తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం లో చిత్రాడ గ్రామ౦ ఉన్నది అక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .ఈ చిత్రాడ వెంకటేశ్వర స్వామిపై సంస్కృతం లో ‘’చిత్రాడ వెంకటేశ్వర శతకం ‘’రాశారు శ్రీ అనంతా చార్యులు .కృష్ణాచార్య గురువు వలన వేదం వేదాంగాలు శాస్త్రాలు కావ్యాలంకారాలు,శ్రౌత స్మార్త కర్మల నిర్వహణ నేర్పు పొంది ,వైఖానస పాంచరాత్ర శ్రీ విష్ణు దివ్య ఆగమాలలో పరిణతి సాధించిన సుదీమణి శ్రీ పద్మనాభాచార్యులు .తైత్తిరీయ శాఖ .వైఖానస సూత్రులు .గౌతమ గోత్రీకులు .యజ్ఞయాగాదులు నిర్వహించటం లో చేయటం లో ప్రసిద్ధి చెందినవారు .నిగమాగమ ప్రవచనంలో వరిష్టులు తాతగారైన శ్రీ పద్మనాభాచార్యులు .ఆ గౌతమస గోత్రం లో జన్మించిన నరసింహా చార్య కవికి మూడవ సోదరుడు అనంతాచార్యుడు అనే కవి ఈ చిత్రాడ వెంకటేశ్వర శతకం రాశారు .వృష శైల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన చిత్రాడ నివాసి .దక్షిణ తిరుమలగా ,దక్షిణకాశిగా,పాద గయగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం .ఉత్తరాన పాదగయ అయిన పిఠాపురం ,తూర్పున సముద్రం ,పశ్చిమాన అఖండ గోదావరి ఉన్న పవిత్ర క్షేత్రం చిత్రాడ .రావు వంశం లో పుట్టి శ్రీ వెంకటేశ్వరస్వామి నిజభక్తుడైన వెంకటాద్రి సద్గుణ గరిష్టుడు .సచ్చీలుడు .ఆశ్రితులపాలిటి కల్పతరువు .ఈయన ఆదేశం తోకవిగారు చిత్రాడ శతకం సంస్కృతం లో రాశారు ..’’చిత్రాడ వాస కృపయాపరిపాహి దీనం ‘’అనీ ‘’’’చిత్రాడ వాస మురసా శ్రియ మా దధానం ‘’అనీ ‘’చిత్రాడవాస శరణాగత వత్సలత్వా ‘’అనీ పరిపరి విధాల సంబోధిస్తూ అత్యంత భక్తీ తాత్పర్యాలతో అత్యంత సులభ శైలిలో శతకం రాశారు
‘’సనకాది యోగి వర్యైరనవరతా సేవ్యమాన పద పద్మః –చిత్రాడ వేంకటేశ క్షిప్రం మే ప్రదిశ పాద భక్తిం తే’’
‘’కలిదోషహరం కరుణా జలధిం –కమనీయ వపుః కలితం పరమం – కమలాలయ వక్ష సమాదిగురుం –కలయే సతతం వృష శైల పతిం’’
‘’చిత్రాడ గ్రామ వాసీ ఘనరుచి రతనుః పార్శ్వర్యోర్విద్యువిద్యుదాభ –శ్రీ భూ దేవీ సమేత స్తరణి శ్శిశిల చ్చక్ర శ౦ఖొర్ధ్వపాణిః –భక్తేభ్యో వేంకటేశోవిలసతి చరణప్రస్రురోరుస్తితాభ్యాం-హస్తాభ్యా మాశ్రితేభ్యః ప్రపిత విరజా గాధ ముక్తి ప్రదేశః ‘’
‘’శ్రీ భూదేవీ సమేతాయ భక్తాభీష్ట ప్రదాయినే –చిత్రాడాఖ్య పురీశాయ వేంకటేశాయ’’అంటూ శతకం పూర్తీ చేశారు .
చిత్రాడ లని శ్రీ వెంకటేశ్వరస్వామికి రంగరంగ వైభ౦వగా జరిగే రధోత్సవం చూడటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేలాదిగా తరలివస్తారు .ఆ వైభవం చూడటానికి రెండు కళ్ళూ చాలవు .స్వామి తన దేవేరులు శ్రీ దేవీ భూదేవీ లతో కలిసి ఊరేగుతాడు .భక్తుల అభీష్టాలను తీర్చే కొంగు బంగారం చిత్రాడ శ్రీ వేంకటేశ్వర స్వామి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-20-ఉయ్యూరు