అల్లాడు పల్లివీరభద్రస్వామి దేవాలయం
శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మే౦ద్ర స్వయం గా శిల్పించి ప్రతిష్టించిన దేవాలయం ఇది .కడపజిల్లా చాపాడు మండలం అల్లాడు పల్లి లో ఉన్నది .మైదుకూరుకి 6,ప్రొద్దుటూరుకు 14కిలోమీటర్లదూరం .కుందూ నదీ తీరాన ఉన్న దేవాలయం .ఆ నదికి తరచూ వరదలు వచ్చి ప్రజలు కష్టాలలో అల్లలాడు తుంటే గ్రామానికి ‘’అల్లాడు పల్లి ‘’అనే పేరొచ్చింది.ఆలు అంటే ఆవులు పశువులు ఆడుట అంటే తిరగటం కనుక అవి తిరిగే ప్రదేశం అనీ అర్ధం ఉంది’’ఆలు ఆడు పల్లి ‘’అయి క్రమంగా అల్లాడుపల్లి అయింది .
వీర బ్రాహ్మే౦ద్రస్వామి దేశ సంచారం చేస్తూ కాలజ్ఞానం బోధిస్తూ ,కర్ణాటకనుంచి కర్నూలు జిల్లా బనగానపల్లెకు వచ్చి ,అక్కడ గరిమి రెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువులకాపరిగా చేరి తాను గీసిన గిరి లో పశువులు మేసేట్లు చేస్తూ శ్రీ వీరభద్ర స్వామి విగ్రహం చెక్కారు .క్రమంగా జ్ఞాని అయి, గుహలో తపస్సు చేసి, మళ్ళీ దేశ సంచారం మొదలుపెట్టగా ,విపరీతంగా వరదలు వచ్చి తాను శిల్పించిన విగ్రహం కొట్టుకుపోయి అల్లాడు పల్లె కుందూనది చేరింది .మడుగుప్రక్కన ఉన్న కేతవరం గ్రామం లోని పిల్లలు ఇక్కడికి వాచ్చి ఆటలాడుతుంటే వీరభద్ర స్వామి విగ్రహం బాలుడిగా మారి వారితో ఆటలాడి ,.వాళ్ళు తెచ్చుకొన్న చద్ది తినేవాడు ,వాళ్ళను కొడుతూ తిడుతూ బెదిరిస్తూ వారు వెంటపడితే మడుగులోకి దూకి అదృశ్యమయ్యే వాడు .ఈ పిల్లలు రాత్రిళ్ళు ‘’నల్లోడువచ్చే, కొట్టే’’అని కలవరించేవారు .రోజూ జరిగే ఈ తంతు కు గ్రామస్తులకు ఆశ్చర్యం కలిగి ఒక రోజు ఆనది దగ్గరకు వెళ్లి చాటుగా కాపుకాసి ఆ విగ్రహ బాలుడికి పట్టుకొన్నారు . .అప్పుడు తాను వీరభద్ర స్వామి నని , తాను ఒకరోజు బయటపడుతానని అపుడు బయటకు తీసి ప్రతిస్టించమని చెప్పి నదిలోకి దూకాడు .నదిలో బుడగలు రావటం వాళ్ళు చూశారు .
స్వామి చెప్పిన రోజున గ్రామాధికారి కొడుకుపోతి రెడ్డి కోడలు పోతెమ్మమంగళవాయిద్యాలతో నది దగ్గరకు వెళ్ళారు .చెప్పిన సమయానికి స్వామి బయటకు రాలేదు .చాలా సేపు నిరీక్షించి ఆ దంపతులు నిరాశతో ఆత్మ హత్యకోసం నదిలోకి దూకే ప్రయత్నం చేశారు .అప్పుడే నదిలో నుంచి బుగ్గలు రావటం గమనించారు .ఆ బుగ్గలతో పాటు స్వామికూడా నది ఒడ్డుకు చేరి నిలబడ్డాడు .వీరి ఆనందానికి అవధులులేకు౦డాపోయాయి .తెచ్చిన పూజాద్రవ్యాలతో వీరభద్ర స్వామికి పూజ చేసి ,జయజయ ధ్వానాలు చేస్తూ అందరూ ఒక బండీ మీద ఊరేగిస్తూ ఊళ్లోకి తేగానే ,ఇప్పుడు ఆలయం ఉన్న చోటుకు బండి రాగానే బరువెక్కి కదలలేదు .ఎన్నో ప్రయత్నాలు చేసినా అంగుళం కూడా కదదల్లేదు .వడ్రంగి పిచ్చి వీరయ్యనుఒక్కడే అక్కడ నుంచి కదలలేదు ,అలసి భోజనాలకోసం ఇళ్ళకు వెళ్ళారు వారంతా .ఆ వీరయ్య సాక్షాత్తు వీర బ్రహ్మేంద్ర స్వామి యే.
బ్రహ్మంగారు మానసిక భగవదావేశం వలన శుభ ముహూర్తం గుర్తించి ,సమాధి నిష్టతో ‘’ఓం నమో భగవతే వీరభద్రాయ’’ మూలమంత్రాన్ని జపించగానే ,స్వామి విగ్రహం స్వయంగా తానే ఉత్తరాభి ముఖం గా ప్రతిస్టితు డయ్యాడు .భోజనాలు చేసి తిరిగి వచ్చిన గ్రామస్తులకు ఆశ్చర్యం కలిగి,తమతోబాటు వచ్చిన పిచ్చి వీరయ్య బ్రహ్మగారు అని గ్రహింఛి కాళ్ళమీద పడ్డారు .బ్రహ్మ౦గారు తనగురువు వీరభద్రస్వామి విగ్రహానికి పూజాదికాలు నిర్వహించి ,మళ్ళీ కందిమల్లెయ్య పల్లెకు వెడుతూ ,కోడికూత ,రోకటి పోటు వినబడని గడువులో ఆలయ నిర్మాణం చేయమని చెప్పారు .అందులోని భావం గ్రహించి ఒక్కరోజులోనే గర్భాలయం నిర్మిచారు .స్వామి విగ్రహం రోజురోజుకూ పెరుగుతుండటం తో ఒకరోజు రాగి చెంబుని శిరసుపై పెట్టి తర్వాత తీయగానే పెరగటం ఆగిపోయిందని చెబుతారు .
శ్రీ వీరభద్ర స్వామి విగ్రహం ఆరు అడుగుల దివ్య సుందర గంభీర నల్లరాతి మూర్తి .రౌద్రంతో తలపై శివలింగం ,నుదురుపై మూడు పట్టెలు,శిరసుపై కలశం ,ఉరమున హారాది భూషణాలు ,యజ్ఞోపవీతం, లింగకాయ ,పొడవైన కపాలమాల ,కుండల కంకణాలు ,కుడి చేతిలో ఎత్తిన ఖడ్గం ,ఎడమ చేతి అరచేతి కింద ఆనించి నట్లు ఉన్న వీర ఫలకాయుధం ,నాభిస్థానానికి కింద భద్రకాళి ముఖాకృతి,నడుమున ఒరలో పిడిబాకులు ,కాళ్ళకు మంజీరాలతో రౌద్ర౦ తో ఉత్తరాభి ముఖుడై ఉంటాడు .కుడిపాదం వద్ద దక్షుడి చిన్న విగ్రహం ఉంటుంది .నందీశ్వరుడు ఎదురుగా ముఖమండపం లో ఉంటాడు .స్వామికి రాగి, వెండి తోడుగులున్నాయి .రోజూ వీటిని అలంకరిస్తారు .మూడవ నేత్రం స్వర్ణ మయం .
బ్రహ్మ౦గారు ప్రతిస్టించినప్పటి నుంచి 400ఏళ్ళుగా స్వామికి నిత్యపూజా నైవేద్యాలు యధా విధిగా జరుగుతున్నాయి .మాన్యపు భూములున్నాయి .సోమవారాలు కార్తీకమాసాలలో భక్తులు అధికంగా వస్తారు .మహా శివరాత్రికి తిరుణాల వైభవంగా జరుగుతుంది .బళ్లమీద,ట్రాక్టర్లలో జనం విపరీతం గా వచ్చి దర్శిస్తారు .వేరు సెనగ ,అలచంద గుగ్గిళ్ళు ప్రసాదంగా పానకం తోపాటు అందిస్తారు .భక్తులకు విశేషంగా అన్నదానం చేస్తారు .పౌరాణిక నాటకాలు, చక్కభజన. హరికధా కాలక్షేపాలు ఉంటాయి .కనుము నాడు స్వామి కి పారు వేట ఉత్సవం చేస్తారు .చుట్టుప్రక్కగ్రామాలలో ఊరేగింపు నిర్వహిస్తారు .శివరాత్రి నాడు కల్యాణం చేస్తారు .మర్నాడుఎడ్లకు బండలాగుడు పోటీలుపెడతారు .బ్రహ్మ౦గారి మఠ అధి పతులకు అల్లాడుపల్లి లోని వీరభద్రస్వామి దేవాలయమే గురుపీఠం .బ్రహ్మగారి మఠంలో జరిగే ప్రతి వేడుకా ముందుగా ఇక్కడ చేయటం సంప్రదాయమైంది .
ఆధారం –తవ్వా ఓబుల రెడ్డి రచన –అల్లాడుపల్లి వీరభద్ర స్వామి చరిత్ర .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-8-20-ఉయ్యూరు
—