మూలకారణ శక్తి వేదవతి
కృశధ్వజుడు అనే ముని భార్య మాలావతి .ఆయన ఒక రోజు వేదం చదువుతుంటే పుట్టిన కుమార్తె వేదవతి.పుట్టినప్పుడు పురిటి గదిలో వేదం ధ్వని వినిపించింది కనుక వేదవతి అని పేరు పెట్టారు .ఆమెను విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేయాలని తండ్రి అందరికీ చెప్పేవాడు ఒక రాక్షసుడు ఈమెను మోహించాడు పెళ్లి చేసుకొంటానని మునిని అడిగితె ఆయన తిరస్కరించాడు .కోపం వచ్చి ఆయన్ను చంపాడు దైత్యుడు .ముని పత్ని దుఖాన్ని భరించలేక వేదవతిని ఒంటరిదాన్ని చేసి మరణించింది .తల్లిదండ్రులిద్దర్నీ పోగొట్టుకొన్న ఆమె తపస్సు చేయాలని నిశ్చయించుకొని తీవ్ర తపం చేస్తుండగా , మహాభుజములు గల రావణుడు భూమి మీద సంచరిస్తూ హిమవత్పర్వత ప్రాంతారణ్యానికి వెళ్ళి అక్కడ దేవతాకన్యవలె ప్రకాశిస్తున్న ఒక కన్యకను చూశాడు . ఆమె వేదప్రోక్తములైన నియమాలు పాటిస్తూ ,, కృష్ణాజినమును, జటలను ధరించి ఉంది . ఆ రావణుడు గొప్ప నియమమును అవలంబించి ఉన్న మంచి సౌందర్యముగల, ఆ కన్యను చూడగానే కామమోహములతో నిండిన మనస్సుతో నవ్వుతూ ”మంగళప్రదులారా! ఏమిటి? నీవు నీ యౌవనమునకు విరుద్ధముగా ప్రవర్తిస్తు న్నావు ? నీ ఈ సౌందర్యమునకు విరుద్ధముగా ఇట్టి ప్రవర్తన యుక్తము కాదు కదా! సాటిలేని నీ రూపము పురుషులకు కామోన్మాదమును కలిగించునది. తపస్సు చేయుటకు తగినది కాదు. ఇది లోకప్రసిద్ధమైన నిర్ణయము కదా ఓ! భద్రులారా! నీవు ఎవరిదానవు. నీ భర్త ఎవరు? నిన్ను అనుభవించు పురుషుడు
లోకములో పుణ్యాత్ముడు. నీవీ తపస్సు ఎందుకు చేస్తున్నావు . నాకు అంతా చెప్పు” అని అడిగాడు .
తపోధనురాలైన ఆ కన్య రావణుని మాటలు విని, వానికి యథాశాస్త్రముగా ఆతిథ్యమిచ్చి- ”గొప్ప తేజస్సు కలవాడు, శోభావంతుడు అయిన కుశధ్వజుడనే బ్రహ్మర్షి నా తండ్రి. నిత్యమూ వేదాభ్యాసము చేయు ఆ మహాత్మునకు వేదవాజ్ఞ్మయ స్వరూపిణినైన నేను కన్యగా పుట్టాను. నా పేరు వేదవతి. అప్పుడు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు నా తండ్రి దగ్గరకు వచ్చి తమకు నన్ను ఇమ్మని అడిగారు. నా తండ్రి నన్ను వాళ్ళకి ఇవ్వలేదు. అందుకు కారణము చెప్తా విను . దేవతల ప్రభువు, మూడులోకాలకు అధిపతి అయిన విష్ణువు తన అల్లుడు కావలెనని నా తండ్రికి కోరిక ఉండేది . అందుచే ఆయన నన్ను మరెవ్వరికీ ఇవ్వటానికి అంగీకరించలేదు. శంభువు అనే దైత్యరాజు ఇందుకు కోపించాడు
ఆ పాపాత్ముడు నా తండ్రిని రాత్రి నిద్రించుచుండగా చంపివేశాడు . మహాభాగ్యవంతురాలైన నా తల్లి దీనురాలై నా తండ్రి శరీరమును కౌగిలించుకొని అగ్నిలో ప్రవేశించి౦ది . నారాయణుణ్ణి గురించి మా తండ్రికి ఉన్న మనోరథమును సత్యమైన దానిని చేయాలని నిశ్చయించుకుని నేను ఆ నారాయణుడినే హృదయములో నిలుపుకుని ఉన్నాను. ఈ విధముగా ప్రతిజ్ఞ చేసి గొప్ప తపస్సు చేస్తున్నాను . ఈ విషయమంతా నీకు చెప్పాను. నాకు నారాయణుడే భర్త. అతడు తప్ప మరొక్కడెవ్వడూ కాదు. ఆ నారాయణుణ్ణి పొందాలనుకొనే కోరికచేతనే భయంకరమైన నియమమును అవలంబించి ఉన్నాను. రావణా! నీ గురించి నాకు అంతాతెలుసు . ఇంక వెళ్ళు. మూడులోకములలో ఉన్నది అంతా నాకు తపోబల౦ చేత తెలుస్తుంది ” అని చెప్పింది .
. మన్మథశరీరములచేత పీడింబడిన రావణుడు విమానాగ్రభాగము నుండి దిగి, గొప్ప తపస్సు చేస్తున్న ఆ కన్యతోమళ్ళీ – ”ఓ! సుశ్రోణీ! ఇట్టి ఆలోచన గల నీవు గర్వముతో ఉన్నావు. ఈ విధముగా తపస్సు చేయటం ముసలివాళ్ళకు మాత్రమే తగిన పని. సమస్తసద్గుణములు ఉన్నదానివి . మూడు లోకములలో సుందరివి అయిన నువ్వు ఇలా పలకటం తగదు . నీ యౌవనము దాటిపోతోంది. ఓ! మంగళప్రదురాలా! నేను లంకాధిపతిని. దశగ్రీవుడు అని ప్రసిద్ధిచెందిన వాడిని . అలాంటి నాకు భార్యవై నీవు సుఖ౦ గా భోగాలు అనుభవించు .. నీ విష్ణువు ఎంతటివాడు! నీవు కోరుతున్న విష్ణువు వీర్యము చేతగాని, తపస్సు చేతగాని, భోగము చేతగానీ, బలముచేత గానీ నాతో సమానుడు కాదు” అన్నాడు .
వాడి మాటలు విని వేదవతి ”అలా అనకు . అట్లానకుము”అని మళ్ళీ – ”రాక్షసరాజా! నీవు తప్ప బుద్ధిమంతుడైన మరెవ్వడైనా మూడులోకముల అధిపతీ, సర్వలోకములచేత నమస్కరింపబడువాడూ అయిన విష్ణువును అవమానిస్తాడా ?” అన్నది. ఆ వేదవతి ఇలా అంటూండగా రావణుడు చేతి చివరలతో ఆమె శిరోజాలను పట్టుకొన్నాడు. అప్పుడు వేదవతి కోపింఛి తనకత్తిలాంటి చేతులతో కేశాలను ఛేధించింది . . రోషముతో మండు తోందా అన్నట్లున్న ఆమె రావణుణ్ణి కాల్చివేస్తోందా అన్నట్లుగా చూస్తూ యోగాగ్నిని ఏర్పరుచుకుని, మరణించేందుకు తొందరపడుచూ రావణునితో “దుష్ట రాక్షసుడా! నీ నుండి అవమానము పొందిన పిమ్మట ఈ మలిన దేహంతో నేను జీవించటానికి ఇష్టపడను . నీవు చూస్తుండగానే అగ్నిలో ప్రవేశిస్తా . పాపాత్ముడైననువ్వు నన్ను వనములో అవమానించావు. అందువలన నిన్ను హతమార్చడానికి నేను మళ్ళీ జన్మిస్తాను. పాపనిశ్చయము గల పురుషుణ్ని స్త్రీ చంపజాలదు కదా? నీకు శాపమిస్తే నా తపస్సు వ్యయమై పోతుంది . నేను ఏదైనా మంచిపనికాని, దానముకాని, హోమము కానీ చేసి ఉంటె ,త్రికరణ శుద్ధిగా మహా విష్ణువునే ప్రేమిస్తూ ఉంటె దానికి ఫలితముగా వచ్చే జన్మలో అయోనిజమైన కుమార్తె గా ఒక ధర్మాత్ముడికి , పతివ్రతగా పుట్టి నిన్నూ ,నీ వంశాన్నీ సర్వ నాశనం చేస్తాను ” అని పలికి ప్రజ్వలిస్తున్న యోగాగ్ని లో ప్రవేశింఛి దగ్ధమైంది వేదవతి . అపుడు దివ్యమైన పుష్పవృష్టి కురిసింది ..
పద్మ౦ వంటి కాంతిగల ఆమె మరల పద్మ౦లో లంకలో జన్మిచింది . మొదట రావణుడికే కనిపించింది .మళ్ళీ . పద్మమధ్యభాగము వంటి కాంతిగల ఆ కన్యను గ్రహించి ఆ రావణుడు తన ఇంటికి తీసుకు వెళ్ళాడు . మంత్రికి చూపించాడు . సాముద్రికా లక్షణములు తెలిసిన మంత్రి ,జ్యోతిష్యులు ఆ శిశువును చూడగానే రావణునితో ”ఈమె నీ చావు కోసమే నీ గృహ౦ చేరి౦ది” అని చెప్పారు . ఆ మాట విని రావణుడు చేసేది ఆశిశువును ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రం లో విసిరేయించాడు .ఆపెట్టే క్రమంగా మిధిలానగరం చేరి భూమిలో నిక్షిప్తమైంది .జనకమహారాజు పుత్రేస్టి కోసం నాగలి దున్నుతుంటే ,ఆపెట్టే నాగలి చాలుకు తగిలితే, బయటికి తీయి౦చ గా అందులో రూపవతి ఐన కన్య కనిపిస్తే ,ఆమెకు నాగేటి చాలులో దొరికి నందున ‘’సీత ‘’అని పేరు పెట్టి కూతురుగా గాగారాబంగా పెంచుకొన్నాడు .కనుక సీత అయోనిజ .రావణ సంహారం కోసం ఇలా ఉద్భవించింది . కృతయుగ౦లొ వేదవతి అనే పేరుతో ఉన్న ఈమె త్రేతాయుగ౦ లో రావణు సంహారానికి మహాత్ముడైన జనకుని కి నాగేటి చాలులో దొరికి సీత పేరుతొ పిలువబడి అల్లారు ముద్దుగా పెరిగింది తరువాత జరిగిన రామాయణ కథ అంతా మనకు తెలిసిందే .
కనుక మూల కారణ శక్తి లక్ష్మీ దేవి అవతారమే వేదవతి అనే సీతా దేవి .మహాపతివ్రత .
‘’అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా
పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్.’’
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-20-ఉయ్యూరు