డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-18
సింహపురి అనే నెల్లూరు విశేషాలు -1
‘’శ్రీమత్సి౦హపురీ పరాక్రమ కలావైదగ్ధ్యపూర్ణోదరీ –గీర్వాణా౦ధ్రరసజ్న పండిత కవి బ్రహ్మాది భాగేశ్వరీ –చండోన్మత్త గజాన్ యథా స్వబలతఃసింహో తిశేతేతథా-యా సర్వాంద్ర మహాపురీః స్వగుణతో జేజీయతాం సాస్వహం ‘’అని శ్రీమాన్ కాశీ కృష్ణాచార్యులు నెల్లూరు పై చెప్పిన శ్లోకం .
భావం – నెల్లూరు అనే సింహపురి కళావైదగ్ధ్యం తో తొణికిసలాడేది .రసజ్ఞులైన గీర్వాణా౦ధ్రపండితులు, కవిబ్రహ్మ నివసించే భాగ్యం పొందింది .మదోన్మత్తమైన ఏనుగు లను సింహం ఎలా మించిపోతుందో అలాగే గుణాలతో మిగిలిన పట్టణాలకంటే ఆంద్ర దేశం లోమించిపోతూ దినదినాభి వృద్ధి చెందుగాక .
అప్పటి నెల్లూరులో వేదం వెంకటరాయ శాస్త్రిగారి తిక్కన పార్టీ ఉంటె వ్యతిరేకపార్టీగా దీపాల పిచ్చయ్య శాస్త్రి దుర్భా సుబ్రహ్మణ్య శాస్త్రి పార్టీ ఉండేది .పిచ్చయ్య శాస్త్రి వేదం వారిని ‘’రంగము మీద కెక్కుదుము రా ‘’ అని సవాలు విసిరేవాడు .దుర్భావారు అభినవ తిక్కన బిరుదుపొందారు .వీరి శిష్యులే మోచర్ల రామకృష్ణయ్య .ఆగర్భ శ్రీమంతుడు దువ్వూరి రామి రెడ్డి ఇగ్లీష్ లెక్చరర్ .ప్రకృతి ఆరాధకుడు .పానశాల కృషీవలుడు ,కు౦భ రాణా,వనకుమారి సీతావనవాసం నలజారమ్మ అగ్నిప్రవేశం పలిత కేశం వంటి ఖండకావ్యాలు రాశాడు .కవికోకిల బిరుదున్నవాడు .సరసకవి కవిశేఖర ప్రసన్న మదురకవి ,సాహిత్య రత్న మోచర్ల రామకృష్ణయ్య ప్రముఖ న్యాయవాది ,విమర్శకుడు ,వాజ్మి ,.రమణానందలహరి,అమృత కలశం ,ప్రేమలీల, స్వాత్మార్పణం స్వతంత్ర రచనలు చేశాడు .20దాకా అనువాదాలున్నాయి .అమృతకలశం అఖండ కీర్తి తెచ్చింది .
వేదం వారి వర్గం లో నేలటూరు రామ దాసయ్యంగారు కాలేజీ లెక్చరర్ .సంస్కృత ఆంద్ర ఆంగ్లాలలో ఉద్దండపండితుడు .కాళిదాస శకుంతల ,కుమార సంభవాలకు కిరాతార్జునీయం ఉత్తరరామ చరిత్రలకు ఇంగ్లీష్ వ్యాఖ్యానం రాశాడు .సాహిత్యవ్యాసాలు చాలారాశాడు .మంచి వక్త .’’కాళిదాసు పోకిరీతనం ‘’పై అద్భుత ప్రసంగం చేసేవాడు .దీపాల పిచ్చయ్యశాస్త్రి గొప్పకవి జాషువా తోకలిసి అవధానాలు చేశాడు .చాటువులు సేకరించి ‘’చాటుపద్య రత్నాకరం ‘’ప్రచురించాడు .ఈయన ‘’సాహిత్య సమీక్ష ‘’నిరుపమానం .చిలకపాటి సీతాంబ ప్రసిద్ధ రచయిత్రి .దిలీపుడు, సముద్రమధనం ,పద్మినీ పరిణయం పద్యకావ్యాలు రాసింది .గృహలక్ష్మి స్వర్ణ కంకణ గ్రహీత .
షేక్ దావూద్ సాహెబ్ దేశభక్తి వంశంలో పుట్టాడు .తండ్రి మతకలహాలలో చనిపోయాడు న్యాయవాది మాలకొందయ్యగారి ఇంటిదగ్గర మూలలో ఒక చిన్న కిళ్ళీ కొట్టుపెట్టుకొని జీవితం గడిపాడు .భారతం లో కర్ణుడు ఇష్టం .భారతం క్షుణ్ణంగా చదివాడు.కర్ణుడిపై కమనీయ పద్యాలు రాశాడు .కిళ్ళీ కొట్టు సాహిత్యాభిమానులతోఎప్పుడూ కిటకిట లాడేది .తర్వాత తెలుగు హిందీ విద్వాన్ పరీక్షలు పాసై ,కర్నూలు ,హైదరాబాద్ ఉస్మానియా కాలేజీలలో తెలుగు, హిందీ లెక్చరర్ గా పని చేశాడు .మొదటికావ్యం ‘’దాసీపన్నా ‘’అఖండ విజం చేకూర్చింది .సాయిబాబా చరిత్ర ,క్రీడా శిర్డీశ్వరం,చంద్రవదన మొహియార్ స్వతంత్ర రచనలు రాశాడు. హిందీ నుంచి అనువాదాలు చాలా చేశాడు. ఆచార్య ఆత్రేయను రామచంద్ర రోజూ రంగనాయక పేటలో చూసేవారట .గౌతమబుద్ధ అశోక సామ్రాట్ ఈనాడు పరివర్తన కప్పలు నాటికలురాసి సినీ ప్రవేశం చేసి మనసుకవిగా ఆరాధనీయుడయ్యాడు .నెల్లూరులో ‘’తీర్పుల పత్రిక ‘’అనే పత్రిక కోర్టు తీర్పుల్ని ప్రచురించేది .నెల్లూరు వెంకటరామనాయుడు ‘’జమీన్ రైతు ‘’ వారపత్రిక 1934లో ప్రారంభించాడు .మన్నేపల్లి రామకృష్ణారావు ‘’సుబోధిని’’ వారపత్రిక నడిపారు ,తిక్కవరపు రామిరెడ్డి రేబాల లక్ష్మీ నరసారెడ్డి దొడ్ల సుబ్బరామి రెడ్డి మహాదాతలు .ఆమంచర్ల సుబ్బు కృష్ణారావు పంతులు,కిడంబి వీరరాఘవాచార్యులు 1908లోనే కాంగ్రెస్ సంఘం స్థాపించి బాగా వృద్ధిలోకి తెచ్చారు .బెజవాడ గోపాలరెడ్డి ఆయన సోదరులు బంధువులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన గొప్ప దేశ భక్తులు .తూములూరు పద్మనాభయ్య సబ్ ఇన్స్పెక్టర్ చేసి ,ఉద్యోగం వదిలేసి 1932-33లో తిప్పావారి సత్రంగోడ స్వాధీనం చేస్కొని ‘’గోడపత్రిక ‘’నడిపి,’’భిత్తి ‘’వారపత్రిక కూడా నడిపారు .ముత్తరాజు గోపాలరావు ‘’నగరజ్యోతి ‘’గోడపత్రిక నిర్వహించాడు .పొణకా కనకమ్మ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళిన రచయిత్రి .కస్తూరిబా బాలికా విద్యాలయం ,కస్తూరిబా పారిశ్రామిక విద్యాలయం నిర్వహించింది .రమణ మహర్షి శిష్యురాలు .
ఒంగోలు వెంకటరంగయ్య ఆడ్వోకేట్ .శుక్రనీతిసారం,తాండవ లక్షణం ,రామాయణ విమర్శనం చారిత్రిక వ్యాస సంపుటి రాశాడు .మామిడిపూడి వెంకటరంగయ్యగారి అన్న రామకృష్ణయ్యప్రభుత్వ న్యాయవాది .మృదు మధురశైలిలో రామాయణం రాశాడు .పుచ్చలపల్లి సుందరయ్య జాతీయ ఉద్యమం లోపాల్గొని జైలు కెళ్ళాడు .పల్లెపాడులో కాంగ్రెస్ ఆశ్రమం స్థాపించాడు .పండిత దీవి గోపాలా చార్యుల శిష్యుడు ఏటూరి శ్రీనివాసాచార్యులు ‘’సుఖవ్యాధి నిపుణుడు .పేదలకు ఉచిత వైద్యం చేసేవాడు ..యోగరత్నాకరం ‘’కు ‘’అమృతకర ‘’వ్యాఖ్య రాశాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-8-20-ఉయ్యూరు