శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం

శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం

తూర్పు గోదావరి జిల్లా తాటిపాక సీమ అనబడే  రాజోలు మండలం లో లక్కవరం గ్రామం లో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .చుట్టూ ప్రాకారం ,మంచి ధ్వజస్తంభం ,వైభావాత్మక కళలతో అందంగా ఉన్న గర్భాలయం ,కళ్ళను ఆకర్షించే చిత్రాలు ఉంటాయి .ముందు భాగం లో ముఖమంటపం కళ్యాణ మండపం ఉంటాయి .ఆలయ గోపురం రమ్యంగా చూడముచ్చటగా ఉంటుంది .ఆలయం లో జయ ఘంట నాదం ఓంకారధ్వనితో వీనులకు విందు చేస్తుంది .మనసుకు హత్తుకొనే శిఖరాలు న్నాయి .స్వామి పూజకు పెంచిన పూలతోట వివిధరకాల పుష్పాలతో అలరారుతుంది .

  ఆలయ ద్వార బంధం దాటీ గా ఉంటుంది .దానికున్న తలుపులలో చిరు ఘంటల రవళి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది .స్వామి ఊరేగింపుకు ఉపయోగపడే అనేక వాహనాల వరుస నయనమనోహరం .స్వామి ఉత్సవ విగ్రహాలు  వెలలేని శోభతో  ఆగమ రీతిలో ఉంటాయి .స్వాములకు పట్టేతెల్లగొడుగుల కాంతి శరత్కాల పౌర్ణమి చంద్రకాంతి తో ధగధగ మెరుస్తాయి .వెండి వింజామరలు స్వామి కి మలయా నిలం అందిస్తాయి .మంగళ తోరణాలు శుభప్రదమై కాంతు లీనుతూ కనిపిస్తాయి .

  గర్భ గృహం లో సకల సౌభాగ్య శృంగార సంయుతమైన  ఎత్తైన పీఠంపై  ముద్దులొలికే శ్రీ రుక్మిణీ సత్యభామల మధ్య శ్రీ వేణుగోపాలస్వామి నయనా నందకరం గా  ముద్దులు మూటకట్టుతూ ,భక్తులకు కొంగు బంగారం గా భక్త వరదుడుగా దర్శన మిస్తాడు .వేణు గోపాల స్వామి ఆలయానికి శంఖు చక్రాలు ధరించిన జయవిజయ అనే ద్వార పాలకులు ఇరువైపులా ఉంటారు .వేణుగోపాల స్వామికి తూర్పు దిశలో పరమ భక్తాగ్రగాన్యుడు స్వామి వాహనం అయిన వైనతేయుడు పరమ భక్త తో వందనం చేస్తూ దర్శన మిస్తాడు .నంద దీపాలు స్వామికి  భక్తజనులకు ఆనంద సంధాయకం గా ఉంటాయి.

  శ్రీ కృష్ణాష్టమి నాడు అశేష భక్తజన సందోహం స్వామి వార్లను దర్శించి పూజించి తరిస్తారు .ఆలయం లో నిత్య అస్టోత్తర ,సహస్రనామ పూజ ధూప దీప నైవేద్యాలు , భోగాలు వైభవంగా రెండు పూటలా జరుగుతాయి.స్వామి వారల ఏకాంత సేవ చూసి తరించాల్సిందే .ధనుర్మాసం లో నిత్య ప్రాతః పూదికాలు ,అత్యంత వైభవంగా గోదా దేవి కల్యాణం నిర్వహిస్తారు  .సంక్రాంతి పర్వదినాన ఆలయ ధర్మకర్త వంశ స్త్రీలంతా ఆలయానికి విచ్చేసి స్వామిని మనసారా అర్చిస్తారు  .ఆలయం నిత్యపూజలు నిత్యభోగాలు ,చక్రపొ౦గలిలి వేణు పొంగలి పులిహోర వంటి ప్రసాదాలతో కలియుగ వైకుంఠం లాగా కనిపిస్తుంది ,వైశాఖ శుద్ధ ఏకాదశినాడు ఉభయ దేవేరులతో శ్రీ వేణు గోపాలస్వామి కల్యాణం రంగరంగ  వైభవం గా నిర్వహిస్తారు .

  ఈ ఆలయానికి ఇరువైపులా రెండు చిన్న దేవాలయాలున్నాయి .ఒకదేవాలయం శ్రీ లక్ష్మీ దేవి ,మరియొకదానిలో శ్రీ జానకీ రామ లక్ష్మణుల దివ్య విగ్రహాలు భక్తానుగ్రహం గా ఉంటారు ..ఆలయ ధర్మకర్తలు మంగెన వంశం వారు.1921దుర్మతి నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి బుధవారం ఉదయం 8-04 గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున లగ్నం లో  వీరు నిర్మించిన లక్కవరం అనే బ్రాహ్మణ అగ్రహారం లో శ్రీ వేణుగోపాల స్వామిని ప్రతిష్టించి సర్వాంగ సుందరంగా వైభవోపేతం గా సకల సౌకర్యాలతో ఆలయనిర్మాణం చేశారు .ఆ వంశం లో గంగయగారు ఉత్తముడు  వేణుగోపాల భక్తుడు భార్య సుబ్బాంబ . ఈ దంపతులకు పంచ పాండవుల వంటి బుద్దిమంతులైన అయిదుగురు కొడుకులు .సర్వారాయుడు,వెంకటస్వామి ,ముత్యాలు మొదలైనవారు .

  మంగెన వంశం వారు పరమభక్తితో భద్రాద్రి రామదాసులాగా శ్రీ వేణుగోపాల స్వామి కి గోపురప్రాకార మంటప వాహనాలు చక్కగా అమర్చారు .చక్కని కోనేరు త్రవ్వించారు .పేదలకు అన్నోదకాలు కల్పించారు. వివాహాదులకు ధన సహాయం అందించారు . బ్రాహ్మణులను ఆదరించి సకల సౌకర్యాలు కల్పించారు .భూతదయతో జాతిమత భేదం లేకుండా అందరి మనసులను రంజింప జేసి కీర్తి పొందారు .ప్రజల క్షేమమే పరమావధిగా జీవించారు.

  ఆధారం – లక్కవర శ్రీ వేణుగోపాల శతకం –కవి –భగవత్కవి శ్రీ లక్కాకుల వేంకట రత్న దాసు గారు –నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా కుల్లూరు పురం లో జన్మించారు .తండ్రి రామ చంద్రార్య .తల్లి యరుకలాంబ .కవిగారికి స్వప్నం లో ఈ స్వామి దర్శనమివ్వగా  భక్తితో 180 సీస పద్యాలతో భక్తిజ్ఞాన వైరాగ్య బోధకాలుగా లక్కవర శ్రీ వేణుగోపాల శతకం 1937లో రాసి ధన్యులవగా , మంగెన వంశీకులు దాన్ని ముద్రించి లోకానికి అందించారు .. సంక్షిప్తంగా ఆలయ చరిత్ర ధర్మకర్త వంశావళి కూడా రాసి తెలియని విషయాలెన్నో లోకానికి తెలియ జేశారు .’’లక్కవర పురపాల హిరణ్య చేల –వేణు గోపాల రుక్మిణీ ప్రాణ లోల ‘’అనేది మకుటం .ఒకటి రెండు పద్యాలు మచ్చుకు చూద్దాం –

‘’రాధామనోహర మాధవ పరమాత్మ –పరమ పదనివాస శరణు శరణు –పార్ధ సారధి దేవభక్త సంరక్షకా –మురళీధరా శౌరి శరణు శరణు –నారాయణా ,భక్త కల్పద్రుమా –సర్వేశ శ్రీ కృష్ణ శరణు శరణు –మందరోద్ధార ,గోవింద హరే కృష్ణ –పరమార్ధ గోవింద శరణు శరణు –శరణు నీకిదే నిక్కంబు  సారసాక్ష –భక్త హృత్పద్మసంవాస ధర్మవాస –లక్కవర పురపాల హిరణ్య చేల –వేణుగోపాల రుక్మిణీ ప్రాణ లోల ‘’

‘’శారద చంద్రికా సమరుచి హైయంగ -వీణ౦బు నొక చేత  వేడ్క నమర –అమృ తోపమానమై

యలరారు పాయస –భక్తంబు నొక చేత పరిఢవిల్ల –పుండరీక నఖంబు ,నిండు చందురు గేరు –కాంతులు మెడక్రింద గంతులిడగ-కనక సూత్ర స్ఫీత ఘంటా వితానంబు –దిసమొల మ్రోగుచు తేజరిల్ల –తల్లి  వెను వెంట ముద్దుగా తప్పటడుగు –లలర దిరిగెడుదివ్య దిగంబరుండు –పద్మ పత్రాక్ష నీవె శ్రీపతి ముకుంద –‘’

‘’సద్గురు పాద కంజాతముల్ సేవింప –కనులేదు వైరాగ్య ఘనసుపదవి –దేశికు నపాదతీర్ధంబు గ్రోలక –గానరాదట్టి విజ్ఞాన మహిమ –దేశి వర్యుని దివ్య ప్రసాదంబు- గొనక కల్గునె భక్త మనన దీక్ష –సద్గురు బోదార్ధ సారంబు దెలియక –కలుగునే ముక్తి యు ఘనతగాను –అట్టి సద్గురు మూర్తి వై యమరు దీవె-నీ గురూప దేశమే నాకు నిత్య సుఖము ––

‘’గోపాల శ్రీ కృష్ణ గోపరిపాలకా –మందర నగధీర మంగళంబు –నీరజ దళ నేత్ర ,నీల తోయద గాత్ర –మౌని సన్నుత పాత్ర మంగళంబు –పాండవ పాలనా ,భక్త జనోద్ధార-మధుసూదనా శౌరి మంగళంబు –కమలామనః ఖేల కాంచనమయ చేల –మహనీయ గుణ శీల మంగళంబు –మన్మధాకార ,యదు వీర మంగళంబు –మాధవాననంత గోవింద మంగళంబు –లక్కవర పుర పాల ,హిరణ్య చేల –వేణు గోపాల రుక్మిణీ ప్రాణ లోల ‘’

అంటూ శతకం పూర్తి చేశారు దాసుకవి .మందార మకరంద మాధుర్యంగా  భక్తి తత్వ సుబోధకం గా  పద్యాలున్నాయి  .ఈ కవి మనమహాకవుల దృష్టిలో పడక పోవటం ఆశ్చర్యం .భక్తకవిగా పేరు పొందాల్సిన కవి వరేణ్యులు ఈ కవి .వారు ఈదేవాలయ శతకం రాయకపోతే దాని చరిత్ర తెలిసేదికాదు. వారికి ఆంద్ర సాహితీ లోకం, భక్తజనం రుణ పడి ఉంటారు  .

  రేపు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-8-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in దేవాలయం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.