ప్రపంచ దేశాల సారస్వతం
203-అమెరికాదేశ సాహిత్యం
18వ శతాబ్దం అమెరికన్ సాహిత్యం -2చివరి భాగం )
నూతన దేశం
యుద్ధం తర్వాత కాలం లో పైన చెప్పిన మహామహులు పైన్ ,ఆడమ్స్ లు దేశ నిర్మాణానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వలేక పోయారు .కొత్తవారి సలహాలు అవసరమయ్యాయి .బెంజమిన్ రాజ్యా౦గ సమావేశం ఏర్పాటుకు దోహదం చేశాడు .కాని వీరికి భిన్నమైన రచయితలు ధామస్ జెఫర్సన్ ,ఫెడరలిస్ట్ పేపర్స్ లో రచయితలూ నాయకులయ్యారు .1787నుంచి ఒక సంవత్సరకాలం లో 85 ఆర్టికల్స్ ప్రచురింపబడ్డాయి .వీటిని అలేక్జాండర్ హామిల్టన్,జేమ్స్ మాడిసన్ ,జాన్ జే రాశారు .ప్రభుత్వం నడపటానికి దేశం బలపడటానికి మంచి పరిపాలనకు వారి వ్యాసాలూ బాగా తోడ్పడ్డాయి . శాసన సభ్యులను ప్రభావితం చేసి కొత్తరాజ్యా౦గానికి వోట్లు ఎక్కువగా పడేట్లు కృషి చేశాయి . హామిల్టన్ 51 ఫెడరలిస్ట్ పేపర్స్ రాసి ఫెడరలిస్ట్ పార్టీ మొదటి సెక్రెటరి ఆఫ్ దిట్రెజరీ -1789-95 అయ్యాడు .తన వ్యాసాలతో జాతీయ ప్రభుత్వం శక్తి సామర్ధ్యాలు రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులతో పెంచాడు .
జఫర్సన్ చాలా ప్రభావ శీల రాజకీయ రచయితగా యుద్ధకాలం లోనూ ఆతర్వాత గుర్తింపు పొందాడు .ఆయన రాసిన ‘’ది మెరిట్స్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఇండి పెండేన్స్’’గురించి మాడిసన్ చెప్పినట్లు ‘’తేలికగా అర్ధమయ్యే మానవ హక్కుల గొప్ప ప్రసార సాధనం.అమెరికా ప్రజలకు ఆసందర్భానికి తగిన శైలీ అభివ్యక్తి ఉన్న అద్భుత రచన ‘’.యుద్ధం తర్వాత ఆయన సరైన సిద్ధాంతాలను ,రాజ్యాంగం పై ఉన్న విశ్వాసాలను పేపర్లలో రాస్తూ ,తన ఉత్తరాలలో ,ప్రారంభ ఉపన్యాసాలలో వ్యక్తీ స్వేచ్చను ,స్థానిక స్వయం ప్రతిపత్తినీ ఎలుగెత్తి చాటాడు.హామిల్టన్ భావాలకు నమ్మకాలకు విభిన్నమైన పాలనా వికేంద్రీకరణ ,శక్తివంతమైన ఫెడరల్ ప్రభుత్వం అవసరాలను వివరించాడు .మనుషులంతా సమానమే అని నినదించినా, ప్రభుత్వ యంత్రాంగం లో సద్గుణాలు, ప్రతిభ ఉన్న వారికే ఉన్నతపదవులు ఉండే ‘’నేచురల్ అరిస్టాక్రసి ‘’ ఆంటే సహాజ ఉన్నత వర్గపాలన ఉండాలన్నాడు .
ఈకాలం లోని గుర్తింపుపొందిన కవులు ,కవిత్వం గురించి తెలుసుకొందాం .అమెరికన్ రివల్యూషన్ కాలం లో కవిత్వం విదేయులకు ,కాంటి నెంట లిస్టులకు కూడా తమభావ ప్రకటనకోసం ఒక గొప్ప ఆయుధం అయింది.తమవాదాలు తెలియజేయటానికి తమహీరోలను పొగడటానికి పాటలు రాయటానికి సాధనమైంది.అలా వచ్చినవే ‘’యాంకీ డూడిల్’’,నాధన్ హీల్,ది ఎపిలాగ్ ‘’.ఇవన్నీ పాప్యులర్ బ్రిటిష్ మెలడీలలో లో కూర్చి ,ఆనాటి బ్రిటిష్ కవితల్లాగా రాసి సమ్మోహనం కల్గించారు .ఆకాలపు విఖ్యాత అమెరికన్ కవి ఫిలిప్ ఫ్రెన్యుమొదటి రివల్యూషనరి యుద్ధ గాథలను గొప్ప ప్రచార సాధనాలుగా ఉపయోగించాడు .ఆ తర్వాత ఆయన అనేక విషయాలలో చొరవ చూపాడు .నియో క్లాసిక్ శైలిలో రాసినా, రాసిన కవితలలో ‘’ది ఇండియన్బరీయింగ్ గ్రౌండ్ ‘’,ది వైల్డ్ హనీ సకిల్ ,’’టు ఎ కేటి-డిడ్,’’ఆన్ హనీ బీ ‘’కవితలు రొమాంటిక్ లిరిక్స్ గా వైభవం పొంది 19 వ శతాబ్దం కవిత్వానికి నాంది పలికాయి .
18వశతాబ్ది చివరి ఏడాదిలో చారిత్రాత్మక నాటకాలు నవలలు వచ్చాయి .అమెరికాలో చాలాకాలం నుంచి నాటక శాలలు క్రియా శీలంగా ఉన్నా ,నిజమైన మొదటి అమెరికన్ కామెడీ’’కాంట్రాస్ట్’’ను రాయల్ టేలర్ 1787లో రాశాడు .ఇందులో బ్రిటన్ కుచెందిన గోల్డ్ స్మిత్ ,షెరిడాన్ ల అనుకరణ బాగా ఎక్కువే అయినా’’ మొదటి యాంకీ ‘’పాత్ర కల్పన చేసి తర్వాత రాబోయే అలాంటి పాత్రలకు భూమిక గా చేశాడు . దీనితో మొదటిసారిగా అమెరికన్ నేటివిటి ఉన్న పాత్ర సృష్టి చేసి , మార్గ దర్శి అయ్యాడు .
విలియం హిల్ బ్రౌన్ మొదటి అమెరికన్ నవల ‘’ది పవర్ ఆఫ్ సింపతి’’1789 లో రాసినవలారచనపై అప్పటిదాకా ఉన్న పాత పక్షపాత,ఉపేక్షా దృష్టిని అధిగమించి, సెంటిమెంట్ దట్టించి ,ఎలా కొత్తమార్గంలో పయని౦చాలో చూపాడు .దీనితో సెంటిమెంటల్ నవలా వెల్లువ 19వ శతాబ్దం చివరిదాకా అవిచ్చిన్నంగా సాగింది హాగ్ హెన్రి బ్రాకెన్ రిడ్జ్ రచయిత సేర్వాన్టేస్ రాసిన ‘’డాన్ క్విక్సోట్’’,హెన్రి ఫీల్డింగ్ రచనలకు దీటుగా ‘’మోడరన్ షివల్రి’’ 1792-1815 రాసికొంత విజయం సాధించాడు .ఇందులో ప్రజాస్వామ్యంపై హాస్యాత్మక సెటైర్ తోపాటు ఆసక్తి గా సరిహద్దు ప్రజాజీవనం ను వర్ణించాడు .చార్లెస్ బ్రాక్ డెన్ బ్రౌన్ రాసిన ‘’వీలాండ్ -1798,ఆర్ధర్ మెర్విన్ -1799-1800 హెడ్గార్ హన్తి 1799లు జాతీయ గోథిక్ ధ్రిల్లర్ లుగా అనిపిస్తాయి .తర్వాత 19వ శతాబ్ది సాహిత్యంగురించి తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-20-ఉయ్యూరు