మళ్ళీ పేస్ బుక్ లో లైవ్
సాహితీ బంధువులకు శుభకామనలు — సుమారు రెండు నెలల క్రితం నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత తెలుగుశాఖాధ్యక్షులు ,నాకు మిక్కిలి ఆత్మీయులు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు ఫోన్ చేసికుశలప్రశ్నల అనంతరం ”ప్రసాద్ గారూ !ఎందుకో మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తున్నాను . కొత్తపుస్తకాలేవైనా తెచ్చారా ఉగాదికి ?మీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయా” ?అని అడిగారు .మూడు పుస్తకాలు ఉగాదికి తెచ్చినవైనం కరోనా లాక్ డౌన్ లో వాటిని మాస్వామి పాదాలవద్ద ఉంచి ఆవిష్కరించిన విషయాలన్నీ చెప్పి ఈ హడావిడి అయ్యాక మీకు పంపిస్తాననని చెప్పాను .కొత్త రచనలేమైనాచేస్తున్నారా అంటే లిస్ట్ చదివాను .వారు అత్యంత ఆప్యాయంగా ”మీ జీవిత చరిత్ర రాశారా ?”అని ప్రశ్నిస్తే నెట్ లో ”నాదారి తీరు ”పేరుతో సుమారు 150ఎపిసోడ్ లు నా రిటైర్ మెంట్ దాకా ధారావాహికగా రాశానని చెప్పాను .వారు చాలా సంతోషించి ”అక్కడినుంచి ఇవాళ్టి వరకు కూడా త్వరలో రాయండి .మొత్తం పుస్తకరూపం లో వచ్చే ఉగాదికి విడుదల చేయండి ”అన్నారు ఒకరకమైన ఆదేశంగా . ప్రస్తుతం అంత ” దృశ్యం ”లేదని మనసులోనే అనుకోనిమర్యాదగా ” సరే ”అని అన్నాను . .
నాజీవితం గురించి రాస్తే మా కుటుంబం వారికైనా విషయాలు తెలుస్తాయని సుమారు పాతికేళ్ల క్రితం శీర్షిక ఏం పెట్టాలా అని తర్జన భర్జన పడి ”అనంత కాలం లో నేనూ ”అని పెట్టి నా 1993పాత డైరీలో 25-2-1995 న మొదలుపెట్టి ,మధ్యమధ్యలో రాస్తూ 26-6-2008వరకు నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఇంటర్ చదువు పూర్తయ్యే దాకా రాసి పారేశాను . దీన్ని నేనే చదివి వాయిస్ రికార్డ్ కూడాచేశాను .అది ఎక్కడుందో తెలీదు .ఈ డైరీ ఆతర్వాత చాలాకాలం నాకు కనిపించలేదు .సుమారుగా ఏడాది క్రితం అన్నీ వెతుకు తుంటే దొరికితే ”హ మ్మయ్య ”అనుకు ని భద్రంగా దాచుకున్నాను.
ఆతర్వాత జీవితం గురించి రాయాలని శీర్షికగా ”నా దారి తీరు ”అనిపెట్టి డిగ్రీ చదువు బీఎడ్ ఉద్యోగం ,ఉద్యోగ విశేషాలు ,అందులో నేను చేసిన ప్రయోగాలు నా పదవీ విరమణ వరకు సుమారు 150 ఎపిసోడ్ లు రాశాను నెట్ లో . ఇవన్నీ మీకు తెలిసినవే .ఆచార్యులవారు ఆదేశించినట్లు ఆఫ్టర్ రిటైర్ మెంట్ విషయాలు రాయాలంటే ఇంటర్ వరకు రాసింది కూడా నెట్ లో ముందు రాయాలి .కానీ ఇప్పుడు అంత ఓపిక తీరిక లేదు .కనుక పేస్ బుక్ లో లైవ్ గా చదివి రికార్డ్ చేద్దామని అనుకొంటున్నాను .
ప్రస్తుతం ప్రపంచ దేశాల సారస్వతం పై మనసంతా ఉంది 126దేశాల సాహిత్యం నిన్నటికి రాశాను . 150 దేశాలవరకు రాసి ,కొంతవిరామం ఇచ్చి ,ఆతర్వాత పైన చెప్పిన పని చేయాలనుకొంటున్నాను .
శ్రావణమాసం మొదటి రోజు మంగళవారం 21-7-2020ఉదయం 10గంటలకు ”అనంతకాలం లో నేనూ” ధారావాహిక ”పేస్ బుక్ లో లైవ్ ”ప్రారంభిస్తాను . ఇందులో కొన్ని ఊసుల్లో ఉయ్యూరు ,మరికొన్ని సరసభారతి పుస్తకాలలో సందర్భ వశాన వచ్చ్ రిపిటీషన్ అనిపించవచ్చు.అయినా నా ప్రయత్నం చేస్తాను .
ఇదిపూర్తయ్యాకే, నా రిటైర్ మెంట్ నుంచి ఉన్నవిషయాలను ”నా దారి తీరులో ”అంతర్జాలం లో రాస్తాను .మీ- గబ్బిట దుర్గాప్రసాద్ – 12-7-20-ఉయ్యూరు
.