’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -4
శిధిల హంపీ వైభవం -2(చివరిభాగం )
ఆఆనాటి విజయనగర దీపావళి విజయ దశమి వేడుకలగురించి చరిత్ర గ్రంథాలెన్నో చెప్పాయి ‘’ఆకాశ భైరవ కల్పం ‘’ఆనాటి బాణా సంచా కాల్పులకు గొప్ప సాక్షి .ఒకసారి రాయలవారి వేటలో ఒక కారెనుబోతు అంటే అడవి దున్న చిక్కింది .దాని మెడ గజం వెడల్పు .దుర్గాస్టమి నాడు బలివ్వాలనుకొన్నారు .దాని మెడను ఒకేదెబ్బతో ననరక గలవారున్నారా అని రాయలు ప్రశ్నించాడు .కొలువులో ఉన్న మహా దండనాయకులు, దుర్గాదిపతులు కిక్కురుమనలేదు .అప్పుడు నాగమనాయుడి కొడుకు యువకుడు విశ్వనాథ నాయకుడు లేచి అనుమతిస్తే తాను ఆపని చేస్తానన్నాడు .రాజు అంగీకారించగా ఒక్క దెబ్బ వ్రేటుతో దాని తల నరికేశాడు .మహర్నవమి దిబ్బ శిధిల శిల్పాలలో కత్తి ఎత్తి నిలబడిన వీరుడు విశ్వనాథ నాయుకుడే అన్నారు తిరుమల రామచంద్ర .
హంపీ విరూపాక్షస్వామిని ‘’పంపాపతి ‘’అని కూడా పిలుస్తారు .పంప హంప అయింది కాలక్రమం లో .ఈస్వామి రథోత్సవమూ ఒక ముచ్చటే .సాధారణంగా స్వామికీ, అమ్మవారికీఒకే రథం ఉంటుంది .రథోత్సవం రోజు ఇద్దర్నీ ఒకే రథం లో ఊరేగిస్తారు .కానీ హంపీ రథోత్సవం నాడు స్వామినీ ,అమ్మవారు పార్వతీ దేవినీ వేర్వేరు రథాలలో ఊరేగిస్తారు .ఇక్కడినుంచి మెయిలు దూరం లో ఉన్న కృష్ణస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు .ఈ సంప్రదాయం ఎలా ప్రవేశించిది ?ఓఢ్ర గజపతిని రాయలు ఓడించాక ,అక్కడ జగన్నాథ రథ యాత్రలో బలభద్ర సుభద్ర ,జగన్నాథ స్వాములను వేర్వేరు రథాలపై ఊరేగించటం చూసి రాయలు విజయనగరం లో ఆ సంప్రదాయాన్ని ప్రవేశ పెట్టాడని రామ చంద్రగారి తాతగారు చెప్పారట .
శిథిలమైన హంపీ కోట గోడల్ని చూస్తే చాలా ఎత్తైనవి సుమారు 35అడుగుల ఎత్తుగా ఉండేవి అనిపిస్తాయి .మనిషి సగటు ఎత్తు అయిదున్నర అడుగులు అనుకొంటే ,ఈ గోడలు సుమారు ఏడు నిలువుల ఎత్తు ఉంటాయి కనుక 35అడుగుల ఎత్తు ఉండచ్చు అని అంచనా .గోడల గానుగసున్నం అంటే గార, రాళ్ళ సందులనుంచి పడిపోయి చాలాచోట్ల కనిపిస్తుంది .రామ చంద్ర ఆయన స్నేహితులబృందం ఆగోడ సందుల్లో వ్రేళ్ళు దూర్చి కోటగోడలమీదకు ఉడుముల్లాగా ప్రాకేవారట .ఎక్కటం తెలికేకాని దిగటం కష్టం .దూకితే పాదాలు నుజ్జు నుజ్జు .అందుకని పైనుంచి నెమ్మదిగా జారేవారు .మోకాళ్ళు మోచేతులు డోక్కు పోయేవి .ఒకసారి తల్లిగారు చూసి ప్రమాదం అని హెచ్చరించింది .
తుంగభద్రా నది ఇసుక చాలా సన్నం .ముత్యాలు పొడి చేసి పరచినట్లు నదీ తీరం ఇసుకతో కనిపిస్తుంది .ఆప్రాంతం లో నదిని దాటించే తెప్పను ‘’హరిగోలు ‘’అంటారు .వెదురు బద్దలతో సుమారు పది మంది కూర్చునేట్లు గట్టిగా గుండ్రంగా కట్టి దానిపై దళసరి తోలు కప్పుతారు .దీన్నే పెద్ద కొప్పెర లేక హరి గోలు అంటారు .అరుగు అంటే వెళ్ళటం గోలు అంటే గోళం అంటే నదిని దాటించే గోళం.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-20-ఉయ్యూరు