’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం )
మొహ౦జ దారో- హరప్పా-2
హరప్పా-
లాహోర్ –ముల్తాన్ రైలు మార్గం లో ముల్తాన్ కు ఈశాన్యంగా షాహీ వాల్-చించి వాట్మీరాల్ స్టేషన్ల మధ్య హరప్పా ఉన్నది .హరప్పా రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి రెండు మైళ్ళ దూరం లో ఉన్న శిధిలాలను చూడాలి .ఇది పాకిస్తాన్ పంజాబ్ లో మాంట్ గోమరి జిల్లాలో ,రావీ నదిఎడమగట్టు మీద ఉంది .ఊరంతా దిబ్బలే .స్థానికులు ‘’హడప్పా’’అంటారు .హడ్ నా అంటే ము౦చి వేయటం .రావీ నది ముంచటం లేక మింగటం వలన ఈ పేరే స్థిరపడింది .ఇది చాలా విచిత్రంగా వెలుగులోకి వచ్చింది .
లాహోర్ –ముల్తాన్ రైలు మార్గం కోసం కూలీలు త్రవ్వుతుంటే ప్రాచీన నగర శిధిలాలు కనిపిస్తే ,పురాతత్వ శాఖ త్రవ్వకాలు జరిపించింది .1921-34వరకు 13ఏళ్ళు ఏం ఎస్ వాట్స్ ,సర్ మార్టి మర్ వీలర్ అనే పురాతత్వశాఖ అధికారులు త్రవ్వకాలు జరిపించారు .మొహంజదారో ,హరప్పాలు పాకిస్తాన్ లో ఉండటం వలన ,భారత పురాతత్వ శాఖ అధికారులు గుజరాత్ లోని లోథాల్,రాజస్తాన్ లోని కాళీ బంగాన్ లో త్రవ్వకాలు జరిపించి ,ఇక్కడ కూడా అదే సంస్కృతి ని కనిపెట్టారు .ఈ సంస్కృతీ ఒకప్పుడు పశ్చిమ పంజాబ్ ,రాజస్తాన్ గుజరాత్ లవరకు వ్యాపించి ఉందనే నిర్ణయానికి వచ్చారు .ఈ త్రవ్వకాలలో డాక్టర్ ఇంగువ కార్తికేయ శర్మ సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ గా ఉన్నారు .ఇక్కడి త్రవ్వకాలలో చాలా విషయాలు ఆయన కనుగొన్నారు .
ఈ రెండు మహానగరాలల త్రవ్వకాలను బట్టి మనకు తెలిసిన విషయాలేమిటో రామ చంద్ర తెలియజేశారు .మాహాయన బౌద్ధుల మొదటి బుద్ధ చరిత్ర అయిన ‘’లలిత విస్తరం’’ లో బుద్ధుడికి వచ్చిన లిపులలో పాదలిఖిత లిపి,ద్విరుక్త పద సంధి లిపిఉన్నాయి .ఇవి ఒకపదం లో ఒకభాగమైన లిపి .అంటే పదాల చేరికవలన ఏర్పడిన లిపి .ఈజిప్ట్ చిత్ర లిపిలాగా మొహంజో దారో-హరప్పా చిత్ర లిపి కూడా మొదట్లో వస్తురూప బొమ్మలతో తర్వాత ,వస్తువును సూచించే పడభాగం ,పదం మొదటి అక్షరంగా అయి ఉంటుంది .దీనినుంచే బ్రాహ్మీ లిపి పుట్టి ఉంటుంది .ఈజిప్ట్ లిపి , ,బ్రాహ్మీ లిపి , ప్రపంచం లో మరెన్నో లిపులు ‘’ద్విభాషా శాసనం ‘’వల్లనే సాధ్యమౌతాయని తన నమ్మకంగా రామచంద్ర ఉవాచ .అంతేకాక ఒక చెట్టుకొమ్మ ,దానిమీద కొంతఎడంగా రెండుపిట్టలు కిందు మీదులుగా కూర్చున్నట్లు ఉన్న ముద్రిక ను చూస్తే ఋగ్వేద రుక్కు –
‘’ద్వా సుపర్ణా సయుజా సఖాయా –సమాన వృక్షం పరిషస్వజాతే-తయో రన్యః పిప్పలం సాద్వత్తి-అన్నశ్నన్ననోఅభిజా కపీతి’’
భావం -స్నేహంతో కలిసి తిరిగే రెండు పక్షులు ,సమంగా ఒక చెట్టును అంటిపెట్టుకొని ఉన్నాయి .అందులో ఒకటి తియ్యని రావిపండు తింటోంది .ఎండోది పండు తినకుండా సాక్షిగా చూస్తోంది .
అలాగే యోగి ముద్రబొమ్మ ,గంగడోలు నేలమీదకు వ్రేలాడే ఆవులో ఎద్దులో బొమ్మలు ,దేవతా విగ్రహాలు వగైరాలన్నీ ఆర్య సంస్కృతికి ,ఋగ్వేద సంస్కృతికి చిహ్నాలే అన్నారు రామ చంద్ర .డాక్టర్ సునీత్ కుమార్ చటర్జీ చెప్పినట్లు మన సంస్కృతి ఆర్య ,ఆర్యేతర సంస్కృతీ సమ్మేళనం .అది స్నేహంతో జరిగిందేకాని యుద్ధం వల్ల వచ్చి౦ది కాదు .
‘’సా రమ్యా నగరీమహాన్ స నృపతిః-సామ౦త చక్రం చ తత్ –పార్శ్వేతత్ర చ సా విదగ్ధ పరిషత్ –తాః చంద్ర బింబాననాః-ఉద్వృత్త స్స చ రాజపుత్ర నివహః –తే వందినః తాఃకథాః-సర్వం యస్య వశా దగాత్ స్మృతి పథం-కాలాయ తస్మై నమః ‘’
భావం –ఆ అందమైన నగరం ఆగొప్ప రాజు ,అతని సామంతరాజుల బృందం ,,అతని ప్రక్కన ఉండే పండిత పరిషత్తు ,,అ చంద్రముఖులైన సుందర నారీమణులు ,బలిష్టులైన ఆ రాజకుమారుల సమూహం ,ఆ వంది మాగధులు ,ఆ కథలూ, కమా మీషూ అంతా ఎవరివలన స్మరించ దగింది ఐనదో ,అలాంటి కాలపురుషుడికి నమస్కారం .
క్రీ పూ .3300 సంవత్సరాల క్రితం హరప్పానగరం లో 23,500మంది ప్రజలు నివాసాలు ఏర్పరచుకొని ఉన్నారు .ఇది సింధులోయ నాగరకత ఉన్న కంచుయుగం .వ్యవసాయం వాణిజ్యం బాగా జరిగాయి .ఎడ్లబళ్ళు ,పడవలమీద రవాణా జరిగేది .హరప్పానుంచి ఈజిప్ట్ లోని మెసపొటేమియా వరకు సముద్ర వ్యాపారం బాగా జరిగేది .దుంగలతో చేసిన తెరచాప పడవలే రవాణా సాధనాలు .గోధుమ బార్లీ ముఖ్యపంటలు .తర్వాత ఎప్పుడో 2వేల ఏళ్ళ తర్వాత గోధుమ పండించటం ఐరోపా దేశాలలో వచ్చింది . రాగి కంచు వాడారు .ఇనుము అప్పటికి వాడుకం లోకి రాలేదు .కోడిపందాలు జరిగేవి .శక్తిని ,పశుపతిని ఆరాధించేవారు ఇక్కడ కుష్టు ,క్షయ వ్యాధులు ఉండేవి .అనారోగ్యం గాయాలు వలన ఈ నగర నాగరకత నాశనం అయినట్లు కనుగొన్నారు.
క్రీ పూ 1800నాటికీఈ నాగరకత బలహీన పడటం ప్రారంభమై క్రీపూ 1700 కుమహానగారాలన్నీ పూర్తిగా పాడు పడిపోయాయి .ఈ నాగరకత ఒక్కసారిగా మాయమవలేదు .హరప్పా నాగరకత క్రీ.పూ.1000-900 దాకా కొనసాగింది .ఈ నాగరకత క్షీణించ టానికి ముఖ్య కారణం వాతావరణ మార్పు అన్నారు .క్రీ.పూ.1800 వచ్చేసరికి ఈప్రాంతం బాగా చల్లబడి ,తేమ రహితమైనది ,ఋతుపవనాలు రాలేదు .షుగ్గర్ హక్రా నదీ వ్యవస్థ అదృశ్యమై పోవటం భూమి అంతర్భాగ నిర్మాణం లో మార్పు కూడాకారణం కావచ్చు నని ఊహాగానాలు .నిజం నిర్ధారించబడలేదు .ఏమైనా ఒక గొప్పనాగారకత కాలగర్భం లో కలిసిపోవటం బాధాకరం .
సమాప్తం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-8-20-ఉయ్యూరు