తిరుమల రామ చంద్రగారి శారీరకలోపాలు
రామచంద్రగారికి నత్తి ఉండేది .ఆందోళన కలిగితే త్వరగా మాట్లాడ బోతే ,భావోద్వేగం పెరిగితే మాటలు తడబడి నత్తి మాటలు వచ్చేవి .వాళ్ళ ఊర్లో ముక్కుతోమాట్లాడే నరసింహాచారి ని ఈయన ఈయన స్నేహబృందం ‘’అనునాశికా చారి ‘’అని ఎక్కిరించేవారు. అందుకే దానిఫలితమ్గా తనకు నత్తి వచ్చి ఉంటుందని రామచంద్ర పశ్చాత్తాప పడ్డారు .ఇదివరకు ఈయనకు చెవిలో పోటూ,అరచేతిలో పండూ డూ , నిద్రలో నడకజబ్బులు ఉంటె గురువుగారు శ్రీనివాస రాఘవాచార్యులు చిట్కా వైద్యం చెప్పి పోగొట్టారు .చెవిలో పోటుకు ‘’నిర్గు౦డ్యాది తైలం ‘’నిర్గుండఅంటే వావిలి ,అరచేతిపుండుకు ‘’గంధకాది లేహ్యం ‘’,నిద్రలో నడకకు ‘’నారికేళా౦జనం’’వాడమని చెప్పారు .ఈ అంజనం ఎలా తయారో వివరించారు .వందకొబ్బరికాయలు కొట్టి ,ఆ కొబ్బరినీటిని కళాయి ఉన్న గంగాళం లో పట్టి, కాచి వడపోసి ముద్ద చేసి ,పచ్చకర్పూరం కుంకుమపువ్వు గోరోచనం కొద్దిగా లవంగాలు బాగాకలిపి నూరి ఆముద్దకు కలిపి మళ్ళీ నూరి తే పది ఔన్సుల నారికేళ అంజనం తయారయింది .ఈ మూడు చికిత్సలు ఏక కాలం లో చేయించారు . పొన్నగంటికూర ,అవిసె కూర ,చిర్రికూర ,అవిసేపువ్వులు ,ఉస్తికాయలు ,కాకరకాయలు పధ్యం గా ఐదారు నెలలు ఆ మందులు వాడించారు .గురువుగారే అన్ని ఉపచారాలు చేశారు, చేయిచారు .దీనితో నిద్రలో నడిచే జబ్బుకూడా మాయమైంది
తిరుపతి కళాశాలలో చేరాక నత్తి ఆయన్ను నవ్వులపాలుచేసి ఇబ్బందిపెట్టింది .ప్రవేశం కోసం రఘువంశం లో నాలుగవసర్గ మొదటి శ్లోకం చదివి అర్ధ తాత్పర్యాలుచెప్పమన్నారు పరీక్షకులు .అదంతా కొట్టినపిండే ఐయినా కాలేజీలో చేరబోతున్నాననే భావా వేశం లో నత్తి ముంచుకొచ్చి అలానే చదివారు .అర్ధతాత్పర్యాలు బాగానే చెప్పినా స్పష్టత లేకపోయిందే అని బాధపడ్డారు.. ‘’శ్శ్లో శ్లోశ్లో కం లో ఆఆఆఆఅ అలంకారాలు చేచేచేప్పలేదండి .త్తుత్తుత్తుల్య యోగిత అల౦కార మండి.ద్దీద్దీద్దీపకాలంకారం కూడా చ్చేచేప్పోప్పో చ్చండి ‘’అన్నారు .ప్రిన్సిపాల్ గారు ‘’నాయనా ! నీ సంగీతం చాలు .అడ్మిషన్ ఇస్తున్నాము మమ్మల్ని చంపకు ‘’అన్నారు నవ్వుతూ .దీన్ని అలుసుగా తీసుకొని సహచరులు ‘’ఒరేనత్తోడా ,నత్వా చార్య ,నత్తిస్వామీ ‘’ అని గేలిచేసి ఆటపట్టిచేవారుకోపం .వచ్చినా,దిగ మింగుకొనే వారు రామ చంద్ర .ఎవరైనా ఇలా అంటే నవ్వేయటం అలవాటు చేసుకొన్నారు .పత్రికాఫీసులో పై వాళ్ళు అధికారం చెలాయించినా నవ్వేసే వారు .వాళ్లకు ఒళ్ళు మండి’’ఎందుకా వెకిలి నవ్వు ‘’అనేవారు .ఈయన వెంటనే ‘’చేయని తప్పుకు ఆక్షేపణ అర్హమైనప్పుడునవ్వ కుండా యేడిస్తే మీకు మరీ ఇది అవుతున్దండీ ‘’అనేవారు .నవ్వు అందరికీ నాలుగు విధాల చేటు అయితే తనకు నలభై విధాల మేలు చేసింది అంటారు రామ చంద్ర .చదువులో ముందు ఉండటం ,నిజం చెప్పటం హనుమారాధన మాటతప్పకపోవటం పరోపకారం వంటి సుగుణాలకు మిత్రులు ఫిదా అయి ‘’నత్తోడా అనటం మానేశారు కాలేజీలో .
ఆసమయం లో వాసుదాసు అనే ఆంధ్రవాల్మీకి ఒంటిమిట్ట కోదండరామాలయ పునర్మించిన శ్రీ వావికోలనుసుబ్బారావు గారు తిరుపతి రాగా, ఆయన్ను చూద్దామని వెడితే భక్త శిష్యబృందవలయం లో ఉన్న ఆయన ఈయన్ను పట్టించుకోలేదు .తర్వాత రామచంద్రగారు ఆయనకు జాబురాస్తూ అందులో తాను ఆయన భక్తుడనని ఆర్యకదానిది వరుసగాచదివానని తనకు నత్తిబాగా ఉండి ఇబ్బంది పెడుతోందని రాశారు .ఆ లేఖ అందుకొన్న వాసుదాసు గారు స్వదస్తూరితో రెండు ఠావుల ఉత్తరం రాశారు వీరికి .ఆఉత్త రానని ఒంటరిగా మూడునాల్గు సార్లు తనివితీరా చదివారు అందులో సాహిత్య వైద్య చరిత్రాది వివరాలున్న అమూల్య లేఖ అని పించింది .
ఆ ఉత్తరం సారాంశం –‘’శారీరకమైన నత్తిఉందని బాధ పడవద్దు .ప్రపంచం లో నత్తివారు చాలామందే ఉన్నారు .వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకున్నారు .గ్రీసు దీశం లో గొప్ప వక్తలలో ఒకరికి నత్తి బాగా ఉండేది .మహామేధావి ఏదిమాట్లడదామన్నా, నోరు పెగిలేదికాదు .పిచ్చివాడు మూర్ఖుడు అని యెగతాళి చేశారు .తనలో తానూ కుమిలిపోయేవాడు ఒకసారి సముద్రానికి ఎదురుగా నిల్చుని గొంతెత్తి ‘’భగవంతుడా నా జీవితమంతా ఇంతేనా అవమానం పాలవటమేనా ??’అంటూ ఆవేదనతో అరిచాడు .అలా యెంత సేపు అరిచాడో తెలీదు కళ్ళు మూసుకొనీ అరిచాడు .అలాఅరుస్తూ అరుస్తూ వెనక్కి తిరిగాడు .అనర్గళంగా భగవంతులు స్తుతులు ఆ అరుపులూ వినిపించాయి .రెండు మూడు రోజులు గడిచాయి .కళ్ళు తెరిచాడు ఎదుట కను చూపు మేరవరకు పెద్ద గుంపు.తన్ను వెక్కిరించి చంపటానికి వచ్చారేమో అని భయపడ్డాడు .పారిపోయే ప్రయత్నం చేసి పారిపోయాడు జనం వెంటపరిగెత్తి పట్టుకున్నారు ‘’నన్ను చంపకండి నా వేదన భగవంతునికి మొరపెట్టుకొన్నాను .మిమ్మల్ని ఎవర్నీపల్లెత్తు మాటకూడా నేను అనలేదు ‘’అని గి౦జు కొన్నాడు .జనం ఆయనను సమాధానపరచి ‘’మహాను భావా !నువ్వు ఇంతగొప్ప వక్తవని అమూల్యమైన సూక్తులు కురిపిస్తావని మాకు తెలీదు .నువ్వు మహా తత్వ వేత్తవు ,మహావక్తవు క్షమించు మా అజ్ఞానానికి ‘’అన్నారు.
‘’ కనుక కంఠ౦ లో ధ్వనికి సంబంధించిన కండరాలలో లోపాలవలన నత్తి వస్తుంది .ఉప్పుగాలితగిలినా నీటి వాలు గాలి తగిలినా బాగు పడే అవకాశం ఉంది .కనుక చెరువుగట్టుమీదో కలువగట్టుమీదో నీటికి ఎదురుగా నిలబడి నీపుస్తకాలలో ఉన్న పద్యాలో శ్లోకాలో గట్టిగా అరుస్తూ చదువు .చిన్న కణిక రాళ్ళముక్కలను నోట్లోపెట్టుకొని చదివితే నరాల కదలికకుకండరాలలో మార్పు వస్తుంది .దీనితోపాటుసరస్వతీ ఘ్రుతం, సరస్వతీలేహ్యం తీసుకో. జానకీ వల్లభుడు మహావ్యాకరణ వేత్త బహుభాషాకోవిదుడు ఆంజనేయ స్వామి నీకు రక్షకులౌతారు ‘’అని చక్కని సలహా రాశారు వాసుదాసుగారు .
వెంటనే ఆచరణలో పెట్టారు రామ చంద్ర .తిరుచానూరు –రేణి గుంట మధ్య ఉన్న పెద్ద పుష్కరిణి దగ్గరకురోజూసాయంత్రం వెళ్లి కణిక రాళ్ళ ముక్కలునోట్లో పెట్టుకొని గట్టుమీద నీటికి ఎదురుగా నిలబడి వచ్చిన శ్లోకాలన్నీ నాన్ స్టాప్ గా బిగ్గరగా చదివే వారు .అయిదారు నెలల తర్వాత విశ్వాసం పెరిగి, క్రమంగా నత్తి మటుమాయమైంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-20-ఉయ్యూరు