మనకు తెలియని మహాయోగులు—3
5-గోదావరి నదిపై నడచిన గొంగడి స్వామి అనే గోవింద స్వామి -1855-1927
కేరళలోని మలబారు ప్రాంతంలో ఆలపాడ గ్రామం లో 13-1-1885 రాక్షస నామ సంవత్సర పుష్యబహుళ దశమి శనివారం నారాయణస్వామి బ్రాహ్మణ వంశం లో జన్మించాడు .పసితనం నుంచే ‘’గోవింద రా౦ రాం గోపాలహరి హరి’’అంటూ నిరంతరం పాడుకొంటూ ఉండటం వలన ‘’గోవింద స్వామి ‘’ అని అందరూ పిలిచేవారు .ఎప్పుడూ గొంగడి( ళి)మీద కప్పుకోటం చేత గొంగడి స్వామి అనీ ,వరిగడ్డిలో కూర్చుని ధ్యానం చేయట౦తో వరి గడ్డి స్వామి అనీ ,పెద్దపెద్ద గోళ్ళు ఉండటం వలన గోళ్ళ స్వామి అనికూడా పిలిచేవారు .బ్రహ్మచారికనుక బ్రహ్మచారి స్వామి ,సంగీతం నేర్చి వేణువుతో అద్భుతంగా గానం చేసే నేర్పున్నందున ‘’గోపాలస్వామీ ‘’అని కూడా పిలిచేవారు .
చిన్నతనం లోనే తలిదండ్రులు చనిపోవటం చేత దేశదిమ్మరిగా తిరుగుతూ యోగులను జ్ఞానులను ఆశ్రయించి సన్యాసం పొంది గురువు ఆదేశం తో భక్తిజ్ఞానాలు బోధిస్తూ వేణుగానం తో శారీరక మానసిక వ్యాధులు నివారిస్తూ ,దేశమంతా తిరిగాడు .ఉత్తరభారతం లో శిష్యగణం బాగా ఎక్కువ .1887లో మహారాష్ట్రలోని పాండురంగని పండరి క్షేత్రం లో ఉండగా ఆయనకు ఒక తెల్లవారు ఝామున భద్రాచల సీతారాముల దర్శనమైంది .
18మంది శిష్యులతో భద్రాచలం బయల్దేరాడు .1892లో కర్ణాటకలో బీదరు ,బళ్ళారి,శృంగేరి,ఉడిపి క్షేత్రాలలో ఆశ్రమాలు స్థాపించాడు .నాలుగేళ్ళు కన్నడ దేశమంతా తిరిగి ,17మంది శిష్యులనుస్వస్థలాలకు పంపించి ఒకే ఒక్క శిష్యునితో 1896లో ఆంద్ర దేశం లో ప్రవేశించి ,ముందుగా తిరుమలలో శ్రీవారిని దర్శించి ,వేదనారాయణ పురం లో కొన్నాళ్ళు గడిపి ,ఉన్న ఒక్క శిష్యుడిని తనను 1927ప్రభవ సంవత్సర శ్రీ రామ నవమి నాడు భద్రాచలం లో కలుసుకోమని ఆదేశించాడు .అక్కడి నుంచి కాలినడకన ఒంటరిగా నడుస్తూ పల్లెలు పట్టణాలు,అడవులూ దాటుతూ సత్రాలలో ఉంటూ తింటూ మౌనంగా గడిపాడు .కడప దాటాక’’ చిన్నమాచు పల్లె’’ లో శ్రీ ఆంజనేయ ప్రతిష్ట చేసి, ఆర్తుల బాధ తొలగించాడు.ఎన్నో మహిమలు లీలలు చూపాడు .
1904లో వల్లూరులో కొన్ని నెలలు ఉండి,గోపూజ చేస్తూ ,దాని పాలు పితికి అక్కడే ఉన్న బావిలో పోస్తూ ఆ నీటినే ఔషధంగా ఇచ్చేవాడు. సకల రోగాలు నయమయ్యేవి.1916లో భద్రాచలం చేరి ,ప్రతిరోజూ గోదావరి నీటిపై నడుస్తూ,నది మధ్యకు చేరి ,శ్రీరామాలయ శిఖరం దర్శించి స్నానం చేసి ,గట్టుకు వచ్చి ,తపస్సు ధ్యానం చేసి ఆలయం లో సీతారాములను దర్శించేవాడు .భద్రాచల మఠం లో లింగ ప్రతిష్ట చేసి ,తపస్సుకోసం భూగృహం ఏర్పాటు చేసుకొని ,అందులో పదేళ్ళు ఏకాంతంగా తపస్సు చేశాడు భద్రాచలం గోవింద స్వామిగా ఇక్కడ ప్రసిద్ధుడు ..6-5-1927ప్రభవ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి గురువారం 72వ ఏట బ్రహ్మ రంధ్రం చేదించుకొని పరమాత్మలో లీనమయ్యాడు గోవిందస్వామి .పంచమి నాడు సమాధి చేశారు .ఏటా ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు సమాదినుంచే మహిమలు చూపుటాడని విశ్వాసం .
6-సంఘ సంస్కర్త- హంసానంద స్వామి -1859-1980
బహుభాషా కోవిదుడు ,పండితుడు ,స్వాత౦త్ర్య సమరయోధుడు , రాజకీయ వేత్త ,ఆయుర్వేద వైద్యుడు ,ప్రకృతి చికిత్సా నిపుణుడు,సంఘసంస్కర్త ,120ఏళ్ళు సార్ధకంగా జీవించిన వాడు హంసానంద స్వామి .ఉత్తర ప్రదేశ్ లో 1859 సిద్ధార్ధి నామ సంవత్సర శ్రావణ బహుళ పాడ్యమి ఆదివారం జన్మించాడు .తలిదండ్రులు పెట్టిన పేరు నిత్యగోపాల్ .బాల్యం లోనే శ్రీ రామ కృష్ణ పరమహంసను దర్శించి ,కొంతకాలానికి సన్యసించి ,’’జ్ఞానాన౦ద అవధూత’’ అయ్యాడు.
తర్వాత శ్రీ బ్రహ్మానంద’’ సరస్వతీ స్వామి వద్ద సన్యాసం స్వీకరించి ‘’హంసానంద సరస్వతి ‘’అనే దీక్షానామం పొందారు .ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ జ్ఞానబోధ చేస్తూ ,ఆరోగ్యబోధకూడా చేసేవారు .శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులతో కలిసి సామాజిక ,ఆధ్యాత్మిక ప్రచారాల్లో పాల్గొనే వారు .జాతీయోద్యమం లో స్వామి శ్రద్ధానంద ,మహాత్మాగాంధీ,వీర సావర్కార్ ,టంగుటూరి ప్రకాశం ,అరవింద యోగి ,మదనమోహన మాలవ్యా ,రాజగోపాలా చారి వంటి ది గ్దంతులతో కలిసి హంసానంద స్వామి పని చేశారు .సంస్కృత తెలుగు ఇంగ్లీష్ బెంగాలీ ,హిందీ రష్యన్ జర్మనీ భాషలలో నిష్ణాతులయ్యారు .
కర్నూలు జిల్లా బనగానపల్లి దగ్గర యాగంటి గుహలో ‘’వేపాకు మాత్రమే తింటూ’’ ,కఠోర తపస్సు చేసి ,అనేక యోగసిద్ధులు సాధించారు.ఎనిమిదేళ్ళు ఇలా తపస్సు చేసి ,1930లో బనగానపల్లి చేరి ,శిధిల దేవాలయానికి పడమరగా ఉన్న స్థలం లో ‘’స్వస్తి ఆశ్రమం ‘’నిర్మించుకొని ,క్రమంగా అభి వృద్ధి చేసి ప్రజల శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆనందం కలిగించారు .మానసిక రోగులను ఉపదేశాలతో ,వ్యాధి గ్రస్తులకు మందులతో వైద్యం చేసేవారు .ఆయుర్వేద వైద్య వ్యాప్తికి ‘’దయానంద ఫార్మసి ‘’ఏర్పరచి వనమూలికలతో ఆయుర్వేద ఔషధాలు తయారు చేశారు. మందులతో నయంకాకపోతే మట్టిస్నానం తొట్టి స్నానం తైలమర్దనం వంటి ప్రకృతి చికిత్స లతో నయం చేసేవారు .బనగానపల్లి స్వామి అని అందరూ పిలుచుకోనేవారు .1932లో ‘’హంసానంద ప్రకృతి ఆశ్రమం ‘’రూపు దాల్చింది .దీనికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు .హైదరాబాద్ నాగార్జున ఆయుర్వేద పీఠానికి,విజయవాడ రామమోహన ఆయుర్వేద కళాశాలకు,విజయవాడ ప్రకృతి ఆరోగ్య కేంద్రానికి హంసానంద సరస్వతి అధ్యక్షులుగా కేంద్ర,రాష్ట్ర ఆయుర్వేద నిపుణుల సంఘం సభ్యులుగా ఉంటూ గొప్ప సేవ చేశారు .ఎందరికో వైద్య విద్య నేర్పారు .అనేక సిద్ధులు సాధించినా, కేవలం వశీకరణ శక్తిని మాత్రమే ప్రదర్శించేవారు .
13-1-1980 సిద్ధార్ధి నామ సంవత్సర పుష్య శుద్ధ చతుర్దశి మంగళవారం 120 ఏళ్ళ సార్ధక జీవితాన్ని చాలించారు హంసానంద స్వామి .ఆయన హంస పరమహంసలో లీనమైంది .ఆయనముందే సూచించిన స్థలం లో భక్తులు శిష్యులు సమాధి చేశారు ..ప్రతియేటా పుష్యబహుళ ఏకాదశినాడు హంసానందుల ఆరాధనోత్సవాలు బనగానపల్లి లో నిర్వహిస్తూ పేదలకు అన్నదానం వస్త్ర దానం చేస్తూ సార్ధకత కల్పిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-8-20-ఉయ్యూరు