డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -8
బళ్లారిలో గాంధీజీ
1921లో గాంధీ బళ్ళారి వచ్చాడు తిరుమల రామచంద్రగారు వారి తాతగారు ఆయనమిత్రులు అందరూ ఒక రోజు ముందే బళ్ళారి వెళ్లి ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారింటికి పూర్వ పరిచయం తో వెళ్లారు .వీరి నివాసం ఒక పెద్ద హవేలీ బహిరంగ సభలు నాటకాలు వగైరా అన్నీ ఆ బంగ్లాచుట్టూ ఉన్న మైదానం లోనే జరిగేవి .దానిపేరు ‘’బంగ్లా కాంపౌండ్ ‘’.కొన్ని వేలమంది విశాలంగా కూర్చునే మైదానం అది .గాంధీకి స్వాగతం ఏర్పాట్లు ఈ కాంపౌండ్ లోనే జరిగాయి .అందుకని గాంధీని దగ్గర గా చూసే అవకాశం రామచంద్రగారికి దక్కటం తన అదృష్టం అన్నారాయన .కాంపౌండ్ లో ఒక పెద్ద వేదిక ,బల్లలు వేసి తెల్లటి ఖద్దరు గౌనులు ,పల్చని పరుపులు పరచి దిండ్లు పెట్టారు .మైదానం అంతటా వెదుళ్ళు నాటి తోరణాలు పూలమాలలు అలంకరించారు .ప్రవేశ ద్వారానికి రాట్నాల తోరణం కట్టి శోభ తెచ్చారు .మైకులు ఆనాటికి లేవు .ప్రతివీధిని అరటి స్తంభాలు జెండాలు ,రంగు తోరణాలతో అలంకరించారు .ఊరంతా ఆనంద హడావిడే .
మర్నాడు మధ్యాహ్నానికి రైలులో గాంధీ ధార్వాడ వచ్చి ,అక్కడినుంచి ఫోర్డ్ కారు లో బళ్ళారి వచ్చి ఆచార్యుల వారి కాంపౌండ్ కు చేరారు .ఆచార్యులవారి చివరి అబ్బాయి భోగీంద్ర నాథ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు .ఆయన కాశీ విశ్వ విద్యాలయం లో ఇంజనీరింగ్ చదివి వచ్చాడు .హిందీ బాగా మాట్లాడే వాడు .మైదానమంతా జనంతో క్రిక్కిరిసిపోయింది .చుట్టుప్రక్కగ్రామాలజనం కూడా బాగా వచ్చారు .’’గాంధీజీ జై ‘’నినాదాలు మిన్ను ముట్టాయ్.గాంధీ వెంట ప్రముఖులు చాలామంది వచ్చారు .రామకృష్ణమాచార్యులవారి బంగ్లాలో ఉన్న వారికి వేదిక దగ్గరగా స్థలం కేటాయించారు .కనుక రామచంద్రగారికి ఇబ్బంది కలగలేదు’ .గాంధీజీ హిందీలో అయిదే అయిదు నిమిషాలు మాట్లాడాడు .దాన్ని భోగీంద్ర నాథ్ తెలుగులోకి అనువదించాడు .త్వరలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనఉద్యమాలు జరుగుతాయని ,వాటికి ప్రజలు యధాశక్తి ఆర్ధికసాయం చేయాలని,వాలంటీర్లను తయారు చేసి పంపాలని ,స్త్రీపురుషులంతా ఖద్దరు కడితే నెలరోజుల్లోనే స్వరాజ్యం వస్తుందని,స్వరాజ్యం వచ్చేదాకా ఆడవారు నగలు ధరించవద్దని ,మగవారు విలాస వస్తువులు వాడరాదని ,సోదరీమణులు ,తల్లులు ఉద్యమానికి తమ నగలు దానం చేయాలని ,అవసరమైతే ఎలాంటి ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడాలని గాంధీ ఉపన్యాస సారాంశం.
‘’మహిళలు త్యాగం చేయాలి, విరాళాలు ఇవ్వాలి ‘’అన్నమాట మహాత్ముని నోటి వెంట రావటం ఆలస్యం ,ప్రేక్షకులలో ఉన్న వందలాది స్త్రీలు వేదిక వద్దకు వచ్చేశారు .చేతుల బంగారు గాజుల మెడలోని హారాలు చెవికమ్మలుఒలిచి దూసి ఇచ్చారు .ముక్కుల నత్తులు,జడబిల్లలు ,ముక్కు పుడకలు తీసిచ్చారు .ఈ అత్యాశ్చర్యకర దృశ్యం చూసి రామ చంద్ర అమితాశ్చర్య పోయారు .గాంధీ ప్రభావం ఏమిటో అర్ధమైంది .ఎర్రగుడి శ్రీనివాసాచార్యులు అనే ఈయన బంధువు గారి భార్య కమలమ్మగారు ,కొంగు నడుముకు దోపుకొని వచ్చి ,తన రెండు చేతుల బంగారు గాజులూ దూసి గాంధీ చేతుల్లో పోసింది .ఆమెను అభినందించి అందరూ ఆమెను ఆదర్శం గా తీసుకోవాలని గాంధీ అన్నాడు.ఒకాయన ఇచ్చిన విరాళాల వివరాలు రాసుకుంటున్నాడు .ఈ విరాళాల వెల్లువ కనీసం మూడు గంటలపాటు సాగింది .పెద్ద బియ్యంబస్తా సంచీ అంతా నగలతో నిండిపోయింది .తర్వాత 1932-33 గాంధీ మద్రాస్ లో నెలరోజులు ఉంటె ,రోజూ ఆయన ఉపన్యాసానికి వెళ్లి చూశారు రామచంద్ర .
సత్కార్య సాధనకు సత్యాధనాలు ఉండాలనే గాంధీ సిద్ధాంతానికి ఆయన రాసిన వీలునామా గొప్ప దృష్టాంతం .అదేకాదు ఆయన జీవితమంతా దృష్టాంతమే అంటారు తిరుమల రామచంద్ర .సత్యశోధన గాంధీ జీవితానికిమెరుగులు దిద్దింది.
‘’సూనృతం సర్వ శాస్త్రార్ద –నిశ్చితజ్ఞాన శోభితం –భూషణం సర్వ వచసాం –లజ్జేవ కుల యోషితాం’’
భావం –అన్ని శాస్త్ర చర్చలలో నిగ్గు దేలిన జ్ఞాన శోభగల సత్యం –సకల వాక్కులకు ,కుల స్త్రీలకు సిగ్గరితనం లాగా భూషణం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-7-20-ఉయ్యూరు