర్వాత నువ్వు ఆమె ఒడిలో తలపెట్టుకొని నిద్రింఛి నప్పుడు ఆ కాకి మళ్ళీ వచ్చి ఆమెను బాధించింది .అది ఆతర్వాత మాటిమాటికీ వచ్చి ఆమె స్తన ప్రదేశాన్ని ముక్కుతో పొడవగా గాయమై ,రక్తం స్రవించి నీ శరీరం తడిస్తే, నిద్ర లేచావు .ఆమె గాయాన్ని చూసి కోపించిన సర్పం లాగా ఆమెతో ‘’పిరికి దానా !నీ స్తనాన్ని గోళ్ళతో గీరిందెవరు?కోపించిన పంచముఖ సర్పం తో చెలగాటమాడింది ఎవరు ?’’అంటూ నాలుగు వైపులాచూసి ,వాడిగా ఉన్న రక్త సిక్తమైన గోళ్ళ తో ఆమెకు ఎదురుగా ఉన్న కాకినిచూశావు పక్షిశ్రేస్టమైన ఆ కాకి దేవేంద్రుడి కొడుకట.వాడు భూమ్మీద వాయు వేగంతో సంచరించగలవాడట.అప్పుడు నువ్వు కొపపు యెర్రని కనులతో ,ఆ కాకిపై క్రూరమైన ఆలోచన చేసి ,దర్భాసనం నుంచి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్ర మంత్రంతో అభి మంత్రించి వదిలితే అది మండుతున్న ప్రళయాగ్ని లాగా దానివైపు వెళ్లి కాకిని వెంటాడింది .కాకిని కాపాడలేక వాడి తండ్రి ఇంద్రుడు ,దేవతలు మహర్షులు దాన్ని రక్షించలేక వాడి ఖర్మకి వాడిని వదిలేశారు .మూడులోకాలూ తిరిగినా రక్షించేవారు లేక ,శత్రుదమనుడ వైనశరణాగతుడవైన నీ దగ్గరకే వచ్చింది ,
‘’కః క్రీడతి సరోషేణ పంచ వక్త్రేణ భోగినా –నిరీక్ష మాణ స్సహసా వాయసం సామవై క్షథాః’’
‘’సుతః కిల స శక్రస్య వాయసః పతతాం వరః –ధరాతరా౦చర శీఘ్రం పవనస్య గతౌ సమః ‘’
‘’తతస్తాస్మిన్ మహా బాహో కోప సమవర్తి తేక్షణః-వయసే త్వం కృథాః క్రూరాంమతిం మతిమతాం వర ‘’
‘’స దర్భం సంస్తరా ద్గ్రుహ్య బ్రహ్మాస్త్రేణ హ్యయోజయః –స దీప్త ఇవ కాలాగ్ని ర్జజ్వాలాభిముఖః ఖగం ‘’
క్షిప్తవా౦ స్త్వం ప్రదీప్తం హి దర్భం తమ్ వాయసం ప్రతి-తతస్తువాయసం దీప్తః సదర్భోనుజగామ హ’’
‘’స పిత్రాచ పరిత్యక్త స్సురై శ్చ సమహర్షిః-త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాది గచ్ఛతి-పునరేవాగత స్త్రస్త’’ స్త్వకాశ మరిందమ’’
భూమిపై నీ పాదాల చెంత పడిన ఆ కాకిని , చంపదగినదే అయినా దాన్ని దయతో కాపాడావు .నువ్వు ప్రయోగించిన అస్త్రం విఫలం కారాదు అని నువ్వు దానికి చెప్పగా ,దానికోరికపై దాని కుడి కంటిని దహించావు .బతుకు జీవుడా అనుకొంటూ అది నిన్ను మీ తండ్రినీ ప్రస్తుతించి నమస్కరించి ,తనమానాన తాను తననివాసానికి యెగిరి పోయింది –
‘’స తతం నిపత౦ భూమౌ శరణ్య శ్శరణా గతం –వదార్హమసి కాకుత్ స్థ కృపయా పర్యపాలయః ‘’మోఘమస్త్రం న శక్యం తు కర్తు మిత్యేవ రాఘవ భవాం స్తస్యాక్షికాకస్య హినస్తి స్మస దక్షిణం ‘’రామా త్వాం నమస్కృత్య రాజ్ఞే దశరథాయచ –విసృ స్టస్తుతదా కాకః ప్రతి పేదే స్వమాలయం ‘ రామా !సీతాదేవి ఇంకా ‘’ఇలా అస్త్ర విశారదుడు,శౌర్య ధైర్య పరాక్రమాల రాముడు రాక్షసులపై ఎందుకు అస్త్రాలు ప్రయోగించటం లేదు ?నాగ గ౦ధర్వ యక్ష మరుద్గణాలు కూడా రాముని ముందు యుద్ధం లో నిలువ లేరే ? అలాంటి పరాక్రమశాలి రాముడు రావణుడిపై అస్త్రప్రయోగం చేసియుద్ధం లో చంపాలి.శత్రు తపనుడు, నర శ్రేష్టుడు రఘువంశ మణి దీపం ఐన లక్ష్మణుడు అయినా అన్న అనుమతి తో నన్ను ఎందుకు రక్షించడు ? సమర్ధులైన ఆ రామ సోదరద్వయం అగ్ని వాయు తేజో సంపన్నులు .దేవతలకూ ఎదిరింప అసాధ్యులే ,మరి నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు .శత్రుసంహార సమర్ధతకల వారిద్దరూ నన్ను దయ చూడకపోవటం అంటే నేనేదో బలమైన పాపం చేశానేమో అనిపిస్తోంది ‘’అని కన్నీరు కారుస్తూ జానకి పలికింది జానకిరామా ‘’అన్నాడు తానూ దుఖిస్తూహనుమ –
ఏవం అస్త్ర విడం శ్రేస్టఃసత్వవాన్ శీలవానపి- కిమర్ధమస్త్రం రక్షస్సు న యోజయతి రాఘవః –‘’
‘’క్షిప్రం సునిశితైర్బాణై ర్హన్యతాంయుధి రావణః ‘’
‘’భ్రాతు రాదేశ మాజ్ఞాయ లక్ష్మణో వా పరంతపః –స కిమర్దం నరవరో న మాంరక్షతి రాఘవః ‘’
‘’శక్తౌ తే పురుష వ్యాఘ్రౌ వాయ్వగ్ని సమతేజసౌ-సురాణా మపి దుర్ధర్షౌకిమర్దం మా ముపేక్షతః’’
మమైవ దుష్కృతంకించి న్మహ దస్తి నసంశయః –సమర్ధౌసహితౌ యన్మాంనా వేక్షతేపరంతపౌ’’
రామా!వైదేహి అన్న ఆమాటలు విని నాగుండె చేరువై ఆమెకు ఉపశా౦తి కలిగించాలని ‘’అమ్మా !రాముడు నీ ఎడబాటు తో దుఖమనస్కుడై ఏపనీ చేయటం లేదు .అన్నను చూసి తమ్ముడూ అలాగే ఉన్నాడు .నేను ఎలాగో నిన్ను చూడగలిగాను .ఇక ఇది దుఖి౦ చాల్సిన సమయం కాదు .ఈ క్షణం లోనే నీ శోకం తొలగటం చూస్తావు .రామ సోదరులు ఇక్కడికి వచ్చి నిన్ను చూసి లంకను భస్మం చేస్తారు .భయంకర క్రూర దుస్ట రావణుడిని,అతని బంధుమిత్ర పరివారాన్నీ పరిమార్చి ,నిన్ను అయోధ్యకు తప్పక తీసుకు వెడతాడు .నేను నిన్ను చూసినట్లు నీ గుర్తు ఒకటి నాకు ఇవ్వు .అని అడిగాను ఆమె అన్ని వైపులా చూసి ఎవరూ చూడటం లేదని తెలుసుకొని తన జడకు ఆభరణమైన చూడామణి ని ‘’ కొంగు నుంచి తీసి ‘’నాకు ఇచ్చింది . ఆ అభిజ్ఞానాన్ని తీసుకొని శిరసువంచి నమస్కరించి ఇక్కడికి రావటానికి సన్నాహ పడ్డాను ‘’అన్నాడు రాముడితో హనుమ .-
‘’త్వ చ్ఛోక విముఖో రామో దేవి సత్యేన తే శపే –రామే దుఖాభిభూతేతు లక్ష్మణఃపరితప్యతే ‘’
‘’కథం ఛి ద్భవతీదృష్టా న కాలః పరి శోచితుం –అస్మిన్ముహూర్తే దుఖానా మంతం ద్రక్ష్యసి భామిని ‘’
‘’తా ఉభౌ నారా శార్దూలౌ రాజపుత్రా వని౦దితౌ –త్వద్దర్శన కృతోత్సాహౌ భస్మీకరిష్యతః’’
‘’హత్వా చ సమరే రౌద్రం రావణం సహబా౦ధవమ్ –రాఘవస్త్వాంవరారోహే స్వాం పురీం నయతేధ్రు వం ‘’
‘’తస్య రామో విజానీయా దభిజ్ఞాన మని౦దితే-ప్రీతి సంజననం తస్య ప్రదాతుం త్వ మిహార్హసి ‘’
‘’సా భి వేక్ష్య దిశ స్సర్వా వేణ్యుగ్రథితముత్తమం –ముక్త్వా వస్త్రా ద్దదౌమహ్యం మణి మేతం మహాబల ‘’.
రామా !ఇక్కడికి త్వరగా రావాలనే ఉత్సాహంతో శరీరం పెంచిన నన్ను చూసి సీతమ్మ కన్నీటితో ‘’హనుమా !రామలక్ష్న్మణ సుగ్రీవుని అతని మంత్రులను కుశలం అడిగానని చెప్పు .రాముడు ఈ దుఖసాగరాన్నించి నన్ను దాటించేట్లు నువ్వు సన్నాహం చెయ్యి .రాముడినికలిసి పెల్లుబికే నా దుఖాన్ని ,రాక్షస్త్రీలు పెట్టె బాధల్ని భయాన్ని ఆయనకు తెలియజేయి .నీ ప్రయాణం సుఖంగా జరుగు గాక !’’అని చివరిసారిగా నా వీడ్కోలు దుఖాన్ని భరిస్తూ గుడ్ల నీరు కుక్కుకొంటూ దీనాతి దీనంగా పలికింది .పూజ్య రామా !ఇలా అత్య౦త విషాదం తో నీ భార్య పలికి౦దయ్యా .నేను చెప్పిందంతా యోచించి ,సీత సమగ్రంగా క్షేమగానే ఉన్నదని నమ్ము ,విశ్వసించు ‘’అన్నాడు రామదూత పవనసుత హనుమ’’-
‘’హనుమాన్ సింహ సంకాశా ఉభౌ రామ లక్ష్మణౌ-సుగ్రీవంచ సహామాత్యం సర్వాన్ బ్రూయా హ్యనామయం ‘’
‘’యథా చ మహా బాహూ ర్మాంతారయతి రాఘవః –అస్మాద్దుఖాంబు సంరోధాత్వం సమాధాతు మర్హసి ‘’
‘’ఇమ౦ చతీవ్రం మామ శోక వేగం –రక్షోభి రేభిః పరి భర్త్సనం చ –బ్రూయాంతు రామస్య గతస్సమీప౦ –‘’శివశ్చ’’ తే ధ్వాస్తు హరి ప్రవీర’’
‘’ఏ తత్తవార్యా నృపరాజ సింహ-సీతా వచః ప్రాహ విషాద పూర్వకం-ఏతచ్చ బుద్ధ్వా గదితం మయాత్వం –శ్రద్ధత్స్వ సీతాంకుశలాం సమగ్రా౦’’
ఇది 37శ్లోకాల 67 వ సర్గ .
రాముడు సమగ్రంగా లంకలో జరిగినది అంతా తెలియ జేయమంటే హనుమ అంతా ‘’సినేమా రీలు’’లేక నేటి వీడియోలాగా లాగా చెప్పి చూపించాడు .ఎందుకింత హైరానా ,టెన్షన్ రాముడికి ?సీత అక్కడ ఏ రూపం లో ఉందొ అసలుందో లేదో ,ఈ కోతి నిజంగా చూశాడో లేదో ,చూస్తె ఆమెను గుర్తుపట్టాడో లేదో , మాట్లాడాడో లేదో ,ఆమె అసలు తనకోసం ఎదురు చూస్తుందో లేదో ,వస్తాననే నమ్మకం కలిగిఉందో లేదో ,తన శౌర్య పరాక్రమాలు గుర్తున్నాయో లేదో ,ఏదో కాకమ్మ కబుర్లు చెబుతున్నాడేమో,అభిజ్ఞానమైన చూడామణి ఆమెదో కాదో లాంటి సవా లక్ష సందేహాలతో సతమతమై నిగ్గు తేల్చుకోవాలని అంత తపన పడ్డాడు రాముడు .ఆమె తన రాకకోసం రావణ సంహారం కోసం నిరీక్షోందా లేదా అనేసదేహమూ తీరాలి .అప్పుడే కదా తక్షణ కర్తవ్యం తాను ఆలోచించాలి లేకపోతె కుక్క తోకపట్టుకొని గోదారి ఈదినట్లవుతుంది .ఇవన్నీ కన్ఫర్మ్ అవ్వాలి .
హనుమకు భయమేముంది ?అత్యంత వినయ సౌశీల్యగుణమున్న ఉన్నవాడు నిజమైన రుజు ప్రవర్తన ఉన్నవాడుకనుక బొ౦కాల్సిన అగత్యం అవసరం ఆయనకేముంది ?అందుకే యుట్యూబ్ లో కాంటా సుబ్బారావు లాగా ‘’కుండ బద్దలు కొట్టి ‘’నట్లు ప్రతిమాటా చెప్పాడు .ఆమె శీల పవిత్రత చెప్పి రాముని నిజగుణ గరిస్టతను, సీతా విరహవేదననూ ఆమెకు చెప్పి సమన్యాయం చేశాడు .నవవ్యాకరణ పండితుడా మజాకానా ? కాకాసుర వృత్తాంతం పరమనాటకీయంగా ప్రదర్శింఛి గొప్ప ఎఫెక్ట్ కలిగించాడు .రాముడి మనసులో ఉన్న ,ఇతరులకు చెప్పలేని ,ఇతరులతో పంచుకోలేని ధర్మ సందేహాలన్నీహనుమ సీతమ్మ మాటలతో తీర్చుకొన్నాడు .ఇక్కడ హనుమ మరో ఉషశ్రీ యో, మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారో అనిపించాడు .
రాముడుకూడా ‘’కడుపు నిండా ‘’సీతా వియోగ దుఖాన్నిఏడ్చి ఏడ్చి తీర్చుకొన్నాడు .దుఖం పొతే సుఖమే కదా వచ్చేది ?ఆ సుఖం రాముడికీ సీతకూ అతిత్వరలోనే నెలరోజులలోపలే రాబోతోంది ‘’ సీతాపహరణ కథ ‘’సుఖా౦త మౌతోంది .అందరి కన్నీటికి తెర పడ బోతోంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-20-ఉయ్యూరు