శిష్యుడు కాళీ ప్రసాద్ మరణం
సుమారు 55 ఏళ్ళ క్రితం శిష్యుడు ,నాకూ మా కుటుంబానికి అత్యంత విధేయుడు ”మాస్టారూ ”అంటూ నోరారా పిలిచే అమాయక వ్యక్తీ బెజవాడలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేసి రిటైరై , బారేజ్ దాటాక ఉన్న తాడేపల్లి ”మహానాడు ”ప్రాంతం లో స్వంత ఇల్లు కట్టుకొని భార్యా పిల్లలతో పూజా పునస్కారాలతో ఇద్దరబ్బాయిలు ,ఒకకుమార్తే తో అమ్మాయి పెళ్లి బాధ్యతా కూడా తృప్తిగా నిర్వహించి ,తన షష్టి పూర్తికి మమ్మల్ని ఆహ్వానించి నూత్నవస్త్రాలు ఇచ్చిన తర్వాతే కార్యక్రమం ప్రారంభించి ,ఎప్పుడు ఉయ్యూరు వచ్చినా కొడుకులతో ఇంటికి వచ్చిపలకరించి ఆశీస్సులు అందుకొంటూ ,వాళ్లకు కూడా మేము ఆత్మీయులమనే భావన కల్పిస్తూ ,నెలకో రెండు నెలలకో ఒక సారి ఫోన్ చేసి మాట్లాడుతూ తన ఆరోగ్య విశేషాలు తెలియజేస్తూహాయిగా కాలక్షేపం చేస్తూ , ,సరిగ్గా వారం క్రితం కూడా రెండు సార్లు మాట్లాడిన ప్రియ శిష్యుడు ”వంగవీటి శ్రీరామకాళీ వరప్రసాద్”(73) ,మూడు రోజులక్రితం అకస్మాత్తుగా మెదడు నరాల ఇబ్బందితో మణిపాల్ హాస్పిటల్ లో చేరి ,వాళ్ళ పెద్దబ్బాయి ప్రతి పూటా తండ్రి ఆరోగ్య విషయాలు చెబుతూ ,నిన్న ఉదయం ”మాస్టారూ !నాన్న గారి అవయవాలు అన్నీ పని చేయటం లేదు కోమాలో ఉన్నారు”మన సువర్చలాన్జనేయస్వామి అంటే నాన్న గారికి విపరీతమైన నమ్మకం దయుంచి ఆయన పేరిట స్వామికి పూజ చేయించండి ”అని ఏడుస్తూ చెబితే, ”కంగారు వద్దు అమ్మగారికి ధైర్యం చెప్పు ”అని ఓదార్చి , వెంటనే పూజారికి ఫోన్ చేసి అప్పటినుంచే రెండు పూటలా అతడి గోత్రనామాలతో పూజ చేయమని చెప్పి నిన్న సాయంత్రం నేనే ఫోన్ చేసి తెలుసుకోగా ,ఇవాళ ఉదయం కొడుకు ఫోన్ చేసి ”ఉదయం 9-30కు నాన్నగారు వెళ్ళిపోయారు మాస్టారూ మీ కళ్ళముందు మసలిన వ్యక్తీ మాకు దూరమయ్యారు ”అని దుఖం తో చెప్పాడు ధైర్యంగా ఉండమని ఓదార్చాను అంతకంటే ప్రస్తుత పరిస్థితులలో ఏమీ చెయ్యలేక .” కాళీ ”అని మేమందరం పిలిచే కాళీ ప్రసాద్ అత్య౦త వినయ సంపన్నుడు .మా ఇంట్లో ఒకడుగా ఉండేవాడు .ఉయ్యూరులో పాలపర్తి వెంకటరామయ్య గారి మేనల్లుడే కాళీ ప్రసాద్ .చాలా బాధ్యతగా సంసారం నిర్వహించాడు తండ్రి మరణించాక . అన్నగారి కుటుంబాన్నీ ఆదుకొన్నాడు .అతని కజిన్ రాజాకామేశ్వరి కూడా నా శిష్యురాలే .
కాళీ ప్రసాద్ ఆత్మకు శాంతి ప్రసాదించమని భగవంతుని కోరుతూ ,అతని కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను-దుర్గాప్రసాద్