రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్

రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు

బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్

బిరుదున్న కోలాచలం వెంకట రావు గారు .ప్రముఖ నాటక కర్త కోలాచలం శ్రీనివాసరావు గారి పెద్దన్నగారు .ఈ కుటుంబానికి వెంకటాపురం బుక్కపట్నం లలో పొలాలు ఉండేవి .రామ చంద్ర తాతగారు వాటిని సాగు చేసేవారు .పంట డబ్బుకోసం వెంకటరావు గారు, జ్ఞాతిషణ్ముఖ శాస్త్రిగారు వచ్చే వారు .వెంకటరావు గారు గొప్ప నాయకులు .వారిని అక్కడి వారే కాక తెలుగువారు కూడా విస్మరించారు .

  కాంగ్రెస్ వాది వెంకటరావు గారు ,భారత జాతీయ కాంగ్రెస్ స్థాపక సభ్యులలో కూడా ఒకరు   .28-2-1850న బళ్లారిలో జన్మించారు .దేశానికీ సమాజానికి వారు చేసిన సేవ నిరుపమానం .సంఘ సంస్కర్త, మహా దాత ,రాజకీయ దురంధరుడు రావు గారు .మహామహోపాధ్యాయ వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లి నాథ సూరి వంశం వారే .

  రావు గారి తాతగారు కోలాచలం సుబ్బా శాస్త్రి గారు ధార్వాడ జిల్లా గజేంద్ర ఘడ సంస్థాన౦ లో ఉండేవారు .మహారాష్ట్ర ,కన్నడ భాషలలో హరికథలు రాసి చెప్పి మంచి పేరు పొందారు .రావు గారి తండ్రి రాయచూరు జిల్లా అనే గొంది సంస్థాన దివాన్ గా చాలాకాలం ఉన్నారు .

  వెంకటరావు గారు  బళ్ళారి లోని వార్డ్లా విద్యాలయం లోని గవర్నమెంట్ ప్రోవిన్షియల్ స్కూల్ లో  చదివి ,1867లో ఎఫ్ ఏ పాసై ,,మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజిలో చదివి 19వ ఏట డిగ్రీ పొందారు. అప్పుడు ఆ కాలేజి ఒక్కటే ఫస్ట్  గ్రేడ్ కాలేజి .ప్రిన్సిపాల్ ధాంసన్.ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి 1874వరకు బోధించారు .తర్వాత జిల్లా మున్సిపల్ ఆఫీస్ లో హెడ్ గుమాస్తాగా నియమితులై ,నాలుగేళ్ళు పని చేసి ,తర్వాత రెండేళ్ళు డిప్యూటీ  తాసిల్దారుగా ,సబ్ మేజిస్ట్రేట్ గా ఉన్నారు .

  న్యాయ శాస్త్రం పై అభి రుచి ఉన్నందున చదివి 1880 లో లా పాసయ్యారు .బళ్ళారి న్యాయ స్థానాలలో సివిల్ ,క్రిమినల్ కేసులు వాదించారు .కక్షిదారులకు న్యాయం చేస్తారని న్యాయమైన కేసులే చేబడతారని గొప్ప పేరు పొందారు .దీనితో ‘’న్యాయవాద కేసరి ‘’-లయన్ ఆఫ్ ది బార్ అనే బిరుదు పొందారు .ఆతర్వాత ఆయన చిత్రపటాన్ని బళ్ళారి బార్ అసోసియేషన్ లో న్యాయమూర్తి ఇ.ఇ.మెక్.ఆవిష్కరించారు .రావు గారికి వృత్తిలో మంచి పేరుమాత్రమే కాదు కనకధార కురిసింది .మహదైశ్వర్య వంతులయ్యారు .మద్రాస్ బొంబాయి హై కోర్టు లలోనూ కేసులు వాదింఛి గొప్ప కీర్తి పొందారు .

  ఒక సారి రావు గారు బొంబాయి హైకోర్ట్ ఫుల్ బెంచ్ ముందు వాదిస్తుంటే ,ప్రధాన న్యాయమూర్తి సర్ బాసిల్ స్పాట్ అనే చిరాకు రాయుడు, రావు గారు చెప్పింది అంతా ఫుల్ బెంచ్ ఇదివరకు తీర్పులో చెప్పింది అని అడ్డు తగిలితే, రావుగారు ధైర్యంగా ‘’అది ఫుల్ బెంచ్ చెప్పిన తీర్పు కాదు .మీరు చెప్పిన తీర్పుకు మిగిలిన  వారి తల  ఊపు మిలార్డ్ ‘’అన్నారట .ఈ విషయం చీఫ్ జస్టిస్ ఒప్పుకోవాల్సి వచ్చిందట .ఈ వృత్తాంతం బొంబాయి హైకోర్ట్ శత జయంతి సంచికలో ఉన్నది .

  రావు గారు బళ్ళారి జడ్జిగా రెండేళ్ళు మద్రాస్ హైకోర్ట్ జడ్జ్ గా చేశారు .ఒకసారి ఈయన W.W.ఫిలిప్స్ తో ఘర్షణ పడ్డారు ‘’మిస్టర్ వెంకటరావు నా సమయం వృధా చేస్తున్నావ్ ‘’అన్నాడట ఫిలిప్స్. రావు గారు వెంటనే ‘’మీనెలజీతం నాకు నిముషాలకు గంటలకు జీతం. నా సమయం మీ సమయం కన్నా విలువైనది మిలార్డ్ ‘’అన్నారట .

   1893లో రావు గారు ఫిలసాఫికల్ సొసైటీస్థాపక  సభ్యులై క్రియాశీలంగా పని చేస్తూ దేశ ప్రజల సంక్షేమానికి రాజకీయ సామాజిక మతసాంస్కృతిక రాజకీయ రంగాలలో సేవ చేశారు .ఈ సొసైటీ భవననిర్మానానికి ఉదారంగా విరాళం ఇచ్చారు .ఈ భవనం ఇప్పటికీ వారిని గుర్తు చేస్తుంది. వివాహాలలో దేవాలయ ఉత్సవాలలో ఆనవాయితీగా ఉండే భోగం మేళాలకు బళ్ళారి ప్రాంతం లో స్వస్తి పలికించారు రావు గారు మిత్రుడు రావు బహదూర్ ఏ సంబంధ మొదలియార్ తో కలిసి .లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల విస్తరణ కోసం సూచనలు పంపిస్తే ,రావుగారు, సభాపతి మొదలియార్ గార్లు స్థానిక వర్తకులను ప్రోత్సహించి నిలబెట్టిఎన్నిక యేట్లుచేశారు .1885లో బొంబాయిలో మార్క్విస్ రిప్పన్ కు సన్మాన పత్రం అందజేయటానికి బళ్ళారి ప్రముఖుల తరఫున వెళ్లి అందజేశారు .అప్పుడు బొంబాయిలో జరుగుతున్న అఖిలభారత కాంగ్రెస్ ప్రధమ సమావేశానికి హాజరై,72మంది సంస్థాపక సభ్యులలో ఒకరయ్యారు .సోషల్ కాంగ్రెస్ సభల్లోనూ పాల్గొన్నారు .చాలా ఏళ్ళు  ఈ సంస్థల వార్షి  కోత్సవాలకు ఉత్సాహంగా వెళ్లి పాల్గొనే వారు .

   వివిధ దేశాల ప్రజల వ్యవహారాదులు,దేవాలయ మసీద్ చర్చి బౌద్ధ విహారాల ప్రాచీన ,నవీన శిల్ప విశేషాలు తెలుసుకోవటానికి రావు గారు 1884లోభారత్ లోని వివిధ ప్రాంతాలు ,శ్రీలంక బర్మా చైనా ఆగ్నేయ ఆసియా దేశాలలోనూ పర్యటించారు .1884లో వీరేశలింగం పంతులుగారితో బ్రహ్మ సమాజ ప్రచారకులు బుచ్చయ్య పంతులుగారితో పరిచయమై౦ది  రావు గారికి .ఆ స్పూర్తితో బళ్ళారి లో తనబంగళాలో స్వంతఖర్చుతో మూడు విధవా వివాహాలు చేయించారు .అప్పటికి నిషిద్ధమైన సముద్రప్రయానం విధవ వివాహాలు చూసి అనాతనులకు ఆగ్రహం కలిగి బహిష్కరించారు .ఉపాయం ఆలోచించి బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేసి ప్రతిఒక్కరికీ ఒక బంగారుకాసు ఇస్తానని ప్రచారం చేశారు .కుప్పలు తెప్పలుగా బ్రాహ్మణులు వచ్చి భోజనాలు చేసి దక్షిణ తీసుకొని వెళ్ళారు. ఈ వివాదం లో విరూపాక్ష మఠం తటస్థంగా ప్రేక్షకపాత్ర వహించింది .

  రావు గారు 1902 లో మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి నుంచి రష్యా టర్కీ లు మినహా యూరప్ దేశాలన్నీ పర్యటించి అక్కడి ప్రజల స్థితిగతులు తెలుసుకొని ,భారతదేశ విషయాలు వారికి తెలియ బర్చారు .ప్రభుత్వ ఆహ్వానం పై లండన్ లో 1902ఆగస్ట్ 9న జరిగిన ఏడవ జార్జి చక్రవర్తి  పట్టాభిషేకాన్ని చూశారు .రావు గారి సేవలకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ‘’రైటానరబుల్ ‘’బిరుదునిచ్చి గౌరవించి సత్కరించింది .విదేశీ పర్యటనుంచి తిరిగి వచ్చిన రావు గారికి కనీ విని ఎరుగని రీతిలో ప్రజలుస్వాగత౦  పలికారు

  బళ్ళారి లో ప్లేగు విజ్రుమ్భించిన కాలం లో రావు గారు బళ్ళారి మునిసిపల్ చైర్మన్గా ఉన్నారు .ఇరవైనాలుగు గంటలు పని చేసి తనస్వంత డబ్బు వేలాదిరూపాయలు ఖర్చు పెట్టి ,వ్యాధిని నిరోధించారు .ప్రభుత్వ చర్యలకు పూర్తీ సహకారం అందించారు .ఎప్పుడుప్లేగువచ్చినా బళ్ళారి లోని ఆయన బంగళా,ఆవరణ  కాందిశీక శిబిరంగా మారిపోయేది .

మహాదాత వెంకటరావు గారు 1906నుంచి తన ఆదాయం లో నాలుగో వంతు దానధర్మాలకు విని యోగించారు .వీరేశలింగం గారి విధావాశ్రమనిర్మాణానికి అయిదు వేలు విరాళం ఇచ్చారు .కాశీ విశ్వ విద్యాలయాని ఎంతో భూరి విరాళాలు అందించారు .భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన బ్రిటిష్ సంఘానికి ఏటా 500పొండ్లు విరాళం పంపేవారు .హిందూ ముస్లిం క్రైస్తవ సంఘాలకు నిరంతరం  ఏదో ఒకటి  దానం చేసేవారు. బళ్ళారి కాస్మోపాలిటన్ క్లబ్ భవన నిర్మాణానికి భూరి  విరాళమిచ్చారు.ఈ భవనం ఇప్పటికీ సజీవ సాక్షాత్కారంగా ఉంది .

తూర్పు ప్రాంతం మునిసిపాలిటి వర్గం 1903లో వెంకటరావు గారిని మద్రాస్ శాసన మండలికి ఎన్నిక చేసింది .ఆయనతో పోటీ చేసిన ఏలూరు ఆయన కృత్తి వెంటి పేర్రాజు గారు ఓడిపోయారు .1904నుంచి 07వరకు ఇంగ్లాండ్ లో న్యాయ శాస్త్రం చదివి బార్ ఎట్ లా డిగ్రీతో తిరిగి వచ్చారు .అక్కడ టంగుటూరి ప్రకాశం గారు రావు గారికి క్లాస్మేట్ .వెంకటరావు గారి ప్రముఖ మిత్రులు బాలగంగాధర తిలక్ ,పండిత మదనమోహనా మాలవ్యా ,ప్రకాశం పంతులు వీరేశ లింగం గారు ,దాదా భాయ్ నౌరోజీ ,గోపాలకృష్ణ గోఖలే ,అనీ బీసెంట్ మొదలైన హేమాహేమీలు .తిలక్ ను అరెస్ట్ చేసినందుకు నిరసనగా 1916లో రావు గారు నిరసనగా తమ రైటానరబుల్ బిరుదు త్యజించారు .ప్రకాశం గారు తన జీవిత చరిత్రలో రావు గారిని చాలా సార్లు ప్రస్తావించారు .తెలుగు దేశం లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఖాళీ వస్తే రావు గారుపోటీచేశారు .కాకినాడ ప్లీడర్ కృత్తివేంటి పేర్రాజుగారు పోటీ .ఈయన న్యాపతి సుబ్బారావు గారి కాండిడేట్ .రావుగారు గెలిచారు .

  బళ్లారిలో రావు గారు 50వేల రూపాయలతో టౌన్ హాల్ కట్టించారు .30వేల పుస్తకాలున్న  గ్రంధాలయం 70వేలరూపాయలతో నిర్మించారు .ఉచిత వైద్యశాల కట్టించారు .తమ్ముడు నాటకకర్త కోలాచలం శ్రీనివాస రావు గారి నాటకాల ప్రదర్శన కోసం ‘’సుమనోరమా సభ ‘’ నాటక శాల నిర్మించారు  .పేదహిందూ బాలికల కోసం 20వేలతో అనాథ శరణాలయం కట్టించారు .పరిశ్రమలే దేశాభి వృద్ధికి మూలం అనే ఆలోచనతో ఒక లక్ష రూపాయన పెట్టు బడితోనాలుగు జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫాక్టరీలతో ‘’సభాపతి ప్రెస్ కంపెని లిమిటెడ్ స్థాపించారు .’’రిప్పన్ ప్రెస్ అండ్ షుగర్ మిల్స్ కంపెని లిమిటెడ్ ‘’ను తనవాటా 50వేల తో ప్రారంభించారు .ఈ రెండుసంస్థలకు రావు గారే చైర్మన్ .రెండు లక్షలపెట్టు బడితో పెట్టిన దక్కన్ ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ కంపెనీకి రావు గారు కార్యదర్శి .వజ్రకరూర్ డైమండ్ ప్రాస్పెక్టింగ్ కంపెని రష్యా దక్షిణాఫ్రికా పెట్టు బడి దార్లతో కలిసి తాను  మేనేజింగ్ డైరెక్టర్ గా నెలకొల్పారు .చాలా నూలు నేత చక్కెర్ ఫాక్టరీలలో వాటాలుండేవి.దుర  దృస్ట వశాత్తు  ఇవేవీ అభి వృద్ధి చెందక  భారీగా నష్టపోయారు .అవసాన దశలో కుటుంబం వ్యాజ్యాల పాలైంది . ఆస్తి అంతా హారతి కర్పూరమైంది. 25-12-1931న81 వ ఏట  అత్యంత దయనీయస్థితిలోరైటానరబుల్ కోలాచలం వెంకటరావు గారు మరణించారు .ఆకాలం లో రావు గారు లేని  బళ్ళారి లేదు. ఇప్పుడు ఆయన్ను స్మరించేవారే లేరు .తెల్లటి ఖద్దరు దుస్తులతో బంగారు రంగు చాయతో మెరిసి పోయేవారురావు గారు .ఆయనమునిమనవాడు అనంత ప్రసాద్ న్యాయవాది .

‘’ద్వావి వౌ పురుషౌ లోకే –స్వర్గస్యోపరి తిష్ఠతః-ప్రభు శ్చక్షమయా యుక్తః –దరిద్ర శ్చ ప్రదానవాన్ ‘’

భావం –ఇద్దరు వ్యక్తులు స్వర్గం దాటి దానిపైనున్న లోకాల్లో ఉంటారు .ఒకరు ఓర్పుగల ప్రభువు .రెండవవారు దానం చేసి దరిద్రుడైన వాడు.

మనవి-సుమారు అయిదేళ్ళ క్రితం బళ్ళారి నుంచి కోలాచలం ఇంటిపేరున్న లాయర్ గారు నా బ్లాగ్ లో నేను కోలాచలం మల్లి నాథ సూరి గురించిన రాసిన వ్యాసం చదివి ,ఫోన్ చేసి అభినందించి తన దగ్గరున్న ఆవంశ విశేషాలు ,కోలాచలం వెంకటరావు గారిపై ఆంగ్లం లో ఉన్న వ్యాసాలూ నాకు పంపారు రిజిస్టర్డ్ పోస్ట్ లో .నేను వెంటనే వాటిని అనువాదం చేసి నెట్ లో రాసేశా, నేను సరసభారతి పుస్తకాలు వారికి పంపాను నాలుగైదు సార్లు ఫోన్ లో మాట్లాడుకొన్నాం. ఆతర్వాత కమ్యూనికేట్ చేయటం కుదరలేదు . ఆ వెంటనే   బెజవాడ రేడియో వారు ఒక టాక్ వచ్చి రికార్డ్ చేయమనిఫోన్ చేస్తే , బెజవాడ రేడియో స్టేషన్ కు వెళ్లి వెంకటరావు గారి పై రాసిన వ్యాసంచదివి రికార్డ్ చేశాను. అది ఒకవారం లోనే ప్రసారమైంది .

   సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-7-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.