శాంత సౌజన్య సంస్కార మూర్తి శ్రీ శంకర్
శంకర్ అని అందరూ ఆప్యాయంగా పిలిచే అంతర్జాతీయ పోర్ట్రైట్ చిత్రకారులు శ్రీ సత్తిరాజు శంకరనారాయణ గారు 84వ ఏట నిన్న 9-7-20గురువారం హైదరాబాద్ లో మరణించారన్న ఇవాల్టి ఆంధ్రజ్యోతి వార్త చదివి బాధ పడ్డాను .వారితో నాకు ఎనిమిదేళ్లుగా సాహితీ అనుబంధం ఉంది .సరసభారతి పుస్తకాలు బాపు రమణ ల గారితో పాటు చెన్నై తిరువన్మయూర్ లో ఉంటున్న శంకర్ గారికి కూడా పంపమని ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి సూచనమేరకు 2012నుంచి పంపిస్తూనే ఉన్నాను .అందగానే వారు ఫోన్ చేసి చెబుతూనే ఉన్నారు .ఒక వేళ వారు మద్రాస్ లో లేకపోతే ,పుస్తకాలు అందాయని అక్కడి వారు జాగ్రత్త చేశారని తానూ వెళ్ళాక తీసుకొంటాననీ చెప్పే సౌజన్యం శంకర్ గారిది .మొదట్లో ఫోన్లో తాను బాపు గారి తమ్ముడు శంకర్ అని పరిచయం చేసుకొని మరీ మాట్లాడేవారు .గోపాలకృష్ణ గారితోనూ మాంచి పరిచయమే ఉండేది బాపు రమణల గారితో పాటు .శంకర్ వేసిన తన పోర్ట్రైట్ ను నాకు మైనేని గారు పంపిస్తూ దాన్నే తానూ అన్నిటికీ వాడుతున్నానని ఆరాధనా భావం గా చెప్పారు అంతబాగా వచ్చింది చిత్రం .ఆతర్వాత నేను అడగకుండానే నా చిత్రమూ గీసి పంపిన సహృదయులు శంకర్ గారు .
ఇలా కొనసాగుతున్న మా సాహితీ బంధుత్వం తో నేను చొరవ తీసుకొని 2019 సరసభారతి ఉగాది వేడుకలలో పురస్కారం అందజేస్తాం రమ్మని ఫోన్ లో ఆహ్వానించాను .’’బాపుగారిని మీలో చూసుకొంటాం .తప్పక అంగీకరించి విచ్చేయండి ‘’అని ఆహ్వానించాను .తన వయసు ప్రయాణానికి సహకరించటం లేదని కనుక రాలేనని చెప్పారు .వారు వస్తే బాపు గారిని సన్మానించుకోలేక పోయిన అదృష్టం వీరి సన్మానం తో తీరుతుందని భావించాను .వారి రాలేని అశక్తత ను కాదన లేకపోయాను .హైదరాబాద్ లో శ్రీ శంకర్ గారికి తమ అన్నగారు బాపుగారి పురస్కారం అందించినపుడు మనసారా అభినందించి ఫోన్ చేసి మెయిల్ కూడా రాశాను రెండిటికీ వారు చక్కగా స్పందించారు వినయంగా .
అంతకు నాలుగేళ్ల క్రితమే వాగ్గేయకారులపై తాము చిత్రించిన చిత్రాల పుస్తకం నాకు పంపారు .ఆనందంగా అందుకొని ధన్యవాదాలు చెప్పాను. మెయిల్ లో .ఒక సారి వారు మెయిల్ రాసి ‘’మీకు అభ్యనతరం లేకపోతె నాపుస్తకాలు కొన్ని మీకు పంపితాను వాటిని మీ లైబ్రరీలో అందజేయగలరా ?’’అని కమ్మని ఆంగ్లం లో రాశారు .వారెప్పుడు రాసినా ఇంగ్లీష్ లోనే రాస్తారు .మహద్భాగ్యంగా అందజేస్తానని తెలియజేయగా, వారు పంపటం, నేను ఉయ్యూరు లైబ్రరీలోలో ఇచ్చి ,లైబ్రేరియన్ కు అందజేసిన ఫోటోలుకూడా వారికి పంపాను .దీనికి పరమానందం పొందారు శంకర్ .’భోళాశంకరులు’’ అనిపించింది .
ఈ మధ్య ఫేస్ బుక్ లో వారి పోర్ట్రైట్ లను నిత్యమూ చూస్తూ అందులోని పర్సనాలిటీలపై ,నా వారి చిత్ర నైపుణ్యం పై నా కామెంట్స్ సర్వ సాధారణ మయ్యాయి .ఒకటి రెండు చిత్రాలలో వ్యక్తుల స్వరూప స్వభావాలు రాలేదని కామెంట్ కూడా చేశాను .దాన్ని స్పోర్టివ్ గా తీసుకొని ,అది తనకు దొరికిన పాత ఫోటో ఆధారంగా గీసిందనీ లేటెస్ట్ గా గీశాను మళ్ళీ చూడమని వెంటనే స్పందించటం నన్ను మహ దానంద పరచింది. వారిలోని సంస్కారానికి నమస్కరించాను .ఆర్టిస్ట్ ఎవరైనా తానూ వేసిన బొమ్మ బాగులేదని అంటే సహించటం చాలా కష్టం . ఒక వేళ శంకర్ గారి చిత్రం ఏ కాకారణం వల్లనో ఫేస్ బుక్ లోనేను చూసి అకామేంట్ చేయక పొతే, ఆమర్నాడు విడిగా నాకు మెయిల్ లో పంపేవారు .ఇలాంటి వారు ఉంటారా అనిపిస్తుంది .
ఈ సందర్భంగా శంకర్ గారు కిందటి నెల మొదట్లో నాకు మెయిల్ రాస్తూ కర్నాటక లో ఒక మేగజైన్ కవుల రచయితల ప్రసిద్ధ వ్యక్తుల జయంతి , వర్ధంతి నాడు తన చిత్రాలను ప్రచురించి వారికి ఘననివాళి అర్పిస్తోందని చెప్పి మనతెలుగులో ఇలా కవుల రచయితల ప్రసిద్ధ వ్యక్తుల పుట్టిన రోజు మరణతేదీ లున్న పుస్తకం ఏదైనా ప్రచురితమైనదా ‘’అని అడిగారు .నేను వెంటనే ‘’అలా ఉన్నట్లు నాకు తేలేదు .సుమారుగా పదేళ్ళ క్రితం శ్రీ జివి పూర్ణ చ౦ద్ నాకు ఫోన్ చేసి తయారు చేయమని కోరితే రెండు రోజుల్లో సుమారు వందమంది పై రాసి ఆయనకే పంపానని, దాన్ని కొంతకాలం నడుస్తున్న చరిత్ర మాసపత్రిక అనుసరించిందని ,ఇప్పుడు ఆలిస్ట్ నా దగ్గర లేదనీ చెప్పాను .ఆయన ఇంటరెస్ట్ నన్ను కదిలించింది .మళ్ళీ నేనే సుమారు 20మంది పుట్టిన గిట్టిన తేదీలు సేకరించి వెంటనే శంకర్ గారికి పంపాను .నిజంగా ఆయనకు ఇది అక్కరలేదు .ఆయన చిత్రాలన్నీ ఈ తేదీల లను అనుసరించి గీసినవే .
బహుశా కిందటి డిసెంబర్ లో ననుకొంటా రమణగారిశ్రీమతి శ్రీమతి శ్రీ దేవి దేవి గారు రాసిన రామాయణ రమణీయం పుస్తకం నాకు పంపారు .వెంటనే చదివి మెయిల్ రాయటమే కాక దానిపై ఆర్టికల్ కూడా నెట్ లో రాస్తే ,చదివి శ్రీదేవిగారికి కూడా చదివి వినిపించాననీ ,ఆమెకు వాట్సాప్ లో పంపానని చెప్పిన అల్పసంతోషి .శ్రీదేవిగారు నా ఆర్టికల్ చదివిసంతోషంగా ఫోన్ చేసి మాట్లాడారు .అప్పటిదాకా శంకర్ గారి అమ్మాయిని రమణ శ్రీదేవి గార్ల అబ్బాయి ప్రముఖ టివి సీరియల్స్ నిర్మాత రచయిత ‘’వరముళ్ళపూడి’’ గారికిచ్చి వివాహం చేశారని ,శంకర్ గారు వారికి వియ్యంకులనీ నాకు తెలీదు .అప్పటినుంచి శ్రీదేవిగారుకూడా నాతో ఫోన్ లో మాట్లాడటం శంకర్ గారి సౌజన్యమే .
సరసభారతి శ్రీ శార్వరి ఆవిష్కరణ మూడు పుస్తకాలు జూన్ మొదటివారం లోనే శంకర్ గారికి పంపాను .అందగానే యథా ప్రకారం ఫోన్ చేసి అందాయని చెబుతూ ‘’ఈ సారి మీరు పుస్తకాలు ప్రచురిస్తే అందులో నేను గీసిన చిత్రాలేమైనా కావాలంటే నేనే మీకు పంపిస్తాను .ఎవరివైనా అందులో చిత్రాలు వేయాలంటే నేనే వేసి నేనూ మీ సరసభారతి సాహిత్య సేవలో పాలు పంచుకొంటాను మొహమాట పడకండి ‘’అని కమ్మని తెలుగులలో అతి ప్రశాంత వాక్కులతో అత్యంత శుద్ధ మనస్సుతో చెప్పిన వినయ వివేకశాలి శంకర్ గారు .’’అలాగే ఈ సారి తప్పక మీసేవలనూ సరసభారతి వినియోగించుకొంటు౦ది .మీ సహృదయత కు ధన్యవాదాలు ‘’అని చెప్పాను .బాపూ గారబ్బాయి పేరు వెంకటరమణ గారేనాని అడిగితె అవునని చెప్పిబాపుగారిల్లు డెవలప్ మెంట్ కు ఇచ్చారని అబ్బాయి ఆ యింటి ప్రక్కనే తమ సోదరి ఇంట్లో ఉంటున్నారని బాపుగారి అడ్రస్ కు పుస్తకాలుపంపితే వారే అందజేస్తారనీ చెప్పారు ఫోన్ లో .అలాగే నేనుపంపటం బాపుగారబ్బాయి అందాయని ఫోన్ చేసి చెప్పటం జరిగింది .బాపు గారు వారి అబ్బాయి గారు ,తమ్ముడు శంకర్ గారు, రమణగారు వారి శ్రీమతి శ్రీదేవి గార్లు అందరూ గొప్ప సంస్కార శీలురే .బహుశా రామాయణం చదివి అనుసరిస్తూ ఆసుగుణాలు పుణికి పుచ్చుకొని ఉంటారనిపిస్తుంది నాకు .
సుమారు 20 రోజులక్రితం శ్రీదేవిగారుఫోన్ చేసి శంకర్ గారికి నేనుపంపిన ఊసుల్లో ఉయ్యూరు పుస్తకం చదివాననీ ,చాలా బాగా ఉందనీ తన చిన్నప్పటి ఆరుగొలను సంగతులన్నీ మళ్ళీ తన కళ్ళముందు కదలాడాయని చెబుతూ ,నేను రమణ గారిపై రాసిన ‘’హాస్య రమారమణుడు ‘’వ్యాసం గొప్పగా ఉందని దాన్ని రాజమండ్రిలో శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యంగారు ఆయన స్నేహితుడెవరో చదివి బాగుందని చెప్పి పంపితే తన ‘’గోదావరి ప్రభ ‘’మార్చి మాసపత్రికలో ప్రచురించి తనకు పంపారని చెప్పటం ,ఆతర్వాత సుబ్రహ్మణ్యంగారు నాతో మాట్లాడటం ,దాన్ని నాకూపంపటం గురించి ఇదివరకే రాశాను చర్విత చర్వణం చేశాను .ఈ సందర్భంలోనే శ్రీదేవిగారు శంకర్ గారికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో ఉన్నారని చెప్పారు .నేను వెంటనే శంకర్ గారికి మెయిల్ రాసి త్వరలో కోలుకోవాలని కోరాను .ఇవాళ పేపర్ లో వారి మరణవార్త చూసి బాధపడ్డాను .ఇవాళ ఉదయం శ్రీదేవిగారు ఫోన్ చేసి ఈ విచారకరవార్త తెలియజేశారు .ఉదయమే జ్యోతి పేపర్ చూసి తెలుసుకొని అందరికీ ఆ విషయాలు పంపానని చెప్పాను . ఇంకా ఎన్నో అవార్డ్ లు పొందాల్సిన మహా వ్యక్తీ శంకర్ గారు .శంకర్ గారు ఇంత సాధారణంగా గా ఉండటం చూసి ఆయనేదో సాధారణ చిత్రకారులే లే అనుకున్నాను .తీరా నెట్ లో వెతికితే వారి మహోత్కృష్ట స్థితి చూసి దిమ్మతిరిగిపోయింది .సూక్ష్మ౦గా ఆ వివరాలు తెలియ జేస్తాను
ఆకాశవాణిలో 1963 నుండి కొలువులో ఉండి, అనేక విధాలుగా సేవలందించి 1995 లో చెన్నై స్టేషను డైరెక్టర్ గా పదవీ విరమణ చేశాక, తనకు ఆసక్తి ఉన్న చిత్రకళా రంగంలో కృషి చేస్తున్నారు. పలు రంగాలలో ఉన్న ప్రఖ్యాత భారతీయ వ్యక్తుల చిత్రాలను గీస్తూ, పలువురి మన్ననలందుకున్నారు. 2008 లో హాసరేఖలు అనే పుస్తకం, శంకర్ గీసిన 80 మంది ప్రఖ్యాత భారతీయుల చిత్రాలతో, హాసం ప్రచురణలు వారిచే ప్రచురించబడింది. శంకర్ బొమ్మల కొలువు అనే పేరుతో, శంకర్ చిత్రాలు అక్టోబరు 2011 లో, హైదరాబాదు లోని ICCR Art Gallery రవీంద్రభారతిలో ప్రదర్శించబడ్డాయి.పెన్సిల్ తోనూ, చారోకోల్ తోనూ అనేకమంది ప్రముఖుల క్యారికేచర్ లు చిత్రించారు.దాదాపు 1500 కు పైగా అటువంటి అద్భుతమైన బొమ్మలు వేసి ఆయన ఇటీవలే’’ ఇండీయన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’’ లో స్థానం పొందారుకూడాను.
శ్రీ శంకర్ ప్రతిభను గుర్తించి ‘తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్’ లో కూడా స్థానం ఇస్తూ ధ్రువీకరణ పత్రాన్ని 2014 లో అందజేసింది..
శంకర్ గారి ఆత్మకు శాంతికలగాలనీ కోరుతూ ,వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-20-ఉయ్యూరు