డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-20
దయామయుడు డాక్టర్ దాసూరావు
డాక్టర్ దాసూరావు 1906 మే 6న పుట్టి ,ఎల్,ఎం.పి.పట్టా పొంది ,కమలాపురం వచ్చారు .అమృతహస్తం ఉన్న వైద్యులుగా కీర్తి పొందారు .82ఏళ్ళ సార్ధక జీవితం గడిపి ఎందరికో ఆయువుపోసి ,పురుళ్ళు పోసి ,1996మే 23న దివంగతులయ్యారు .ఆయన భార్య రమణమ్మగారు 1996మే 23 చనిపోయారు .ఆయన కుమార్తె నిప్పాణిలక్ష్మి తండ్రి ఔదార్యం ,వేట గురించి ఎన్నో ఆసక్తికర కధలు రామ చంద్ర గారికి చెప్పింది .
దాసూరావు గారు రెండు గుళ్ళ తుపాకి బుజాన తగిలించుకొని సైకిల్ పై తిరిగేవారు .చిరుతలు ,మొసళ్ళు ఎలుగు బంట్లను వేటాడే వారు .చిరుతకూనలు ,మొసలిపిల్లల్ని సాకే వారు .ఎంతపెద్ద పామునైనా తోకపట్టుకొని దూరంగా విసిరేసేవారు .ఇంటి నిండా పులి చర్మాలు ఎలుగు బంటి మొసలి చర్మాలు వేలాడుతూ ఉండేవి .బళ్ళారి జిల్లాలో గృహ నిర్బంధం లో ఉన్న పన్నా రాజు తో కలిసి దాసు గారు వేటాడే వారు .
వైద్యుడు గా దాసూరాగారు ప్రజలలో దేవుడు .బీద రోగులపై అపార దయ చూపేవారు .పేద రోగులకు తన ఇంట్లోనే భోజన నివాస వసతి కల్పించి వైద్యం చేసేవారు .అర్ధరాత్రి తలుపుతట్టినా రోగులకు మందు ఇచ్చేవారు .విసుగు అనేది ఆయన నిఘ౦టువులో లేదు .మర్నాడు ఉదయం రోగి ఇంటికి వెళ్లి ముందురోజు ఇచ్చిన మందు పని చేసిందో లేదో అని వాకబు చేసేవారు .
ఆనే గొంది అవతల తుంగ భద్ర ఒడ్డున మధ్వయతీశ్వరుల 9సమాధున్నాయి. దీన్నే నవబృందావనం అంటారు .ఒకసారి ఉత్తరాదిమఠ౦ కు చెందిన ఒక స్వామీజీ వచ్చి,నవబృందావనం లో ఆరాధన చేయాలనుకొన్నారు .అప్పుడు తుంగభద్ర తీవ్రమైన వరదలతో పొంగి పోర్లుతోంది .అలాంటి వరదలలో పుట్టి అంటే హరిగోలు నడపటానికి ఎవరూ ముందుకు రాలేదు .దాసుగారు సాహసించి స్వామివారిని పుట్టిలో కూర్చో పెట్టుకొని ,తానె స్వయంగా నడిపి బృందావనం చేర్చి ఆరాధన జరిపించి భద్రంగా కమలాపురం మళ్ళీ చేర్చారు .స్వామి ఆయన్ను మెచ్చి ‘’నువ్వు హనుమంతుడవయ్యా ‘’అని శ్లాఘించారు .
డాక్టర్ గారు నిరంతర సంచార వైద్యులు కూడా .ఇంటి వద్ద వైద్యాలయం కూడా ఉండేది .అవసరమైన మందులతో సైకిలెక్కి గ్రామాలు తిరిగే వారు .ఆయనంటే ఆబాలగోపాలానికి తెలుసు .బళ్ళారి జిల్లాలోని ఆయన బంధువులకు ఆయన ఇల్లు ప్రసూతి శాల ..సినీ నటి నిప్పాణి జమున కమలాపురం లో దాసూ రావు గారింట్లోనే 1936లో లోపుట్టింది .బందువర్గానికేకాదు , గర్భిణీస్త్రీలందరికీ వారిల్లు ప్రసూతి గృహమే .పేదలవద్ద ఒక్క దమ్మిడీ కూడా తీసుకొని వైద్యో నారాయణుడు దాసూరావు గారు .
నిజాం రాజ్యం లో రజాకార్లు చెలరేగినప్పుడు ,రాయచూరు ఆనే గొంది ఆ రాజ్య పరిధిలోవే కనుక రజాకార్ల ఆగడాలు ఇక్కడా మొదలు పెట్టారు .రాజకుటుంబం ఎదిరించింది కానీ ,తట్టుకోలేక పోయింది .ఆనెగొంది రాజాస్థాన వైద్యులైన దాసూరావు గారు హోం గార్డ్స్ దళాలు ఏర్పాటు చేసి ,తుపాకి శిక్షణ ఇచ్చి రాజకుటుంబాల కోట్ల విలువైన నగలు సంపద ధనం ,ప్రాణాలు కాపాడారు .
డాక్టర్ గారు ఉదారులు ,దయామయులైనా వృత్తి ధర్మం లో కచ్చితంగా పాటించే వారు .తేదీ మార్చి మెడికల్ సర్టి ఫికేట్ ఇమ్మని ,రామచంద్ర గారు తనకున్న చనువుతో సిఫార్సు చేసినా ససేమిరా ఒప్పుకోని నిబద్ధత ఆయనది .ఒకతనికి పాముకరిస్తే తన ఇంటి డాక్టర్ కి చూపించి మందు ఇమ్మంటే ,ఆయనవద్ద సమయానికి ఆ మందు లేకపోతె ,దాసూరావు గారి దగ్గర ఉంటుంది ఆయన ఇచ్చినా సరే లేక తనకు పంపినా సరే అని పంపాడు ‘’నేను మందిస్తే ఆయన వైద్యానికి విరుద్ధం కావచ్చు. మాఇద్దరి చికిత్స పద్ధతులు వేరు .నా దగ్గర మందు మరో డాక్టర్ కు ఇవ్వను.ఇది వైద్య వృత్తిధర్మానికి విరుద్ధం .ఇది నా సిద్ధాంతం .నియమం ‘’ ‘’అని ఖచ్చితంగా చెప్పి పంపిచేశారు . .
దాసూగారు దైవ భక్తులు, నిరాడంబరులు,గాంధీ మార్గావలంబి .బస్టాండ్ లో ఉన్న ఒక కుష్టు రోగికి రోజూ అన్నం పెట్టేవారు . ఆ తర్వాతే తాను భోం చేసేవారు .వీరి కుమారుల్లో ఒకరు తండ్రి వైద్యం కొనసాగించాడు .డాక్టర్ గారి కూతురు నటి జమున తమ్ముని భార్య .
‘’ధనాని జీవితం చైవ –పరార్ధే ప్రాజ్ఞ ఉత్సృ జేత్ –తన్నిమిత్తోపరం త్యాగః –వినాశే నియతే సతి’’
భావం –వివేకి ఇతరులకోసం ధనం,జీవితం ఉపయోగించాలి .మనిషికి వినాశం తప్పదు కనుక పరులకోసం త్యాగం చేయటం ఉత్తమం .
సశేషం
రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-20-ఉయ్యూరు