’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-19
సింహపురి అనే నెల్లూరు విశేషాలు -2(చివరి భాగం )
నెల్లూరులో వదాన్యుడు తిక్కవరపు రామిరెడ్డి కుమారుడు పఠాభి అనే పట్టాభి రామి రెడ్డి 1932కే గొప్పకవిగా ప్రసిద్ధుడు .అతని ‘’ఫిడేలు రాగాల డజన్ ‘’ఆంధ్రదేశం లో ఒక ఊపు ఊపింది .నేలనూతుల పార్వతీ కృష్ణమూర్తి తెలుగు హిందీలలో మహా విద్వాంసురాలు .’’తులసీ దాస దాసీ ‘’పేరుతో’’ రామ చరిత మానసం ‘’ను సరళ గ్రాంధిక వచనంగా అనువదించింది .గుర్రం వెంకట సుబ్బయ్యవెంకటగిరిరాజా కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్ .ధరణికోట వెంకటసుబ్బయ్య తెలుగు లెక్చరర్ వేదం వారి శిష్యుడు .పాటూరు రామ సుబ్బయ్య మహా వీర పత్రికా రచయిత.’’సింహపురి ‘’వారపత్రిక 1922లో ప్రారంభించి 1930ప్రభుత్వ నిషేధాజ్ఞతో ఆగిపోయినా ,1934లో మళ్ళీ ప్రారంభించి ,పోలీసులకు భయపడి వర్కర్లు రాకపోతే ,తానూ భార్య ,పిల్లలు కంపోజింగ్ మొదలైన పనులు చేసి ప్రచురిస్తూ దాదాపు 30ఏళ్ళు నడిపాడు .
నెల్లూరు న్యాయవాదులు మహాదాతలూ ,స్వాతంత్ర సమరయోధులు ఎందరో విద్యార్ధులకు అన్నదానం చేసేవారు .మాడభూషి నరసింహా చార్యులు వేంకటగిరి సంస్థాన న్యాయవాది .ఆయన రెండవ కుమారుడు గోపాలాచార్యుడు అదే వృత్తిలో ఉన్నాడు. కెవి రాఘవాచార్యులు ,టి.వి. శంకరరామయ్య ‘’ఎస్.ఎస్ .బాట్లీ వాలా కేసు ‘’వాదించిన ప్రముఖులు .చతుర్వేదుల కృష్ణయ్య గొప్ప న్యాయవాది .కోర్టు సెలవుల్లో ఎక్కడికైనా వెడితే, వారం విద్యార్దులకోసం వంటవాడిని ఏర్పాటు చేసి వెళ్ళే ఉదార హృదయుడు .చివుకుల మాలె కొండయ్య గారి ఇంట్లో ఆయన పంక్తిలో రోజూ కనీసం నలుగైదుగురు విద్యార్ధులు భోజనం చేసేవారు .
వెన్నెలకంటి రాఘవయ్య సమర్ధ న్యాయవాది .జాతీయ ఉద్యమం లో చాల సార్లు జైలుకు వెళ్ళాడు .ఏనాదుల ప్రగతికోసం కృషి చేసి ‘’ఏనాది రాగవయ్య ‘’అని పించుకొన్నాడు .రాఘవయ్య ప్రకాశం గారిమంత్రి వర్గం లో ప్రధానకార్యదర్శి గా పని చేశాడు .రాస్ట్రపతి గిరి గారికి వియ్యంకుడయ్యాడు .ఒంగోలు వెంకటరంగయ్య అడ్వొకేట్.గొప్ప చరిత్ర పరిశోధకుడు .శుక్రనీతి సారం ,తాండవ లక్షణం, రామాయణ విమర్శనం ,చారిత్రిక వ్యాససంపుటి ,’’కొందరు నెల్లూరు గొప్పవారు ‘’రచించాడు .పులుగుండ్ల నరసింహ శాస్త్రి గోపాలాచార్యుల శిష్యుడైన గొప్ప ఆయుర్వేద వైద్యుడు .మూలపేట సంస్కృత కళాశాలలో ఆయుర్వేద లెక్చరర్ .సంస్కృతాంధ్ర కవి కూడా .
నెల్లూరు సాహిత్యానికే కాక సంగీతానికీ ఆదరణ కలిగించింది .నిరంతరం సంగీత కచేరీలు జరిగేవి. పేరుమోసిన గాయకులూ ,వైణికులు ఉన్నారు .త్యాగరాజు గారి ప్రశిష్యులలో ఒకరు అక్కడ ఉండేవాడు .ఆయన్ను చిన్నప్పుడు ఎద్దు పొడిచింది .ఆభయం ఇంకాపోలేదు .ఊరిజనం ఆయనతో బాగా పాడించుకొని ,చివర్లో ‘’డుర్ బసవన్న ‘’అనిఎవరో అరిస్తే ,ఆయన మధ్యలోనే ఆపి పారిపోయేవాడు. అందరూ నవ్వుకోనేవారు .
వేదం వెంకటరాయ శాస్త్రి గారి ఆధ్వర్యం లో చాలామంది న్యాయవాదులు నటులయ్యారు .వారిలో కందాడై దొరస్వామయ్య౦గార్ ఒకడు. పర్వత రెడ్డి రామ చంద్రారెడ్డి కబీర్ గా బాగా నటించేవాడు .నెల్లూరి నాగరాజారావు యుగంధర,పాపారాయుడు ,రుస్తుం పాత్రలు వేసి మెప్పి౦చేవాడు ‘’ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ ‘’అనే వాక్యాన్ని చాలా రకాలుగా పలికి అభినయించి ప్రేక్షకులను ముగ్ధులను చేయటమేకాక భయపడేట్లు చేసేవాడు .
ఆసూరి రంగస్వామి సరస్వతి నేలటూరి రామానుజా చార్యుల పెద్దల్లుడు .పురాతత్వ శాఖలో పని చేసేవాడు .కృష్ణా –గుంటూరు పరిశోధన యాత్రలో ఒక దిబ్బమీద కొద్దిగా పైకి కనిపిస్తున్న శిల్పాల ముక్కలు చూసి ,అదొక మహా శిల్ప క్షేత్రం అని ఊహించి ,ప్రభుత్వానికి చెప్పి త్రవ్వించాడు .అదే మహా కళాక్షేత్రమైన నాగార్జు కొండ గా బయట పడింది .నాగార్జున కొండను కనిపెట్టిన మొదటి పరిశోధకుడు గా ఆసూరి రంగస్వామిసరస్వతి ప్రసిద్ధి చెందాడు.
కాళిదాసు ఇంటిపేరున్న జిల్లా సెషన్స్ జడ్జి రిటైరైతే ,ఆయన సంస్కృతాభిమాని అవటం తో సంస్కృత కళాశాలలో వీడ్కోలు సభ జరిపారు .ఆయన తెలుగు మాతృభాషకల దాక్షిణాత్యుడు .అనేక భాషలు వచ్చినవాడు .ఆయన్ను ప్రశంసిస్తూ తిరుమల రామ చంద్ర కొన్ని శ్లోకాలు రాసి చదివారు .అందులో ఒకటి రుచి చూద్దాం –
‘’న్యాయ గ్రంథ విమర్శనం హి కురుషేధృత్వోప నేత్రే సదా –న్యాయా ధీశ కటాక్షమేకమపి భోః నాస్వాస్వక స్మాదపి
వ్యర్థం నః తరుత్వ మిత్వతితరాం భాషాభి రభ్యర్దితాః-రాజంతే ఉపకార వేతన మిమేస్వీకృత్య తన్మానసాః’’
భావం –‘’కళ్ళజోడు పెట్టుకొని ఎప్పుడూ న్యాయ గ్రంథాలు పరిశీలిస్తు౦టావు. మాపైన ఒక్క కటాక్షం అయినా పడనీయవు .మా వయసంతా వ్యర్ధమౌతోంది’’ అని భాషలు కోరగా ,ఉపకార వేతనం పొంది ,భాషా పరిచర్యలో నిమగ్నులయ్యారా అనిపిస్తోంది .
మూల స్థానేశ్వర స్వామిపై రామ చంద్ర రాసిన శ్లోకం –
‘’ఉత్తర పినాకినీతట-హరినగర నివాస ముత్తమై స్సేవ్యం –భూతి విభూషిత దేహం –మూల స్థానేశ్వరం సదా సేవే ‘’
భావం –ఉత్తర పినాకినీ నదీ తీరం లో సింహపురిలో వేంచేసి ఉన్న ,ఉత్తములకు సేవ్యుడైన,విభూతి భూషిత దేహుడైన మూల స్థానేశ్వరుడిని నిరంతరం సేవిస్తాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-8-20-ఉయ్యూరు