మనకు తెలియని మహాయోగులు-
1-ఖండయోగి మహామౌని -ఆదోని తిక్క లక్ష్మమ్మ -1815-1933
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని లో తిక్కలక్ష్మమ్మ మహా సమాధి తెలుగు కర్నాటక ప్రజలకు తీర్ధ యాత్రాస్థలం .ఆదోని దగ్గర మూసానపల్లె లో మాదిగ మంగమ్మ ,బండెప్పా దంపతులకు 1815లో జన్మించింది .బాల్యం నుంచే అన్నపానాదులు ఆటలు పై ఆసక్తిలేకుండా మౌనంగా ఉండేది .పెళ్లి చేస్తే దారిలోకి వస్తుందనే ఆశతో పెళ్లి చేసినా మార్పు రాలేదు .ఇరవై ఏళ్ళకే ఆదోనిపట్టణం వీధుల లో అన్నం నిద్ర లేకుండా ఎండా వానా లేక చేయకుండా ఏదో వెతుకు తున్నట్లు మౌనంగా కూనిరాగాలు తీస్తూ తిరిగేది .ఒక సత్పురుషుడు ఆమెను గుర్తించి మంత్రోప దేశం చేశాడు .
అప్పటి నుంచి గంటలతరబడి సమాధి స్థితిలోనే ఉండి పోయేది .సమాధి నుంచి లేచి వీధుల్లో తిరిగుతూ చెత్త వేసే తొట్టెలదగ్గర కూర్చోటం, పడుకోవటం చేసేది. అందరూ తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ అనేవారు .ఆమె త్రికాలజ్ఞాని అనీ ,నిగ్రహానుగ్రహ సమర్దురాలని తెలిసినవారు మాత్రం ప్రేమతో భక్తితో ఆదరించేవారు .ఖండయోగం తో సహా చాలా మహిమలు చూపేది .దూర దృష్టి,దూర శ్రవణం ,పరచిత్తజ్ఞానం తో భక్తుల ఆర్తుల దీనుల సమస్యలను పరిష్కరించి మేలు చేకూర్చేది .ఆరుబయట పడుకున్నప్పుడు వర్షం పడితే, ఆమె మీద చినుకుకూడా పడేదే కాదు .రెండుమూడు రోజులు నిర్వికల్ప సమాధిలో బ్రహ్మానందాన్ని అనుభవించేది .శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి మంగళవారం 16-5-1933 ఉదయం 118వ ఏట దేహాన్ని చాలించింది .తర్వాత ఆమె పేరిట మఠం నిర్మించి ,ప్రతిశుక్రవారం విశేషపూజలు ,అభిషేకాలు చేస్తున్నారు .ప్రతియేటా ఆదోనిలో కర్ణాటకలోని రాయచూరుజిల్లా ఎలుబు గిరి లోనూ ఆరాధనోత్సవాలు వైభవం గా నిర్వ హిస్తారు .
2-ప్రవక్త నాయబ్ రసూల్ -1720-1780
సయ్యద్ హాజీ రహ్మ తుల్లా నాయబ్ రసూల్ 1720లో కర్ణాటక బీజాపూర్ జిల్లా బెల్గాం లో జుమ్మా మసీదు పాలన పోషణ ,పరిశుభ్రతల బాధ్యతలు చూసే ఇరాన్ దేశీయుడు హజ్రత్ ఖాజా ఆలం దంపతులకు జన్మించాడు .ఖాజా రహ్మతుల్లా అని పేరు పెట్టారు .ఏడేళ్ళకే ఖురాన్ కంఠస్టం గా వచ్చేసింది .8వ ఏట అరబ్బీ ,ఉర్దూ ,పార్శీ సాహిత్యాధ్యయనం చేసిన బాలమేధావి .తల్లి చనిపోతే సవతి తల్లి బాధ భరించలేక 15వ ఏట ఇల్లు వదిలి పవిత్ర ముస్లిం క్షేత్ర సందర్శనం చేస్తూ ,కర్నూలు జిల్లా నంద్యాల చేరాడు .అక్కడ హబీబా అనే పేదింటి పిల్లను పెళ్ళాడి ,ఆమె హఠాత్తుగా చనిపోవటం తో విరక్తితో కర్నూలు నవాబు సైన్యం లో సిపాయిగా చేరాడు .అప్పుడే మారిఫత్ ,తసవ్యుఫ్ అనే ఇస్లాం మత విషయాలు తెలుసుకోవాలనే కాంక్ష పెరిగింది .
అరేబియాకు చెందిన’’ హజ్రత్ అలవిబ్రుం రహమతుల్లా అల్లె’’కర్నూలు రాగా ఆయన్ను 12ఏళ్ళు దీక్షతో సేవి౦చి ఆధ్యాత్మ విజ్ఞానం ఆకళింపు చేసుకొన్నాడు .తర్వాత మక్కా చేరి ,’’అబ్బే కు౦బిన్’’కొండపై ఉన్నమక్కీ రహ్మతుల్లాను సందర్శించి ,దీవెనలుపొంది ,41రోజులు దీక్ష చేసి మహ్మద్ రసూలిల్లా సమాధి నుండి దివ్య సందేశం అందుకొనగా ప్రజలు ఆయనను ‘’నాయబ్ రసూల్ ‘’అంటే ప్రవక్త ప్రతినిధిగా పిల్చారు .ఎన్నో అద్భుతాలు మహిమలు చూపాడు .శిష్యులు చాలామంది చేరారు .
రహ్మతాబాద్ లో 1763లో ఒక మసీదు నిర్మించి ,దాని దగ్గర ఒక యోగాశ్రమ౦ నిర్మిచుకొన్నాడు .1780లో మెడమీద కంతి పెరగాగా మందుకై ,ఉదయగిరి కొండపైకి వనమూలికలకోసం వెళ్లి ,అక్కడే దేహం చాలించాడు .నెల్లూరు జిల్లా అనా సముద్రంపేట ప్రజలు ఆయన దేహాన్ని 1-4-1780న వికారి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు అనాసముద్ర౦పేటలొ సమాధి చేశారు .అప్పటినుంచి ప్రతియేటా అనాసముద్రం పేటలో నాయబ్ రసూల్ ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు .
ఆధారం –శ్రీ కొత్తపల్లి హుమంతరావు గారి ‘’మహాయోగులు ‘’పుస్తకం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-20-ఉయ్యూరు