మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’ శ్రీ అంజనప్ప స్వాములు
హోసూరు ప్రాంతం వరకవి శ్రీ కైవారం తాతగారు జగత్ ప్రసిద్ధులు వారి సమగ్ర చరిత్రను త్రవ్వి తీసి డా అగరం వసంత్ఒక పుస్తకాన్ని వెలువరించాడు .దాదాపు అంతటి ప్రసిద్దే ఉన్న శ్రీ అంజనప్ప స్వాములు గురించి ఆ ప్రాంతం వారికెవరికీ పెద్దగా తెలీదు .కాని ఆయన చరిత్ర కర్ణా కర్ణి గా విన్న వసంత్ లోని పరిశోధకుడు మేల్కొని ఆయన చరిత్ర అంతా సేకరించి పుస్తకం రాసి ఈ మార్చిలోనే ‘’హోసూరు వరకవి యోగి –శ్రీ అంజనప్ప స్వాములు’’ గా ప్రచురించి నాకు నెలక్రితమే పంపితే ఇవాళే చదివే తీరిక దొరికి చదివి అందులోని విశేషాలను మీకు తెలియజేస్తున్నాను .’’హోసూరు ఆంధ్ర పరిశోధక పరమేశ్వరుడు’’ డా.వసంత్ ను మనసారా అభినందిస్తున్నాను .
కర్నాటక కోలారుజిల్లా శ్రీనివాస తాలూకాలో గట్టుపల్లి గ్రామం లో అంజనప్ప స్వామి సమాధి ,ఆశ్రమం ఉన్నాయి .ప్రతి ఏడాది మార్చి –ఏప్రిల్ నెలలో ఆయన ఆరాధనోత్సవాలు జరుగుతాయి .అది అంజనప్ప క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది .గట్టళ్ళి అంజనప్ప అసలుపేరు .ఆయన పుట్టుకమాత్రం ప్రస్తుత తమిళనాడు లోని హోసూరు తాలూకా బేరికే ప్రక్కన ఉన్న సీకనపల్లి .ఇక్కడే 1869లో అంజనప్పకాళమాంబ,గవియప్ప దంపతులకు పుట్టారు .చిన్నతనం లోనే తండ్రి చనిపోగా ,1876-77కాలం లో హోసూరులో విషరోగాలు వ్యాపించిచాలామంది చనిపోగా ,ఈయన తల్లి హోసూరు వదిలి కొడుకుతో కోలారుజిల్లా శ్రీనివాసపురం తాలూకా అరికేరి పల్లెకు చేరింది .అంకేరి జమీందారు వెంకటప్ప వీరికి బంధువు అవటం తో ఆయన ఆదుకొన్నాడు .తల్లి ఇంటిపనులు చేస్తూ , కొడుకు గొడ్లను కాస్తూ బతుకు బండీ ఈడ్చారు .వెంకటప్ప తనకూతురు పాపమ్మ అన్జనప్పకిచ్చి పెళ్లి చేశాడు .వీరి దాంపత్యం రామకృష్ణ పరమహంస శారదా మాతల దాంపత్యం లాగా సాగింది .
గొడ్లను కాస్తూ రోజూ అంజనప్ప చెట్ల నీడల్లో బండలమీద కూర్చుని ధ్యానం లో పడిపోయేవాడు.అప్పుడు ఆయన నోటినుంచి వేదాంత వాక్యాలు భక్తిపాటలు పద్యాలు అలవోకగా వచ్చేవి .మెలమెల్లగా వాటిని రాయటం మొదలు పెట్టారు .అదే తర్వాత ‘’వేదాంత రత్నావళి ‘’అనే 494పేజీల పుస్తకం గా వెలువడి కర్నాటక ప్రాంతమంతా విస్తృత ప్రచారం పొందింది . ఇందులోని 450పేజీలు తెలుగు మిగిలిన 50పేజీలు కన్నడం లో ఉండి,లిపి అంతాకన్నడ లిపిలో ఉంది .ఇప్పటికి ఆపుస్తకం 7సార్లు పునర్ముద్రణ పొందింది అంటే ఎంతటి ప్రభావం కలిగించిందో అర్ధమౌతుంది .ఇందులో 474తెలుగు కీర్తనలు ,52మాత్రమె కన్నడ కీర్తనలున్నాయి .దురదృష్ట వశాత్తు ఈ పుస్తకం ఇప్పటిదాకా తెలుగు లిపి లో అచ్చు కాలేదు .మనవాళ్ళ అలసత్వానికి నిలువెత్తు నిదర్శన గా నిలిచింది .
స్వాముల ఆధ్యాత్మిక సాహిత్యం శతకాలుగా ,కందపద్యాలుగా ద్విపదలుగా తత్వాలుగా ,కీర్తనలుగా ఉన్నాయి .అంజనప్ప స్వామికి ఆంజనేయస్వామి ‘’మరుగుజ్జు ‘’రూపం లో దర్శనమిచ్చి జ్ఞానబోధ చేశాడట.అందుకే ఆయనపై ఎక్కువ కీర్తనలు రాసి ,ఆయనకే అంకితమిచ్చాడు అంజనప్ప స్వామి .అందరు దేవతలు దేవుళ్ళమీద కూడా కీర్తనలురాశాడు .వీటిని పండితపామరులు బాగా మెచ్చారు .వేదాన్తసారాన్నిభాక్తితో రంగరించి మహా మాధుర్యంగా రాశాడు. అలాగే అంజనప్ప స్వామి ‘’కాలజ్ఞానం ,’’శ్రీ పరమాత్మ రామ లింగ శతకం .శ్రీ కృష్ణ శతకం,శ్రీ గగనాద్రిపురి శతకం ,పిండోత్పత్తి వివరం ,శ్రీపరమాత్మకవి శతకం ,మస్తకాచల మహాత్య౦ ,ముక్తికాంతా పరిణయం శ్రీ రాజయోగానంద ద్విపద కావ్యం ,సుజ్ఞాన ద్విపద కావ్యం ,గురుశిష్య సంవాదం వంటి రచనలెన్నో రాశారు .
తత్వాలను తెలుగులోఎక్కువగా రాసినా తనుఉన్న కన్నడ సీమను మర్చిపోకుండా ఆభాషలోనూ కొన్ని రాశారు .తనవ్యక్తిత్వాన్ని ఇలా చెప్పుకొన్నారు –‘’ఒకరి సొమ్ముకు నేను ఆశపడలేదు ఆంజనేయ –చెయ్యెత్తి ఇస్తేను చేతులొడ్డినాను ఆంజనేయ –కడుపుకు కూడు లేక కట్టు గుడ్డ లేక ఆంజనేయ –జోలి కట్టలేదు ,ఇండ్లు తిరగలేదు ఆంజనేయ –కడుపు సాకుట కొరకు కష్టమెంతో పడితి ఆంజనేయ ‘’
తత్వ బోధ చేస్తూ –‘’జగములోన జాతిభేదం లలెంచబోకండి –స్త్రీపురుష జాతులు రెండు సృష్టిలో నిర్మించే బ్రహ్మ ‘’
గురువుగురించి –గురువు బోధా మరువ లేదమ్మా –సద్గురుని బోధ ఆత్మలో నా నెరనమ్మి నానమ్మా
‘’రామ నామ గురు తారక మంత్రము –కోరి పఠించర ఓరన్నా ‘’
మానవ జన్మ గురించి –స్థిరముకాదు ఈమానవ జన్మము –పరమాత్ముని భజియించు .
‘’వావి వరుసలు పోయే వసుధ లోన –మాయ తెలియక పోయె,మమకార మెచ్చాయె-చెడిపోయే రాజ్యంబు చేటు వచ్చె-రాజ్యంబు రంకాయ రమ్యంబు లేదాయె’’
‘’సతిపతు లిరువురుల్ సమగుణమైవుంటే –సత్యంబు సమమౌను నిత్యముగాను’
కృష్ణుడి పై –‘’గోపాల శ్రీ కృష్ణా గోపీ నందనా –పతితపావనలోల పంకజాక్షా –శ్రీపతి నిన్ను నే చింత చేసితి ఆత్మలో –తప్పాక నిన్నునే ఒప్పుగా పూజింతు ‘’
‘’మూల బ్రహ్మ౦బెవరు ముమ్మూల గృహములో వెదకి చూసినవాడు యోగశాలి’’అంటే ఆత్మలో వెదికితే మూలబ్రహ్మతత్వం తెలుస్తుంది .
పిండోత్పత్తి విధం –సతిపతులిద్దరూ సంతసంబున రతి చేయగా రమణి గర్భము నందు
ఒక్క మాసములోపల పంచభూతములు –రెండవ మాసమందు చర్మము కలుగును –మూడు మాసము ల లోపల నరములు కలుగును-ఏడోమాసములుఆడమగ శిశు రూపము — ఎనిమిది మాసములందు సకల వాయువులు కలుగును ‘’
మానవ శరీరం లో తెలుగు అక్షరాలు-స్థూల శరీరం లో గుద స్థానం లో ఆధార కమలం లో శష సహ,దానికి రెండు అంగుళాల పైన –సప్తతి అనే స్వాదిస్టానకమలం లో బ భ మా యరల ఉంటూ సృష్టికర్త బ్రహ్మ ఉంటాడు .దీనికి ఎనిమిది అంగుళాలపైన –డఢణతథదధనపఫఅనే పది రేకులతో ఉంటుంది అక్కడ విష్ణువు ఉంటాడు .దీనికి పది అంగుళాలపైన హృదయస్థానం లో క ఖ గఘ ఙచఛజఝఞటఠఅనే పన్నెండు రేకులతో ఉంటుంది ఇక్కడ లయకర్త రుద్రుడు ఉంటాడు .దీనికి 12అంగులాళపైనకంఠంలో అ,ఆ ఇఈఉఊ ఋఋా,ఎఏఐఒఓఔఅంఱఅనే 16దళాలతో విశుద్ధ చక్రం ఉంటుంది .
కైవారం తాతగారు 1726లో కర్నాటక చిక్క బళ్ళాపురం జిల్లా చింతామణి తాలూకాలో పుట్టారు .పోతులూరి వీరబ్రహ్మ౦గారిలా గా మఠం లో పూజలు అందుకొన్నారు తాతగారు 90శాతం తెలుగులో 10శాతమే కన్నడంలో రాశారు .వీరి రచనలన్నీ కన్నడీకరించ బడి బాగా ప్రచారం పొందాయి .అంజనప్ప ఆశ్రమం కైవారం వారి ఆశ్రమానికి 30కిలో మీటర్ల దూరం లో ఉన్నది .అంజనప్ప పై నారాయణ తాతగారి ప్రభావం కనిపిస్తుంది
‘’తొమ్మిది వాకిండ్లు కొంప దుఖముల కిది మూలదుంప ‘’అని తాతగారు అంటే అంజనప్ప ‘’తొమ్మిది వాకిండ్ల తనువిది నేమ్మదేమియు లేకున్నది ‘’అన్నారు .’’ఎందుండి వస్తీవి తుమ్మెదా ‘’అని ఆయన అంటే ‘’నీ ఊరిపేరేమి జీవయ్యా నీవు ఎందుకు వస్తివి జీవయ్యా ‘’అని ఈయన అన్నారు .
శ్రీ అంజనప్ప స్వామి గుట్టుపల్లి లో 1971ఏప్రిల్ 30న102వ ఏట సమాధిపొందారు .
బహు శ్రమపడి డా వసంత్ ఈ పుస్తకం రాసి అంజనప్ప స్వామిని మనకు అందుబాటులో తెచ్చినదుకు అభినందనలు .ఈ పుస్తకం లో స్వాముల 50 రచనలు చేర్చి నిండుదనం తెచ్చాడు వసంత్.అంజనప్ప స్వాముల ముఖ చిత్రం తో పుస్తకం మేలు భళా గా ఉంది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-20-ఉయ్యూరు