’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-11
గొడుగు పాలుడి సాహస గాథ-2(చివరిభాగం )
కర్తవ్య నిష్టతో అంత సేపున్నాడు కాని గొడుగు పాలుడు విపరీతంగా అలసిపోయాడు .రాయల అప్పణ అయ్యాక , ఒళ్ళూపై తెలియలేదు. తలదిమ్ముగా ఉంది .ఎక్కడికి వెడుతున్నాడో తెలీదు ,తూలిపోతున్నాడు .అలా మైకం లో మైలున్నరనడిచి ఆకలి అలసట వేధిస్తుండగా ,ఉగ్ర నరసింహ ప్రక్కన ఉండే బడివే లింగ దేవాలయం లో దూరి అక్కడా ప్రదోషకాల పూజ అయ్యాక వడపప్పుతిని పానకం ,తాగాడు .తూలి పడ్డాడు.ఆపడటం తో లింగానికి తలతగిలి రక్తం వరదలై కారి స్పృహ తప్పింది .
గుర్రం మీద వచ్చినా రాయలూ బాగా అలసిపోయాడు. నిద్రపట్టింది అర్ధరాత్రి తర్వాత మెలకువ వచ్చి గొడుగుపాలుడు గుర్తుకొచ్చి ‘’గుర్రపు స్వారిపై వచ్చిన నాకే ఇ౦త అలసటగా ఉంటె గుర్రం కంటే ముందు పరిగెత్తిన ఆ బోయ బంటు ఎలా ఉన్నాడో ‘’అని ఆలోచించి దయ మనసులో తొంగి చూసి ,వెంటనే అతడిని వెదకటానికి బయల్దేరాడు రాయలు .ఆయనతోపాటు రాణివాసజనమూ బయల్దేరారు దివిటీలతో వెదకటానికి .రాజధాని అంతా గాలించాడు రాయలు ఇదిగో ఇక్కడ చూశాం అదుగో అక్కడ చూశాం అని ఇచ్చకపు మాటలు చెప్పారు ఎవరూ చూడకపోయినా .
చివరికి బడివే గుడిలో స్పృహ తప్పి పడిఉన్న గొడుగుపాలుడిని చూశాడు రాయలు అమాంతం వెళ్లి తలనుంచి రక్తం కారున్న అతడిని చూసి నిశ్చేస్టుడయ్యాడు .వైద్యుల్ని పిలిపించగా వచ్చి చూసి ఉష్ణ ఆధిక్యం వలన రక్తం తలకెక్కింది అత్యంత శ్రమతో కూడిన పని చేసిఉంటాడు .శక్తికి మించినపనితో రక్తనాళాలు ఉద్రేకం చెందాయి జలగలద్వారా చెడు రక్తం తీయి౦ చేసి శైత్యోప చారాలు చేస్తే స్పృహ వస్తుందన్నారు భిషగ్వరులు .అతడు వడపప్పు తిని పానకం తాగాడు కనుక శైత్యోప చారం సహజంగానే జరిగింది అరగంట సేపట్లో స్పృహలోకి వస్తాడు కనుక జలూక అనే జలగ చికిత్స అక్కర్లేదని రాజ వైద్యుడు చెప్పాడు .ఆయన మాటకు తిరుగు లేదు .అందరూ అతని స్పృహ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు .అలాగే అరగంట లో స్పృహలోకి వచ్చాడు గొడుగుపాలుడు .రాయలముఖం ప్రసన్నమైంది .అతడి సాహస గాథను అందరికీ వినిపించాడు ,విని వాళ్ళంతా తెల్లబోయారు .
రెండు రోజుల తర్వాత మళ్ళీ కొలువుకు సిద్ధమయ్యాడు గొడుగుపాలుడు.నిండు సభలో రాయలు అతడిని కర్పూర రతాంబూలం కానుకలతో సత్కరింఛి ‘’గొడుగుపాలా!నీ కిస్టమైంది కోరుకో ‘’అన్నాడు .అతడికి చాలాకాలంగా చేతినిండా దానాలు చేయాలనే కోరిక ఉంది .అది తీరాలంటే అస్తీ,అదికారం ఉండాలి ఇప్పుడు సమయం వచ్చింది ‘’మహారాజా !ఒక్క రోజు రాజ్యం ఇప్పించండి చాలు ‘’అన్నాడు .సభాజనం ‘’ఇదేం కోరిక ?రాయలవారికే ఎసరా ??’’అని గుసగుసలు పోయారు .’’ఒక రోజు రాజ్యం తో ఏం చేస్తావ్ ‘’రాయలుప్రశ్నించాడు నవ్వుతూ ‘’చేతి నిండా దానాలు చేస్తాను ప్రభూ .నా పేరు శాశ్వతం చేసుకొంటాను మీ గొడుగు నీడలో ‘’అన్నాడు వినయంగా .’’సరే ఇచ్చాను రేపే తీసుకో ‘’అన్నాడు ఉదాత్తంగా రాయలు
మర్నాడు జరగలేదుకాని మంచి ముహూర్తం చూసి రాయలు అతన్ని’’ ఏక్ దిన్ కా సుల్తాన్ ‘’చేశాడు .ఆరోజు సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం దాకా గొడుగు పాలుడే రాజు .అంతా అతడి ఇష్టం .అడ్డు పడేవారెవరూ ఉండరు .ఆ రోజు ఉషఃకాలం లో అతని ఇద్దరు భార్యలతో స్నానాదికాలు, పూజ ముగించి కొలువుకు వచ్చి సింహాసనానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అధిష్టించాడు ’’గొడుగుపాల మహారాజు’’ సింహాసనాన్ని .ఇరు పక్కలా భార్యలు కూర్చున్నారు ఏడుకోప్పెరల కరక్కాయ ,లక్కమసి (సిరా )చేయించాడు దానాలు ధారపోస్తూ దానపత్రాలపై ఆసిరాతో మొహర్లు వేయటం మొదలు పెట్టాడు .భార్యలు దానపత్రాలు సర్దుతున్నారు .నగరం లోనిబీదా బిక్కీ సింహద్వారం వద్ద బారులు తీరారు .కావలి తిమ్మన్నకు చేతి నిండాపని .ఆపగలూ రాత్రీ తిండీ తిప్పలూ లేకుండా ‘’దానేస్టి ‘’కొనసాగింది .తోలి కోడి కూసింది .గొడుగు పాలుడికి ఆదుర్దా పెరిగింది .వేగు చుక్కపొడిచి పైకెక్కే కొద్దీ ఉద్వేగం ఎక్కువైంది .దీనికి తోడూ సిద్ధం చేసుకొన్న సిరా కూడా అయిపొయింది ,కొత్త సిరా చేయించే వ్యవధి లేదు .అరుణోదయం అయింది .భార్యలను నోరు తెరవమన్నాడు వారి వక్కాకు తమ్మపై మొహరు అద్ది దానపత్రాలపై వేయటం మొదలుపెట్టాడు. చివరికి అదీ అయిపోయింది .సూర్యుడు గొడుగుపాలుడు ఏం చేస్తున్నాడో చూద్దామని క్షితిజం నుంచి తొంగి చూశాడు .తనజన్మ తరించిందని గొడుగుపాలుడు సంతోషించాడు .సింహాసనం దిగి భార్యలతోపాటు దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ,మళ్ళీ తెల్లగొడుగు పట్టుకొని రాయల కొలువుకు బయల్దేరాడు .అప్పుడే రాయలు సపరివారంగా ప్రవేశించాడు .గొడుగు పట్టుకొని నిలుచున్నట్లుఉన్న రాతి శిల్పాలు అతడు దానం చేసిన భూముల్లో ఇప్పటికీ బళ్ళారి అనంతపురం జిల్లాలలో కనిపిస్తాయి .కవిలకట్టేలలో కూడా అవి గొడుగుపాలుడు దానంగా ఇచ్చిన భూములు అని రికార్డ్ అయ్యాయి .
‘’అరై స్సందార్యతేనాభిః-నాభౌ చ ఆరాఃప్రతిస్టితాః-స్వామి సేవకయో రేవం –వృత్తి చక్రం ప్రవర్తతే’’
భావం –మనైన్తిలోని పెట్టె బండీఒంటెద్దు ,రెండెడ్ల బండీల చక్రాలు ఉంటాయి రోజూ చూస్తూనే ఉంటాం .చక్రం గుండ్రం గా ఉండి,మధ్యలో లావుపాటి తూము ఉంటుంది .దాన్ని బండి కంటి తూము అనీ లేక కుంభి అనీ అంటారు .దీని చుట్టూ కర్రలు బిగి౦చి ఉంటాయి. వీటిని ఆకులు అంటారు .సంస్కృతం లో’’ అర’’ అంటారు .చక్రం కు౦భికి ఆకులు బిగిస్తారు .ఆకులతో కుంభి నిలబడుతుంది అనిభావం .అంటే ప్రపంచం లో ప్రతిదీ అన్యోన్య ఆశ్రయాలు .ప్రతివాడుఇతరులతొ సామరస్యంగా మెలగాలి .ఒక్క ఉద్యోగమే కాదు అన్నీ పరస్పరాశ్రితాలే అని తాత్పర్యం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-20-ఉయ్యూరు