అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5
శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కొందరు దివ్య పురుషుల ,నదీమతల్లుల దివ్యాత్మల దర్శన౦ .
నిర్మల –ఒకసారి స్వామి గృహస్తాశ్రమం లో ఉండగా వాడీ నుండి ఇంటికి తిరిగి వస్తుంటే ఒక దివ్యలోక మహిళ కనిపించి,’’స్వామీ నాకు పేరు పెట్టకుండా ,ముందుకు వెళ్ళకండి ‘’అని కోరింది .ఆమె తనగ్రామం మంగోన్ ద్వారా ప్రవహించే నదీమతల్లి అని గ్రహించి , ఆ నదికి ‘నిర్మల ‘’అని నామకరణ౦ చేశారు . ఆ దివ్య స్త్రీ సంతోషించి అదృశ్యమైంది .అప్పటినుంచి ఆనది ‘’నిర్మలానది ‘’గా ప్రసిద్ధి చెందింది.
కృష్ణ –కలియుగం లో శ్రీ దత్తాత్రేయస్వామి రెండు అవతారాలలో కృష్ణానది తో సంబంధం ఉన్నది .శ్రీ పాద వల్లభ అవతారం లో కృష్ణానది రెండుపాయలమధ్య ఉన్న ద్వీపం లో చాలాకాలం గడిపారు .రెండవది అయిన శ్రీ నరసింహ సరస్వతి అవతారం లో నరసోబా వాడిలో కృష్ణా ,పంచనదీ సంగమ క్షేత్రం లో 12 ఏళ్ళు, కృష్ణ ఉపనది భీష్మ నది,అమరరాజ నదితో కలిసే తీరం గాణగాపుర౦ లో 36సంవత్సరాలు గడిపారు .ఇలా దత్తాత్రేయ అవతారాలతో కృష్ణా నదికి ప్రత్యేక అనుబంధం ఉన్నది .చాలాకాలం గా భక్తులు వాసు దేవ స్వామిని కృష్ణానదిపై శిఖరిణీ వృత్తంలో ఒక స్తోత్రాని శంకరాచార్య ,జగన్నాథ ప౦డితుడు గంగానదిపై రాసిన ‘’ గంగా లహరి ‘’లాగా రాయమని కోరుతున్నారు .అంతకు ముందే నర్మదాలహరి రాసి ఉన్నారు స్వామి .గాణగాపురం వెడుతూ౦డగా స్వామి కి కృష్ణానదీ మాత కనిపించి తనపై కృష్ణాలహరి రాయమని సూచించింది .అప్పటికప్పుడు అప్రయత్నంగా ఆశువుగా 51 శ్లోకాలు చెప్పారు స్వామి .విని పరవశించి కృష్ణామాత’’ఇక చాలు ‘’అని చెప్పి అదృశ్యమైంది .
తంజావూరు లో చాతుర్మాస్యదీక్ష చేసి ,కృష్ణా నది మీదనుంచి వస్తుండగా ఫాల్గుణ శుద్ధ చతుర్దశి వచ్చింది .మర్నాడు పౌర్ణమి నాడు యతీంద్రుల నియమమ ప్రకారం క్షవరం చేయించుకోవాలి .ఆకలి బాగా వేసి సమీప గ్రామం లో తగిన ప్రదేశం కోసం వెదికితే ,గ్రామస్తులు సహకరించకపోగా యెగతాళి చేశారు . కృష్ణ వేణి తో ‘’అమ్మా !నీపై నేను చూపించిన గౌరవానికి ఇది ఫలితమా .నాకు కించిత్తు అయినా ప్రత్యుపకారం చేయలేవా ?రేపు నాకు ముండనం కుదరకపోతే ,ఇక ఎన్నడూ చాతుర్మాస్య దీక్ష చేయను. సన్యాసాన్ని విసర్జిస్తాను .ఇక భవిష్యత్తులో నీ మాట వినను . ‘’.అన్నారు.నదీమాత ఆ రోజు రాత్రి స్వామి కలలో కనిపించి ‘’ రేపు నీ దీక్షా విరమణకు తగిన ఏర్పాట్లుచేసి నేను ప్రత్యుపకారం చేస్తున్నాను’’అని అభయ మిచ్చింది . .అదే రాత్రి ఊరి పెద్దల కు కలలో భయంకర రూపం లో నదీ మాత కనిపించి ‘’స్వామిని అవమాన పరచటం గొప్పనేరం ఆయనకు మీరు క్షమాపణ చెప్పండి .ఆయన దీక్షా విరమణకు పూర్తిగా సహకరించండి .లేకపోతే నాకు ఆగ్రహం వచ్చి మిమ్మలని అందర్నీ సర్వ నాశనం చేస్తాను జాగ్రత్త ‘’అని తీవ్రంగా మందలించి మార్గ దర్శనం చేసింది .మర్నాడు వారంతా నిద్రలేచి తమకలను గురించి ఒకరికొకరు చెప్పుకొని ,అమాంతం స్వామీజీ ని చేరి కాళ్ళపై పడి క్షమించమని ప్రార్ధించి ,చెంపలేసుకొన్నారు .వెంటనే శిరో ముండనానికి తగిన ఏర్పాట్లు చకచకా చేసి దీక్షా విరమణకు పూర్తిగా సహకరించారు .ఆ రోజే వెళ్లి పోవాల్సిన స్వామి వారి అభ్యర్ధనపై పది హేను రోజులు అక్కడే ఉండిపోయారు .
నర్మద-రెండేళ్ళు హిమాలయాలలో గడిపి స్వామి గంగానదీ తీరం బ్రహ్మావర్తం లో ఉన్నారు .ఒకరోజు స్వప్నం లో నర్మదానది దర్శనమిచ్చి మరికొంతకాలం తన సన్నిధిలో ఉ౦డమని కోరింది.ఆయన పెద్దగాపట్టించుకో లేదు .ఒక బ్రాహ్మణుడు చర్మ వ్యాధితో బాధపడుతుంటే స్వామీజీ పాదతీర్ధాన్ని తీసుకొంటే తగ్గిపోతుందని సలహా ఇచ్చాడుఒకాయన . స్వామి ఎప్పుదూఎవరికీ పాదతీర్ధం ఇవ్వటానికి అంగీకరించలేదు .ఒకసారి స్వామి ఏమరుపాటుగా ఉంటూ రాసుకొంటు౦ టే ఆ బాపడు అమాంతం పాదాలపై నీరుపోసి కడిగి పాద తీర్ధం తాగి ఒళ్ళంతా పూసుకొన్నాడు .ఎందుకు అలా చేశావని స్వామి ప్రశ్నిస్తే జరిగింది చెప్పి క్షమాపణ కోరాడు . ఆ వ్యాధి స్వామీజీకి అంటుకొన్నది .రోజూ గంగాస్నానం చేస్తున్నా దురదలు ,పుళ్ళు బాధ తగ్గటం లేదు .దత్తాత్రేయస్వామి కలలో దర్శనమిచ్చి మూడురోజులునర్మదా నదిలో స్నానిస్తే నివారణ అవుతుందని సూచించాడు .వెంటనే స్వామి నర్మదానది నాభి అయిన నామవార్ వెళ్లి నర్మదా నదీ మాతను ప్రార్ధించి స్తోత్రం రాశారు .చాలా చాతుర్మాస్యాలు నర్మదా తీరం లోనే చేసి, తన అంతిమ యాత్ర కూడా నర్మదా తీరం లోనే చేయాలని సంకల్పించారు . అంతటి అనుబంధం,సాన్నిహిత్యం పవిత్ర నర్మదా నదీ మాతతో యేర్పడింది . నర్మద స్వామీజీ ని కన్నకొడుకుగా చూసింది .ఆయన భిక్ష చేస్తున్నప్పుడు బెణుకు మంత్రాన్నిచెబితే ఆయన దాన్ని వృద్ధి చేశారు .దక్షిణాది భోజనం దొరికే ఇళ్ళు చూపించింది .నదిలో పొరబాటున జారిపోయిన వంట పాత్రను మళ్ళీ అందించింది .నదీమతల్లులను ఆయన ప్రాణం ఉన్న వారిగా భావించి పూజించారు .ఆ నదులపై స్తోత్రాలు రాసి భక్తి చాటుకొన్నారు .
పినాకిని -1907 నడి వేసవిలో తమిళనాడులోని పినాకిని నది తీరం పై వెడుతుంటే అధిక చైత్ర పౌర్ణమి వచ్చింది . ముండనం చేయించుకొని స్నానం చేదామని అనుకొంటే నదిలో చుక్క నీరు కూడా లేదు .అక్కడి బ్రాహ్మణుడు నదీ గర్భం లోతుగా త్రవ్వుతామని ,ఆ చలమ నీటిలో లో స్నానించమని కోరారు .అలానే అని స్వామి చెలమను చేరగానే అందులోని నీరు ఉత్తుంగం గా పెరిగింది .క్రమంగా పెరిగి గుండె లోతు జల ఏర్పడింది .అందులో దిగి హాయిగా అఘమర్షణ స్నానం చేశారు సంతృప్తిగా .పినాకిని పై కృతజ్ఞతతో ఆయన నోటినుండి అకస్మాత్తుగా ఆశువుగా కవిత వెలువడింది –దాని భావం
‘’అధిక చైత్రమాసం పౌర్ణమి నాడు కుంగి కృశించిన పినాకిని మాత ,క్షణం లో క్రమంగా వృద్ధి చెంది ,నా పవిత్ర ముండన స్నానానికి తోడ్పడింది. అందరూ ఆమెను అర్చించి తరించాలి .
నర నారాయణ మునుల దర్శనం –నాల్గవ చాతుర్మాస్య దీక్ష లో స్వామి బదరీ నారాయణ క్షేత్రానికి నడిచి వెడుతున్నారు .దారిలో ఒక పెద్ద అగాధాన్ని కప్పివేస్తూ పర్వత శిఖరం పెరిగి దారికి అడ్డు నిలిచింది .ముందుకు వెళ్ళాలా వద్దా అనే సందేహం లో స్వామి ఉండగా ,ఇద్దరు మనుషులు శిఖరం దిగుతూ కనిపించారు .వారు ‘’స్వామీ !ఈ దారి చాలా ప్రమాదకరం .వెడితే చావు కొని తెచ్చుకొన్నట్లే .’’అని హెచ్చరించారు ఆ జంట .’’స్వాములూ !నేను నర నారాయణమునులను దర్శింఛి ,పూజించటానికి వచ్చాను .నా ప్రాణం పోయినా ఫరవాలేదు వారిద్దర్నీ చూసి పూజ చేయకుండా మాత్రం వెనక్కి వెళ్ళనే వెళ్ళను ‘’అన్నారు స్వామి .అనగానే వారిద్దరూ అదృశ్యమయ్యారు .అలా స్వామి నరనారాయణ మునుల దర్శనం తో తరించారు బదరీ క్షేత్రం లో .
అశ్వత్థామ-చివరి చాతుర్మాస్య దీక్షకోసం స్వామి చికలాడ నుంచి గరుడేశ్వర్ వెడుతూ ,ఒకదట్టమైన భయంకరం ప్రమాద భరితమైన అరణ్యం గుండా నడిచి వెడుతున్నారు .శూల పానేశ్వరం(త్రిశూల పాణి ఈశ్వరుడు ) దాటాక ,గుర్తించదగిన అడుగులున్న బాట ఎక్కడా కనిపించలేదు .అంటే ఇది వరకెవ్వరూ ఈదారిలో నడిచిన గుర్తులు లేవు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళటానికి .ఏ అడవి మనిషీ కనిపించలేదు వెంట ఉండి ఆ కీకారణ్యం దాటి౦చ టానికి .ఇంతలో ఒక ఆటవికుడు అకస్మాత్తుగా కనిపించి ‘’స్వామీ !ఈ అడవి దాటి౦చ టానికి నన్ను సాయం చేయమంటారా ?’’అని అడిగాడు. సరే అన్నారు స్వామి ‘’అయితే స్వామీ ! నా వెనకాలే నడవండి .లేకపోతే దారి తప్పే ప్రమాదం ఉంది ‘’అని జాగ్రత్తలు చెప్పి దారి చూపిస్తూ మార్గదర్శనం చేస్తూ ,గరుడేశ్వర దేవాలయం కనిపించగానే దాన్ని చూపించి, క్రమంగావెళ్లి పోయే ప్రయత్నం చేశాడు ఆ ఆగ౦తకుడు .అతడి ప్రవర్తన అనుమానం కలిగి స్వామి వెంటనే’’బాబూ! నువ్వెవరు ?నీ కథాకమామీషు చెప్పు ‘’అని అడిగారు ‘’నేను అశ్వత్థామను ‘’అని ఒకే ఒక్కమాట చెప్పి అత్యంతవేగం గా కదిలి అదృశ్యమయ్యాడు అశ్వత్థామ’’.సప్త చిరంజీవులలో అశ్వత్థామ ఒకడు. మిగతా ఆరుగురు- బలిచక్రవర్తి, హనుమంతుడు ,విభీషణుడు ,కృపుడు,పరశురాముడు ,వ్యాసుడు .
కొన్ని ఆలయాలలో స్వామీజీ లనుకూడా మూల విరాట్ లను ముట్టుకొని అర్చి౦చ టానికి అంగీకరించరు. అలాంటివాటిలో బడరీనారాయన ,తిరుమల బాలాజీ దేవాలయాలున్నాయి .తిరుపతి వెంకటేశ్వర దేవాలయంలో ఒకసారి అర్చకులు స్వయంగా స్వామీజీని గర్భాలయం లోకి ఆహ్వానించి ఆయన బాలాజీ విగ్రహాన్ని తాకి అర్చి౦చే దాకా గౌరవం గా నిలబడే ఉన్నారు .అనునిత్యంస్వామి వాసు దేవానంద మహారాజ్ తన ఇష్టదైవం శ్రీ దత్తాత్రేయ స్వామితో సంభాషిస్తూనే ఉంటారు. అనుమతులు సలహాలు పొందుతూనే ఉంటారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-8-20-ఉయ్యూరు