12—చిన్నారి పిచ్చుక -పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత
పెద్ద భవంతిలో చెదలు తిన్న కొయ్య దూలాల
గూడు వెనకాల ఒక చిన్నారి పిచుక తల్లికోసం ఏడుస్తోంది
దగ్గరలో ఉన్న పొలం లో తూనీగలు పట్టే తల్లి పిచుక విన్నది
ఎవడో తుంటరి వెధవ నా చిట్టి తల్లిని
పట్టుకు పోవాలని ప్రయత్నిస్తున్నాడనుకొంది
గుండెని౦డా ప్రేమతో కంగారుగా
నిరాశగా వేగంగా గూటికి తిరిగొచ్చి౦ది
అనుభవం లేని ఆచిన్నారి తల్లిరావటం చూసి
‘’నేనెందుకు అమ్మ ఒడికి ఎగర లేను “?అనుకొని
ఎగిరే ప్రయత్నం అప్పుడే చేసింది
పాపం అది ఇంకాఎగరటం నేర్చుకోలేదు
ఎగిరే ప్రయత్నం లో కింద నేలపై పడిపోయింది
గుడ్ల నీరు కుక్కుకుంటూ తల్లి చూసింది
పిల్లను తన రెక్కలమధ్య కాపాడాలని ప్రయత్నించి
వేరే ఆలోచన లేకుండా అమాంతం కిందికి దూకింది
ఇంతలో కొందరు పిల్లలు పరిగెత్తుకొచ్చి
చిన్నారి పిచుకను పట్టుకొన్నారు
వాళ్ళు ఆపిల్లపై తల్లికెంత మమకారమో పట్టించుకోలేదు
దాన్ని ముందుగా గొడుగులో, తర్వాత జేబులో దాస్తూ
అందరూ పగలబడి నవ్వుతుంటే ఒకే ఒక్కడు మాత్రం
గుండె ద్రవించి కన్నీరు కార్చాడు .
వాడి తల్లి చనిపోయి చాలాకాలమైంది
తల్లిప్రేమ ఎలాటిదో మర్చిపోయినవాడు
కాని గుండెల్లో ఏదోబాధ కల్గి కన్నీరు కార్చాడు .
నిచ్చెన సాయంతో ఆ చిన్నారి పిచ్చుకను గూటిలోకి చేర్చాడు
ఆ చిన్నారి పిచ్చుక కూడా
కన్నీటితో వాడిని ఆశీర్వదించింది .
తల్లి పిచ్చుక ఆకుర్రాడిని గొప్ప ఆశ్చర్యంగా చూసింది
అదీ నీటితో నిండిన కళ్ళతో వాడికి కృతజ్ఞతలు చెప్పింది
మౌనంగా తల్లి పక్షి అందజేసిన ఆ కన్నీటి బిందు దీవెన కు
ఈ ప్రపంచమంతా కూడా సమానం కానే కాదు .
తుల తూగనే తూగదు.
ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవిత’’చోరుయ్ పఖిర్ చ్ఛానా ‘’కు సాజెద్ కమాల్ ఆంగ్లానువాదం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-20-ఉయ్యూరు