డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1
‘’మనలిపి పుట్టు పూర్వోత్తరాలు ‘’త్వవ్వి తలకెత్తిన అసమాన ప్రజ్ఞానిధి ,బహుభాషా పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం ,అభిమానధనం అన్నీ ఇందులో దర్శనమిస్తాయి .అందులోని ముఖ్యవిషయాలు అందరికీ ఆకర్షణీయంగా నూతనంగా కనిపించేవి కొన్ని మీకు అందించాలనే తలపుతో ఈదారావాహికకు ‘’ ’డా.తిరుమల రామ’’ చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా ‘’అని పేరుపెట్టాను .ముందుగా ఆయనగురించి ఆయనే మూడవ ముద్రణలో చెప్పుకొన్నవిషయాలు మీకోసం .
‘’డాక్టర్ తిరుమల రామ చంద్ర విచిత్ర వ్యక్తీ ,వైరుధ్యాలపుట్ట ,వైపరీత్యాల మెట్ట.పాదర్సాన్ని పరిహరించే పరుగు .మెరుపును మించిన చాంచల్యం .
ఇంతటి వైరుధ్యాల వైవిధ్యం లో వైపరీత్యాల వైరూప్యం లో రచయిత కనిపిస్తాడు .విమర్శకుడు తొంగిచూస్తాడు .భాషా వేత్త భాసిస్తాడు.ప్రతిదాని పుట్టు పూర్వోత్తరాలూ పరిశీలించే పరిశోధకుడు పలకరిస్తాడు .కనిపించిన దాన్నల్లా కలం తో కబళిద్దామనే భావుకుడు గోచరిస్తాడు .తెలిసిన దాన్నే తేటమాటలతో అందించే పత్రికా రచయిత తారట్లాడుతాడు ఉపనిషత్కాలం స్వర్ణయుగం అవతరించాలనే దురాశా పరుడు ప్రత్యక్షమౌతాడు .
ఇలాంటి స్థితి కి కారణమేమిటి?పరిసరాలు ఎందుకు వికటించాయి?లోపాలు ఎక్కడ ఉన్నాయి ?అవి సరిదిద్దుకోవటానికి వీలు లేనివా ?విధి బలీయమా ?ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ‘’ఈ హంపీ నుంచి హరప్పా దాకా ‘’
నేను తిరుపతిలో సంస్కృత కళాశాలలో విద్యార్ధిగా ఉన్నప్పుడు దిన చర్య వ్రాసేవాడిని .ప్రతిదినమూ ఏదైనా మంచి పని చేయాలనే నియమం పాటించేవాడిని .రాత్రి పడుకోబోయే ముందు దిన చర్యను ఒక సూక్తితో ముగించే వాడను .
స్వాతంత్ర్యోద్యమ౦ లో క్రియాశీల కార్యకర్త నైన తర్వాత ,ఆనాటి పనులన్నీ దిన చర్యలో చేరేవి .అది పోలీసుల చేతుల్లో పడి ,న్యాయస్థానం లో నాకే కాక ,నా మిత్రులకూ ప్రతి కూల సాక్ష్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడింది .అప్పటి నుంచి దిన చర్య వ్రాయటం మానుకున్నాను .
ఈ ‘’హంపీ నుంచి హరప్పా దాకా ‘’పర్యటనలో తిదులవారీగా సంఘటనలు గుది గుచ్చటం అందువలననే సాధ్యం కాలేదు .నా జ్ఞాపకాన్ని బట్టి పేర్కొన్నాను .
నా బోటి సామాన్యుని జీవితం లో ఏమి గొప్ప సంఘటనలు ఉంటాయి కనుక ?కాని అదొక దేశ ద్రిమ్మరి అనుభవ విశేషంగా ,సత్యాన్వేషి కథనంగా ,జిజ్ఞాసువు ఆవేదనగా పాఠకుల మనసుకు దగ్గరౌతుందని ఆ విశ్వాసం .
భాషా సేవకుడు
తిరుమల రామచంద్ర .
ఇది చదివితే వారిలో ఎంతటి వినయ సంపద ఉన్నదో మనకు తెలుస్తుంది .
మూడవ ముద్రణకు సంపాదకులు శ్రీ అక్కిరాజు రమాకాంతరావు ఏమన్నారో చూద్దాం –‘’20వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలోనే తిరుమల రామచంద్ర గారు వంటి వైవిధ్యమైన జీవితం గడిపిన కవి పండిత సాహిత్య వేత్తలు లేరు .ఆయన మనస్వి .నిరాడంబర సరళసాధుప్రవృత్తికి మూర్తి మంతం .ఆయన వంటి బహు భాషా వేత్తలు ఈ శతాబ్దం లో వేళ్ళమీద కూడా లేరు .ఆయన గొప్ప పండితుడు ,పరిశోధకుడు ,పురావస్తు చరిత్ర విశారదుడు ,అత్యున్నతమైన ప్రమాణాలతో ‘’పరిశోధన ‘’పత్రిక నడిపారు .
హంపీ నుంచి హరప్పా దాకా ఈ శతాబ్దపు’’ నవీనేతి హాసం ‘’.సమాజ సాహిత్య ఆంతర్య సంస్కృతి త్రివేణి’’.ఆధునిక పురాణం .కమనీయ కావ్యం. అద్భుత వాస్తవికతకు దర్పణ మైన గొప్పనవల చవులూరించే కథా సంపుటి. విస్మయావహ మైన సామాజిక సన్ని వేశ రంగస్థల సురుచిర రూపకం .ఆయన దొడ్డ వ్యక్తిత్వ నిరూపణం .మహర్షులందరూ ఒక ఎత్తూ అగస్త్యుడు ఒక ఎత్తూ అంటారే అల్లానే శ్రీ తిరుమల రామ చంద్ర సర్వ సాహిత్య సృజన ఒక ఎత్తూ ‘’హంపీ నుంచి హరప్పా దాకా ‘’ఒక ఎత్తు అనవలసి ఉంటుంది .జీవితం లో డెబ్భై సంవత్సరాలు తెలుగు వారి ఉత్తమ సాహిత్యాభి రుచి ప్రవర్ధనకోసం ,సంస్కృతి ,పునరుజ్జీవనం కోసం ఆయన గొప్ప కృషి చేశారు .వ్యాసాలు సమీక్షలు వేలాది సంఖ్యలో రాశారు .ఆయన ఆర్జవం ఇతరులలో మృగ్యం .ఇతరులంటే సాహితీ రంగ ప్రముఖులని అర్ధం ‘’అని కీర్తి కిరీటం పెట్టారు అక్కిరాజువారు .
అక్కిరాజు వారే రెండవ ముద్రణలో –‘’రామ చంద్ర గారు ‘’త్రిదశుడు’’అంటే ఎప్పుడూ ముప్ఫై ఏళ్ళ వాడి గానే జీవించారు .’’గతానికి ఆగతానికి ఆయన ఒక వారధి .’’.ఈపుస్తకం భారతీయసంస్కృతిలోని మేలిమిని సాక్షాత్కరింప జేస్తున్న సుందరపురాణం .ఆయనలాంటి ‘’మనస్వి సమకాలీనంలోఎవరూ లేరు .స్థితప్రజ్ఞుడు.కార్యార్ది కాడు.ఆయన దేశభక్తి నిరుపమానం ..’’గౌతమ ధర్మ సూత్రాలు మను స్మృతి మా గురువులను చూసే రాశారేమో ‘’అనే౦తటి గురుభక్తి,ఆత్మార్పణ, అభి నివేశం ఆయనది .ఆయన మనస్తత్వ పరిశీలన ,మానవ స్వభావ చిత్రణ ,మనస్తత్వ ప్రతిపాదన చాలాఅద్భుతమైనవి .తెలుగులో ఇంతఆత్మనివేదనా ,ప్రణవంగా ఏ స్వీయ చరిత్రా లేనే లేదు .కరుణ సుచిరోజ్వల శృంగారం ,సుకుమార హాస్యం పరమ మనస్విత పుస్తకమంతా పరచుకొన్నాయి .
’’తరువోపి హి జీవంతి మృగ పక్షిణః-సజీవతి మనో యస్య మనవేవ హి జీవతి ‘’
భావం –చెట్లుజీవిస్తాయి కొన్ని వేల ఏళ్ళుకూడా ,మృగాలూ పక్షులూ జీవిస్తాయి .అయితే వాటి మనసు పరిపక్వశీలం కాదు . మనసుతో మనసారా జీవించే వారే జీవించినట్లు. వాళ్ళ జీవితమే సార్ధక౦ అనే ‘’యోగ వాసిస్టం’’లోని శ్లోకం .అలాంటి వారు తిరుమల రామ చంద్ర .ఆయనకు షష్టిపూర్తికాలేదు .సప్తతి జరగలేదు .అసీతి అసలేలేదు .సహస్ర చంద్ర దర్శనం సమకూడలేదు .అంటే తెలుగు వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు అని అర్ధం. ఆయనది ఏమీ పట్టించుకోని మనస్తత్వం . రవీంద్రునిలా నిరంతర నిత్య మనన శీలి రామ చంద్ర ‘’
అని ఆమనస్వికి ఈ సాహితీ తపస్వి శ్రీ అక్కిరాజు రమాకాంతరావు గారు 12-12-1997 న నమస్సు లర్పించారు .
ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ టి.ఉడయవర్లు 16-6-2013లో రాసిన వ్యాసం లో మరికొన్ని విశేషాలు తెలుసుకొందాం –
పరిశోధనా పారంగతుడు
సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరుమల రామచంద్ర. సంస్కృతం, ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లం, ఆంధ్ర భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసిన రచనలు – తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలలోని అనేక అపురూప రచనలను తెలుగులో అనుసృష్టి చేశారు. శతాధిక రచనలు వారు చేసినప్పటికీ, ఇప్పటికీ దాదాపు పాతిక మాత్రమే పుస్తకరూపంలో వచ్చాయి. చీకటి కోణాల్లో దాగున్న తెలుగుకు తన పరిశోధనల ద్వారా వెలుగునిచ్చిన తిరుమల రామచంద్ర రచనలు తిరిగి తెలుగువారికి అందకుండా అంధకారంలో మ్రగ్గడం క్షంతవ్యం కాదు.
తిరుమల రామచంద్ర వ్రాసిన ‘మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు’ అయినా, ‘నుడి-నానుడి’ అయినా ‘సాహితీ సుగతుని స్వగతం’ అయినా, ‘మరుపురాని మనీషులు’ అయినా, ‘గాథాసప్తశతి’లో తెలుగు పదాలు అయినా ఏ ఒక్కటి అమెరికా లాంటి పశ్చిమదేశంలో రచించి ఉంటే పరిశోధనాత్మక రచనలకుగాను జర్నలిస్టులకిచ్చే ‘పులిట్జర్’ అవార్డు ఎప్పుడో వచ్చి ఉండేది. ఆయన చివరి రోజులలో వ్రాసిన ఆత్మకథాత్మక రచన ‘హంపీ నుంచి హరప్పాదాకా’ జ్ఞానపీఠ్ అవార్డు రాదగినది.
తెలుగులో ఇంత చక్కని, చిక్కని, అక్కున చేర్చుకోదగిన జీవిత చరిత్ర మరొకటి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన రెండు నెలల్లో వెలువడిన అపూర్వ గ్రంథం ‘మనలిపి-పుట్టుపూర్వోత్తరాలు’. ఎన్నో క్రొంగొత్త అంశాలు చెప్పిన ఈ గ్రంథం భారతీయ భాషలలో సమగ్రమైనది. ఇంతవరకు ఇలాటి గ్రంథం రాలేదు. అలాగే భాషాశాస్త్రాన్ని మానవజాతి శాస్త్ర, సాంఘిక శాస్త్ర, చరిత్రాదులతో సమన్వయించి రచించిన మరో అపూర్వగ్రంథం – ‘నుడి-నానుడి’. వివిధ దృక్కోణాలతో వ్రాసిన ఇలాంటి గ్రంథం కూడా మరొకటి లేదు. ప్రాకృత-తెలుగు సాహిత్యాలకు రెండువేల సంవత్సరాలకు పైగా సంబంధం ఉందంటారే తప్ప – వివరణాత్మకంగా వ్రాసినవారు లేరు. ఈ నేపథ్యంలో ‘గాథాసప్తశతి’లో తెలుగు పదాలు వెలికితీసి పుస్తకరూపం ఇచ్చారు. గాథాసప్తశతిని కాళిదాసు అనుకరించాడని ఈ గ్రంథంలో తిరుమల రామచంద్ర సిద్ధాంతీకరించి చెప్పారు. ‘సాహితీ సుగతుని స్వగతం’, ‘మరుపురాని మనుషులు’ మౌలిక వ్యాస సంపుటాలు. ఈ గ్రంథాలు ఆ రోజుల్లో నాలాంటి సాహితీ ప్రియులకు, యువ జర్నలిస్టులకు, విద్యార్థులకు స్ఫూర్తిగ్రంథాలు.
ఇంతటి పరిశోధనా పారంగతుడు తిరుమల రామచంద్ర ప్రమాదీచనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి జ్యేష్ఠ నక్షత్రంలో అంటే సరైన తేదీ 1913 జూన్ 17న జానకమ్మ – శేషాచార్య దంపతులకు జన్మించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాష, సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన ఈ యేడాదే తెలుగుభాషా సేవకుడుగా తనకుతానే ఎంతో గర్వంగా బతుకున్నంతకాలం చెప్పుకున్న తిరుమల రామచంద్ర శతజయంతి సంవత్సరం రావడం యాదృచ్ఛికమైనా, ప్రభుత్వం దానికి సంబంధించిన భాషా, సాంస్కృతిక సంబంధిత సంస్థలు శ్రద్ధ వహించి ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇంతవరకు పుస్తకరూపంలోకి రాని వారి రచనలు సేకరించి, వరుసగా ప్రచురించవలసిన తరుణమిది. 1997 అక్టోబర్ 12న కన్నుమూసిన తిరుమల రామచంద్ర ఎనభై నాలుగేండ్ల వయస్సులోను అప్పుడు జర్నలిస్టుగా చురుకుగా పనిచేస్తున్న నాలాంటి వారితో కలిసి ఎన్నో సభల్లో పాల్గొన్నారు.
మరెన్నోసార్లు తమ అనుభవాలు, జీవిత విశేషాలు, భాషా సాహిత్య విషయాల పరిశోధనలో అనుసరించిన పద్ధతులు చెప్పారు. వయస్సురీత్యానే కాకుండా, పాండిత్యపరంగా ఎలాంటి భేషజం లేకుండా మనసువిప్పి మాట్లాడే స్వభావం కలిగిన తిరుమల రామచంద్ర జీవిత, సాహిత్య సేవలను దిజ్మాత్రంగా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
తిరుమల రామచంద్ర నడిపిన శీర్షికలలో మరుపురాని మనీషులు, నుడి-నానుడి (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక) తెలుగు వెలుగులు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) సాహితీ సుగతుని స్వగతం (భారతి) ఆయనకు ఎనలేని కీర్తిని, తెలుగుకు అపురూప సాహిత్య సంపదను ఒనగూర్చాయి. ఇవి కాకుండా వారు మనవి మాటలు (భారతి), చరిత్ర కెక్కని చరితార్థులు (పరిశోధన), తెలుగుతల్లి, మాటలకథ, పదసంపద, సంస్కృతి సంప్రదాయ (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక), మాండలికాలు, పలుకుబడి, హైదరాబాద్ లేఖ (ఆంధ్రప్రభ), హైదరాబాద్ నోట్‌బుక్ (ఆంధ్రపత్రిక), రాజధాని విశేషాలు (ఆంధ్రప్రదేశ్), ఇదీ మన రాజధాని (ప్రజాతంత్ర) విజయవంతంగా నిర్వహించారు. కేవలం వారి పేరుతోనే కాకుండా సుమారు పాతిక వేల కలం పేర్లతో వారెన్నో రచనలు చేశారు. కన్నడం నుంచి పది, పన్నెండు నవలలు, కథా సంకలనాలు అనువదించారు. హిందీ, ఇంగ్లీషు నుంచి సుమారు ముఫ్పై గ్రంథాలు అనువదించారు.
తిరుమల పరిశోధనాత్మక రచనలలో పేర్కొనదగినవి ‘హిందువుల పండుగలు-పర్వాలు’, ‘తెలుగు పత్రికల సాహిత్య సేవ’, మూడు వాఙ్మయ శిఖరాలు, అహంభో, అభివాదయే, బృహదారణ్యకం, మనవి మాటలు, బుద్ధుణ్ణి బళ్ళోవేశారు లాంటివి. అనువాదాల్లో లలితవిస్తరం, అవధాన కల్పలత చెప్పుకోదగినవి. లలితవిస్తరం మహాయాన బౌద్ధ సంప్రదాయాను సారమైన బుద్ధుని చరిత్ర. భారతదేశంలోనే ఇది మొట్టమొదటి లౌకిక వచనమనీ, క్రీస్తుకు ముందు మూడు శతాబ్దాల నాడు రచించిందని రామచంద్ర అభిప్రాయం. మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైనవారు లలిత విస్తరాన్ని ప్రస్తావిస్తూ దీనిలో విపుల సంగతి ఉందని, క్రీడల సంగతి అనేవారు. దీనికి రాజేంద్రలాల్ మైత్రా సంగ్రహ అనువాదం ఆంగ్లంలో ఉంది గానీ, యథామూలాను వాదం ఏ భాషలోను లేదు. రామచంద్ర, ప్రముఖ విద్వాంసులు బులుసు వెంకట రమణయ్య కలిసి దీనిని మక్కీకిమక్కీ అనువదించారు. మొదట ఇది 1962లో ఆంధ్రప్రభ ఆదివారం సారస్వతానుబంధంలో ధారవాహికంగా ప్రచురితమై పుస్తకరూపం పొందింది.
అనువాదం చేసే పద్ధతిలో ముఖ్యంగా తెనుగు తోబుట్టువుల అనువాదంలో రామచంద్ర మక్కికి మక్కి వాది. అంటే తెలుగు నుడికారం విడనాడి యథామూలమని కాదు.
పఠనీయత ఉండాలి. మూలానుసారిగాను ఉండాలి. సంక్షేపీకరణం, సారాంశకథనం ఆయనకు ఒప్పదు. ఉదాహరణకు ఒక సన్నివేశం. రామచంద్ర దక్షిణ భారత పుస్తక సంస్థ వారికి కొన్ని కన్నడ అనువాదాలు చేశారు. వాటిలో ఒక కథలో ఒక ఆఫీసరు కోపంతో ఆఫీసులో ప్రవేశించే భార్య కరాఘాతాలు తప్పించుకొనడానికి పెద్ద ఫైలును తల మీద పెట్టుకుంటాడు. అతడు దానిని టీకాచార్యులు హయగ్రీవుని కోసం శనగల పూర్ణం పళ్లెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అని రచయిత వర్ణించారు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు ద్వైత మతానుసారంగా మధ్వాచార్యుల వారు భాష్యం రాశారు. దానికి అణు భాష్యమని పేరు. దానికి జయతీర్థుల వారు టీక రాశారు. కనుక ఆయనకు టీకాచార్యులని పేరు. అది కూడా కఠినమని శ్రీపాదరాయలనే విద్వాంసులు మరొక వ్యాఖ్య రాశారు. శ్రీపాద రాయలకు హయగ్రీవుడు ప్రత్యక్షమని ఐతిహ్యం. శ్రీపాదరాయలు ఉడికించిన సెనగలు బెల్లం పళ్ళెంలో పెట్టుకుని తల మీద మోసుకుని గుదిగాళ్ళతో కూర్చుంటే హయగ్రీవుడు అశ్వరూపంలో వచ్చి, తన ముందు కాళ్ళు శ్రీపాదరాయల మోకాళ్ళపై పెట్టి ఈ బెల్లం శనగలు తినేవాడట. ఈచిత్రం ఏ ఉడిపి హోటలులోనైనా గోడకు వ్రేలాడుతూ ఉంటుంది. ఈయనకు కూడా టీకాచార్యులని పేరుంది. కొందరు దీనికి ఒప్పరు. టీకాచార్యులు పళ్ళెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అనే ఉపమానం కన్నడంలో విద్యావంతులకు తెలిసిన సంప్రదాయం. రామచంద్ర ఆ విధంగానే వ్రాసి క్రింద అథస్సూచికలో వివరణ ఇచ్చారు. ఆ సంస్థలో తెలుగు ఎడిటర్‌గా ఉన్న బొమ్మకంటి సింగరాచార్యులు దానిని తీసివేసి వీరభద్ర పళ్ళెంలాగా అని మార్చారు. ముద్రణ జరిగిన తర్వాత రామచంద్ర దాన్ని చూచి, అది సరికాదని వాదించారు. వీరభద్ర పళ్ళెం మార్పు బాగుంది కానీ ఈ మార్పు వల్ల తెలుగు పాఠకులకు ఒక కొత్త సంప్రదాయ జ్ఞానం అందలేదు. అందుకు నిరసనగా రామచంద్ర ఇకపై ఆ సంస్థ వారికి అనువాదం చేయడం మానివేశారు. అది రామచంద్ర తత్వం.
తిరుమల రామచంద్ర రచనల గురించి ఇంకా ఎన్నని చెప్పను. ఏదో ఒక కొత్త విషయం లేకుండా ఏ రచనలు చేయలేదు. ఇవ్వాళ పత్రికలు వాడుతున్న భాషలో ఏది సరైన పదమో, ఏది తప్పో వివరిస్తూ రాసిన ‘పలుకుబడి’కి కూడా ఇంతవరకు గ్రంథరూపం ఇవ్వలేదు. తిరుమల రామచంద్ర శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకునైనా ఈ యేడాది, గ్రంథాలుగా రాని వారి రచనలన్నీ వెలుగు చూస్తాయని ఆశిద్దాం.
– టి. ఉడయవర్లు
సీనియర్ జర్నలిస్టు
(జూన్ 17న తిరుమల రామచంద్ర శతజయంతి)
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-20-ఉయ్యూరు