203-అమెరికాదేశ సాహిత్యం -6
19 వ శతాబ్ది సాహిత్యం -3
అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1
1848రివల్యూషన్ ప్రపంచవ్యాప్తిగా ఆకర్షింప బడి అనేకమంది అమెరికన్లు నూ కదిలించింది .సంస్కరణ గాలిలోనే ఉంది .అమెరికన్ బ్రాహ్మిన్స్ , ట్రాన్ సేండెంట లిస్ట్ లు ముందుకొచ్చారు .విలియం లాయడ్ గారిసన్ అనే సన్యాసి ,ధనస్వామి బానిసత్వం పై పోరాటం చేశాడు .ఆయన సంపాదకుడుగా ఉన్న వారపత్రిక ‘’లిబరేటర్ ‘’ సర్క్యు లేషన్ తక్కువే అయినా దాన్ని పూర్తి గా సమర్ధించి ఒక ఆయుధం అయింది ఆయనకు .ఈపత్రిక చందాదారు బానిస వ్యతిరేక ఉద్యమ౦ తో సంబంధమున్న గొప్ప రచయిత జాన్ గ్రీన్ లీఫ్ విట్టియర్.ఆయన ఆపత్రికలో రాసిన చిన్నచిన్నకవితలు చాలా భావస్పోరకం గా బానిస నిర్మూలనానికి అనుకూలం గా ఉంటూ జనాలను చైతన్యవంతుల్ని చేశాయి. ఆయన కవితలన్నీ ‘’పోయెమ్స్ రిటెన్ డ్యూరింగ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ అబోలిషన్ క్వేస్చిన్ -1837,’’వాయిసెస్ ఆఫ్ ఫ్రీడం 1846,సాంగ్స్ ఆఫ్ లేబర్ అండ్ ఆదర్ పోయెమ్స్ -1850 పుస్తకాల రూపం లో వచ్చాయి .ఆఉద్యమ నవలారచయిత్రి హర్రియట్ బీచర్ స్టొవ్ ‘’అంకుల్ టామ్స్ కాబిన్ ‘’1852లో హాస్యం సెంటిమెంట్ తో రాసి ఉద్యమానికి మాంచి దోహదం చేసి,సివిల్ వార్ నుంచి తేరుకోనేట్లు చేసింది .
న్యు ఇంగ్లాండ్ మరోగ్రూప్ రచయితలు ,,నవలాకారులు చరిత్ర ఆధార రచనలు చేశారు.నాటకీయత చొప్పించి పండించారు .వీరిలో జాన్ బ్రాక్రాఫ్ట్ ‘’హిస్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్’’12భాగాలు 1882లో రాశాడు జాన్ లోత్రాప్ మోట్లి’’హిస్టరీ ఆఫ్ డచ్ రిపబ్లిక్ అండ్ దియునైటెడ్ నెదర్ లాండ్స్ ‘’ను 9భాగాలలో 1856-74 లో రాశాడు .ఈ గ్రూప్ ముఖ్యుడు ఫ్రాన్సిస్ పార్క్ మన్ అనే చరిత్రరచయిత ఇంగ్లాండ్ ఫ్రాన్స్ లమధ్య పోటీలను ,దానివల్ల అమెరికన్ ఫ్రాంటియర్ పురోగతిపై ధారావాహికంగా రాశాడు.తన పడమటి దేశ యాత్రను ది ‘’ఓఒరెగాన్ ట్రయల్ ‘’గా రాశాడు
హథారన్,మెల్విల్లి ,విట్మన్ త్రయం
నథానియల్ హతారన్ కదలు రోమాన్స్ లతో అమెర్రికన్ ఫిక్షన్ ను ముందుకు తీసుకు వెళ్ళాడు .ఇతడి ప్రముఖరచన ‘’ది స్కార్లెట్ లెటర్ ‘’-1850లో కాలనీ అమెరికా గురించి విపులంగా వర్ణించాడు .’’దిహౌస్ ఆఫ్ సెవెన్ గేబుల్స్ ,’’-1851లో భూత భావిష్యత్తుల విషయాలున్నాయి .‘’ది మార్బుల్ ఫాన్’’-1860ను దూర దేశాలలో రాశాడు .ఈకాలాన్ని అతడు ‘’దిలైట్ ఆఫ్ కామన్ డే’’అన్నాడు .లోతైన మనో విశ్లేషణాత్మకమైన ఈరచనలతో సంక్లిష్ట నైతిక సమస్యలను చర్చించాడు .
హతారన్ స్నేహితుడు ,నైబర్ అయిన హెర్మన్ మెల్విల్లీ పెద్దగా చదువుకోకపోయినా వేల్స్ నువేటాడే షిప్ లో ప్రయాణం చేసి దానినేతన ‘’వేల్ కాలేజ్ అండ్ హార్వర్డ్ ‘’గా భావించి మొదటిసారిగా అనుభవాలను 1846లో ‘’టైపీ’’1847లో ‘’ఓమూ ‘’గా రాసి ప్రచురించాడు .1849లో ‘’రెడ్ బరన్’,’1850లో ‘’వైట్ జాకెట్ ‘’లు రాశాడు .1846-51కాలంలో అయిదేళ్ళు ఫిలాసఫీ సాహిత్య క్లాసిక్స్ హతారన్ అల్లిగారికల్ సింబాలిక్ రచనలు చదివి అధ్యయనం చేశాడు .దీనితో కొత్త దృక్పధమేర్పడింది .ఈ ప్రభావంతో మొదట ‘’మోర్డి’’-1849,ను దేశ ఆర్ధిక రాజకీయ సాహిత్య మతాల సంస్థలపై అన్యాపదేశంగాఒకరకమైన తిరుగుబాటు దోరణితో రాశాడు .1851లో రాసిన ‘’మోబీ డిక్’’లేక ది వేల్ నవల అద్భుత సి౦బాలిజానికి ప్రతీక ప్రతిమాట వాక్యం అర్ధవంతం ఆలోచనాత్మకం గా ఉండి పేరు మారుమోగిపోయింది .సంక్లిష్టంగా ఉన్నా అఖండ మేధస్సుతో ఏకీకృతం గా ఏకముఖంగా రాశాడు .బెనిటోసేరెనో కథ, కథా సాహిత్యం లో మాస్టర్ పీస్ .1852లో రాసిన సైకలాజికల్ నవల ‘’పియర్రె’’,1890లో రాసిన నావలేట్ ‘’బిల్లీ బడ్’’లు మోబీ డిక్ లోని మేధో లక్షణాలు తగ్గినట్లుగా ఉంటాయి .
తనజన్మభూమి ‘’మాన్ హట్టన్ ‘’పై వీరాభిమానం తో ఉరకలు వేసే ఉత్సాహం తో గానం చేసే వాల్ట్ విట్మన్ గాయకుడు జీవితం ను మేల్విల్లీ లాగా కాక తక్కువగా చూశాడు .సామాన్యమానవుని జీవిత శోభపై ప్రెసిడెంట్ జాక్సన్ కున్న అభిమానం గ్రహించి జాక్సోనియాన్ డెమాక్రసి పై వీరాభిమాని . .ఎమర్సన్ వ్యాసాలు బోధనలు అర్ధం చేసుకొని ప్రేరణ పొందిన విట్ మన్1855లో తనకవితాసంపుటి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’రాసి ప్రచురించాడు .తరువాత క్రమ౦గా పెచుతూ 9ప్రచురణలు తెచ్చాడు .ఆ కవిత్వంలోనే తన చరిత్ర చెబుతూ భావావేశాలను నమ్మకాలను తెలియబర్చాడు .సామాన్యమానవుని గురించి మొదటిసారిగా పట్టించుకొన్న కవితా సంపుటి గడ్డిపరకలు .అమెరికన్ వ్యక్తివాదాని అస్తిత్వానికి ప్రతీక .రాజీలేని మనస్తత్వం ట్రాన్స్ డెంటల్ ఐడియలిజం ,అనిబద్ధ వచనకవిత్వం తోమార్గదర్శి అయి అమెరికన్ పీపుల్ కవి అనిపించుకొన్నాడు .మొదట్లో సంప్రదాయ బద్ధులకు రుచించకపోయినా ఎమర్సన్ రాసిన కితాబు వలన జనానికి అర్ధమై ఆరాధనా భావం పెరిగి అమెరికన్ కవులలో అగ్రేసర్ కవి అయ్యాడు ట్రెండ్ సెట్టర్ అయ్యాడు విట్మన్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-20-ఉయ్యూరు