మహారాష్ట్ర కొల్హాపూర్ దగ్గర బ్రాహ్మణాగ్రహారం లో దత్త ఉపాసకుడు విష్ణుభట్టు అనే ఋక్ శాఖ పురోహితుడికి బ్రహ్మానంద తీర్ధులు 1879లో జన్మించాడు చిన్నప్పటి పేరు గణపతి .అయిదవఏట అక్షరాభ్యాసం చేసినది మొదలు ఆధ్యాత్మిక భావనతో తల్లితో పాటు దత్తస్మరణ చేస్తూ ,సద్గుణాలు అలవరచుకొన్నాడు .ఉపనయనం తర్వాత దగ్గరున్న నదీతీరం లో ఏకాంతం గా భగవధ్యానం చేసేవాడు .12వ ఏట ప్లేగు వ్యాపించి సోదరులిద్దరూ చనిపోగా ,వైరాగ్యం తో ఇల్లువిడిచి దత్తక్షేత్రం నరసోబావాడి చేరాడు .అక్కడి హరికథలు విని తన్మయుడయ్యాడు .తండ్రివచ్చి ఇంటికి తీసుకు వెళ్ళాడు .
1833లో తపస్సుకోసం హిమాలయాలకు బయల్దేరాడు .1897లో బదరి క్షేత్రం చేరి ,యోగులవద్ద లంబికాయోగం నేర్చాడు.తర్వాత నర్మదాతీరం గరుడేశ్వార్ చేరి,అక్కడ అపర దత్తాత్రేయుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతిని దర్శించి ,సేవ చేయగా గణపతి కి దత్తమహామంత్రం ,యోగం, అనుష్టానం బోధించారు .రేయింబవళ్ళు వీటిని సాధన చేసి ,స్వామి అనుమతితో శృంగేరి శ్రీ నృసి౦హ భారతీస్వామి ని ఆశ్రయించగా భాష్య ప్రవచనం చేయింఛి సంస్కృతం నేర్పారు . అక్కడి మహారాష్ట్ర సన్యాసి ఆనందానంద తీర్ధ స్వామిచే సన్యాసం బ్రహ్మానందదీక్షనామం ఇప్పించి ఆశీర్వదించారు .
బ్రహ్మానందులు యాత్రలు చేస్తూ తిరుపతి దర్శించి నెల్లూరు చేరి ,అక్కడ జీవన్ముక్తులైన నిత్యానందస్వామి తో పరిచయమేర్పడింది .అక్కడే ‘’శ్రీ నిత్యానంద వేద సంస్కృత పాఠశాల ‘’ను బ్రహ్మానందులు స్థాపించి,ఇద్దరూ కలిసి పర్యటన చేస్తూ భక్తులకు యోగరహస్యాలు బోధిస్తూ మంత్రోపదేశం చేశారు .బాపట్ల చేరి సనాతన ధర్మప్రచారానికి పూనుకొన్నారు .లీలలు అద్భుతాలు మహిమలు ప్రదర్శించారు .ఎన్నో జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు.బాపట్లలో దత్తాత్రేయ మందిరం ,లైబ్రరీలను నిర్మిచి సమృద్ధిగా మూలధం చేకూర్ఛి పాలకమండలి నియమించారు.బాపట్ల బ్రహ్మానంద తీర్థులు గా ప్రసిద్ధిపొందారు .
కాశీ వెళ్లి ‘’మాండూక్యోపనిషత్ తారకమంత్ర మఠం’’లో భాష్య ప్రవచనం చేశారు ,కాళయుక్తిసంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి గురువారం 15-8-1918 న 39వఏట సమాధి నిష్టలో ఉదయం 9-30గంటలకు బ్రహ్మానంద తీర్థులు బ్రహ్మ రంధ్రం చేదించుకొని బ్రహ్మైక్యం పొందారు .భక్తులలో మహాభక్తుడు,జ్ఞానులలో శ్రేష్ఠుడు,కర్మయోగుల్లో వీరుడు ,యోగులలో రాజయోగి సనాతన ధర్మానికి సారధి, ఆధ్యాత్మిక వికాసానికి ఎత్తిన జయపతాక శ్రీ బ్రహ్మానంద తీర్థులు .
8-ఆటవిక కుటుంబాలకు ఆరాధ్యదైవం –బ్రహ్మ సాక్షాత్కారం పొందిన చిద్గగనానంద స్వామి-1885-1969
రాయలసీమకడపజిల్లా ప్రొద్దుటూరు తాలూకా చినరాజుపల్లెలో రుక్కు గురవారెడ్డి నాగమ్మదంపతులకు శ్రీ వెంకటేశ్వర వరప్రసాది గా వెంకటరెడ్డి 30-3-1885 పార్ధివ సంవత్సర చైత్ర పౌర్ణమి సోమవారం రాత్రి 12గంటలకు హస్తా నక్షత్ర ధనుర్లగ్నం లో పుట్టాడు .ఏడవఏట ప్రాణాయామం నేర్చాడు .పూనాలో హఠ యోగాశ్రమం లో చేరి ఒక ఏడాది యోగాభ్యాసం నేర్చి,తర్వాత పండరి, రాయచూర్ ,అనంతపురం,యాదికి లు చూసి చీమలకుర్తివాగుపల్లెకు చేరాడు .అక్కడ ఒక వేదా౦తివద్ద సీతారామా౦జనేయం ఒంటబట్టించుకొని ,11వ ఏట బొమ్మేపల్లి సుబ్బదాసు అనే సిద్ధ పురుషుని ఆశ్రయించాడు .ఆయన తారక సంఖ్య,అమనస్క యోగాలు నేర్చుకొని వస్తే ,అచల పూర్ణ యోగం బోధిస్తానని చెప్పాడు .
12వ ఏటనే ‘’లంకమల పర్వతం ‘’పై ధ్యాన సాధన చేసి స్వరశాస్త్రం నేర్చి ,15వ ఏట కమలాపురం తాలూకా నాగేశ్వర పర్వతాగ్రం పై ఏడాది తపస్సు చేసి ,18వ ఏట తిరుమల బావాజీ మఠంలో రెండేళ్ళు మతత్రయ సారం గ్రహించాడు .తర్వాత వీరాంజనేయ క్షేత్రాలు సందర్శించి,28వ ఏట చిన్నరావిపల్లెకు చేరి ,బ్రహ్మానంద మహర్షిని సందర్శించి శిష్యుడయ్యాడు .అనేక విధాలుగా పరీక్షించి దీక్షను ,’’చిద్గగనానంద’’ దీక్షానామం అనుగ్రహించారు బ్రహ్మనందులు .12ఏళ్ళు అనంతపురం జిల్లా పోతులకుంట లో గురువుగారి ప్రస్థానత్రయ ఆశ్రమ భూములను స్వయంగా దున్నుతూ, పంటలు పండిస్తూ గురుసేవచేశాడు.
మళ్ళీ దేశ సంచారం చేసి ,హిందూపురం తాలూకా గోరంట్లలో గురువు స్థాపించిన ఆద్వైతాశ్రమానికి తిరిగి వచ్చి ,ఆయుర్వేదం నేర్చి ,ఔషధాలు తయారు చేసి,రోగులకు ఉచితంగా వైద్యం అందించి ఆరోగ్యవంతుల్నిచేశారు .నాలుగేళ్ళతర్వాత కదిరి తాలూకా తుమ్మలాపుర దుర్గం వెళ్లి ,ఆరునెలలు నిహారంగా తపస్సు ఘోరంగా చేశారు .అక్కడ భవనాశి ఆశ్రమం స్థాపించి ,రాయలసీమ తీవ్ర కరువు కాలం లో ఆరునెలలు విరివిరిగా అన్నదానాలు చేయించారు .కొత్త చెరువు దగ్గర నాగులకనుమలో ఆనందశ్రమం స్థాపించి ,52వ ఏట బలిఘట్టం చేరి ,త్రిశూలపర్వత౦ పై 12రోజులు లోక శాంతికోసం దీక్ష పూనారు .మన్యం లోని జనులకుఆధ్యాత్మిక చైతన్యం కలిగించటానికి బ్రహ్మానందాశ్రమం స్థాపించారు .ఇలా 10 ఆశ్రమాలు స్థాపించి ,మళ్ళీ బలిఘట్టం చేరి బలిఘట్ట౦ చిద్గగనానంద స్వామి గా ప్రసిద్ధి చెందారు .సౌమ్య సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి చాతుర్మాస్యదీక్ష వహించి భక్తులకు ప్రస్థాన త్రయం బోధించారు .27-7-1969 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఉదయం 8గంటలకు శ్రీ చిద్గగనానంద స్వామి 84వ ఏట జీవ సమాధి చెందారు .దాదాపు అయిదు వేల ఆటవిక కుటుంబాలకు చిద్గగనానందులు ఆరాధ్య గురువు, దైవం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-8-20-ఉయ్యూరు