ప్రపంచ దేశాలసారస్వతం
203-అమెరికాదేశసాహిత్యం-1
అమెరికన్ సాహిత్యం ఆ దేశ చరిత్రతో పాటు వృద్ధి చెందింది .దాదాపు నూటయాభై ఏళ్ళు అమెరికా అంటేఉత్తర అమెరికా పశ్చిమం వైపు ధైర్యం తో వెళ్లి నిలబడిన కొన్ని కాలనీల సముదాయాలే .మాతృదేశం కోసం జరిగిన తిరుగుబాటులో అమెరికా చివరికి యునైటెడ్ స్టేట్స్ ఆ ఫ్అమెరికా గా రూపు దాల్చింది .19వ శతాబ్ది చివరకు ఆఖండం దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు ,సమాంతరంగా ఉత్తరానికి ,పడమటి వైపు ఫసిఫిక్ సముద్రం వరకు విస్తరించింది.ఆ శతాబ్దానికి మంచి శక్తి సంపన్న దేశంగా అభి వృద్ధి చెందింది .దీనితో మొదటి రెండు ప్రపంచయుద్ధాలలో కీలక పాత్ర పోషించింది .సైన్స్ ,టెక్నాలజీ అభి వృద్ధి చెంది పారిశ్రామికంగా బలపడి ,ఆలోచనా విధానాలలో మార్పు వచ్చి ,ప్రజజీవితాలలో గణనీయ మార్పులు వచ్చాయి .ఇవన్నీ అమెరికా సాహిత్యం తో ముడిపడి ఉన్నవే .
ప్రస్తుతం 17వ శాతాబ్దినుంచి21వ శతాబ్దం వరకు అమెరికన్ సాహిత్యం లో వచ్చిన కవిత్వం నాటకం కాల్పనిక రచన ,సాహిత్య విమర్శ విషయాలను మాత్రమె తెలుసుకొందాం .అంతకు ముందు వరకు ఉన్న స్థానిక లేక దేశీయులలో ఉన్న మౌఖిక సాహిత్యం అంతా’’నేటివ్ అమెరికన్ లిటరేచర్ ‘’లో దొరుకు తుంది .17వ శాతాబ్దినుంచి వచ్చిన సాహిత్యం లో కొందరు ఆఫ్రికన్ అమెరికన్ లసాహిత్యం కొంత ఉన్నా పూర్తిగాలోతుగా తెలుసుకోవాలంటే ‘’ఆఫ్రికన్ అమెరికన్ లిటరేచర్ ‘’చదవాలి .అమెరికన్ సాహిత్యం లో ఉన్న సాహిత్య సంప్రదాయాలు అవగాహన చేసుకోవాలంటే ‘’ఇంగ్లిష్ లిటరేచర్ అండ్ కనడియన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లిష్ ‘’చదివి తెలుసుకోవాలి .
17వ శతాబ్ది అమెరికన్ సాహిత్యం
అమెరికన్ సాహిత్య చరిత్ర యూరప్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడే వారితో ప్రారంభమై అమెరికా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు దాకా నడుస్తుంది .కనుక మొట్టమొదటి అమెరికన్ సాహిత్యం అంటే కాలనీ ఇంగ్లీష్ రచయితలు రాసిన ఆంగ్ల సాహిత్యమే .జాన్ స్మిత్ అనే సైనికుడు రాసినదానితో అమెరికన్ సాహిత్యం ప్రారంభమై ఆయనకే ఆ గౌరవం దక్కుతుంది .ఆయన రాసిన పుస్తకాలు –ట్రూ రిలేషన్ ఆఫ్ వర్జీనియా -1608 ,దిజనరల్ హిస్టరీ ఆఫ్ వర్జీనియా,న్యు ఇంగ్లాండ్ అండ్ సమ్మర్ ఐల్స్ 1624.ఇందులో రచయిత స్వంత డబ్బా అధికంగా ఉన్నా ,ఇంగ్లీష్ జాతికి ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేసే అవకాశాలను బాగా వివరించాడు .డేనియల్ డెల్టన్’’బ్రీఫ్ డిస్క్రి ప్షన్ ఆఫ్ న్యూయార్క్ -1670,విలియం పెన్ –బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ది ప్రావిన్స్ ఆఫ్ పెన్సిల్వేనియా -1682,ధామస్ ఆషే’’కారోలీనా ‘’-1682 ముఖ్యమైన పుస్తకాలు రచయితలూ .వీరంతా తమ రచనలలో అమెరికా ఆర్ధిక వికాసానికి తోడ్పడుతుందని ఎలుగెత్తి చెప్పారు ఇంగ్లీష్ వారికి .
ఈ రచయితలలో కొందరు బ్రిటిష్ దేశానికి సార్వభౌమాదికారానికి వీర విధేయులు .కొందరు ప్రభుత్వం చర్చి రాజ్యం లలో జోక్యం చేసుకోవటాన్ని నిరశించారు .ఈ భావాలను నేధానియాల్ వార్డ్ ఆఫ్ మాసా చూ సెట్స్ బే రాసిన ‘’ది సింపుల్ కాబ్లార్ ఆఫ్ అగ్గవాం ఇన్ అమెరికా -1647లో కనిపిస్తాయి .దీనికి వ్యతిరేకంగా కన్జర్వేటివ్ భావాలు కూడా ప్రచురితమైనాయి ,జాన్ విన్త్రాప్ 1630-49లో రాసిన ‘’జర్నల్ ‘’లో మాసా చూసేట్స్ బె ధియోక్రాటిక్ వాళ్ళు బైబిల్ ఆధారిత ‘’గాడ్ ‘’హెడ్ గా ‘’రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని రాశాడు .దీన్ని బలపరచినవరిలో ఇంక్రీజ్ మాదర్ ,అతడికొడుకు కాటన్ ఉన్నారు . విలియం బ్రాడ్ ఫోర్డ్ ‘’ఎ హిస్టరీ ఆఫ్ ప్లిమౌత్ ప్లాంటేషన్ 1646లో రాశాడు .అతని పిల్గ్రిం సెపరేటిస్ట్ లు పూర్తిగా ఆంగ్లికనిజం నుంచి విడిపోయారు .ఇతడికంటే రాడికల్ రోజేర్ విలియమ్స్ అనేకవివాదాస్పద ధారావాహిక కరపత్రాలు రాసి చర్చి తో , ఆంగ్ల రాజ్యం తో విడిపోవటమే కాక ప్రజా బలాన్ని ,విభిన్న మతాల మధ్య సామరస్యాన్నిఉద్బోధించాడు.
17 వ శతాబ్ది సాహిత్యం లో జీవితచరిత్రలు ,ఒడంబడికలు ,యాత్రా విశేషాలు ,మత ధర్మాలు చోటు చేసుకొన్నాయి .నాటకం ఫిక్షన్ లో రచనలు నామమాత్రమే .కారణం వీటిపై చులకన భావమే .కాని 1640లో ‘’బే సాలం బుక్ ‘’ లో నూ మైకేల్ విగ్లస్ వర్త్ రాసిన ‘డాగెరల్ వెర్స్’’లో కాల్వేనిక్ విశ్వాసం పై’’ ది డే ఆఫ్ డూమ్’’వంటి మంచి ఉత్తమ కవిత్వం రాశారు .మాసాచూ సెట్స్ కు చెందిన అన్నే బ్రాడ్ స్ట్రీట్ కొన్ని లిరిక్స్ ‘’ది టెన్త్ మ్యూజ్ లేట్లిస్ప్రంగ్ అప్ ఇన్ అమెరికా ‘’1650లో రాసి ముద్రించింది .ఇందులో మత౦ పై ఆమె విశ్వాసాలతో పాటు తన కుటుంబం గురించి కూడా రాసింది . వీరందరి కంటే ఉత్తమ ఉదాత్త కవిత్వం ఎడ్వర్డ్ టైలర్అనే ఇంగ్లాండ్ జాతీయుడు మినిస్టర్ వైద్యుడు బోస్టన్ లో,వెస్ట్ ఫీల్డ్ లలో ఉంటూ రాసి నా, 1939వరకు ఎవరూ గుర్తించలేకపోయారు .క్రైస్తవం పై తనకున్న నమ్మకాలను,అనుభవాలను ఇందులో ప్రతిఫలింప జేశాడు కవితారూపంగా .17వ శతాబ్దం లో వచ్చిన సాహిత్యం అంతాపూర్తిగా బ్రిటిష్ రచనలే .జాన్ స్మిత్ జగ్రాఫికల్ సాహిత్యం, జార్జి ఫోర్డ్ కింగ్ జేమ్స్ బైబిల్ ను అనుకరిస్తే ,మాదర్స్ ,రోజర్స్ లు మెరిసే వచన రచనలు చేశారు .అన్నేరాసిన కవితా శైలి బ్రిటిష్ కవులు స్పెన్సర్ ,సిడ్నీల శైలీ విధానమే .టైలర్ మాత్రం మెటాఫిజికల్ కవిత్వాన్ని జార్జి హెర్బర్ట్ ,జాన్ డోన్నెల్లాగా రాశాడు .ఈ మొదటి 17వ శతాబ్దం సాహిత్యమంతా ఒకరకంగా బ్రిటిష్ సాహిత్యమే తప్ప ‘’నేటివిటి లేనిదే’’అయింది .దీని తర్వాత 18వ శతాబ్ది సాహిత్యం గూర్చి తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-20-ఉయ్యూరు