16-ఎడబాటు –పద్మ భూషణ్ ఖ్వాజీ నజ్రుల్ ఇస్లాం కవిత
మిత్రమా అది వీధిలో జరిగిన ఎదురు దాడికాదు
ప్రక్కప్రక్కన నడుస్తూ చేసిన
అనుకోని అకస్మాత్తు సంభాషణా కాదు
అది మామూలు కరస్పర్శ కానే కాదు
ఆకస్మికయాత్రకు ముగింపూ కాదు.
క్షణ క్షణం నిన్ను నువ్వు విచ్చుకొంటూ
మా హృదయాలకు బాగాదగ్గరయ్యావ్
నువ్వు విజేతగా రాలేదు మిత్రునిలా చేరావ్ .
నీ నవ్వుతో మా మనసుల్ని గెలిచావ్
నువ్వు సింహాసనం ఆక్రమించలేదు
మా గుండెల్లో బాగా దూరిపోయి
అక్కడే పట్టాభి షిక్తుడవయ్యావ్
అందుకే మా కంటే నువ్వే ఎక్కువ బాధ పడుతున్నావ్ .
సమయంవచ్చినప్పుడు వీడ్కోలు చెప్పి విడిపోయావ్
అన౦తకాల పరచయం ద్వారా
నువ్వు మాకు స్వంతమయ్యావ్ .
రక్తం కారుతున్న కోట్లాది జన
హృదయాలలో నువ్వెప్పుడూ
ప్రియ శోకంగా శాశ్వతంగా నిలిచిపోతావ్
నిన్ను మళ్ళీ నేను చూస్తాననే అనుకొంటాను
ప్రియమిత్రమా మనదేదో ఆషామాషీ కలయికకాదు.
ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ కవితకు –కబీర్ చౌదరి ఆంగ్లానువాదం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-20-ఉయ్యూరు