పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసు దేవానంద సరస్వతి 1854శ్రావణ కృష్ణ పంచమినాడు మహారాష్ట్ర,సామంతవాడి దగ్గర మాన్గోన్ గ్రామం లో జన్మించారు .వీరిని తెమ్బేస్వామి అని అంటారు .దత్తాత్రేయస్వామి అవతారంగా భావిస్తారు . చిన్నతనం లో వాసుదేవ అని పిలువబడేవారు విధివిధానంగా అన్నీ చేసేవారు .రెండుపూటలా సంధ్యావందనం ,వెయ్యి సార్లు గాయత్రీ జపం,గురు చరిత్ర పఠనం నిత్యకృత్యం .రెండులక్షల నలభై సార్లు గాయత్రి జపం చేశారు .తర్వాత వేదాధ్యయనం టాటా భట్టాజీ ఉక్తి దేవ వద్ద చేశారు .సాత్వికాహారం తినేవారు .ముందుగా వైశ్వదేవ ఆహుతి ఇచ్చి తర్వాత తినేవారు .ప్రతి ఏకాదశినాడు ఉపవాసం చేసేవారు .మంచి నీరుకూడా త్రాగకుండా పగలు,రాత్రీ నిద్రపోకుండా ప్రణవం జపిస్తూ గడిపేవారు .మంత్రసిద్ధికి అర్హత సాధించారు .వందేళ్ళనాటి దత్త్రేయ యంత్రాన్ని స్వహస్తాలతో రాసిన దత్త స్తవ౦ ఆయన ఆస్తి . . సరస్వతీ దేవిపై రాసిన శ్లోకాలను 1913లో నీలకంఠశాస్త్రి తండ్రికి అందజేశారు .ఒకశ్లోకం –నమస్తేశారదాదేవీ –సరస్వతి మతిప్రదే –వాసత్వ మమ జిహ్వాగ్రే –సర్వ విద్యా ప్రదా భవ ‘’
వాసుదేవ స్వామి తానుపొందిన సిద్ధులు, శక్తులు ఎన్నడూ డబ్బు కోసం ప్రదర్శించలేదు దీనులకు, అవసరమున్నవారికి సాయం చేసేవారు.
కుర్గుడ్డా ,పిఠాపురం వంటి చోట్ల ఆశ్రమాలను అభి వృద్ధి చేశారు .’’దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర’’మంత్రం తో దత్త విగ్రహాలు స్థాపించారు .ఈ మహామంత్రాన్ని కోట్లాది సార్లు జపించి అద్భుత సాహిత్యం సృష్టించి జ్ఞానబోధ చేశారు .1914లో గుజరాత్ లోనిగరుడేశ్వర్ లో పద్మాసనం లో దత్త విగ్రహం ఎదుట కూర్చుని ఓంకారం జపిస్తూ60వ ఏట ప్రాణాలు వదిలి సిద్ధిపొందారు .భక్తులు ఎప్పుడు భక్తిగా తలచితే అప్పుడు వచ్చి కోరికలు తీరుస్తానని చెప్పి దేహం చాలించారు ‘
వీరికి 8వ ఏట ఉపనయం అయింది .బాబాజీ పంత్ కూతురు రమాబాయి తో 21వ ఏట వివాహమైంది .నిత్యస్మార్తాగ్ని చేసేవారు .గాయత్రీ మంత్రం పునశ్చరణ చేసేవారు .వైశాఖ శుక్ల పంచమినాడు తనస్వగ్రామం మంగోం లో శ్రీ దత్తాత్రేయ విగ్రహం ప్రతిష్టించారు .జ్యేష్ట శుద్ధ ద్వాదశినాడు సన్యాసాశ్రమ స్వీకారం విధి విధానంగా స్వీకరించారు .ఉజ్జైన్ లో శ్రీ నారాణా నంద సరస్వతి నుంచి దండం స్వీకరించారు .1891క్షిప్రా నది ఒడ్డున ఉజ్జైన్ లో మొదటి చాతుర్మాస్య దీక్ష చేశారు .1892లో ఉత్తరప్రదేశ్ బ్రహ్మావర్తం లో రెండవ చాతుర్మాస్యం గడిపారు.ఈ సమయం లో శ్రీ దత్తపురాణ౦ సంస్కృతంలో రచించారు .మూడవ చాతుర్మాస్యం హరిద్వారం లో గంగానదీ తీరం లో 1893 లో పూర్తి చేశారు .మూడు నాలుగు చాతుర్మాస్యాలు బద్రీ ,కేదార్ నాద లలో 1894,95లలో చేశారు .1896ఆరవ చాతుర్మాస్యం హరిద్వార గంగాతీరం లో పూర్తి చేశారు .1896 ‘’నర్మదా లహరి ‘’అద్భుత రచన చేశారు .ఏడవ చాతుర్మాస్యం మహానదీ తీరాన 1897లోమధ్యప్రదేశ్ పెట్లాడ్ లో చేశారు ,ఇక్కడే ‘’దత్త లీలామృత సింధు ‘’ వెయ్యి పదబంధాలతో రాశారు .1898లో గుజరాత్ లోని తిలక్ వాడా లో ఎనిమదవ చాతుర్మాస్యం చేసి ,తెలుగులోని ‘’కుమార పురాణం ‘’ను మరాఠీ లోకి అనువదించారు .
గుజరాత్ లోని ద్వారకలో తొమ్మిదవ చాతుర్మాస్యం 1899లోనూ ,పదవదాన్ని 1900లో మధ్యప్రదేశ్ చికలాడ లో నర్మదా నదీ తీరం లో చేస్తూ ‘’కృష్ణ వేణి –పంచగంగ యుధిస్టం’’అనే నర్సోబా వాడి గొప్పతనాన్ని ఇంగ్లీష్ లో రాశారు .మధ్యప్రదేశ్ మహాత్ పూర్ లో క్షిప్రా తీరం లో 1901లో పదకొండవ చాతుర్మాస్యం గడిపి ,దత్తపురాణ౦ లోని కథలను సంకలనం చేసి ,’’త్రిశతి గురు చరిత్ర ‘’ను 300శ్లోకాలలో రచించారు . గురు చరిత్ర ఇక్కడే మొదటి సారి ముద్రించి అందరికీ అందజేశారు .ఉత్తర ప్రదేశ్ బ్రహ్మావర్తం లో 1902 లో12చాతుర్మాస్యం గడుపుతూ సంశ్లోకి గురు చరితను లఘుమనన సార వేదాంతంగా కూర్చారు ఇక్కడే 1903లో చాతుర్మాస్యం గడిపి ‘’సప్తశతి గురు చరిత్ర ‘’ను 700శ్లోకాలో మహిళలు పఠించ టానికి వీలుగారాశారు .ఇక్కడే 1904లో 14వ చాతుర్మాస్యం చేసి ,గంగాపూర్ వెడుతూ కృష్ణానదిపై కృష్ణ లహరి రాశారు .మహారాష్ట్ర నర్సిలో కాయధు నదీతీరాన 15వ చాతుర్మాస్యం1905లో పూర్తి చేసి ,ఇక్కడే ’’దత్త చంపు ‘’సంతరించారు .కరుణా త్రిపది కూడా ఇక్కడే రాశారు .ఇది దత్తఉపాసకులకు నిత్య పారాయణ గ్రంథం అయింది
1906లో మధ్యప్రదేశ్ బర్వా లో 16వ చాతుర్మాస్య దీక్ష చేశారు .1907లో తమిళనాడు తంజావూర్ లో కావేరి నదీ తీరాన 17వది చేస్తూ సమశ్లోకి గురు చరిత్ర రాశారు 1908లో 18వ చాతుర్మాస్యం కృష్ణా జిల్లా ముక్త్యాలలో కృష్ణా తీరాన నిర్వహిస్తూ యువ శిక్ష, వృద్ధ శిక్ష, స్త్రీ శిక్షా రచించారు .మహారాష్ట్ర వైన్ గంగా తీరం పావని లో 19వ చాతుర్మాస్యం1909లో చేస్తూ ‘’వైన గంగా ‘’స్తవం రాశారు .కర్నాటక హౌనూర్ లో తుంగభద్రా తీరాన 20వ దీక్ష1910లో చేసి ,జైన్ పూర్ లో ‘’దత్తాత్రేయం మహామనం వరదం భక్తవత్సలం ‘’రాశారు .21వ దీక్ష1911లో కర్నాటక కురవ్ పూర్ లో చేసి వెంకటరమణ ,అఘోర కష్టోద్ధరణ స్తోత్రం రాశారు .1912లో చికల్వాదాలో 22వ చాతుర్మాస్యంగడిపి ,చివరిది అయిన 23 వ చాతుర్మాస్య దీక్షను1913లో గుజరాత్ నర్మదా తీరం లో చేస్తూ సమాధి చెందారు .
శ్రీ విమలానంద భారతీ స్వామీజీ భక్తవత్సల దత్తాత్రేయ స్వామిని ,పాదుకలను రాజమండ్రి గోదావరీ తీరం లో నెలకొల్పారు .ఆశాఢ శుద్ధపాడ్యామి గరుడేశ్వార్ లో స్థాపించారు
స్వామి చరిత్రను తెలుగులో గుంటూరు వాసి సాధకులు శ్రీ జివిఎల్ విద్యాసాగరరచించారు .మూడు ముద్రణలు పొందింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-20-ఉయ్యూరు