యోగి ఖాదర్షాబాబా
విజయనగరం జిల్లాలో వికారి సంవత్సర కార్తీక శుద్ధ చవితి బుధవారం హజరత్ ఖాజా ఖాదర్షావలీ బాబా పాదాలలో శుభాలక్షణాలైన శంఖు చక్రాలతో జన్మించారు .వీరి పూర్వీకులు తిరుచినాపల్లి రాజవంశానికి చెందినవారు .అక్కడినుంచి విజయనగరం వచ్చి స్థిరపడ్డారు .కైలాసపతి శివుడే జన్మించాడని అందరూ భావించారు .బాల్యం లోనే సాదు సత్పురుషుల బోధలు విని జ్ఞానం పొందేవారు .స్థానిక హైస్కూల్ లో చదివారు .ఒక రోజు తండ్రి నాగపూరులో లోఉన్న అయిదుగురు సాధువులకు తలా ఒక రాగికానీ ఇస్తానని మొక్కుకొన్నానని, ఇప్పటిదాకా ఇవ్వ లేకపోయానానని ,వెళ్లి వారిని గుర్తించి అందజేయమని పంపించారు .నాగపూరు చేరినరోజే ఇక్కడ తండ్రి చనిపోయాడు .నాగపూర్లో వేలాది శిష్యులున్న తాజుద్దీన్ బాబాను దర్శించారు .ఈ బాబా ఖదర్షా బాబా ను లోకొద్ధరణకోసం ప్రేరేపించి ఉపదేశించారు .మూడు రోజులు జ్ఞానబోధ చేశారు .’’ఖాదర్ అంటే నేనే ‘’అని ఆయన్ను ముఖ్య శిష్యుడిగా స్వీకరించాడు .తిరిగి విజయనగరం వచ్చి స్థానిక నల్ల చెరువు గుట్ట మీద 15ఏళ్ళు నిద్రాహారాలు మాని మౌనంగా దీక్షగా తపస్సు చేశారు .తర్వాత స్థానికుల కోరికపై మైదానప్రాంతానికి వచ్చారు .అక్కడ విశాలమైన ప్రాంతం లో ఒక ప్రార్ధనామందిరం దర్గా ఏర్పడింది. వసుధైక కుటుంబం ధ్యేయంగా బోధనలు చేశారు .చేతి స్పర్శతో ఎంతటి రోగామైనా తగ్గించే వారు .ఇక్కడ రాజు సామాన్యుడు ఒకటే .కులమతజాతి భేదం లేదు గులాబిరేకులు చిటికెడు విభూతి మాత్రమే బాబా ఇచ్చే మందు .రమణమహర్షి సత్యసాయిబాబా వంటి మహానుభావులు బాబా దర్శనం చేసి ఆశీస్సులు పొందారు .విజయనగరం జైపూర్ మహా రాజాలుకూడా బాబా ఆశీస్సులు అందుకొంటూ తరచూ దర్శనం చేసుకొనేవారు .బాబాపాదాలలో ఉన్న శంఖు చక్రాలే సర్వ జన రక్ష . కనుక బాబా పాదరక్షలకు భక్తిగా జనం మొక్కుతారు .అప్పటి నుంచి అక్కడ ఉన్న ఎనిమిది వృక్షాలను అ స్టదిక్పాలకులుగా భావిస్తారు .ఇక్కడి దాక తెలిపిన వృత్తాంతం అంతా యు ట్యూబ్ వీడియో కథనం. శాంతి సర్వమత సమానత్వం ,సకలజీవులపట్లమమకారం ప్రేమ ఆలంబనగా ,మానవాళి జాగృతికోసం జ్ఞానయోగ మార్గంగా సూచిన్చిందే సూఫీ మతం .ఈ సూఫీ మతాన్ని ఆదర్శంగా ఖాదర్షాబాబా ప్రచారం చేశారు
ఇక పై రాసింది అంతా శ్రీ భోగరాజు వెంకటరామయ్య కవి గారు రాసిన ‘’ఖాదర్షా బాబా శతకం ‘’ ఆధారం గా రాసింది .
బాబా చిన్నతనం లో పాలిచ్చే దాది ఇంట్లో నిద్రిస్తుంటే ,ఆ వీధిలోని ఇళ్ళన్నీ అగ్నికి ఆహుతికాగా ఈ ఒక్క ఇల్లు మాత్రమె కాలకుండా ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది .ఎప్పుడైనా ఈ పిల్లాడిపై తల్లికి కోపం వచ్చి కొడితే ,వెంటనే ఆమెకు జ్వరం వచ్చేది .ఒకసారి గుర్రపు స్వారీ చేస్తూ వెడుతుంటే ఐదు తలల నాగుబాము కన్పించి ,ఆ రోజు రాత్రి కలలోకూడా కన్పించి ‘’నువ్వు గంధర్వుడివి .అందుకే కనిపించాను ‘’అని చెప్పింది .చుట్టుప్రక్కలవారు ఇవన్నీ విని ఆయనను భక్త ధృవ ,భక్త ప్రహ్లాదునితో పోల్చేవారు.అంతటి భక్తీ తాదాత్మ్యం అలవడ్డాయి .
గురువు ఆజ్ఞ పొంది ఒక కొండపై తీవ్ర తపస్సు చేశారు బాబా .అప్పటినుంచి ఆకొండ ప్రపంచంలో గొప్ప క్షేత్రమైంది .సింహాచలం ,రామతీర్ధం మొదలైన వాటికి ఎంతటి ఖ్యాతి వచ్చిందో ఖాదర్షా బాబా తపస్సు చేసిన కొండకు అంతటి పేరు వచ్చింది .జనాలకు తత్వజ్ఞాన బోధ చేసే సంకల్పం ,ఐహిక సుఖాలన్నీ త్యాగం చేసి ‘’ ఖాదిరీ పదివి ‘’స్వీకరించారు బాబా .భద్రుడు తపస్సు చేసిన కొండ భద్రాద్రి అయినట్లు, బాబా తపస్సు చేసిన ‘’నల్ల చెరువు గుట్ట ‘’ ‘’ఖాద్రీ నగరం ‘’అనే మహా క్షేత్రం గా వర్దిల్లింది .గురూప దేశ మంత్రాన్ని దీక్షగా నిశ్చలమనసుతో జపించి తపస్సు చేసినందుననే మహాత్ముడయ్యారు .ఎండా వానా లెక్కచేయక ,క్రూరసర్పాలు మృగాలకు ఆలవాలమైన ఆ కొండపై దీక్షగా తపస్సు చేశారు బాబా .చుట్టూంతా గుట్టలు రాళ్ళు ముళ్ళపొదలు తో ఉండే ఆప్రదేశం బాబా వలన మంచి దారులు ఏర్పడి ,కార్లతో హాయిగా రోజుకు పది వేలమంది భక్తులు దర్శించే మహా క్షేత్రంగా అభి వృద్ధి చెందింది .జతిమతాలు లేకుండగా అన్ని జాతులవారేకాక అక్కడి జంతువులూ పక్షులు కూడా పరస్పర వైరాలు మాని సఖ్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది .బాబా ఒకసారి తీవ్ర తపస్సు చేస్తుంటే పెద్ద తుఫాను విరుచుకు పడినా చలించక కదలక తదేకంగా తపస్సు కొనసాగించారు .అప్పుడు ఒక త్రాచు పాము వచ్చి ఆయన రెండు పాదాలను పట్టుకొన్నది శరణు వేడినట్లుగా .వడగళ్ళ వాన వచ్చినా చలించని దీక్షతో తపస్సు చేశారు .వంటవారు వంటలు భోజనాలకు చాలా ఇబ్బందికలిగిస్తోంది వాన దయచూడుబాబా అని ప్రార్ధిస్తే వర్షపు హోరు లేకుండా చేశారుబాబా .
ఒకనాడుఒక వేశ్య బాబా సేవకై వస్తుంటే ,ఆతన తపస్సు మహాత్మ్యం వలన ఒక పాము ఆమె రెండు కాళ్ళను చుట్టేసింది .భయపడ్డ ఆమెకు సద్బుద్ధి ప్రసాదించి కాపాడారు .అర్ధరాత్రులలో రెండుప్రక్కలా రెండు పులులతో బాబా ‘’షైరు’’ చేసేవారు .డాక్టర్లు కూడా తగ్గించలేని జబ్బులతో బాధపడే వారు బాబా ను దర్శిస్తే రోగాలు యిట్టె మాయమయేవి . .హస్తవాసి మంచిదని వాసుదేవుని వంటి చల్లని స్వామి అని ప్రజల నమ్మకం .
బాబా పై ఈ శతకం రాసిన కవి శ్రీ భోగరాజు వెంకటరామయ్య గారు 24ఏళ్ళనుంచి కడుపు శూల తో బాధపడుతూ ఎందరు డాక్టర్లకు చూపించినా తగ్గకపోతే బాబా దగ్గరకు వచ్చారు .ఇష్టం వచ్చినవన్నీ హాయిగా తినమని ,పద్యం గిత్యం జాన్తా నై అని చెప్పి చిటికలో నయం చేశారు బాబా .కవిగారు తనకు ఏ పదార్ధాలు కూరలు పడవని చెప్పారో వాటినే తినమని చెప్పి తినిపించి శూల బాధ నివారించారు .
బాబా దర్బారులో గానా బజానా జరుగుతున్నా వినీ విననట్లు చూసీ చూడనట్లు ఉంటూ విజ్ఞాన మౌనంతో తదేక దృష్టి తో దీక్ష కొనసాగించటం బాబా ప్రత్యేకత .బాబా అనుగ్రహం తో ఇచ్చే ఫలమైనా విభూతి అయనా గడ్డిపరకైనా రోగాలు, హాహాకారాలు మానిపోయేట్లు చేస్తాయి .అన్నిరకాల రోగులు మానసిక రోగులు మూర్చరోగులు కూడా వచ్చి బాబా అనుగ్రహంతో వ్యాధులనుపోగోట్టుకొని హాయిగానవ్వుకొంటూ వెళ్తారు..మహా వేదాంతులు ,బహు శాస్త్ర పారంగతులు ,శాస్త్రవేత్తలు దైవజ్ఞులు ఐశ్వర్య సంపన్నులు బాబా పాదాలకు మ్రొక్కి భక్తితో సేవించటం మహాదాశ్చర్య విషయం .కలియుగ ప్రత్యక్ష దైవం గా ఖాదర్షా బాబాను విశ్వసిస్తారు .అని కవిగారు చాలా భక్తిగా ఆర్తిగా బాబా చరిత్ర రాశారు .వీరు ఆంద్ర దేశ అక్షరాస్యులకు చిరపరిచితులైన కవి శేఖరులు , విజయనగర ఆస్థాన కవీశ్వరులు శ్రీ భోగరాజు నారాయణ మూర్తిగారి తమ్ములు.దీనికి ముందుమాట ను విజయనగరం మహారాజాకాలేజి రిటైర్డ్ సీనియర్ తెలుగుపండితులు శ్రీ అడిదం రామారావు గారు రాశారు .ప్రముఖకవి శ్రీ విశ్వనాథ కవిరాజు ఆశీస్సుల౦ది౦చారు .పుస్తకముద్రణకు ధనసాయం చేసినవారు శ్రీ రామ చంద్రుని రామారావు పంతులుగారు .వీరంతా ఖాదర్షా బాబా భక్తులే ..ఈ శతకం 1946లో ముద్రింపబడింది .కవిగారి కొన్నిపద్యాలురుచి చూద్దాం
‘’మద క్రోధద్వయ నాశాకారి వగుటన్ ,మత్తేభ శార్దూలముల్ –ముదమారంగాను సూటినిం గలిపి నే ముత్తెంబులున్ వజ్రముల్ -గదియం గల్పుచు మాల గూర్చి ఇడితోఖాదర్ష బాబా ,భవ-త్పద భక్తిన్నిది కంఠమందు ధరియింపం గోరి మన్ని౦పుమా ‘’
‘’బ్రహ్మయో విష్ణువో శివుడో తాజుద్దీన్ రూపంబు తో –గరుణంబెట్టెననంగజాలు ఘనుడౌఖాదర్షబాబాగురూ’’
‘’బుధు లొందుంగలశంఖ చక్రములు నీ పూజ్యంబు పాదంబులన్’’
‘’నిన్నుం బోల్చగావచ్చు నాధృ వునితోనిక్కంబు ప్రహ్లాదుతో ‘’
‘’సకలైశ్వర్య సమున్నతి౦ గలిగి ,తత్సౌఖ్యంబు లాసి౦చ కే -సకలో త్కృష్టఖాడిరీపదవికి సంకల్ప మున్ బూని ‘’
‘’ఈ రీతిన్ పరమాత్ము తోసముడవైయీ పర్వతారణ్యముల్ ఘోర౦బయ్యెడి క్రూర జంతుభయముల్ ఖూనీలు చోరీల౦గల హత్యలున్ గలస్థాలిన్,సుక్షేత్రమున్ జేయు నీ –కౌరాసాటియేలోకమందు కనగా ఖాదర్ష బాబా గురూ ‘’
‘’అహాహా నీ ఇరు ప్రక్కల౦ బులులు రెండౌ యర్ధరాత్రంబు నన్-బహు భక్తి౦ నడువ’’
‘’ఏ రూపంబును నెట్టి రోగి యయినన్ నీక్షించాగా నంతనే యా రోగంపు బలంబు తగ్గి మనమానంద ధైర్యంబు లవ్వారినింబొందునోయట్టిరూపయుతుడౌస్వామిసదానంద వే మారుల్ మ్రొక్కెద’’
‘’ప్రత్యక్షంబగు దైవమీవ యనుచున్ భక్తాళి నేవ్వళలన్ –సత్యాసత్యవివేక జ్ఞాన మిడుచున్ సన్మార్గులు౦ జేయుచున్ ‘’
‘’జాలంబింతకు జేయకయ్య సతతమున్ సద్భక్తితో గొల్చెదన్ –కాలంబింతయు వ్యర్ధ పుచ్చకయనే ఖాదర్ష బాబా గురున్ –బోలెం జాలెడు వారు లేరనుచు నిబ్భూమి౦ దగన్ జాటెదన్ –పాలించంగను జాగు సేయకుము యో బాబా నమస్కారముల్ ‘’
అంటూ శతకం ముగించారు కవి ధారాశుద్ధి భక్తీ అంకితభావం అవగాహన ,బాబా మహిమా నిరూపణం తో కవిత్వం చిందులు త్రోక్కింది .ఆదర్శ పురుషుడు ఖాదర్షా బాబా చరిత్రను లోకానికి తెలియ జేసిన కవి శ్రీ భోగరాజు వెంకటరామయ్య ధన్యులు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-20-ఉయ్యూరు